ఎం కోటేశ్వరరావు
ఒక దేశం, ఒకేసారి ఎన్నిక అ ంటే పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదన గురించి నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చే విధంగా త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ 2019 జూన్ 19న జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.నలభై పార్టీలకు ఆహ్వానం పంపగా 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనను సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, నేషనల్ కాన్ఫరెన్స్, మజ్లిస్ పార్టీలు వ్యతిరేకించినట్లు వార్తలు రాగా ,అమలు ఎలా అని ప్రశ్నించారు తప్ప ఎవరూ ఆ భావనను వ్యతిరేకించలేదని రాజనాధ్ సింగ్ విలేకర్లతో చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన వెనుక వున్న వుద్దేశ్యాలేమిటి, వివిధ వాదనలు, వాటి బండారం గురించి చూద్దాం.భిన్న అభిప్రాయాలను వినటానికి మేము సిద్దంగా లేము, మా మనోభావాలు దెబ్బతింటాయి అనుకొనే వారు దీనిలో మిగతా భాగం చదవకుండా వదలి వేయటానికి స్వేచ్చ వుంది.
ముందుగా తెలుసుకోవాల్సింది ఈ ప్రతిపాదన సరికొత్తది కాదు, మూడున్నర దశాబ్దాలుగా ఏదో ఒక రూపంలో ముందుకు వస్తూ వెనక్కు పోతున్న అంశం.1983లో ఎన్నికల సంఘం దీని గురించి ప్రస్తావించింది.1999లో వాజ్‌పేయి సర్కార్ మరోసారి ముందుకు తెచ్చింది. తరువాత ఎల్‌కె అద్వానీ, ఇప్పుడు నరేంద్రమోడీ వంతుగా వచ్చింది. గతేడాది లా కమిషన్ సమర్పించిన నివేదికలో మిగతా అంశాలతో పాటు ప్రస్తుతం వున్న రాజ్యాంగ పరిధిలో జమిలి ఎన్నికలు జరపటానికి అవకాశం లేదని న్యాయశాఖకు నివేదించింది.అంతకు ముందు నీతి అయోగ్ కూడా దీని గురించి సూచనలు చేసింది. నరేంద్రమోడీ ఏర్పాటు చేయబోయే కమిటీ ఏమి చెబుతుందో చూద్దాం. బిజెపిని నడిపిస్తున్న సంఘపరివార్ తన అజెండాను మరింత ముందుకు తీసుకుపోవాలంటే ప్రస్తుతం వున్న రాజ్యాంగం అనువుగా లేదు. కొంత మేరకు ఆటంకంగా వుంది. అందువలన దాని లౌకిక మౌలిక స్వరూపాన్ని, స్వభావాన్ని సమూలంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే దుష్ట ఆలోచన వుంది. ఇప్పటికే ఆర్టికల్ 370కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే దాని వైఖరి తెలిసిందే. అది జరగాలంటే నూతన రాజ్యాంగసభకు తప్ప పార్లమెంట్, సుప్రీం కోర్టులకు కూడా అలాంటి అవకాశం లేదనే అభిప్రాయంలను నిపుణులు ఇంతకు ముందే అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగపరిషత్‌తో నిమిత్తం లేకుండా సదరు ఆర్టికల్‌ను సవరించాలంటే పార్లమెంట్ ఆమోదంతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం కూడా అవసరం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అలాంటి తీర్మానం శాసనసభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అలా జరగాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం, హిందువులు మెజారిటీగా వున్న ప్రాంతాలలో సీట్లను పెంచి, ముస్లింలు ఎక్కువగా వున్న చోట తగ్గించి మెజారిటీగా హిందువులు ఎన్నికయ్యేట్లు చూస్తేనే అలాంటి తీర్మానం ఆమోదం పొందే అవకాశం వుంది. కనుకనే బిజెపి ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల, మార్పు గురించి ఆలోచనలు చేస్తున్నది. ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం దేశంలో మిగతా చోట్ల ఐదు సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వ్యవధి ఆరు సంవత్సరాలు. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన ఒకేసారి ఎన్నికలకు తొలి రాజ్యాంగపరమైన అడ్డంకి ఇక్కడే మొదలౌతుంది. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం పోయి కొత్త వివాదాలను ముందుకు తేవటం అంటే అసలు సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడ దీనిలో వుందన్నది స్పష్టం.
1967వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తరువాత దేశంలో ఎన్నికలు నిరంతరం జరుగుతున్న కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నది, పధకాలను అమలు జరపాలంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డువస్తున్నది. అందువలన ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. భద్రతా సిబ్బంది మీద వత్తిడిని తగ్గించవచ్చు. ప్రధానంగా ముందుకు తెస్తున్న వాదనలు ఇవి. 1999లో లా కమిషన్ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. ఒక వేళ అవిశ్వాస తీర్మానం పెడితే, దానితో పాటు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి విశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టాలని సూచించింది. అంటే ఒక ప్రభుత్వం పడిపోయినా చట్టసభలను రద్దు చేయకుండా ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నికచేసి కొనసాగించాల్సిందే.
2015లో పార్లమెంటరీ కమిటీ నివేదికలో జమిలి ఎన్నికలను సిపార్సు చేశారు. తరువాత నరేంద్రమోడీ సూచనల మేరకు 2019, 2021లో రెండు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను జరపాలని నీతి అయోగ్ సూచించింది. కానీ దాని మీద రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి మోడీ మరింత మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తిరిగి ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు. గతంలో నీతి ఆయోగ్ ముందుకు తెచ్చిన సూత్రం ప్రకారం 2018,19లో జరగాల్సిన 12 అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరపాలి. మిగిలిన అసెంబ్లీలకు 2021లో జరపాలి. అంటే దీని ప్రకారం ఐదు సంవత్సరాలలో ఒకసారికి బదులు రెండు సార్లు జరుగుతాయి. మరొక సూచన ప్రకారం 2024 నుంచి ఒకేసారి జరపాలి. దీనికి గాను రాజ్యాంగ సవరణలు చేయాలి.
అభివృద్ధికి ఎన్నికలకు లంకె !
ఇది ఒక అసంబద్దమైన వాదన.1952తొలిసాధారణ ఎన్నికల నుంచి 1967వరకు కేరళ వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో అధికారంలో వున్న కాంగ్రెస్ 1967 ఎన్నికలలో లోక్‌సభలో మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ తొలిసారిగా తొమ్మిది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. నాడు మొదలైన రాజకీయ సంక్షోభం మరో రెండు సంవత్సరాలలో కాంగ్రెస్‌లో చీలికకు, పర్యవసానంగా లోక్‌సభను ఏడాది ముందుగానే రద్దు చేసి 1971లో ఎన్నికలకు పోవటం, ఆ సందర్భంగా ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలపై కోర్టు తీర్పు, దాన్ని వమ్ము చేసేందుకు రాజ్యాంగసవరణ, అత్యవసర పరిస్ధితి వంటి పరిణామాలన్నీ తెలిసిందే. నిజానికి పదిహేను సంవత్సరాల పాటు రాజకీయ స్ధిరత్వం వున్నా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? నిరుద్యోగం, ధరల పెరుగుదల, చెల్లింపుల సమస్య తలెత్తటం, ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని అంగీకరించటం ఈ కాలంలో జరిగినవే. జయప్రకాష్ నారాయణకేమీ పనిపాటా లేక లేదా అధికారం కోసం ఆందోళనలు నిర్వహించలేదు. తరువాత వాజ్‌పేయి పాలనా కాలంలో ప్రభుత్వ స్ధిరత్వానికి ఎలాంటి ముప్పు లేదు, దేశం వెలిగిపోతోందంటూ బిజెపి ప్రచారం చేసుకుంది, అయినా ఆ పార్టీ ఓడిపోయింది. గత అయిదు సంవత్సరాలలో కూడా రాజకీయంగా ఎలాంటి అస్ధిర పరిస్ధితి లేదు, బిజెపి ఏ బిల్లుపెడితే ఆ బిల్లు, ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిగింది. అయినా 1971 నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ఇద్దరు రిజర్వుబ్యాంకు గవర్నర్లు, ఒక ప్రధాన ఆర్ధిక సలహాదారు అర్ధంతరంగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అభివృద్ధి అంకెల గారడీ చేసి లేని అభివృద్ధిని వున్నట్లు చూపారని మాజీ ప్రధాన ఆర్ధిక సలహాదారు చెబుతుంటే, అభివృద్ధి అంకెలే నిజమైతే దానికి అనుగుణ్యంగా వుపాధి ఎందుకు లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు. ఇలాంటి వాటి మీద చర్చ జరిగితే తమకు నష్టం కనుక వేరే అంశాలను జనం ముందు పెడుతున్నారనే అభిప్రాయం వుంది.
పోనీ ప్రపంచంలో అనేక దేశాలలో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు,చివరికి స్ధానిక సంస్ధలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న వుదంతాలు వున్నాయి. వాటి అభివృద్ధి సంగతేమిటి? ప్రతి ఏటా ఎక్కడో ఒకదగ్గర ఎన్నికలు జరుతున్నా, కేంద్రీకరణ పక్కదారి పడుతున్నా మన దేశ అభివృద్ధి ఏడుశాతంపైగా వుందని, చైనాను అధిగమించామని మన పాలకులు చెబుతున్నారు కదా ! అమెరికాలో అలాంటి పరిస్ధితి లేదు, ఐరోపా దేశాలలో లేదు, అనేక చోట్ల ప్రభుత్వాలు కూలిపోయినా, ఏదోఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప చట్ట సభలు రద్దు కావటం లేదు. మరి అక్కడ ఒకటి నుంచి మూడుశాతంలోపే అభివృద్ధి రేటు ఎందుకు వుంటున్నట్లు? ధనిక దేశాలన్నీ సంక్షోభాలను ఎందుకు ఎదుర్కొంటున్నట్లు ? వాణిజ్య యుద్దాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? అనేక దేశాలలో నియంతలు ఎన్నికలే లేకుండా , లేదూ జరిపినా తూతూ మంత్రంగా చేసి దశాబ్దాల తరబడి అధికారంలో పాతుకుపోయిన చోట్ల కూడా అభివృద్ధి ఆమడ దూరంలో వుండటాన్ని చూశాము. అభివృద్ధి అనుసరించే విధానాలను బట్టి తప్ప ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎవరైనా వుంది అంటే పైన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ఖర్చు తగ్గింపు వాదన !
ఎన్నికల ఖర్చు తగ్గించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, అయితే ఏ ఖర్చు అన్నది అసలు సమస్య. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ఖర్చు 60వేల కోట్ల వరకు వుంటుందని, దానిలో ఎక్కువ భాగం బిజెపి చేసిందన్నది జగమెరిగిన సత్యం. దాన్ని తగ్గించటం ఎలా అన్నది చర్చిస్తే అర్ధం వుంటుంది. దాన్ని మరుగుపరచి అధికారిక ఖర్చు తగ్గింపు గురించి జనం దృష్టిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఒక పోలింగ్ బూత్‌లోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కలసి వచ్చేది భద్రతా సిబ్బంది, కొంత మేర రవాణా ఖర్చు తప్ప మిగిలినవేవీ తగ్గవు. ఓటింగ్ యంత్రాలు, వాటి నిర్వహణకు ఎన్నికల సిబ్బందిలో తగ్గేదేమీ వుండదు. ఒక రాష్ట్రంలో ఒక రోజు ఎన్నికలు జరిపే పరిస్ధితి లేదు, రాను రాను ప్రతి ఎన్నికకూ భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాల్సి వస్తోంది. దానికి కారణం ఎన్నికలు ఎప్పుడూ జరగటం కాదు. శాంతిభద్రతల సమస్యలు, ఓట్ల రిగ్గింగు, గూండాయిజం వంటి ఆవాంఛనీయ ధోరణులు పెరగటం. అలాంటపుడు ఒకేసారి జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? ఓట్ల కొనుగోలు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతుల వంటి ఇతర ప్రలోభాలను తగ్గించటం ఎలా అన్నది అసలు సమస్య. వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ఒకటో అరో తప్ప రిజర్వుడు నియోజకవర్గాలలో కూడా డబ్బు ఖర్చుపెట్టగల వారినే అభ్యర్ధులుగా నిలుపుతున్న తరువాత వారు గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయకుండా ఎలా వుంటారు. ఎన్నికల తరువాత పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా వసూలు చేసుకోవటమే కాదు, వచ్చే ఎన్నికలకు సైతం అవసరమైన నిధులను సంపాదించుకొనేందుకు చూస్తున్న స్ధితి.ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఎవరైనా తక్కువ ఖర్చు చేశారా, ఓట్ల కొనుగోలు, అమ్మకాల ధరలేమైనా తగ్గాయా ? ఏ ఎన్నికలలో పోటీ చేసే వారు ఆ ఎన్నికలకే వుంటారు. ఎంపీ, ఎంఎల్‌ఏలుగా ఒకేసారి ఒకరే పోటీ చేయరు. ఈ ఎన్నికల బరిలోకి దిగిన వారు స్ధానిక సంస్దల వైపు రారు. ఎవరి స్ధాయిలో వారి కొనుగోళ్లు, ప్రలోభాలు వుంటాయని తెలంగాణాలో ఆరు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామీణ స్ధానిక సంస్ధ ఎన్నికలు రుజువు చేశాయి. కాళేశ్వరం పనులేమీ ఆగలేదు, ఆరు నెలలకు ముందు వుద్యోగఖాళీలనేమీ నింపలేదు, ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో కూడా అదే పరిస్దితి. అందువలన అభివృద్ధి ఆగటం అంటే ఏమిటి? ఈ వాదన చివరకు అసలు ఎన్నికలే లేకపోతే అంతా సాఫీగా సాగుతుంది, ఓట్ల ఖర్చు వుండదు, అంతా అభివృద్ధికే మళ్లిస్తారన్న వాదనలనూ ముందుకు తెచ్చేవారు వుంటారు.
అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి !
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అన్ని అభివృద్ధి పధకాలు ఆగిపోతాయి. ఇదొక పచ్చి అవాస్తవం. చట్టసభల పదవీ కాలం అరవై నెలలు అనుకుంటే ఎన్నికల నిర్వహణ జరిగేది గరిష్టంగా ఒక నెల, రెండు నెలలు. ఈ కాలంలో అభివృద్ధి ఆగిపోతుందా? అసలు అభివృద్ధి అంటే ఏమిటి? కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాక ముందే పధకాలను ప్రకటిస్తున్నారు, నిబంధనావళి అమల్లోకి వచ్చిన తరువాత కొత్త పధకాలు ప్రకటించకూడదు, ఓటర్లను ప్రభావితం చేసే వాగ్దానాలను ఎన్నికల ప్రణాళిక రూపంలో ఎలాగూ చేయవచ్చు. అంతే తప్ప పాతవాటిని అమలు నిలిపివేయాలన్న నిబంధనలేవీ లేవు. సంక్షేమ పెన్షన్లు, వుద్యోగుల జీతభత్యాలు ఆగవు.మహా అయితే కరువు భత్యం వంటివి వాయిదా పడతాయి. రోజూ ఎన్నికలైతే అధికారులు పనులేమి చేస్తారు అన్నది మరొక వాదన. ఎన్నికలు లేనపుడు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నట్లయితే లక్షలాది ఫైళ్లు ఎందుకు గుట్టలుగా పేరుకుపోతున్నట్లు ? కోర్టులలో కేసుల విచారణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకం కాదు, అయినా ఏండ్లతరబడి ఎందుకు సాగుతున్నట్లు ? మంత్రుల పని కుంటుపడుతుంది, ఇంతకంటే హాస్యాస్పద వాదన మరొకటి లేదు.
స్ధిరత్వం కావాలి !
ఎన్నికైన చట్ట సభలు స్ధిరంగా పని చేయాలి. రద్దు కాగూడదు. కొన్ని దేశాలలో ప్రభుత్వం పడిపోతే మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తప్ప సభలను రద్దు చేసి మాటి మాటికి ఎన్నికలకు పోరు. అసలు ప్రభుత్వాలు పడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అవినీతి, అక్రమాలకు పాల్పడితేనో, ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన తెలిపితేనో ఏదో ఒక బలమైన కారణం వుంటే తప్ప ప్రభుత్వాలు పతనం కావు. తూచ్ ఈ రోజు ఈ ఆట, రేపు ఇంకొక ఆట ఆడుకుందామని చెప్పటానికి ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఏమైనా పసిపిల్లలా ! స్దిరత్వం పేరుతో ఒక ప్రభుత్వం కూలినా మనకేమీ ఢోకా లేదు మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం లెమ్మని ప్రజాప్రతినిధులు రెచ్చిపోయే పరిస్ధితిని జనం మీద రుద్దాలని చూస్తున్నారా ? తమకు వాగ్దానం చేసిన విధంగా లేదా తాము ఆశించిన విధంగా తమ ప్రజాప్రతినిధి పని చేయటం లేదని వెనక్కు పిలిపించాలని కోరే హక్కు ఓటర్లకు ఇస్తారా అంటే దాని ప్రస్తావనే లేదు.
బిజెపి ఎందుకు జమిలి ఎన్నికలను కోరుతోంది ?
లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు ఓటర్లు ఏదో ఒక పార్టీనే ఎన్నుకున్నట్లు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంది. అందువలన అది తమకు అనుకూలంగా వుంటుందని బిజెపి భావిస్తోంది. గతంలో ఆ పార్టీ కొన్ని చోట్ల బలంగా వున్నప్పటికీ దేశవ్యాపితంగా లేదు, ఇప్పుడు దేశవ్యాపితంగా పెద్ద పార్టీగా ఎదిగింది కనుక తమకు అనుకూలం కనుక ఎలాగైనా ఆ విధానాన్ని అనుసరించాలనే ఆతృత ఇప్పుడు దానిలో కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు వెంటనే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని చావు దెబ్బతీసి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి పరిస్ధితి రాకుండా చూడాలని కోరుకుంటోంది. గత ఎన్నికల్లో రెచ్చగొట్టిన మాదిరి మతభావాలు, విద్వేష ప్రచారం, వుపయోగించుకొనేందుకు పుల్వామా, కార్గిల్ వంటివి ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భంలోనూ రావు. రెండవది విద్వేష ప్రచారాన్ని ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో రెచ్చగొట్టటం ప్రారంభిస్తే అది ఎల్లకాలమూ, అన్నివేళలా ఆశించిన ఫలితాలు రావు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, అది కూడా హిందూమతం ఇలా అజెండాను అమలు జరపవచ్చు. ప్రస్తుతం అన్ని పార్టీల కంటే అది ఆర్ధికంగా, ఇతరత్రా బలంగా వుంది కనుక ఒకేసారి ఎన్నికలు జరిపితే మిగతా వాటి కంటే ముందుండవచ్చు. ఇలా దాని కారణాలు దానికి వున్నాయి.
జమిలి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది ఎవరు ?
పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అని బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి గాను 1959లో కేరళలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయటాన్ని చూపుతున్నారు. దానిలో కాదనాల్సిందేమీ లేదు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. నేటి బిజెపి పూర్వ రూపం జనసంఘం. నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయటంలో కాంగ్రెస్,ఆర్‌ఎస్‌ఎస్ దాని రాజకీయ విభాగం జనసంఘం, కేరళలోని మెజారిటీ, మైనారిటీ మతశక్తులు, మీడియా, వీటన్నింటినీ సమన్వయ పరచిన అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ, అమెరికా రాయబారులు తమ వంతు పాత్రను పోషించారు. ఇదంతా విమోచన సమరం పేరుతో సాగించారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎత్తుగడలు ఎవరు రూపొందించారో అన్నింటినీ పాట్రిక్ మోయిన్ హన్ అక్షర బద్దం చేశారు. ఆ పధకంలో భాగంగా జనసంఘం నేత వాజ్‌పేయి కొట్టాయం వచ్చి మళయాల మనోరమ పత్రిక అధిపతి మామెన్ మాప్పిలై అధ్యక్షతన జరిగిన సభలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశారు. 1959 జూలై 31న ఆర్టికల్ 356ను తొలిసారిగా వుపయోగించి నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆగస్టు ఒకటం తేదీన విజయ దినం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘంతో సహా కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ సంబరాలు చేసుకున్నారు.
ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు జనసంఘం నేతగా వాజ్‌పేయి బలపరుస్తూ ఏం మాట్లాడారో చూడండి.’ కేరళ జనం అభినందనలకు అర్హులు, భవిష్యత్‌లో కూడా వారు కమ్యూనిస్టు పార్టీకి తగిన జవాబు చెబుతారని ఆశిస్తున్నాను.నేను కాంగ్రెస్‌ను విమర్శించే వాడినే అయినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వంలోని 13 రాష్ట్రాలలో ఏం జరిగిందో చెప్పటానికి నేను వెనుకాడను, ఎక్కడా సెల్ కోర్టులను ఏర్పాటు చేయలేదు(కమ్యూనిస్టు పార్టీ శాఖల కోర్టులని వాజ్‌పేయి భావం), పద్నాలుగు సంవత్సరాల యువకులు వారి ఇండ్ల నుంచి బయటకు రాకుండా నిషేధించలేదు. కమ్యూనిస్టులను వివాహం చేసుకోవాలని ఏ తలిదండ్రులూ తమ బిడ్డలకు చెప్పలేదు, సెల్ కోర్టులను దిక్కరించిన వారిని ఎక్కడా కత్తిపోట్లకు గురిచేయలేదు. ఈ మాటలు చెబుతూ నేను తీర్మానాన్ని బలపరుస్తున్నాను ‘ అన్నారు. తరువాత జనతా పార్టీలో విభాగమైన వాజ్‌పేయి తదితరులు అదే ఆర్టికల్‌ను వుపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేయటం గురించి వేరే చెప్పనవసరం లేదు.
కేరళలో కమ్యూనిస్టుల గురించిన తప్పుడు ప్రచారం ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్నట్లుగా కమ్యూనిస్టు గ్రామాల్లో మరొక పార్టీని బతకనివ్వరని, వ్యతిరేకించేవారిని చంపివేస్తారనే ప్రచారం 1950దశకంలోనే ప్రారంభమైంది. వాజ్‌పేయి అంతటి వ్యక్తే దాన్ని పార్లమెంట్ వేదికగా కొనసాగించిన తరువాత ఆయన వారసులుగా చెప్పుకొనే అంతర్జాల పోకిరీల గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్ జీహాద్ పేరుతో ఇప్పుడు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేసినట్లుగానే గతంలో కమ్యూనిస్టుల మీద కూడా ఇలాంటి నిందా ప్రచారం జరిగినట్లు వాజ్‌పేయి వుపన్యాసమే సాక్షి.
రాజ్యాంగ నిబంధనలు, స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలను వామపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కాన్ని ప్రాంతీయ పార్టీలు వాటి పర్యవసానాలు, తెరవెనుక లక్ష్యాలను గుర్తించలేక సమర్దిస్తున్నాయి. ఎన్నికల్లో కండబలం, ధనబలం, అధికార దుర్వినియోగాన్ని గణనీయంగా అరికట్టేందుకు ఇప్పుడున్న మార్గం దామాషా పద్దతిలో ఎన్నికల నిర్వహణ చేపట్టటమే. ఎవరైనా ఫిరాయింపులను ప్రోత్సహించినా, పాల్పడినా వారి సభ్యత్వం రద్దయి, ఆ పార్టీ జాబితాలో వున్న ఇతరులతో ఆ స్ధానాన్ని పూర్తి చేసే విధంగా సంస్కరణలు చేపట్టాలి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఎంతమందికి అవకాశం వస్తుందో ముందుగా తెలియదు కనుక అభ్యర్ధులు డబ్బు ఖర్చు చేసే పరిస్ధితి వుండదు. ఎవరైనా వ్యక్తులుగా పోటీ చేయదలచుకుంటే, నియోజకవర్గాలు ఎలాగూ వుంటాయి కనుక వాటిలో పోటీ చేసి సత్తా వుంటే తగిన ఓట్లు తెచ్చుకొని ఎన్నిక కావచ్చు. అందువలన ఇలాంటి ఆచరణ సాధ్యమైన విధానాల గురించి చర్చిస్తే వుపయోగం. అందుకు బిజెపితో సహా ఎన్ని పార్టీలు సిద్ధం అన్నది ప్రశ్నార్దకం.ఎందుకంటే ప్రతి పార్టీ డబ్బు, రెచ్చగొట్టటం వంటి పద్దతుల్లో గెలవటం సులభం అనుకుంటున్నందున ప్రతి ఓటు తన ప్రతినిధిని చట్టసభలకు పంపే న్యాయం జరిగే ఇలాంటి ప్రజాస్వామ్యబద్దమైన సంస్కరణలకు అనుకూలంగా వున్న పార్టీలను ప్రోత్సహించటంతో పాటు పౌర సమాజమే ముందకు వచ్చి, అడ్డుపడుతున్న వారిని నిలదీయాల్సిన అవసరం వుంది.