Tags

, , , ,

Image result for bjp surgical strike on tdp four mps captured

ఎం కోటేశ్వరరావు

బాలకోట్‌ మీద రాత్రిపూట జరిపిన మెరుపుదాడిలో ఎందరు వుగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేరు గానీ, పట్టపగలు అందరి ఎదుటే గురువారం సాయంత్రం తెలుగుదేశం మీద జరిపిన మెరుపుదాడిలో బిజెపి నలుగురు రాజ్యసభ సభ్యులను చేజిక్కించుకుంది. ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు విలీనాన్ని ఆమోదించటం, బిజెపి తన సభ్యుల జాబితాలో నలుగురు సభ్యులైన వై సుజనా చౌదరి, సిఎం రమేష్‌, టిజి వెంకటేష్‌, గరికపాటి మోహనరావు పేర్లను చేర్చటం జరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి దాడులకే సన్నద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం తరువాత వెంటవెంటనే జరిగిన పరిణామాల్లో వూహకు అందని రీతిలో పనికానిచ్చి తమ తీరే వేరని బిజెపి నిరూపించుకుంది. వీరితో పాటు మరి కొందరు ఎంపీలు, ఎంఎల్‌ఏల కోసం కూడా బిజెపి మాటువేసిందని వార్తలు కొద్ది రోజుల క్రితమే వచ్చినప్పటికీ మరీ ఇంత త్వరలో పని పూర్తి చేస్తారని వూహించి వుండరు. ఒక నిర్ణయం జరిగిన తరువాత నలుగురి నోళ్లలో నానటం ఎందుకు వచ్చే చెడ్డపేరు ఎలాగూ వస్తుంది, ఈ మాత్రం దానికి సిగ్గు ఎందుకు అన్నట్లుగా జరిపించేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాల అక్రమాలకు, అత్యవసర పరిస్ధితి వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి మూడు దశాబ్దాలు పడితే పూవు పుట్టగానే పరిమళించినట్లుగా వాటిలో ఒకటైన ఫిరాయింపుల ప్రోత్సాహం, కేంద్ర దర్యాప్తు సంస్ధలను వుపయోగించుకొని బెదిరించటానికి రెండవసారి సంపూర్ణ మెజారిటీతో అధికారానికి వచ్చిన నాటి నుంచి బిజెపి ప్రారంభించి తమది భిన్నమైన పార్టీ అని నిజంగానే నిరూపించుకుంది.

తమ నేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లటాన్ని చూసి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారని తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో మనోభావాన్ని రెచ్చగొట్టేందుకు, ఒక సాకును చొప్పించేందుకు ప్రయత్నించారు. ఫిరాయించే వారు అధినేత వుంటే కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకొని సకల లాంఛనాలతో పోతారా ? అదే ప్రమాణం అనుకుంటే వైస్రాయ్‌ వుదంతాలలో ఎన్‌టిఆర్‌కు తెలుగు తమ్ముళ్లు ఇచ్చిన గౌరవం ఏమిటో యావత్‌ దేశం సచిత్రంగా చూసింది. ఎవరూ ఎన్‌టిఆర్‌ ఆశీస్సులు తీసుకోలేదు, ఆయన వుండగానే తిరుగుబాటు చేశారు కదా ! పార్టీ ఎంపీలు, మరికొందరు నేతలు ఏక్షణంలో అయినా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్నారని వార్తలు వచ్చినప్పటికీ పార్టీని కాపాడుకోవటానికి ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. తమ సభ్యుల పట్ల మితిమీరిన విశ్వాసమా ?

ఒకటి స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఇడి అనే వేట సంస్ధల వేటు నుంచి తప్పించుకోవటానికి వ్యాపారులందరూ కేంద్రంలో, రాష్ట్రాలలో వారికి మిత్రపక్షాలుగా ఎవరు అధికారంలో వుంటే వారితో సయోధ్యగా వుండటమో లేక జతకట్టటమో చేస్తుంటారు. అది గత ఎన్నికల్లోనే వైసిపి ఎంపీల విషయంలో రుజువైంది. ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి లొంగదీసుకొనేందుకు అసమర్ధ కాంగ్రెస్‌కు ఐదు దశాబ్దాలు పడితే సమర్ధ బిజెపి కేవలం ఐదు సంవత్సరాలలోనే ఆ విజయాన్ని సాధించింది. సమావేశం లేదు, తీర్మానాలు లేవు, సుజనా చౌదరి బహిరంగంగా చెప్పినట్లు నలుగురూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదు కూడా. ఫిరాయించిన ఎంపీలు అనర్హత వేటును తప్పించుకొనేందుకు పార్టీని విలీనం చేసినట్లు అవసరమైన పత్రాలను తయారు చేయటం, దాన్ని ఏకంగా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందచేయటం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. రాజకీయ నీతులు చెప్పే వెంకయ్య నాయుడు వారి పత్రాన్ని స్వీకరిస్తూ ఫొటోలకు ఇచ్చిన ఫోజును చూసి ఏమనుకోవాలో జనానికే వదలివేద్దాం. రానున్న రోజుల్లో మిగిలిన తెలుగుదేశం ఎంపీల్లో ఎందరు మిగులుతారనేది శేష ప్రశ్న. ఎంపీల ఫిరాయింపు తెలుగుదేశం ఎంఎల్‌ఏల ఫిరాయింపులను వేగవంతం చేసిందనే వార్తలు వచ్చాయి. తమ నేత విదేశాల నుంచి వచ్చేంతవరకు ఆగుతారా లేక వచ్చిన తరువాతే తాము ఫిరాయిస్తే ఏం చేస్తారో చూస్తాం అంటూ వేచి చూస్తారా అన్నది చూడాలి. జరగనున్నది జరగక మానదు, ముందుగా నిర్ణయించుకున్న యాత్ర పూర్తి చేసి కనీసం కుటుంబసభ్యులనైనా సంతోష పెడితే మంచిదేమో చంద్రబాబు ఆలోచించుకోవాలి.అదే నేను ఇక్కడ వుంటేనా అని చెప్పుకొనేందుకైనా అక్కడే వుండి అంతా పూర్తయిన తరువాత తిరిగి వస్తే కాస్త పరువు దక్కుతుంది. ఫేక్‌ ప్రచారాలను చేయించటంలో తెలుగుదేశంతో సహా ఏ ఒక్క పార్టీ తక్కువ తినలేదు. ఇప్పుడు స్వయంగా తెలుగుదేశం నేత, వారి రాజగురువు రామోజీరావు, ఇతర కుల పెద్దలే ఎంపీలను బిజెపిలోకి పంపారనే సామాజిక మాధ్య ప్రచారానికి వారే సమాధానం చెప్పుకోవాలి.

బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు, గో సంరక్షణ పేరుతో దాడులు చేసే వారు, ఇతర అవాంఛనీయ శక్తులు పుష్కలంగా వున్నాయి. ఇతర పార్టీల నుంచి అవినీతి, అక్రమాల ముద్రపడిన వారు, పార్టీకి పెట్టుబడులు పెట్టగలిగిన వారు కొన్ని రాష్ట్రాలలో దానికి కొరతగా వున్నందున దాన్ని పూడ్చుకొనేందుకు ఎంతగా ఆత్రత పడుతోందో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తాము అవినీతి ఆరోపణలు చేసిన వారు, తమపై రాజకీయంగా దాడి చేసిన వారిని ఇప్పుడు బిజెపి చేర్చుకుంది. గతంలో సిబిఐ, ఇడి దాడులకు, బిజెపి ఆరోపణలకు గురైన వారిని తెలుగుదేశం పార్టీ సమర్ధించింది. ఇదే అదే పార్టీ వారు ఎంపీలు స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడారని చెబుతున్నారు, వారివి నాలికలా మరొకటా అన్న అనుమానం వస్తోంది. బిజెపి నేతలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆయారామ్‌ గయారామ్‌ టిజి వెంకటేష్‌ ఏ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారో అదే ప్రయోజనం కోసం బిజెపి పంచన చేరారు. మిగిలిన ముగ్గురిదీ అదే దారి.

Image result for bjp surgical strike on tdp four mps captured

కేసులు, ఆరోపణలు వున్నంత మాత్రాన నిర్ధారణ అయ్యేంత వరకు ఎంపీలు నేరం చేసినట్లు కాదని అందువలన తెలుగుదేశం ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవటం తప్పుకాదని బిజెపి నేతలు కుంటిసాకు చెబుతున్నారు. గతంలో డేరాబాబా, ఆశారాంబాపు వంటి నేరగాండ్ల గురించి కూడా బిజెపి నేతలు ఇదే వాదనలు చేసి వారితో అంటకాగిన విషయం తెలిసిందే. బిజెపి ఇలాంటి నేర చరిత్ర, కేసులు వున్నవారిని ఇదే వాదనలతో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులుగా నిలిపి మద్దతు పలికింది, తర తమ స్ధాయిలో మిగతా పార్టీలు కూడా అదే బాట పట్టాయి. గతంలో పార్టీల నేతలు తాము ఎంత పరిశుద్ధమో చెప్పుకొనేందుకు తమ రక్తాల గురించి చెప్పేవారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా వాటి రక్తాలన్నీ లుషితమే. జన్యువుల్లోనే మార్పులు జరిగాయి. కనుకనే ఏ పార్టీ నుంచి ఎవరు చేరినా వారిని తమలో ఇముడ్చుకోవటానికి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఎన్నికల ముందు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కూడా ఫిరాయింపుదార్లను చేర్చుకుంటున్నపుడు వారు ఎన్నికలైన తరువాత ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వేరే పార్టీ వైపు చూస్తే, ఫిరాయిస్తే తప్పు పట్టాల్సిన పనేముంది? నీవు నేర్పిన విద్యయే కదా ! అసలు తప్పు ఎవరిది అని చెప్పాల్సి వస్తే అలాంటి వారిని గుడ్డిగా ఎన్నుకుంటున్న జనానిదే అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలను బిజెపిలో చేర్చుకోవటం అంటే త్వరలోనే వైసిపి మీద రాజకీయ దాడికి నాందిపలకటమే అన్నది ఒక అభిప్రాయం.అదే జరిగితే జగన్‌, ఇతరుల మీద వున్న కేసులను, తెలుగుదేశం నుంచి కాషాయ తీర్ధం పుచ్చుకున్న నేతల దాడిని వైసిపి ఎలా ఎదుర్కొంటుంది అనేదే ఆసక్తికరం. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణాలో తెరాస మాదిరి ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు తెలుగుదేశం ఫిరాయింపుదార్ల పట్ల, బిజెపినేతల పట్ల వైసిపి వ్యవహరిస్తే కేంద్రం తన వద్ద వున్న పెద్ద కత్తిని వైసిపి మెడమీద ప్రయోగించటానికి వెనుకాడదు. ఇదొక ప్రత్యేక పరిస్ధితి అనవచ్చు.