Tags
100 years US Communist Party, American Communist Party, CPUSA, CPUSA organization’s 31st National Convention, HAY MARKET, Wahsayah Whitebird
ఎం కోటేశ్వరరావు
పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేయాలా, డెమాక్రటిక్ పార్టీ వంటి వాటిలోని వామపక్ష శక్తులకు మద్దతు ఇవ్వాలా అన్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఆ సమాజాలలో రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఆ పరిస్ధితిని సృష్టించింది. అయితే అమెరికాలోని ఒక యువ కమ్యూనిస్టు, మన పరిభాషలో చెప్పాలంటే ఒక గిరిజన యువకుడికి అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. చికాగో నగరంలో జరిగిన అమెరికా కమ్యూనిస్టు పార్టీ 31వ మహాసభ, పార్టీ శతవసంతాల వుత్సవాలకు ప్రతినిధిగా హాజరైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక చిన్న మున్సిపాలిటీ ఆష్‌లాండ్ కౌన్సిలర్‌గా ఏప్రిల్ నెలలో ఎన్నికైన వాహ్‌సయా వైట్‌బర్డ్ గురించి ఒక పత్రిక వెల్లడించిన కధనం ఎంతో ఆసక్తికరంగానూ, అమెరికా సమాజంలో వస్తున్న మార్పు సూచికగా కనిపిస్తున్నది. అమెరికా రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరిని చెప్పటానికి,వునికిని కొనసాగించటానికి చోటు, వెసులుబాటు వుందంటారు వైట్‌బర్డ్. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలకు ముందు తన రాజకీయ వైఖరి ఏమిటని ఎవరూ అడగలేదు, అడిగిన తరువాత వెంటనే 2011 నుంచి కమ్యూనిస్టుగా వున్నట్లు తెలిపే నా పార్టీ గుర్తింపు కార్డును వారికి చూపించాను. ఎన్నికలకు ముందు స్ధానిక మీడియా వారు పార్టీ అనుబంధం గురించి అడిగారు, అదొక సమస్యగా నాకు అనిపించలేదు, ఎన్నికలలో నేను పేదల వేదిక పేరుతో పోటీ చేశాను, పేదలకు అందుబాటులో గృహాలు, కనీసవేతనం పెంపు, ఇండ్లు లేని వారికి ఆశ్రయాలు కల్పించాలనే అజెండాను ఓటర్ల ముందు పెట్టాను, డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్ధి మీద గెలిచాను. పార్టీ గుర్తు మీద పోటీ చేయటం ఒక సమస్య కాదనుకుంటున్నాను. పార్టీ తన స్వంత అభ్యర్ధులను నిలిపేందుకు ప్రయత్నించాలి.ఇతరులతో కూటమి కట్టాలి. కీలకమైన అంశం విధానాల మీద వుండాలి, పాక్షికమైన అనుబంధాల మీద కాదు. అని చెప్పాడు. ఒక బేకరీ కార్మికుడిగా అతను పని చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఆధిపత్యం సాధిస్తుందని చెప్పబోవటంలేదు గానీ తాను పని చేస్తున్న గ్రామీణ విస్కాన్సిన్ రాష్ట్రంలో తాను చెప్పే అంశాలను వినేవారు వున్నారంటూ కొన్ని అంశాలలో స్ధానిక సంస్ధలలో పన్నులు పెంచకుండా,ప్రస్తుతం లాభాలే లక్ష్యంగా పని చేస్తున్న చోట తక్కువ రేట్లతో కొన్ని పనులు చేయవచ్చు అన్నారు. రియలెస్టేట్‌ను ప్రజోపయోగ కంపెనీగా నడిపితే జనం మీద భారం పడదని తాను గుర్తించానన్నారు.
అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ చాలా పరిమితమైనది. మూడు రోజుల జాతీయ మహాసభ, శతవసంతాల వుత్సవం శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగింది.ప్రతినిధులు చికాగోలోని హేమార్కెట్ (మేడే పోరాటాలు జరిగిన ప్రాంతం)ను సందర్శించటంతో శుక్రవారం నాడు సభలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు సౌహార్ధ ప్రతినిధులుగా వచ్చారు. వెనెజులా కమ్యూనిస్టు యువజన విభాగ ప్రతినిధి అలెక్స్ గ్రానాడో ఇచ్చిన సందేశానికి పెద్ద ఎత్తున ప్రతినిధులు ప్రతిస్పందించారు. ప్రారంభ సభలో చికాగో నగరానికి నల్లజాతికి చెందిన తొలి మేయర్ హరోల్డ్ వాషింగ్టన్ సన్నిహితుడిగా వుండి 1983లో హత్యకు గురైన కమ్యూనిస్టు రూడీ లోజోనో కుమారుడు పెపె లోజోనో, గతంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున వుపాధ్యక్షపదవికి పోటీ చేసిన, ప్రస్తుతం పార్టీ వుపాధ్య క్షుడిగా వున్న జార్విస్ టైనర్ తదిరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మీద వున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని, అమెరికాకు శాంతి, సమానత్వం, సోషలిజాలను తీసుకు రావాలని జార్విస్ టైనర్ చెప్పారు. కమ్యూనిస్టు వ్యతిరేకత అనేది పెద్ద అబద్దమని, అది ఇప్పుడు వైట్‌హౌస్‌లో నివాసం వుందని అన్నారు. యుద్దం, జాత్యంహంకారం, అసమానతల వైపు నెడుతున్నారని, యజమానులకు లొంగిపోవాలని కార్మికులను ఒప్పించేందుకు చూస్తున్నారని అన్నారు.
పార్టీ ప్రతినిధుల సభ శనివారం నాడు ప్రారంభమైంది. అధ్యక్షుడు జాన్ బాచ్‌టెల్ ప్రారంభ వుపన్యాసం చేస్తూ దేశంలో పార్టీ నిర్మాణం, సమస్యలను వివరించారు.డోనాల్డ్ ట్రంప్ కార్పొరేట్, పచ్చి మితవాదుల ప్రతిబింబంగా వున్నాడని పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. అహింసా పద్దతుల్లో ఎన్నికల ద్వారా సోషలిజాన్ని తీసుకురావాలని కోరారు. కార్మికవర్గ పోరాటం వీధులతో పాటు భావజాల రంగంలో కూడా కొనసాగించాలన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారెన్, కమలా హారిస్,జో బిడెన్ వంటి వారు 24 మంది అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్నారని, ఎవరు సరైన వ్యక్తి అన్నది ఇంతవరకు నిర్ణయం కాలేదన్నారు. అధికారాన్ని నిలుపుకొనే ప్రక్రియలో భాగంగా పురోగామి, వామపక్ష శక్తుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు మితవాదులు అబద్దాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని బాచ్‌టెల్ చెప్పారు. కార్మికవర్గంలో వున్న భయాలు, అభద్రతాభావాలను వుపయోగించుకొని ఆర్ధిక జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారన్నారు. వర్గ, శ్వేత, పురుషాధిక్యాలను ప్రదర్శిస్తూ అవినీతి, యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పచ్చిమితవాదులు, రిపబ్లికన్ పార్టీని ఓడించటం అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు.చమురు వ్యాపారులు, మిలిటరీ-పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులతో అవి నిండి వున్నాయని అన్నారు. అధికారికంగా నమోదు కాని పదిలక్షల మంది వలసకార్మికులను దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ అనుకుంటే అతగాడు నరకానికి పోతాడని బాచ్‌టెల్ అన్నారు.
మితవాద శక్తుల ప్రభావానికి వ్యతిరేకంగా జరిగే పోరులో పార్టీకి ప్రత్యేకించి యువతరం కావాలని, పార్టీ ప్రతినిధులను చూస్తే యువజన ప్రాతినిధ్యం, భిన్న సామాజిక తరగతులు వుండటం దీన్ని ప్రతిబింబిస్తున్నదని బాచ్‌టెల్ అన్నారు. 202 మంది ప్రతినిధుల్లో మూడింట రెండువంతుల మంది 44సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు వారని, 10.3శాతం ఆఫ్రికన్ అమెరికన్లు, మరో 10.3శాతం లాటినోలు, ఐదుశాతం ఆఫ్రో కరీబియన్లు, 9.2శాతం మంది యూదులు వున్నారు. అయితే మహిళలు 30శాతమే వున్నారని, ఈ అసమతూకాన్ని సరిదిద్దాలని అన్నారు. ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత పార్టీ సభ్యత్వం పెరిగిందని, అనేక మంది స్ధానిక బృందాలు, సామాజిక వుద్యమాల్లో చేరుతున్నారని, వారిలో ఎక్కువ మంది నేడు డెమోక్రటిక్ పార్టీలో వుంటూనే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా కూడా వుంటున్నారని, రేపటి కార్మికవర్గ పార్టీకోసం అందరూ కలసి పని చేయాలని చెప్పారు.
కమ్యూనిస్టుపార్టీ కనీస వేతన చట్టం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాల జాతీయచట్టం, అందరికీ వైద్యం, నిరుద్యోగ పరిహారం వంటి ఇతర పురోగామి అంశాలతో పాటు ఆఫ్రో అమెరికన్ల అణచివేతకు, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్న కమ్యూనిస్టుల భావజాలం నేడు ప్రధాన స్రవంతి చర్చగా వుందన్నారు.మనకు ఒక స్వప్నం వుంది. దానిలో గోడలు వంతెనలుగా, ఆయుధాలు నాగళ్లుగా, పెట్టుబడిదారులు అంతరించిపోయిన రాజులు, డైనోసార్సుగా మారతారు. మన ముందున్న సవాలుకు ధీటుగా మనం పెరిగితే ఇదే మన భవిష్యత్ అని బాచ్‌టెల్ చెప్పారు.