ఎం కోటేశ్వరరావు
డోనాల్డ్ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా, ఆ పిచ్చివాడి ప్రేలాపనలు, చర్యలకు అనుగుణంగా మారు మాట్లాడకుండా భారత్‌తో సహా అనేక దేశాలు నృత్యం చేయటం ఏమిటి? ఆ పిచ్చి మనకూ సోకిందా ? ఇరాన్ మీద దాడి చేయమని ట్రంప్ ఆదేశించటం ఏమిటి, చివరి నిమిషంలో ఆపేయండి అనటం ఏమిటి, అంతలోనే అసలు నేను దాడికి సిద్దం కమ్మని చెప్పానే తప్ప అంతిమ ఆదేశం జారీచేయలేదని అనటం ఏమిటి, పిచ్చిగాక పోతే అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇరాన్ గగన తలం మీద నుంచి మన విమానాలు ఎగరకూడదని అమెరికా తన సంస్ధలను ఆదేశించింది. మనతో సహా మిగతా దేశాలకు ఏమైంది. మన విమానాలను కూల్చివేస్తామని ఇరాన్ ప్రకటించలేదే, అటువంటి వాతావరణం కూడా లేదే, అయినా మనం కూడా మరో దారిలో ప్రయాణించాలని నిర్ణయించాం. ఇది విమాన సంస్ధల మీద లేదా ప్రయాణీకుల మీద భారం మోపదా ? అమెరికా కోసం మనం ఇరాన్‌తో వైరం తెచ్చుకోవాలా? ఇవన్నీ జనానికి సంబంధించిన ప్రశ్శ లు. అమెరికా అడుగులకు మడుగులొత్తాలని పాలకులెప్పుడో నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల పూర్వరంగంలో తమపై దాడి జరిగితే దాన్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నాహాలతో వున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
మరోవైపు నుంచి ఆలోచిస్తే ట్రంప్ పిచ్చివాడా, ఇది నిజమా ? కానే కాదు, ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలనుకుంటున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఒక పిచ్చివాడిని గద్దె మీద కూర్చోపెట్టేంత అమాయకులా కానే కాదు, కాదు. మరి ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ! డోనాల్డ్ ట్రంప్ చర్యల గురించి అనేక మంది పరి పరి విధాలుగా అలోచిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. ఎందుకిలా చేశారు, కారణం ఏమై వుంటుంది. గత కొద్ది వారాల పరిణామాలను చూస్తే ఇరాన్ మీద ఆధారరహిత నిందలు మోపేందుకు, రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా వచ్చిన వార్తల మేరకు అమెరికన్లు గురువారం వుదయం ఇరాన్ గగనతలం మీదకు ఒక గూఢచారి డ్రోన్‌ను పంపారు, దాని వెనుకనే 35మంది సైనికులు వున్న మిలిటరీ విమానమూ వుంది. అనుమతి లేకుండా తమ గగనతలాన్ని అతిక్రమించిన డ్రోన్‌ను ఇరాన్ గార్డులు కూల్చివేశారు. మిలిటరీ విమానం కూడా ఇరాన్ గగనతలంలో ప్రవేశించిందా లేదా అన్నది తెలియదు. అసలు మిలిటరీ విమానాన్ని పంపలేదని అమెరికా చెబుతోంది. తమ డ్రోన్ అంతర్జాతీయ జలాల పరిధిలో వుంది కనుక కూల్చివేత దుర్మార్గమంటూ ఇరాన్ మీద దాడి చేయాలని ట్రంప్ వెంటనే ఆదేశాలిచ్చాడని, అయితే ఆరోజు రాత్రేే నిలిపివేయమని చెప్పినట్లు న్యూయార్క్‌టైమ్స్ పత్రిక ద్వారా లోకానికి వెల్లడించారు. తరువాత ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానసలు అంతిమ ఆదేశాలు ఇవ్వలేదు, విమానాలు గాల్లోకి ఎగరలేదని ట్రంప్ స్వయంగా చెప్పాడు. డ్రోన్ కూల్చివేత పూర్వరంగంలో ఇరాన్ గగన తలం మీదుగా విమానాలను నడపవద్దని అమెరికా తన విమాన సంస్ధలను కోరింది. ఇంకేముంది పొలోమంటూ మనతో సహా మిగతా దేశాలు కూడా అదే పని చేశాయి. అయితే ఇరాన్ రాజధాని టెహరాన్‌కు నడిపే విమానాలను ఇతర దేశాలు రద్దు చేయలేదని, గతం మాదిరే నడిపాయని వార్తలు వచ్చాయి. ఇదొక ప్రచార, మానసిక యుద్ధం తప్ప వేరు కాదు.
తాను ఆదేశించినట్లుగా దాడులు జరిగితే నిర్ధేశిత లక్ష్యాలను దెబ్బతీయటంతో పాటు 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని అందువలన దాడులను నిలిపివేసినట్లు ట్రంప్ పేర్కొన్నాడు. అయితే లక్ష్యాలతో పాటు ప్రాణ నష్టాల గురించి వివరించిన తరువాతే ట్రంప్ దాడి ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పత్రిక పేర్కొన్నది. అందువలన ట్రంప్ ఆడిన అబద్దాలలో ఇదొకటిగా మిగిలిపోయింది. ట్రంప్ చర్య వెనుక కారణాలేమిటి అని అనే మీడియా వూహాగానాలలో ెముఖ్యమైౖనవి ఇలా వున్నాయి.కమాండర్ తప్పిదం తప్ప డ్రోన్‌ను కూల్చివేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడాలని ఇరాన్ నాయకత్వం అనుకోలేదని ట్రంప్‌కు తెలిసిందట, దాంతో దాడుల విరమణకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్ మాజీ జనరల్ జాక్ కియానే ఫాక్స్ బిజినెస్ ఛానల్‌కు చెప్పాడు. తన ఆదేశాల మేరకు మరో పదినిముషాల్లో విమానాలు బయలు దేరుతాయనగా దాడులు జరిగితే 150 మంది పౌరులు మరణిస్తారని తెలిసిన వెంటనే ఆపమని చెప్పారన్నది ఒక కధనం. అయితే జరిగే ప్రాణనష్టం గురించి కూడా వివరించిన తరువాతే దాడులకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్ అధికారులు తమకు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొన్నది. ఇరాన్ రక్షణ వ్యవస్ధలను తప్పించుకొనే బి2 బాంబర్లు సిద్ధం కానందున దాడులను నిలిపివేసినట్లు ఒక అధికారి ఓక్స్ విలేకరికి చెప్పగా దాడి జరిగితే చమురు సంక్షోభం తలెత్తవచ్చని, అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరగవచ్చని భావించిన ట్రంప్ నిలిపివేతకు ఆదేశించినట్లు మరో అధికారి ఓక్స్ విలేకరికి చెప్పటం గమనార్హం. గురువారం రాత్రి ఫాక్స్‌న్యూస్ ఛానల్లో టక్కర్ కార్ల్సన్ ఇరాన్ మీద దాడి చేయవద్దని చేసిన వినతికి స్పందించి ట్రంప్ వెంటనే దాడి నిలిపివేయాలని కోరినట్లు మరొక కధనం. చర్చలకు అంగీకరించకపోతే దాడులు చేస్తామని ట్రంప్ బెదిరించాడు, ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా ఇరాన్ స్పందించలేదు, దాంతో ట్రంప్ వెనక్కు తగ్గాడని ఇరాన్ వర్గాలు చెప్పినట్లు రాయిటర్ పేర్కొన్నది. అయితే అసలు కారణం ఏమిటన్నది అధ్యక్ష భవన ప్రతినిధి ఎవరికీ చెప్పలేదు. వూహాగానాలను అవునని గాని కాదని గాని ఖండించలేదు. గూఢచార డ్రోన్‌తో పాటు సైనికులున్న విమానం కూడా ఎగిరిందా లేదా అన్నది అమెరికన్లు నిర్ధారించలేదు.
ఇదంతా చూస్తుంటే ఇరాన్ ఆదమరచి వున్న సమయంలో దెబ్బతీయటానికి ఇలాంటి ఆదేశాలు, నిలిపివేతల నాటకం ఆడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో యుద్దోన్మాదులు ఇలాంటి అనేక నాటకీయ పరిణామాలకు పాల్పడినందున దేన్నీ కొట్టివేయలేము. అయితే ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఇరాన్ అన్ని విధాలుగా సన్నద్దంగానే వున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రెచ్చగొట్టిన వాటికి సమాధానం ఇవ్వటం తప్ప తానుగా ఇంతవరకు రెచ్చిపోయిన వుదంతం లేదు. చమురు ఓడల మీద ఇరాన్ దాడులు చేసినట్లు అమెరికా చెప్పటమే తప్ప ఆధారాలు లేవు. డ్రోన్ కూల్చివేయటం ఒక్కటే నిజం. అది తన గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించినా కూల్చకపోతే భయపడినట్లు ప్రపంచం భావిస్తుందని ఇరాన్‌కు తెలుసు కనుకనే కూల్చివేసింది. ఒక వేళ సంయమనం పాటించి కూల్చకపోతే చూశారా, వారి గగన తలంలోకి మేము ప్రవేశించినా చూస్తూ వుండిపోయిందని అమెరికన్లు ప్రచారం చేసుకొనే అవకాశమూ వుంది. ఇదంతా రెచ్చగొట్టే ఒక దుష్ట క్రీడ తప్ప వేరే కాదు. అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణ సలహాదారు, సిఐఏ డైరెక్టర్ వంటి వారందరూ దాడులకు అనుకూలంగా వున్నప్పటికీ ట్రంప్ వైఖరి అలా లేదనే ప్రచారమూ జరుగుతోంది. రాజు మంచివాడేగానీ మంత్రులూ, సలహాదారులే చెడ్డవారు అని చెప్పటం వంటిదే. ఇరాన్ మీద దెబ్బకు దెబ్బ తీయాలంటూ జనం నుంచి స్పందన వెల్లువెత్తింది, దాన్ని చూసిన తరువాత ఎంత మంది చనిపోతారని నేను అడిగాను, 150 మంది సర్ అని ఒక జనరల్ చెప్పాడు. వెంటనే డాడి ఇంకా పదినిమిషాల్లో జరగనుందనగా ఆపేయమని చెప్పా, వారు మానవ రహిత డ్రోన్‌ను కదా కూల్చింది, నాకేం తొందరలేదు’ అని స్వయంగా ట్రంప్ చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి తొలుతదాడికి ఆదేశాలెందుకు ఇచ్చినట్లు ? అమెరికా విమానాలను ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించవద్దని ఆదేశాలు ఎందుకు జారీ చేసినట్లు ?
ఇరాన్ మీద దాడి చేస్తే వుపయోగం ఏమిటి, నష్టాలేమిటి అనే విషయాన్ని అమెరికా వ్యూహకర్తలు తేల్చుకోలేకపోతున్నారా అనే పద్దతుల్లో కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నాడు. శతృవులుగా ప్రకటించిన దేశాల పట్ల కఠినంగా వున్నట్లు కనిపించకపోతే ట్రంప్ శిబిరం డీలా పడిపోతుంది. అందువలన అలా కనిపించాలి, ఆచరణలో అడుగు ముందుకు వేయకుండా ఎదుటి వారి మీద వత్తిడి తేవాలి, అది మెక్సికోతో సరిహద్దు మూసివేత, చైనాతో వాణిజ్య యుద్దం, రాయితీలను రద్దు చేసి భారత్‌ను బెదిరించటం వంటిది ఏదైనా కావచ్చు. ఇరాక్ మీద దాడికి పాల్పడి సీనియర్ బుష్ భయంకరమైన తప్పిదం చేశారని ట్రంప్ విమర్శిస్తుంటారు. అలాంటి పెద్ద మనిషి అంతకంటే బలమైన ఇరాన్ మీద దాడి చేసేందుకు మరో తప్పిదం చేస్తాడా ? రెండవది ట్రంప్‌ను వెనక్కు లాగే అంశాలలో ఆర్ధిక వ్యవస్ధ. యుద్దం చేస్తామన్న ప్రకటనతోనే చమురు ధరలు పెరిగాయి, నిజంగా చేస్తే పరిస్ధితి ఏమిటి? తనతో పాటు తనను నమ్ముకున్నవారూ మునుగుతారు అనే సంశయం. అన్నింటా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నించాల్సిందేగానీ తెగేదాకా లాగి సుదూర ప్రాంతాలలో యుద్ధాలలోకి దిగితే నష్టమే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదుకనుక, అమెరికన్ల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు తొందరపడవద్దు అనే వత్తిడి ట్రంప్‌మీద వుంది. ఒక వేళ ట్రంప్ గనుక ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభిస్తే అది ఏవో కొన్ని దాడులు చేసి వదిలివేస్తే వచ్చే ఏడాది నవంబరు ఎన్నికల్లో పరువుపోతుంది. దీర్ఘకాల దాడికి పూనుకుంటే అది ఆలోగా ముగిసే అవకాశం వుండదు, అది మరింకా నష్టం. ఇది ఒక గుంజాటన అయితే అమెరికా అధ్యక్షుడిగా వుండి ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించకపోతే చరిత్రలో అసమర్ధుడిగా మిగిలిపోతానేమో అనేది కూడా ట్రంప్‌ను యుద్ధం వైపు లాగుతోందని చెప్పవచ్చు.
ఒకటి మాత్రం స్పష్టం. ఇరాన్‌తో జగడం గతంలో ఇరాక్ మీద దాడికి దిగినంత సులభం కాదు. రష్యా, చైనాలు ఇరాన్‌కు బాసటగా వుంటాయన్నది ఇప్పటి వరకు వెల్లడైన వైఖరి. అమెరికన్లు ఇప్పుడు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నందున వారి వైఖరిలో అనూహ్య మార్పులు జరుగుతాయని అనుకోలేము. ఏక్షణంలో అయినా మరోసారి అమెరికా, ఇతర ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్య సంక్షోభంలోకి జారుతాయని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా లేక సాధారణ అమెరికన్లకు మానసికంగా దేనికైనా సిద్ధం చేసేందుకు చేస్తున్న ప్రచారమా అన్నది చూడాల్సి వుంది. ధనిక దేశాల ఆర్దిక వ్యవస్ధల తీరుతెన్నులను చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదు. దాన్నుంచి తప్పించుకొనేందుకే అమెరికా ఇప్పుడు చైనాతో వాణిజ్య యుద్దం, భారత్ వంటి దేశాల మీద వత్తిడి అని చెప్పవచ్చు.