Tags

, , , , ,

Image result for YS Jagan 30 days rule

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదిహేడవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నెల రోజుల పాలన గురించి చెప్పాలంటే కొన్ని చర్యల మీద తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ వ్యతిరేకుల విమర్శలను పక్కన పెడితే అభిమానులనుంచి అభినందనలు అందుకున్నారు. అనేక మంది తటస్ధుల ప్రశంసలు కూడా పొందారు. వీటితో పాటు నూతన ప్రభుత్వ లేదా నా మాటే శాసనం అన్న బాహుబలి పాత్ర మాదిరి ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు, చర్యలు కొన్ని అభిమానించే వైసిపి వారితో సహా మొత్తం జనాల్లో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయి. అసాధారణ విజయం సాధించిన పాలక పార్టీకి, ప్రభుత్వానికి తొలి నెలలోనే ఇలాంటి పరిస్ధితి ఏర్పడటం ఒక విశేషంగానే చెప్పాలి.

Image result for praja vedika undavalli

నాటకీయ పరిణామాల మధ్య కృష్ణా కరకట్టలోపల వున్న ప్రజావేదికను కూల్చివేయించిన తీరు ఒక సంచలనం అనటంలో ఎలాంటి సందేహాలు లేవు. ఆదిలోనే అనేక అంశాలలో తరువాత ఏంటి అన్న సహస్ర శిరఛ్చేద అపూర్వచింతామణి ప్రశ్నలతో పాలన ప్రారంభమైంది దానికి తగిన జవాబు చెప్పగలిగితే జగన్‌ సర్కార్‌ బతికిపోతుంది లేకపోతే బలి అవుతుంది. అదే విధంగా మరోసారి ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబు కూడా నెల రోజులుగా కొత్త పాత్రను పోషిస్తున్నారు. అనుభవం రీత్యా జగన్‌తో పోల్చుకోవటానికే లేదు. పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు చట్టరీత్యా గాకపోయినా నైతికంగా అయినా రాష్ట్ర జనాల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుంది.

Image result for praja vedika undavalli

అన్ని అంశాలను ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు కనుక ఒక్కో అంశాన్ని చూద్దాం. ప్రజావేదిక అక్రమ కట్టడం కనుక దాన్ని కూల్చివేయాలని అనుకున్నారు, అన్నంత పనీ చేశారు, హైకోర్టు కూడా అడ్డుపడలేదు. ఇంతవరకు ఇబ్బంది లేదు.దాని కొనసాగింపుగా చంద్రబాబు నివాసం వుంటున్న మరొక అక్రమ కట్టడం గురించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడే బంతి ప్రభుత్వం చేతి నుంచి ప్రతిపక్షానికి చేరింది. అక్రమ కట్టడాలు రాష్ట్రంలో అనేక వున్నాయి. వీటిలో రెండు రకాలు. సముద్రతీరం, నదీ తీరాల్లో నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవి ఒక రకం, మరో తరగతి అలాంటి నిషేధాలు లేని ప్రాంతాలలో అనుమతులు పొందీ వుల్లంఘించి జరిపిన నిర్మాణాలు కొన్ని, అసలు అనుమతులు లేకుండానే నిర్మించినవి కొన్ని. రెండవ తరగతి వాటిని ప్రభుత్వం తలచుకుంటే అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి కూల్చివేయవచ్చు, లేదూ స్వల్ప వుల్లంఘనలు వుంటే, అవి జనానికి, రాకపోకలకు, ఇతరత్రా ఇబ్బంది కరం కాదు అనుకుంటే జరిమానాలు విధించి ఆమోద ముద్ర వేయటం ఒకటి. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం నిషేధిత ప్రాంతాల్లో చేసిన నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు. వాటిని గత పాలకులు ఎందుకు కూల్చివేయలేదు,యజమానుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎలా అనుమతించారు అంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమ వ్యవహారం తప్ప మరొకటి కాదు.

కేరళలోని కొచ్చిన్‌ శివార్లలోని మరాదు అనే మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన కేసు ప్రస్తుతం నడుస్తోంది. దాన్ని నిర్మించిన సంస్ధ, కొనుగోలు చేసిన వారు చేసే వాదన ఏమంటే మరాదు గ్రామ పంచాయతీ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. అవి అక్రమం అంటూ హైకోర్టుకు వెళ్లినపుడు నిర్మాణాలను నిలుపుదల చేయకుండా కోర్టు అనుమతించింది. నిర్మాణాలు జరిగే సమయంలో కోస్తా పరిరక్షణ సంస్ధ వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీరా పూర్తిగా నిర్మించిన తరువాత ఇప్పుడు కూల్చివేయాలని కోరటం ఏమిటి? మా వాదన వినకుండా కోర్టు తీర్పు ఇచ్చింది కనుక మా వాదనలు విని అంతిమంగా నిర్ణయించాలి, తీర్పును తిరిగి విచారించాలి అని యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తీర్పు ఇచ్చింది మరొక బెంచి కనుక తాము దానిని విచారించబోము, ఆరువారాలు కూల్చివేతల నిలిపివేతకు వుత్తరువు ఇస్తాము అంటూ తాజాగా మరొక బెంచి వారు ప్రకటించారు.కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా సమస్యను సంక్లిష్టం చేసే విధంగా తీర్పులు చెబుతున్నందున ఇదొక పెద్ద సమస్య. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకువచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అజెండాను ముందుకు తెస్తున్నది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అంశాల గురించి ముందుగా చూద్దాం. కృష్ణానది తీరంలో జరిగిన అక్రమ కట్టడాల గురించి ప్రతిపక్షంగా వున్నపుడు వైసిపి ఈ అక్రమాలను ప్రశ్నించింది. అది అధికారానికి వచ్చిన తరువాత ఆ సమస్యను చేపట్టబోయే ముందు తగినంత కసరత్తు చేసినట్లు కనిపించటం లేదు. లేదూ నాటకీయంగా ఒక ప్రభుత్వ నిర్మాణాన్ని కూల్చివేసిన తరువాత ప్రయివేటు నిర్మాణాల విషయంలో ప్రభుత్వ విధానమేమిటో స్పష్టం చేయలేదు. ముందే చెప్పినట్లు నా మాటే శాసనం మాదిరి నిర్ణయాలు చేస్తే కుదరదు.ప్రభుత్వ భవనం మాదిరి ప్రయివేటు వాటి జోలికి పోవటం అంత సులభం కాదు. అనేక భవనాలు వుండగా ఒకే భవనానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ప్రతిపక్షాలకు, మీడియా, సామాజిక మాధ్యమానికి వ్యాఖ్యానించే అవకాశం ఇచ్చింది. ‘గౌరవ ముఖ్యమంత్రి గారు, నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై – డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా?లేకపోతే మన రాష్ట్రంలో క ష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ ప్రకారం తొలగిస్తారా! కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు…’అంటూ తెలుగుదేశా పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.

అక్రమ నిర్మాణాల చర్చ పక్కదారి పట్టకుండా వుండాలంటే ఇప్పటికైనా ఆ సమస్య మీద సమగ్రవిధానం ప్రకటించాలి. దాన్ని మంత్రి వర్గ నిర్ణయంగానో మరొకటిగానో చట్టబద్దమైనదిగా వుండాలి. లేదూ గత ప్రభుత్వాలు తీసుకున్న విధానాల కొనసాగింపే అయితే ఆ విధానాలు ఏమిటి? నూతన ప్రభుత్వం దానినే కొనసాగిస్తున్నదా అన్న విషయమైనా చెప్పాలి. లేదా అసలు ఎలాంటి విధానం లేకుండా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరిస్తే అదైనా చెప్పాలి. విద్యుత్‌ కొనుగోళ్ల మీద సమీక్ష జరిపి వాటిలో వేలాది కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైందని చెబుతున్న జగన్‌, అక్రమ నిర్మాణాల మీద ఎందుకు సమీక్ష జరపరు? వాస్తవాలు, తన కార్యాచరణ ఏమిటో జనానికి ఎందుకు చెప్పరు? సంబంధిత మంత్రులతో వుపసంఘాన్నివేసి ఒక నివేదిక తెప్పించుకోవటం, మంత్రివర్గ ఆమోదం వంటి పద్దతులను ఎందుకు పాటించరు? తొందరపడ్డారు, కక్ష తీర్చుకుంటున్నారు అనే ఆరోపణలకు గురికావటం ఎందుకు?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ చర్యల మీద ధ్వజమెత్తుతున్నారు. వారికి ఆ హక్కు వుంది. అయితే ప్రతి పార్టీ అధికారంతో నిమిత్తం లేకుండా సమస్యల మీద ఒక వైఖరిని తీసుకోవాలి. అక్రమ కట్టడాల మీద తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటి అన్నది ప్రశ్న. అధికారపక్షానికి 50శాతం వరకు ఓట్లు వస్తే ప్రతిపక్షానికి కూడా 40శాతం వరకు వచ్చాయి. అందులోనూ గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో వుంది కనుక ఎలాబడితే అలా మాట్లాడితే కుదరదు.తాజాగా నోటీసు ఇచ్చిన ప్రయివేటు భవనానికి గతంలో గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చిందని, తరువాత రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఇచ్చారని, అది అక్రమ కట్టడం అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ దాన్ని ఎందుకు కూల్చలేదని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పటానికి ఆ రాజశేఖరరెడ్డి లేరు కనుక ఆయనెందుకు కూల్పించలేదు అన్నది పక్కన పెడదాం. నిన్నటి వరకు అధికారంలో వున్న చంద్రబాబు ఏమి చెబుతారు అన్నది ప్రశ్న. ఆ కట్టడం అక్రమం అని దానిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివాసం వుండటం ఏమిటని ప్రారంభంలోనే విమర్శలు వచ్చాయి కదా ? దాని మీద లేదా అలాంటి కట్టడాల మీద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వ అనుసరించిన వైఖరి ఏమిటి అన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. అసలది అక్రమమా, సక్రమమా అన్నది చెప్పకుండా తండ్రి అనుమతించిన వాటికి కొడుకు నోటీసులు పంపటమా, ఒకవేళ అక్రమం అయితే దానికి జగన్‌మోహన్‌ రెడ్డే బాధ్యత వహించాలని అని సీనియర్‌ నేత ఎనమల రామకృష్ణుడు వాదిస్తున్నారు. జగనే బాధ్యత వహించాలి అంటున్నవారు ఆ జగనే బాధ్యతగా భావించి చర్యతీసుకొనేందుకు నోటీసు పంపించారు కనుక మాట్లాడకుండా కూర్చోవాలి తప్ప ప్రశ్నించటం ఏమిటి అన్నది జనం నుంచి వస్తున్న స్పందన. సదరు భవన యజమాని తేల్చుకోవాల్సిన అంశం అది. లేదా శాశ్వతంగా చంద్రబాబు లేదా ఆయన కుటుంబ సభ్యులు వుండటానికి హక్కులు లేదా అమ్మకం లాంటివి ఏవైనా జరిగితే చంద్రబాబు కుటుంబం స్వంత వ్యవహారంగా తేల్చుకోవాలి తప్ప రాజకీయ రంగు పూయాల్సిన అవసరం ఏముంది?

ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత కుటుంబంతో కలసి ఐరోపా విహార యాత్రకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. వెళ్లే సమయంలో ఏమి ఆలోచించుకుంటూ వెళ్లారో తెలియదుగానీ వచ్చిన తరువాత ఏం మాట్లాడాలో అర్ధం అవుతున్నట్లు లేదు. కంటి చూపే తప్ప జరుగుతున్న పరిణామాల మీద నోటి మాటలేదు. అనుమతుల్లేకుండా, అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చివేయదలచుకున్న జగన్‌ సర్కార్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలను కూడా కూల్చుతారా అని అనుచరులతో అన్నట్లు లీకుల వార్తలు వచ్చాయి. తరువాత తెలుగుదేశం నేతలు కూడా అదే వాదనలు చేస్తున్నారు కనుక నిజమే అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసమంటూ నిబంధనలకు విరుద్దంగా జనం సొమ్ముతో ప్రజావేదికను నిర్మించటమే ఒక అక్రమం అయితే, అధికారాన్ని కోల్పోయిన తరువాత దాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన అవసరం కోసం కేటాయించమని కోరటం- అదీ ప్రతిపక్ష నాయకుడి హోదా వుంటుందో లేదో కూడా తెలియని స్ధితిలో- గొంతెమ్మ కోరిక తప్ప మరొకటి కాదు, అన్నింటికి మించి ు ఈ సమస్యమీద తెలుగుదేశం నేతలు ముందేమి చెబుతున్నారో, తరువాతేమి మాట్లాడుతున్నారో తెలిసే స్ధితిలో లేరు.

Image result for praja vedika undavalli

ప్రభుత్వ సమీక్షా సమావేశాలకు సరైన సమావేశ మందిరం లేదు, హోటళ్లు, ఇతర ప్రయివేటు భవనాల్లో చేసే ఖర్చును పొదుపు చేసేందుకు, సచివాలయానికి వచ్చే జనానికి అందుబాటులో వుండేందుకు ప్రజావేదికనిర్మాణం జరిగిందని తెలుగుదేశం వారు వాదిస్తున్నారు. నిజమే అనుకుందాం. మే 23వ తేదీకి ముందు రోజుకు తరువాత రోజుకు జరిగిన మార్పుల్లో అధికార మార్పిడి తప్ప పైన చెప్పిన అవసరాలు తీర్చే ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడలేదు కదా ? అలాంటపుడు ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించామని చెప్పినదానిని తన అవసరాలకు కేటాయించమని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కోరటం ఏమిటి? అంటే కొత్త ప్రభుత్వం సమీక్షలు ఎక్కడ చేయాలి? జనాన్ని ఎక్కడ కలుసుకోవాలి? అవన్నీ వేరే చోట్ల పెట్టి, సదరు భవనాన్ని తనకు అప్పగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని నాలుగుదశాబ్దాల రాజకీయ అనుభవం వున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి సూచించటమే కదా !

ప్రభుత్వ సమీక్షల కోసం ఒక భవనం వుండాల్సిందే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కట్టేదేదో కృష్ణానది కరకట్టకు ఇవతల రాజధానికి సేకరించిన భూములుండగా అక్కడ కట్టకుండా నిబంధనలకు విరుద్దంగా ఎందుకు నిర్మాణం చేయించినట్లు ! 2020, 2050 స్వాప్నికుడిగా చెప్పుకున్న చంద్రబాబుకు ప్రపంచంలో పర్యావరణ హానికి ఎదురవుతున్న ముప్పు, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియవా ? తాను నివసిస్తున్న ఒక అక్రమ ప్రయివేటు భవనం పక్కనే ప్రజావేదికను నిర్మింపచేయటంలో ఆయన విజ్ఞత ఏమైనట్లు ? తానున్నది రాష్ట్ర ముఖ్య మంత్రుల లేదా ప్రతిపక్ష నేతల అధికారిక శాశ్వత నివాసం ఏమి కాదే ! ఈ వుదంతంలో తలెత్తుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నేతల వద్ద వున్న సమాధానాలు ఏమిటి అనటంతో పాటు ప్రభుత్వ తీరు తెన్నులు ఏమిటి అని కూడా ప్రశ్నించక తప్పదు !