Tags
100 years of the KKE, Alexis Tsipras, Greece New Democracy, Socialist PASOK, Syriza, The ‘SYRIZA Experience
గ్రీస్‌లో నాలుగేండ్ల క్రితం తొలి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ సిరిజా ఆదివారంనాడు జరిగిన మలి ఎన్నికల్లో పరాజయం పాలైంది. మితవాద న్యూ డెమోక్రసీ పార్టీ తిరిగి అధికారానికి వచ్చింది. తొలిసారిగా మే నెలలో జరిగిన ఐరోపా యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రకాల మితవాద పార్టీలు 52శాతం ఓట్లు తెచ్చుకొని అక్కడ పెరుగుతున్న ప్రమాదానికి సంకేతాలను వెల్లడించాయి. ఇప్పుడు వాటి బలం మరింత పెరిగింది. వామపక్ష సిరిజా వైఖరి, విధానాలతో తొలినుంచీ విభేదిస్తున్న కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లూ సీట్లను నిలబెట్టుకుంది. గతంలోనూ, ఈసారీ ఆ పార్టీ 300స్థానాలున్న పార్లమెంట్లో 15 సీట్లు తెచ్చుకుంది. లాటిన్ అమెరికాలో కొన్నిచోట్ల వామపక్షాలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో గ్రీస్ ఎన్నికలు అభ్యుదయవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు, కార్మికవర్గానికి కూడా ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతున్నాయి.
ఈ ఎన్నికల్లో అధికారిక సమాచారం ప్రకారం వివిధ పార్టీల ఓట్లశాతం, సీట్ల సంఖ్య ఇలా ఉన్నాయి. న్యూడెమోక్రసీ 39.85(158), సిరిజా 31.53(86), కినాల్(మార్పుకోసం ఉద్యమం) 8.10(22), కమ్యూనిస్టుపార్టీ 5.3(15), ఎలినికి లిసీ(గ్రీక్ పరిష్కారం) 3.7(10) డైయం25(2025 ఐరోపా ఉద్యమంలో ప్రజాస్వామ్యం) 3.44(9) సీట్లు పొందగా ఇతర పార్టీలకు 8.08శాతం ఓట్లొచ్చాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం 300స్థానాలున్న పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 151స్థానాలు అవసరం. అయితే ఎన్నికలు 250స్థానాలకు మాత్రమే జరుగుతాయి. వీటిలో మూడు రకాలు, దేశం మొత్తాన్ని 12 నియోజకవర్గాలుగా పరిగణించి పార్టీలు పొందిన ఓట్లశాతాలకు అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు. ఇవిగాక మరో ఏడు స్ధానాలు ఇవన్నీ దాదాపు దీవులకు చెందినవి. వీటిలో నియోజకవర్గ ప్రాతిపదికన మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. మిగిలిన 231స్థానాలను దేశంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గాలలో వున్న సీట్లను దామాషా ప్రాతికపదికన పార్టీలకు కేటాయిస్తారు. కనీసం 3శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి మాత్రమే ప్రాతినిద్యం లభిస్తుంది. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పెద్ద పార్టీకి 50స్థానాలు బోనస్‌గా ఇస్తారు. ఈ కారణంగానే న్యూ డెమోక్రసీ పార్టీకి 39.85శాతమే ఓట్లు వచ్చినా సీట్లు సగానికిపైగా పొందింది.
కొంతమంది వర్ణించినట్టు తీవ్రవాద వామపక్ష లేదా వామపక్ష కూటమిగా 2004లో ఏర్పడి పదేండ్లలో అధికారానికి వచ్చిన పార్టీగా సిరిజా ఎందరో వామపక్ష అభిమానులకు ఉత్సాహానిచ్చింది. సిరిజా అంటే మూలాల నుంచి లేదా విప్లవాత్మకం అని అర్థం. గ్రీసులో 1990 దశకంలో ప్రయివేటీకరణ, సామాజిక, పౌర సమస్యల వంటివాటితో పాటు కొసావోపై దాడులను వ్యతిరేకించటం వంటి అనేక సమస్యలపై ఐక్యంగా ఉద్యమించిన వామపక్ష సంస్థలు, పార్టీలు, శక్తులు తొలిసారిగా 2002 గ్రీస్ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్దుబాట్లు చేసుకున్నాయి. తరువాత దాని కొనసాగింపుగా 2004ఎన్నికల సమయంలో సిరిజా కూటమిగా పోటీ చేశాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయిన ఒక గ్రూపు, వామపక్ష-పర్యావరణ ఉద్యమకారుల పార్టీ, ఇంటర్నేషనల్ వర్కర్స్ లెఫ్ట్ వంటివి, వివిధ భావజాలాలతో పని చేస్తున్న వామపక్ష బృందాలూ వ్యక్తులూ దీనిలో చేరారు. ఆ ఎన్నికల్లో 3.3శాతం ఓట్లు తెచ్చుకున్న సిరిజా ఆరు పార్లమెంట్ స్థానాలు తెచ్చుకుంది. ఆరుగురు ఎంపీలు వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన వారే అయ్యారు. ఇది మిగతా బృందాలలో ఆందోళనకు కారణమైంది. సిరిజాలో ఇదే పెద్దపార్టీ. మధ్యేవాద వామపక్ష రాజకీయాలను తిరస్కరించాలనే అంశంపై కొన్ని సైద్ధాంతిక సమస్యలు తలెత్తటంతో ఎన్నికలు ముగిసిన మూడునెలలకే ఈ పార్టీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో విడిగానే పోటీ కూడా చేసింది. సిరిజాలో విలీనమైన ఇతర పార్టీలలో కూడా విభేదాలు తలెత్తాయి. అయితే అదే ఏడాది డిసెంబరులో తిరిగి సంకీర్ణ కూటమిలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు. 2004 నుంచి 2009 వరకు సిరిజా అనేక అంతర్గత సమస్యలను ఎదుర్కొన్నది, కొత్త శక్తులు చేరాయి. 2009ఎన్నికల్లో 4.6శాతం ఓట్లు తెచ్చుకుంది. తరువాత కాలంలో ప్రధాని అయిన సిప్రాస్ పార్లమెంటరీ పార్టీనేతగా ఎన్నికయ్యారు. మరుసటి ఏడాది వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు సిరిజా నుంచి విడిపోయి డెమోక్రటిక్ లెఫ్ట్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 2012లో జరిగిన ఎన్నికల్లో సిరిజా కూటమి 16శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ పెద్ద పక్షంగా ముందుకొచ్చింది. అయితే ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది జూన్‌లో తిరిగి ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కూటమి బదులు సిరిజా ఒక పార్టీగా పోటీ చేసి 27శాతానికి ఓట్లను పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరుసటి ఏడాది ఐక్యపార్టీ సభ జరిగింది. కూటమిలోని పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే నాలుగు పార్టీలు అంగీకరించకపోవటంతో ఆ నిర్ణయాన్ని మూడునెలలు వాయిదా వేశారు. సిప్రాస్‌ను అధ్యక్షుడిగా 74శాతం అంగీకరించారు. యూరో నుంచి తప్పుకోవాలని కోరే వామపక్ష వేదిక అనే పార్టీ సిరిజా కేంద్రకమిటీలో 30శాతం స్ధానాలను పొందింది. 2014 ఐరోపా యూనియన్ ఎన్నికల్లో 26.5శాతం ఓట్లతో సిరిజా పెద్ద పార్టీగా అవతరించింది. తరువాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వివిధ కారణాలతో మిశ్రమ ఫలితాలను పొందింది. 2014 డిసెంబరులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో విఫలం కావటంతో పార్లమెంట్ రద్దయింది. 2015 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో సిరిజా 36.3శాతం ఓట్లు, 149 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది గానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్లు తగ్గాయి. సిరిజా గనుక అధికారంలోకి వస్తే పొదుపు చర్యలకు వ్యతిరేక వైఖరిని తీసుకుంటుందని, పెట్టుబడిదార్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని అనేకమంది భయపడ్డారు. మితవాద ఇండిపెండెంట్ గ్రీక్స్ పార్టీ సంకీర్ణానికి అంగీకరించటంతో సిప్రాస్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. ఒక వామపక్షం, పచ్చి మితవాద పార్టీ పొత్తు అది.
రుణభారం నుంచి గ్రీస్‌ను బయట పడవేసేందుకు ఐరోపాయూనియన్, ఐరోపా కమిషన్, ఐఎంఎఫ్‌ల త్రికూటమి పొదుపు పేరుతో విధించిన షరతులను అంగీకరిస్తూ సిప్రాస్ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనను సిరిజాలోని 25మంది ఎంపీలు వ్యతిరేకించారు. వారంతా బయటకొచ్చి పాపులర్ యూనిటీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. మెజారిటీ కోల్పోవటంతో 2015 ఆగస్టు 20న రాజీనామా చేసి సెప్టెంబరు 20న తాజా ఎన్నికలకు సిప్రాస్ సిఫార్సు చేశారు. తిరిగి సిరిజా పెద్దపార్టీగా అవతరించి 145స్థానాలను తెచ్చుకుంది. మరోసారి ఇండిపెండెంట్ గ్రీక్స్‌తో ఒప్పందం చేసుకొని 155సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసింది. పార్లమెంట్ పదవీ కాలం నాలుగేండ్లు అయినందున ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు వుంది. అయితే మేలో జరిగిన ఐరోపా యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో, తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిజా ఓటమి చెందింది. దాంతో ముందస్తు ఎన్నికలకు సిప్రాస్ సిఫార్సు చేయటంతో ఈనెల ఏడున ఎన్నికలు జరిగాయి. ఒక వామపక్ష పార్టీగా సిరిజా స్వల్ప కాలంలోనే ఓటర్లకు ఎందుకు దూరమైంది అన్నది అనేకమందిలో తలెత్తుతున్న ప్రశ్న.
నాలుగేండ్ల క్రితం గ్రీస్ చేగువేరా(సిప్రాస్)గా పేరు తెచ్చుకున్న నేత పాలనలో అంతకు ముందు పాలకుల హయాంలో త్రికూటమి తమ మీద రుద్దిన భారాలనుంచి విముక్తి కలిగిస్తారని ఆశించిన కార్మికవర్గ కలలు కల్లలయ్యాయి. గత పాలకులు ప్రకటించిన పొదుపు చర్యల గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సిప్రాస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మితవాదులు గగ్గోలు పెట్టారు. జనం బ్రహ్మరథం పట్టారు. 2015 జూలై 5న జనాభిప్రాయ సేకరణ సమయంలో డబ్బులేక బ్యాంకులు మూతబడ్డాయి. ఐరోపా సంస్థలు, ఐఎంఎఫ్ నగదు సరఫరా నిలిపేశాయి. అవి ప్రతిపాదించిన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు 61శాతం మంది ఓటు వేశారు. కొద్దిరోజుల తరువాత ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి సదరు సంస్థలు రుద్దిన అన్ని షరతులకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ 25మంది ఎంపీలు తిరుగుబాటు చేయటంతో వెంటనే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు జరిపారు. నూతన షరతుల గురించి జనానికి పూర్తిగా తెలిసి, పర్యవసానాల గురించి చర్చలు ప్రారంభమయ్యేలోగానే ఎన్నికలు రావటం, ఎదురుగా అంతకు ముందే పొదుపు చర్యల్ని రుద్దిన న్యూ డెమోక్రసీ పార్టీ కనిపిస్తుండటంతో చాలామంది ఓటర్లు అసలు ఎన్నికలకే దూరమయ్యారు. 1974 తరువాత కనిష్టంగా 56.6శాతం ఓట్లు పోలయ్యాయి (తాజా ఎన్నికల్లో మరో శాతం పెరిగింది తప్ప ఓటర్లలో ఉత్సాహం లేదు). మరోసారి సిరిజానే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి, సిరిజాకు పెద్ద తేడాలేదని భావించిన వామపక్ష ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండిపోయారనే అభిప్రాయాలూ వెల్లడయ్యాయి.
ఒకనాడు ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వ్యక్తే వాటిని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొత్తగా అన్న, వస్త్రాల కోసం చూస్తే వున్న వాటినే వూడగొట్టినట్టుగా పరిస్థితి తయారైంది. విప్లవకారుడని భావించిన వారికి విద్రోహిగా కనిపించాడంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు వందల నౌకా కంపెనీలకు, ఇతర సంస్థలకు పెద్ద మొత్తంలో పన్నుల రాయితీలు ప్రకటించారు. ఇలాంటి వైఖరి కారణంగానే మితవాదుల కంటే అతివాదుల పేరుతో భారాలు మోపే వారే మంచిదనే కారణంతో ఐరోపా యూనియన్ ఎన్నికల్లో దేశంలో ఇరవైకి పైగా ఉన్న బడా సంస్థలలో సగం, బ్యాంకులు, ఐరోపా యూనియన్, కమిషన్, అనేక కార్పొరేట్ సంస్థలు సిప్రాస్‌కు మద్దతిచ్చినట్టు వార్తలొచ్చాయి. అమెరికా నుంచి ఎఫ్16 యుద్ధ విమానాల కొనుగోలుకు రెండున్నర బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇజ్రాయెల్‌తో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నారు. బాల్కన్ ప్రాంతానికి నాటో కూటమి విస్తరించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలో గ్రీస్ చేసిన వీటో రద్దు చేసి దారి సుగమం చేశారు.
గ్రీక్ బడాబాబులకు, ఐరోపా యూనియన్ భారాలకు, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడతానన్న వాగ్దానాలతో సిప్రాస్ అధికారానికి వచ్చారు. వాటికి పూర్తి భిన్నంగా ఆచరణలో వ్యవహరించారు. పొదుపు పేరుతో పేదల మీద భారాలను మోపారని చివరికి జర్మన్ ఆర్థిక మంత్రి వూల్ఫ్‌గాంగ్ ష్కాబుల్ కూడా విమర్శించారంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాలుగేండ్ల క్రితం న్యూడెమోక్రసీకి 16.5శాతం మంది యువకులు ఓటు వేస్తే ఈ ఎన్నికల్లో 30శాతానికి పెరిగింది, ఇదే విధంగా పెన్షనర్లు కూడా ఆ పార్టీ వైపు మొగ్గారని వెల్లడైంది. సిరిజా నాయకత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆచరణలో ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాలను అమలు చేసింది. మిగతా పార్టీలకు దానికీ తేడాలేదని తనను తానే బహిర్గత పరుచుకుంది. ఇతర బూర్జువా పార్టీల మాదిరే పార్టీలో అన్నీ తానే అయి వ్యవహరించి సిరిజా అంటే సిప్రాస్ అనే విధంగా మార్చివేశారన్న విమర్శలున్నాయి. ఐరోపా యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఓటర్లను ఆకట్టుకొనేందుకు సిప్రాస్ కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఫలితం లేకుండా పోయింది.