Tags

, ,

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఎం కోటేశ్వరరావు

అనేక మంది వూహించినట్లు ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన నిర్ణయాలు, నిర్ధిష్ట కార్యాచరణ లేకుండానే ముగిసిందని చెప్పాలి. ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ ప్రధాని మర్యాద పూర్వకంగా సభ విజయవంతమైందని చెప్పవచ్చు తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకుండా కేవలం ఆశాభావాలతో ముగిసింది. ప్రపంచీకరణ మరింత ముందుకు పోతున్న వర్తమానంలో అనేక అంతర్జాతీయ వేదికల సందర్భంగా జరిగిన పరిణామాలే పునరావృతం అయ్యాయి. నేను కూడా రాజుగారి గంగాళంలో పాలుపోయటానికే వచ్చాను గానీ నీతో ముఖ్యవిషయాలు మాట్లాడాలి పక్కకు రా అన్నట్లుగా ఒసాకాలో నేతల ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యత ఏర్పడిందన్నది స్పష్టం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిగతా దేశాల నేతలతో-మన ప్రధాని నరేంద్రమోడీతో సహా- జరిపిన సంప్రదింపులన్నీ మా యింటికొస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేమి పెడతారు అన్న పద్దతుల్లో అమెరికా ప్రయోజనాల చుట్టూ చర్చలను తిప్పారు. మద్దులాట-దెబ్బలాట పద్దతిలో ఒక వైపు ట్రంప్‌తో భాయీ భాయీ అంటూనే మరో ఏకపక్ష వ్యవహారాలను సహించరాదని మిగతా దేశాల నేతలతో పరోక్షంగా అమెరికా వైఖరిని విమర్శించే ప్రకటన జారీలో మన ప్రధాని నరేంద్రమోడీ భాగస్వామి అయ్యారు.

ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల మధ్య వున్న వివాదాలను కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. నిజానికి వాటిని వేరే సందర్భాలలో చర్చించేందుకు అవకాశం వున్నప్పటికీ జి 20ని వేదిక చేసుకోవటాన్ని బట్టి ఎవరూ ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే ధోరణిలో లేరన్నది స్పష్టమైంది.నాటోలో సభ్యరాజ్యమైన టర్కీ తన మిలిటరీ అవసరాల కోసం రష్యా తయారీ ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయటాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. కొనుగోలుతో ముందుకు పోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన విషయం తెలిసిందే.తమ వ్యవహారాల్లో రష్యా బాధ్యతారహిత, అస్ధిర కార్యకలాపాలకు దూరంగా వుండాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. గతేడాది శాలిస్బరీలో సెర్గీ స్కిరిపాల్‌ మీద విషపూరిత దాడికి పాల్పడిన ఇద్దరు రష్యన్లను తమకు అప్పగించాలని పుతిన్‌తో జరిపిన భేటీలో కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా హాంకాంగ్‌ అంశాన్ని లేవనెత్త కూడదని తాము కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జింపింగ్‌ చెప్పారు. అయినప్పటికీ జపాన్‌ ప్రధాని షింజో అబె దాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని కోరారు.

పందొమ్మిది దేశాలు, ఐరోపా యూనియన్‌ సభ్యురాలిగా వున్న జి20 పద్నాలుగవ శిఖరాగ్ర సమావేశం జపాన్‌లోని ఒసాకాలో ఈనెల 28,29 తేదీలలో జరిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 80శాతం వుత్పత్తి, మూడింట రెండువంతుల జనాభాను కలిగివున్న దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈ బృంద సమావేశం జపాన్‌లో జరగటం ఇదే తొలిసారి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు ఇరాన్‌ మీద భౌతిక దాడులు జరుపుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇతర అనేక అంశాల గురించి దేశాల నేతలు ప్రస్తావించి చర్చించినప్పటికీ ఈ సమావేశాల అజెండాలో అగ్రస్ధానం వాణిజ్య యుద్ధం ఆక్రమించింది. భారత్‌ మార్కెట్లో మరింతగా ప్రవేశించేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక వలపు బాణాలు విసిరారు. అమెరికాతో దోస్తీకి నరేంద్రమోడీ తహతహలాడుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్ధితి, దేశీయంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తల ప్రయోజనాలు ఇమిడి వున్నందున మోడీకి ఇష్టం వుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ట్రంప్‌కు దూరంగా వుండాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. స్వేచ్చా, న్యాయమైన, వివక్షలేని, పారదర్శక, స్ధిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించేందుకు సభ్యదేశాలు పని చేయాలని సమావేశం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వాంఛలకు విరుద్దంగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయంతో మార్పు లేదని అమెరికా స్పష్టం చేయటంతో ఈ అంశంపై పడిన పీఠముడి విడిపోలేదు. పర్యావరణానికి హానిచేసే విషవాయువుల విడుదలను తగ్గించాలన్నది ఆ ఒప్పంద సారం. దాన్ని తాము అమలు జరిపితే తమ కార్మికుల, పన్ను చెల్లింపుదార్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందంటూ అమెరికా ఆ ఒప్పందంతో తనకు సంబంధం లేదంటోంది.

తన పంతం నెగ్గించుకోవాలని, తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. చైనాలోని హువెయ్‌ టెలికాం కంపెనీ వుత్పత్తులు ఇంతకాలం తన భద్రతకు ముప్పు అని ప్రకటించి వాటిని కొనుగోలు చేయరాదని ఇతర దేశాలను కూడా బెదిరించిన ట్రంప్‌ ఆ కంపెనీకి అమెరికన్లు విడిభాగాలను విక్రయించవచ్చు అని ఒసాకాలో ట్రంప్‌ ప్రకటించటం విశేషం. ఇదే విధంగా తాము ఇప్పటి వరకు 300 బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై విధించిన పన్ను మినహా ప్రస్తుతానికి అదనంగా పన్నుపెంచటం లేదని కూడా చెప్పారు. అయితే ఇది డిసెంబరులో చేసిన ప్రకటన పునశ్చరణ తప్ప కొత్తదేమీ కాదు. చైనాతో తమ సంబంధాలు వూహించినదాని కంటే మెరుగ్గా వున్నాయని, రెండు దేశాలు తిరిగి పట్టాలు ఎక్కాయని, చైనా నేత గ్జీ జింపింగ్‌తో చాలా చాలా మంచి సమావేశం జరిగిందని ట్రంప్‌ విలేకర్లతో అన్నాడు. వుద్రిక్తతలను గమనంలో వుంచుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముందుకు తీసుకుపోవాలని సమావేశంలో నేతలు అంగీకరించినట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే శిఖరాగ్ర సభ ముగింపు సమావేశంలో ప్రకటించారు.

ఒసాకా సమావేశాల్లో వుమ్మడిగా అజెండా అంశాలను చర్చించటంతో పాటు అనేక దేశాల నేతల మధ్య ద్విపక్ష సమావేశాలు చోటు చేసుకున్నాయి. ముదిరి వాణిజ్య యుద్ద నేపధ్యంలో ట్రంప్‌, గ్జీ జింపింగ్‌ మధ్య అలాంటి సమావేశం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూసింది.వారు భేటీ అయ్యే ముందు మీడియాకు విడివిడిగా ప్రకటనలు చేశారు. 1970దశకంలో అమెరికాాచైనా మధ్య సంబంధాలు ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రారంభమయ్యాయని, ఒక చిన్న బంతి తరువాత కాలంలో ప్రపంచ పరిణామాలను ముందుకు తీసుకుపోవటంలో ఎంతో పెద్ద పాత్రపోషించిందని జింపింగ్‌ గత చరిత్రను గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతర్జాతీయ పరిస్ధితులు, వుభయ దేశాల సంబంధాల్లో ఎంతో మార్పు జరిగినా సహకారం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందటం, ఘర్షణతో నష్టపడ్డాయన్న మౌలిక వాస్తవంలో మార్పులేదని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఒసాకాలో ట్రంప్‌, జింపింగ్‌ ఏమి చెప్పినప్పటికీ వాణిజ్య యుద్దం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతి వారూ వాణిజ్యం గురించి మాట్లాడుతూ మనం తప్పు చేయకూడదని చెబుతున్నారు. వాటిని విన్నవారికి ఏదో ఒక పరిష్కారానికి వస్తారన్న ఆశకలుగుతుంది, కానీ వారి నడక తీరు చూస్తే మరింత ప్రతికూలంగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే చెప్పవచ్చు. మరో 350బిలియన్‌ డాలర్ల వుత్పత్తుల మీద పన్నులు విధించాల్సి వున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పని చేయటం లేదని ట్రంప్‌ చెప్పారు. అయితే ఒసాకా నుంచి వాషింగ్టన్‌ చేరేలోగా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాదని చెప్పలేము. ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో వూహించలేము. రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయి మరింత సంక్లిష్టం అవుతుందా అన్నట్లుగా తయారైన అంశం తెలిసిందే. అదే జరిగితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం అయ్యే అవకాశం వుందని భయపడిన వారంతా ఈ సమావేశాల్లో రెండు దేశాల వైఖరి ఎలా వుంటుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

అగ్రరాజ్యాల మధ్య తలెత్తిన పోటీ నివారణకు గాను ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను ఏర్పాటు చేసినప్పటికీ ఏ దేశానికి ఆదేశం రక్షణాత్మక విధానాలను చేపట్టటంతో దానితో నిమిత్తం లేకుండానే, సంస్ధ స్ఫూర్తికి విరుద్దంగా దాని వెలుపల దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎక్కువైంది. దీంతో రక్షణాత్మక చర్యలను నిరోధించేందుకు సంస్కరణలు అవసరమనే అజెండా ముందుకు వచ్చింది. అవును నిజమే, సంస్కరణలు తేవాల్సిందే అనే అభిప్రాయం ఒసాకాలో కూడా వెల్లడైనప్పటికీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లుగా పరిస్ధితి తయారైందని చెప్పవచ్చు. బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరిగిన గత సమావేశంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా వుండాలని అమెరికా కోరింది. అయితే ఆచరణలో ఈ కాలంలో చూస్తే అమెరికన్లు బస్తీమే సవాల్‌ అంటూ అనేక దేశాల మీద పన్నులు విధించి తమ షరతులకు అంగీకరించే విధంగా వత్తిళ్లకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆంబోతుల వంటి అమెరికా-చైనాలు ముందుగా ఒక అంగీకారం, అవగాహనకు వస్తే తమ పని సులభం అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య వివాదం పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్లు ఎగుమతి ఆధారిత ఆర్దిక వ్యవస్ధ వున్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఒసాకాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ అంశాల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అమెరికన్లు ఒకవైపు జర్మనీ, రెండోవైపు చైనాతో కూడా లడాయి పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వాణిజ్య సంస్ధలో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలతో ప్రపంచ వ్యవస్ధ నడుస్తోందని, ఈ పూర్వరంగంలో డబ్ల్యుటిఓను సంస్కరించాలని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కోవాలని ఈ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక సంయుక్త ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు నేతల సమావేశ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.దీనిలో అమెరికా పేరు ప్రస్తావన లేనప్పటికీ దాని గురించే అన్నది స్పష్టం. అంతర్జాతీయ చట్టాల మీద ఆధారపడాలని, జాతీయ సార్వభౌమత్వాలను గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పర్యావరణ సమస్యల మీద ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నారు.అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సాధారణ తీర్మానాన్ని ఒక తంతుగా ఆమోదించారు. విడిగా మాట్లాడినపుడు కొన్ని దేశాల వారు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి వుండాలని కోరారు. ఈ అంశంపై తయారు చేసిన ప్రకటనలో ఎక్కడా 2015నాటి పారిస్‌ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటంతో తాము సంతకం చేయటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా, జపాన్‌ కూడా దాని ప్రస్తాన ఒసాకా ప్రకటనలో వుండరాదని పట్టుబట్టాయి.