Tags
Andhra Pradesh Re-organization Act, Central funds to Andhra Pradesh, Polavaram Irrigation Project
ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద గత మూడు సంవత్సరాలలో కేంద్రం విడుదల చేసిన అదనపు నిధుల గురించి మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో దిగువ వివరాలను తెలియ చేసింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన వివరాల ప్రకారం 2016-17 సంవత్సరంలో వివిధ ఖాతాల కింద విడుదల చేసిన మొత్తం రూ .10,169.2 కోట్లు, తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా రూ 20,505.72 మరియు రూ.19,698.01 కోట్లు. ఇవిగాక రాష్ట్ర పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వ పధకాలకింద మరియు ఇతరంగా అందచేసిన నిధుల వివరాలు ఇలా వున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.2,514.7, 2017-18లో రూ.2,000, 2018-19లో రూ.1,400 కోట్ల రూపాయల వంతున విడుదల చేశారు. ఇవిగాక ఆర్దికలోటును తేడాను పూడ్చేందుకు 2016-17లో రూ.1176.5 కోట్లు, అదే ఏడాది రాయలసీమ,వుత్తర కోస్తాలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు, ఇచ్చారు. మిగిలిన సంవత్సరాలలో ఇచ్చిందేమీ లేదు. ఇవిగాక 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల వరకు విదేశీ సాయంతో చేపట్టిన పధకాలకు విడుదల చేసిన నిధుల వడ్డీ నిమిత్తం 2018-19లో రూ.15 కోట్ల 81 లక్షల రూపాయలు విడుదల చేశారు.
2018 ఫిబ్రవరి 8న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 2010-11 ధరలో పోలవరం నిర్మాణానికి అనుమతించిన ఖర్చు రూ.16,010.45 కోట్లు. దానిలో సాగునీటి విభాగపు ఖర్చు రూ.12,294.40 కోట్లు. దానికి గాను 2014 మార్చి 31వరకు ఏఐబిపి కింద కేంద్రం చెల్లించిన మొత్తం రూ.562.57 కోట్లు. దాన్ని కేంద్ర ప్రాజక్టుగా అనుమతించినందున 2014 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇరిగిగేషన్ విభాగానికి అంగీకరించిన మొత్తం నూటికి నూరుశాతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఆ మేరకు 2014 ఏప్రిల్ ఒకటి నుంచి 2017 మార్చి 31వరకు కేంద్రసాయంగా రూ.3,364.16 కోట్లు చెల్లించింది.2017-18 సంవత్సరానికి గాను రూ.1020.64 కోట్లు మంజూరు చేసి రూ.979.36 కోట్లను విడుదల చేశారు.2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, సకాలంలో పూర్తి చేసేందుకు ఆటంకాలుగా వున్న పరిష్కారంగాని భూసేకరణ, పునరావాస సమస్యలు, డిజైన్ల ఖరారు మొదలైన వాటన్నింటినీ సక్రమంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆ ప్రకటనలో వుంది.
ఈ రెండు ప్రకటనలను చూసినపుడు సామాన్యులకు కాస్త గందరగోళం ఏర్పడుతోంది. అందువలన సామాన్యులకు సైతం అర్దమయ్యే భాషలో పోలవరం గురించి కేంద్రం అంగీకరించినదేమిటి, రాష్ట్రం భరించాల్సిందేమిటి, అసలింతవరకు జరిగిందేమిటి అన్నది జనానికి తెలియచెప్పటం కనీస బాధ్యత. గత ప్రభుత్వం అటువంటి స్పష్టతను ఇవ్వలేదు. కేంద్రంతో ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. న్యాయమైన వాటా కోసం ఇతర రాష్ట్రాలతో కలసి అవసరమైతే ఘర్షణ పడక ఎలాగూ తప్పదు. కేంద్రంలోని బిజెపితో రాజకీయంగా సఖ్యతగా వుండాలా,అణగిమణిగి వుండాలా, ఆత్మగౌరవంతో వుండాలా అన్నది వైసిపి-బిజెపికి సంబంధించిన అంతర్గత వ్యహారం. రాష్ట్ర పధకాలు, నిధులకు సంబంధించి ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. గత పాలకులు ఆపని చేయలేదు. ఇపుడు ఆ లోపాన్ని పునరావృతం కానివ్వకూడదు.
వైసిపికి తొలి ఎదురుదెబ్బ-అసలైన పరీక్ష !
ప్రత్యేక హోదా నినాదంతో అధికారానికి వచ్చిన వైసిపికి ఆదిలోనే కేంద్రం తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. హోదా ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఈ పూర్వరంగంలో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ దాని గురించి ముఖ్యమంత్రి అడుగుతూనే వుంటారా ! ఏం చేస్తారో చూద్దాం. అంతర్గతంగా కారణాలు ఏవైనా కావచ్చు, కృష్ణానదీ తీరంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్ల సమావేశం ముగియగానే యంత్రాంగం ఆపనిలో వుంది. అది ప్రభుత్వ భవనం, అనుమతుల్లేకుండా నిర్మించారని సిఆర్‌డిఏ అధికారులే చెప్పారు కనుక కూల్చివేత గురించి ఏ సమస్యా లేదు. నది రెండు వైపులా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అక్రమంగా నిర్మించిన ఇతర ప్రయివేటు కట్టడాలను కూల్చివేస్తారా లేదా అని రాష్ట్రమంతా ఆతృతతో ఎదురు చూస్తోంది. వాటిలో ఒక్క వామపక్షాలకు చెందిన వారు తప్ప అన్ని పార్టీల నేతలు లేదా మద్దతుదారుల కట్టడాలు వున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే ఎక్కువ.కూల్చివేత ఒక్క ప్రజావేదికకే పరిమితం అయితే రాష్ట్ర ప్రభుత్వ పరువు పోవటం ఖాయం.
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదులుకొని ప్రత్యేక పాకేజికి అంగీకరించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానికి ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలను తెరవాలని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వాటిని వినియోగించాలని షరతు పెట్టింది. ఆ తరువాత అది ఏమైందో తెలియదు, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్‌డిఏ నుంచి దూరమై తిరిగి ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకుంది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది. అసలా పాకేజి ఏమిటి? దాని మీద జరిగిన వుత్తర ప్రత్యుత్తరాలు, ఇతర అంశాలేమిటి అన్నవాటి మీద జగన్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప రాష్ట్ర ప్రజలకు అర్ధం కాదు.