Tags

, ,

Image result for india budget 2019-20, nirmala

ఎం కోటేశ్వరరావు

2019-20 సంవత్సర పూర్తి బడ్జెట్‌ను జూలై ఐదున నూతన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు కుహనా మేథావుల కేంద్రంగా వర్ణిస్తారు. అయితే వారి అదృష్టమో దురదృష్టమోగానీ అదే విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తీరుకు మొత్తంగా మీడియా ప్రశంసలు కురింపించింది. అఫ్‌ కోర్స్‌ అది కార్పొరేట్లకు, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినందువలన కూడా కావచ్చు. ఒక వ్యక్తి హావభావాలు, ప్రవర్తన తీరుతెన్నులు వ్యక్తిగతమైనవి తప్ప వేరు కాదు. సదరు వ్యక్తులు ఏ భావాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాటి పర్యవసానాలు,ఫలాలు ఏమిటన్నదే సమాజం చూస్తుంది. అందువలన నిర్మలా సీతారామన్‌ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు గనుక దానిలోని అంశాలపై విమర్శలు లేదా ప్రశంసలను వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు.

ఐదేండ్ల క్రితం నాటి అర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, నిర్మల బడ్జెట్‌కు సామ్యాలను చూపుతూ ఎన్ని నిమిషాలు, ఎన్నిపదాలు, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించారు అనే పద్దతుల్లో విశ్లేషించిన వారు కూడా లేకపోలేదు.ఆ రీత్యా చూసినపుడు 16,489 పదాలను జైట్లీ రెండు గంటల ఏడు నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేస్తే నిర్మల 20,223 పదాలను రెండు గంటల తొమ్మిది నిమిషాల 13 సెకండ్లలోనే ముగించారంటే వాగ్ధాటితో తక్కువ సమయంలో ఎక్కువ పదాలను కుమ్మరించారన్నది స్పష్టం. బడ్జెట్‌ తీరు తెన్నులను చూసే ముందు నాలుగవ తేదీన ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేను కూడా కలిపి విశ్లేషించటం సముచితంగా వుంటుంది.

గతానికి చెందిన అంకెల వివరాలు ఇచ్చినప్పటికీ వాటికి చెప్పే భాష్యం, వుగాది పంచాంగంలా ఆశాభావం వెలిబుచ్చే నివేదికలుగానే మన అర్ధిక సర్వేలు వుంటున్నాయి. బడ్జెట్‌ కూడా అంతే. భవిష్యత్‌ మాసాల్లో సంభవించే పరిణామాల మీద అంచనాల ప్రాతిపదికగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు వుంటాయి. అంచనాలు తప్పితే కోతలతో సవరణలను ఆమోదించటం మనం చూస్తున్నాం. ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అదే చేస్తుంది. ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వ ద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. కాగా వర్తమాన సంవత్సరంలో ఏడు శాతం ఆశాభావం, అంచనా మాత్రమే. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్ధిక వ్యవస్ధను పెంచుతామని అందుకుగాను ప్రతి ఏటా కనీసం ఎనిమిది శాతం అభివృద్ది వుండాలని చెప్పిన వారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అంచనాలోనే ఒకశాతాన్ని తగ్గించారు. అలాంటపుడు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు ?

Image result for india budget 2019-20, nirmala

అంకెల్లోకి పోతే ఒక పట్టాన తేలే అవకాశం వుండదు. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు, భాష్యం చెప్పవచ్చు. అందువలన ఎవరి భాష్యం వాస్తవాలకు దగ్గరగా వుందన్నది జనం నిర్ణయించుకోవాల్సిందే.ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ వుపన్యాసం రెండింటిలోనూ 2024-25 నాటికి అంటే ఐదు సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షలకోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా చెప్పారు. తప్పులేదు, అందుకు గాను ఏటా 8శాతం అభివృద్ధి రేటు వుండాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి చెప్పినదాని ప్రకారం మన జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు వుంది.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ప్రభుత్వాలు, మంత్రులూ తమ పబ్బంతాము గడుపుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన దీపాంకర్‌ దాసుగుప్తా చెబుతున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల కోట్ల డాలర్లకు జిడిపి పెరగాలంటే 2018-19 రేట్ల ప్రకారం ఐదేండ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటు బదులు 13శాతం వుంటేనే సాధ్యం అంటున్నారు. అదే 2011-12 ధరల ప్రకారం అయితే 19శాతం వంతున పెరిగితే నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని, అదే ఎనిమిదిశాతం చొప్పున అయితే 2030-31వరకు ఆగాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత మన పాలకులు చెబుతున్న లక్ష్యం సాధించటం గురించి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అసలు నీవు దేశభక్తుడవేనా అని ప్రశ్నిస్తారు. మన గురించి ఐఎంఎఫ్‌ ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం.2020 నుంచి 2024 సంవత్సరాలలో సగటున 7.59శాతం అభివృద్ధి రేటుతో మన జిడిపి 2.97లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.30లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన అభివృద్ధి రేటు 6.8శాతమే. అది ఈ ఏడాది ఏడుశాతంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటపుడు ఎనిమిదిశాతం వుంటే గింటే ఐదులక్షల కోట్ల డాలర్లకు చేరతామని చెప్పటం ఏమిటి? అదేమన్నా ప్రామాణిక సంఖ్యా? అంతకు మించి సాధిస్తే జనం వద్దంటారా ? లేకపోతే మరేదైనా చేస్తారా ? ఐదు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌(మంచి రోజులను) తెస్తామని, గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని, 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పినట్లుగానే మైండ్‌ గేమ్‌లో ఇదొక భాగం అనుకోవాలి.

ఆర్ధిక సర్వే రచయితలు అభివృద్ధి గురించి పలుసార్లు చైనాను వుదహరించారు. బ్రిటీష్‌ వారి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు. చైనా మాదిరి పురోగమించాలని కోరుకోవటం తప్పుకాదు. బ్రిటీష్‌ వారి నమూనా వారి దేశాన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది గనుక మనకు వాంఛనీయమూ కాదు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనంలో వుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా వుంటే అది చైనా ఒక్కటే. కొంత మంది విమర్శకులు అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరుతో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్నారని ఆరోపిస్తారు. వారు చెప్పిందాన్ని కాసేపు అంగీకరిద్దాం.చైనా సంస్కరణలకు నాలుగు పదులు నిండాయి. ఈ కాలంలో అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ ప్రతి పది సంవత్సరాలకు ఏదో ఒక ఆర్ధిక సంక్షోభం, మాంద్యం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ధనిక దేశాల్లో 2008లో ప్రారంభమైన సంక్షోభం పరిష్కారం గాకపోగా త్వరలో మరో సంక్షోభానికి తెరలేవనుందనే వార్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సంక్షోభ ప్రభావం మనమీద కూడా పడుతోంది. చైనా ఎన్నడూ ధనిక దేశాల మాదిరి సంక్షోభాలను ఎదుర్కొన్నదా అంటే లేదు. అభివృద్ధి రేటులో స్వల్పతగ్గుదల వుండవచ్చు గానీ ఇతర దేశాల మాదిరి నామ మాత్రం లేదా తిరోగమన దారి పట్టలేదు కదా ? ఎందుకనో ఎప్పుడైనా మనం ఆలోచించామా ?

మన దేశంలో కొంత మంది భలే చిత్రమైన వాదనలు చేస్తుంటారు, వాటిని నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని పచ్చి అబద్దాలు కూడా వున్నాయి. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయో చూద్దాము. చైనా అభివృద్ధి చెందిన మాట నిజమేగానీ అది కమ్యూనిస్టు దేశమండీ, మనది ప్రజాస్వామ్యం, ఒక నిర్ణయం చేస్తే అక్కడ తప్పయినా ఒప్పయినా అమలు జరగాల్సిందే, మన దగ్గర అలా కాదు. చైనా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నది, దాని తరువాత స్ధానం పొందేందుకు భారత్‌ ప్రయత్నించకూడదు, అది సాధ్యం కాదు.ఏక పార్టీ నిరంకుశ పాలనతో పాటు దశాబ్దాల తరబడి మౌలిక సంస్కరణల గురించి చేసిన ప్రచారంతో పాటు మెజారిటీగా వున్న హాన్‌ జాతీయులు, చైనా భాష మాట్లాడేవారిని సమీకరించారు. భారత్‌లో అటువంటి అవకాశం లేదు.బహుళపార్టీ వ్యవస్ధ వున్నది. సామాజిక పరంగా, భాషా పరంగా వందలాది మైనారిటీలను ఒక లక్ష్యం కోసం సమీకరించటం సాధ్యం కాదు. చైనాలో రైతులను భూముల నుంచి తరమివేశారు, మన దగ్గర అలా కుదరదు. నిరంకుశ పాలకులు వున్న అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పలేము, క్యూబా, వుత్తర కొరియా, వెనెజులాల్లో వైఫల్యం చెందారు. మంచి నియంతలను కలిగి వుండటం చైనీయుల అదృష్టం. ఇంకా ఇలాంటి బుర్రతక్కువ ప్రచారాలు చాలా వున్నాయి. అలాంటపుడు మన అభివృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ వుంది, త్వరలో మనం చైనాను అధిగమిస్తాము, ఎగుమతుల్లో చైనాతో పోటీపడతాము, దాన్ని వెనక్కు నెట్టి ముందుకు పోతాము అని చెప్పుకోవటం ఎందుకు అన్నది ప్రశ్న.

సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆహారం తిని బతికితే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్చతో ప్రాణాలు నిలుపుకుంటారా? అక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ నిత్యదరిద్రంతో బతకాలా ? అసలు ఇలాంటి వాదనలు చేసే వారి సమస్య ఏమిటో మనకు అర్ధం కాదు. కమ్యూనిస్టులు ఏపనైనా మెడమీద కొడవలి, తలమీద సుత్తిపెట్టి చేస్తావా, చస్తావా అంటారన్నట్లుగా కొందరు చెబుతారు. పోనీ, మచ్చుకు అలా చేసి చైనాలో హెక్టారుకు1,751 కిలోల పత్తి పండిస్తే మనది ప్రజాస్వామ్యం గనుక 502కిలోలే పండిస్తారని అనుకుందాం. మరి బ్రెజిల్‌, టర్కీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్ధలున్నవేగా అక్కడ చైనా తరువాత అధికంగా 1,600-1700 కిలోల వరకు పండిస్తున్నారుగా దాన్నేమనాలి? పత్తి రైతులు మన దేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత తప్ప సరైన సమాధానం వుండదు.

Image result for india budget 2019-20, nirmala

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో భిన్న భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఆచారాలు వున్న మాట నిజం. ఇలాంటి చోట హిందూత్వ పేరుతో మెజారిటీవాదాన్ని బలవంతంగా రుద్ద చూస్తున్నారు. ఇది జనాన్ని ఏకత్రాటి మీద నడిపించటానికి దోహదం చేస్తుందా ? ఫలానా వారి ఇంట్లో ఆవు మాంసం వుందనో, ఫలానా వారు ఆవులను వధించటానికే తరలిస్తున్నారనో సాకులు చూపి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామూహికంగా దాడులు, హత్యలు చేసే వారు గోరక్షకుల పేరుతో చలామణి అవుతున్నారు. వారికి పాలకపార్టీ అండదండలున్నాయి. ఒక్క వుదంతంలో కూడా ఇంతవరకు దుండగులకు శిక్షలు పడలేదు. అది అలా వుండగా కొత్తగా ఆకస్మికంగా కొందరు ప్రత్యక్షమై మైనారిటీ తరగతులకు చెందిన వారిని పట్టుకొని నీవు దొంగతనానికి వచ్చావు లేదా జైశ్రీరామ్‌ అంటావా లేదా అంటూ చావచితక కొట్టి పోతుంటే వారిని అడ్డుకొనే వారు లేరు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే అదిగో చూడండి వీరు హిందూమతానికి, హిందూత్వకు వ్యతిరేకులు, మెజారిటీగా వున్న వారికి తమ దేవుడిని తలచుకొనే అవకాశం కూడా వుండకూడదా అంటూ విద్వేష ప్రచారాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో వారి ఏలుబడిలో చైనా మాదిరి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎవరైనా చెబితే ఎలా నమ్మాలి?

ఏ దేశ పురోగమనానికైనా పరిశోధన, అభివృద్ధి కీలకం. వేల సంవత్సరాల నాడే మన వారు సముద్ర వాణిజ్యం చేశారని ఒకవైపు గొప్ప చెప్పుకుంటాం. మరోవైపు సముద్రం దాటి ప్రయాణిస్తే మ్లేచ్చులు అవుతారు, మైలపడతారు, ధర్మం చెడుతుంది, కులం నుంచి వెలి అంటూ గిరులు గీసి కూర్చోపెట్టిన కారణంగానే మనకు ఒక కొలంబస్‌ లేకుండా పోయాడు. మన పూర్వులు పెట్రోలు లేకుండానే విమానాలు నడిపారు, ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండేది, అసలు వేదాల్లోనే అన్నీ వున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవటానికే మనకు సమయం చాల్లేదు. మిగతా దేశాల్లో ఇలాంటి పిచ్చి ముదరలేదు కనుకనే కొత్తవాటిని కనిపెట్టాలనే తపనతో ఎంతో ముందుకు పోయారు. దేశంలో జరిగిన ప్రతి అనర్ధానికి లేదా తమకు నచ్చని ప్రతి అంశానికి కారకుడు నెహ్రూ అంటూ బిజెపి నేతలు దాడిచేస్తుంటారు. వాదనకోసం సరే అందాం. గత ఐదు సంవత్సరాల్లో నరేంద్రమోడీ, అంతకు ముందు వాజ్‌పేయి పాలనా కాలంలో బిజెపి చేసిందేమిటి? చైనా గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధన, అభివృద్ధికి తన జిడిపిలో రెండుశాతం మొత్తం ఖర్చు చేస్తున్నది. మనం 0.7శాతం దాటలేదు. ఐదు సంవత్సరాల క్రితం స్ధానికుల పేటెంట్‌ దరఖాస్తుల విషయంలో మనం 52వ స్ధానంలో వుంటే 2018లో అది 55కు దిగజారింది. ఇదే సమయంలో చైనా మూడు నుంచి ఒకటవ స్ధానానికి చేరుకుంది. ఆవు మూత్రంలో బంగారం వుందా, అవితాగితే కాన్సర్‌ నయమౌతుందా, ఆవు పేడలో ఏముంది, దాన్ని పూసుకుంటే సొగసుగా తయారవుతామా అనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. యధారాజా తధా పరిశోధకా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. కావాలంటే వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పే సంస్కృత పండితులకు, అగ్రహారాలకు వాటి పరిశోధన అప్పగించి వాటిలో దాగి వున్నవాటిని వెలికి తీయమనండి. పైసా ఖర్చు కాదు. ఇప్పటికే ఐదేండ్ల కాలాన్ని వృధా చేశారు. దాని దారిన అది నడుస్తుంటే మిగతా అంశాల మీద ఇతరులను ప్రోత్సహించాలి, పోటీ పెట్టాలి తప్ప కాలు గడపదాట కుండా వేదకాలం గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది.

ఏ దేశంలోనూ ఇవ్వని విధంగా పరిశోధన పేరుతో చేసే ఖర్చులకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు ఇస్తున్నాయి. ప్రయివేటు సంస్ధలు ఆ రాయితీలను ఎలా స్వాహా చేయాలనే అంశం మీద పెడుతున్న శ్రద్ద పరిశోధన మీద లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. దాంతో పన్ను మినహాయింపులను తగ్గించగానే ప్రయివేటు రంగం గగ్గోలు పెడుతోంది. మరో వైపున అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నట్లుగానే పరిశోధనా రంగం నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి.1996లో చైనా జిడిపిలో 0.56శాతం ఖర్చు చేయగా మన దేశం 0.63శాతం పెట్టింది. అదే 2015నాటికి చైనా 2.07శాతానికి పెంచగా మనది అదే 0.63దగ్గరే వుండిపోయింది.ఇదే కాలంలో ప్రపంచ సగటు 1.97 నుంచి 2.23శాతానికి పెరిగింది. మనం ప్రపంచ సగటుకు ఇంకా ఎంతో దూరంలో వున్నాం. ఇజ్రాయెల్‌ గరిష్టంగా 4.27శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనకు కూడా ప్రజాస్వామ్యమే అడ్డువస్తోందనుకోవాలా ? రాజకీయంగా ఎవరైనా అడ్డుపడుతున్నారా ?

Image result for india budget 2019-20, nirmala

దేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే 2004జూన్‌ నుంచి 2019 మార్చి వరకు లభ్యమైన సమాచారం మేరకు జిడిపిలో ప్రతి మూడు మాసాల పెట్టుబడి సగటు 34.8శాతంగా వుంది. గరిష్టం 2011సెప్టెంబరులో 41.2శాతం కాగా కనిష్టం 2017 మార్చిలో 29.5శాతం వుంది. తాజా పరిస్ధితికి వస్తే గతేడాది చివరి మాసాల్లో 32.2శాతం వుండగా ఈ ఏడాది మార్చిలో 29.8శాతం వుంది. చైనాలో ఏడాదికి ఒకసారి వివరాలను వెల్లడిస్తారు. ఆ మేరకు 2018 డిసెంబరులో పెట్టుబడి జిడిపిలో 44.8శాతం వుంది. అంతకు ముందు ఏడాది 44.6 శాతం. 1952 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వరకు సగటు 36శాతం వుంది. 2011 డిసెంబరులో గరిష్టంగా 48 శాతం కాగా 1962లో కనిష్టంగా 15.1శాతం నమోదైంది.

నరేంద్రమోడీ 2.0 సర్కార్‌ ప్రయివేటు పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున మరులుగొన్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో ప్రయివేటు రంగ పెట్టుబడులు ప్రస్తుతం 14సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయిన తరుణంలో వాటి గురించి జనానికి భ్రమలు కొల్పే విధంగా పారాయణం చేస్తున్నది. మంచి రోజులు తెస్తా మంచి రోజులు తెస్తా అని నరేంద్రమోడీ చెప్పటం తప్ప అలాంటి సూచనలు ఎండమావుల్లా కూడా కనిపించటం లేదు. 2018 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలని సిఎంఐఇ(భారత ఆర్ధిక వ్యవస్ధ పర్యవేక్షణ కేంద్రం) పేర్కొన్నది. అయితే ఆ మొత్తం సెప్టెంబరుతో ముగిసిన మూడునెలలతో పోల్చితే 53శాతం, ఏడాదితో పోల్చితే 55శాతం తక్కువ అని తెలిపింది. ప్రయివేటు రంగం పధకాలు ఇదే కాలంలో 62,64శాతాల చొప్పున తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్ధల పధకాలు కూడా 37,41శాతాల చొప్పున పడిపోయాయి. ఇది 2004 తరువాత ఇది కనిష్టం. కొత్త పధకాలు రాకపోవటం ఒకటైతే అమల్లో వున్న ప్రాజెక్టులు నిలిచిపోవటం మరింత ఆందోళనకరం. మొత్తంగా 11శాతం వుంటే ప్రయివేటు రంగంలో ఇది 24శాతం వరకు వుంది. అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఎత్తివేత గురించి పాలకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాల స్ధాపక సామర్ధ్యం పెరిగినంతగా విద్యుత్‌ వినియోగం పెరగకపోవటమే కొరతలేకపోవటానికి కారణం. ప్రయివేటీకరణలో భాగంగా విదేశాల నుంచి అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులలో 35.4శాతం విద్యుత్‌, 29.2శాతం వస్తూత్పత్తి రంగానికి చెందినవి. నిధులు, ఇంధనం, ముడిసరకుల కొరత, మార్కెట్‌ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవటం దీనికి ప్రధాన కారణాలు. వీటిలో కూడా ఎక్కువ శాతం నిధుల కొరతే. ఇటువంటి స్ధితిలో ప్రయివేటు పెట్టుబడుల గురించి దేశ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. ఈ పేరుతో మరిన్ని ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను రుద్దే యత్నం తప్ప ఇది వేరు కాదు.

ఆశలు ఆకాశంలో ఎగురుతుంటే భూమ్మీద పరిస్ధితి ఎలా వుంది ? అన్నదాతలు సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర వ్యవసాయాభివ ద్ధి రేటు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాత సూచనలు కనిపిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వ ద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని క ష్ణమూర్తి సుబ్రమణియన్‌ విరచిత సర్వే నమ్మకంగా చెబుతోంది. ప్రపంచ ధనిక దేశాలు వ ద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- మన వ ద్ధి ప్రస్థానం గతాన్ని అధిగమిస్తుందన్నది ప్రశ్న.

Image result for india budget 2019-20, nirmala

సోషలిస్టు చైనా గురించి ఇటీవలనే కొన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కార్మికుల వేతనాలు పెరుగుతున్న కారణంగా అనేక మంది ప్రయివేటు పారిశ్రామికవేత్తలు తమ సంస్ధలను అక్కడి నుంచి తరలించేందుకు చూస్తున్నారని, భారత్‌ అనువుగా వుంటుందని భావిస్తున్నారన్నది వాటి సారాంశం. దీని అర్ధం ఏమిటి? తన ఎగుమతులను చౌకగా ప్రపంచానికి అందించేందుకు కార్మికుల శ్రమను ఫణంగా పెడుతోందన్న కొందరి వక్రీకరణలకు ఇది చెంపపెట్టు. ఆ స్ధాయిలో మన దేశంలో వేతనాలు లేవన్నది మన పాలకులకు అభిశంసన. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ ధనిక దేశాలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాని ఎగుమతులపై కొంత ప్రభావం పడినా ఆరుశాతం పైగా అభివృద్ధి రేటు కొనసాగించటానికి కారణం తన జనాల ఆదాయాలను పెంచి అంతర్గత వస్తు వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవటమే. కేవలం ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన లాటిన్‌ అమెరికా దేశాలు దెబ్బతినటానికి కార్మికవర్గ ఆదాయాలను పెంచకపోవటం ప్రధాన కారణం. వ ద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని ప్రగతి సాధ్యం. రిజర్వ్‌బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వ ద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ లేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న తాజా సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు లక్ష్యానికి ఇది విరుద్దం. భారీ పరి శమలతో పెద్ద ఎత్తున వుత్పత్తి చేసి వుత్పాదక ఖర్చు తగ్గిస్తే తప్ప ఎగుమతుల్లో మనం పోటీ పడలేము. చిన్న, మధ్య తరహా సంస్దలకు అలాంటి వెసులుబాటు వుండదు.

ప్రయివేటు పెట్టుబడులతో పెద్ద ఎత్తున వుపాధి కల్పిస్తామని యువతకు భ్రమలు కల్పిస్తున్నారు. అభివృద్ధి రేటు గురించి డబ్బాకొట్టుకుంటున్న పాలకులు వుపాధి గురించి మాట్లాడటం లేదు. గతంలో వుపాధి రహిత అభివృద్ధి సంఘటిత రంగ సంస్ధలకే పరిమితం అయింది. ఇప్పుడు అది అసంఘటిత రంగానికి కూడా విస్తరించటం వుపాధి కల్పన మరింత క్లిష్టం కానుంది. దేశంలో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో పని చేస్తున్నవారు లేదా పనికోసం ఎదురుచూస్తున్నవారు గానీ 2012లో 55.5 శాతం మంది వుంటే 2018లో 49.7శాతానికి పడిపోయింది. అంటే నిరుద్యోగులు పెరిగారు.

ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివ ద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయని ఒకవైపు చెబుతోంది. మరోవైపు వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాలలో నాట్లు, కోత, నూర్పిడి పనులను యంత్రాలే చేస్తున్నాయి. వుపాధి రహిత అభివృద్దికి ఇది ఒక సూచిక. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మాటేమిటి అంటే సమాధానం లేదు. చిన్నా, పెద్ద అనేతేడా లేకుండా అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ వాదన వుంది. గత ఐదు సంవత్సరాలుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అవుతోంది. ప్రస్తుత స్ధితిని చూస్తే ఆరో సంవత్సరం కూడా ఇదే స్ధితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా వ్యవసాయ వృద్ధి రేటు 2.9శాతం తక్కువేమీ కాదు.కానీ వృద్ది రేటు ఐదుశాతం గనుక వుంటే పంటల ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు 30 నుంచి 40శాతం వరకు పడిపోయే అవకాశం వుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్న మోడీ సర్కార్‌ ప్రచారం ఒక వాగాడంబరమే తప్ప వాస్తవం కాదని కూడా రమేష్‌ తేటతెల్లం చేశారు. ఆదాయాలు రెట్టింపు కావాలంటే ఏడాదికి పదిశాతం వృద్దిరేటు అవసరం. తన అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఆరుశాతానికి మించి లేదు. ఇప్పుడున్న ధరలకు పదిశాతం అదనంగా రైతులు పొందితే వారి ఆదాయం 16శాతం పెరుగుతుందని రమేష్‌ అంటారు. మరి ఆ పరిస్ధితి ఇప్పుడు వుందా ? ప్రతి పభుత్వ పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది బడ్జెట్‌లో అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై ద ష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు ధరల పెరుగుదల ఎంత ప్రహసన ప్రాయంగా వుందో బడ్జెట్‌కు ముందు పెంచిన నామమాత్ర ధరలను చూస్తే తెలుస్తుంది.

దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని గత ఏడాది పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని తాజా ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌ వైపు నడుద్దామని పిలుపునిచ్చింది. బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! ఆదాయపన్ను మినహాయింపుల గురించి ఎదురు చూసిన ప్రభుత్వ వుద్యోగుల ఆశాభంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగునెలల క్రితం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలనే తిరిగి వల్లించారు. నిజానికి వుద్యోగులకు మినహాయింపులు పెంచితే ఆ మేరకు మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుంది. అధిక ఆదాయం వచ్చే వారి మీద సర్‌ఛార్చి పెంపుదల హర్షణీయమే అయినా అసమానతల తగ్గింపు రీత్యా చూస్తే ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిదే. మరోవైపు బడా సంస్ధలకు ఇచ్చిన రాయితీలను చూస్తే 25శాతం ఆదాయపన్ను జాబితాలోకి వచ్చి సంస్ధల వార్షిక లావాదేవీల మొత్తాన్ని 250 నుంచి 400 కోట్లకు పెంచారు. పోనీ దీని వలన ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందా అంటే చెప్పలేము. అనేక సంస్ధలు తమ లాభాలను, పన్ను రాయితీలను సరిహద్దులు దాటించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చి వాటి మీద కూడా రాయితీలు పొందుతున్నారు.

మోదీ ప్రభుత్వం ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా ప్రపంచ స్ధాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జల మార్గాల గురించి చెప్పినా ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లుగా వుంది. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ గురించి కబుర్లు చెబుతున్నారు. ‘గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు ఖర్చు చేయలేదు. ఈ సారి మొత్తాన్ని పెంచలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులు తగ్గాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను కుదించారు. ఇవన్నీ గ్రామీణుల ఆదాయాలను తగ్గించేవే తప్ప పెంచేవి కాదు. గత బడ్జెట్‌లో వివిధ పధకాలకు చేసిన కేటాయింపుల్లో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర కోతలు పెట్టి లోటు అదుపులో వుందని నమ్మబలికారు. జనాన్ని మాయ చేయటం తప్ప వేరే కాదు. ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల వుపసంహరణ ద్వారా వచ్చిన నిధులను కొత్త పెట్టుబడిగా పెడితే ప్రయోజనం, అలాగాక వాటిని లోటును పూడ్చు కోవటానికి వినియోగిస్తున్నారు.

Image result for india budget 2019-20

రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనకు వందలక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కొండంత రాగం తీసి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 3.38లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరోవైపు రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాలని చెప్పి కేటాయించిన మొత్తం 66వేల కోట్ల రూపాయలు మాత్రమే. తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తలో తెల్లారి లేస్తే నరేంద్రమోడీ ఏదో ఒక దేశంలో వుండేవారు. ఎందుకయ్యా అంటే దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి అని చెప్పారు. మరోవైపు తమ నేత కొత్తగా అప్పులు చేయటం లేదని, పాత అప్పులను తీర్చినట్లు మోడీ అనుయాయులు ఎన్నికల ముందు వూదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో విదేశీ బాండ్ల ద్వారా రుణాలను సేకరిస్తామని చెబుతున్నారు. ఐదేండ్లుగా సాగించిన కౌగిలింతల దౌత్యం, విదేశీయులకు పరచిన ఎర్రతివాచీ మర్యాదలద్వారా ఏమి సాధించినట్లు? ఏమాటను, ఏ చేతనూ విశ్వసించే స్దితి కనిపించటం లేదు.

మరోవైపు జనాన్ని బాదేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. వివాహ సమయంలో నూతన వధూ వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెబుతారు. వారికి అది కనిపిస్తుందో లేదో తెలియదు గానీ అమ్మాయి తండ్రికి అప్పులు స్పష్టంగా కళ్ల ముందుంటాయి. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వెలిబుచ్చినట్లు చమురు ధరలు తగ్గుతాయో లేదో గాని పెట్రోలు, డీజిల్‌ మీద ప్రకటించిన ఒక రూపాయి ప్రత్యేక సుంకం మాత్రం స్పష్టంగా ధరల పెరుగుదలకు దారి తీసింది. గత ఐదు సంవత్సరాలలో తగ్గిన చమురు ధరలను వినియోగదారులు లబ్ది పొందకుండా పన్నులను పెంచారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుతాయని ఏ అంచనాతో చెబుతున్నారో తెలియదు గానీ ఆ పేరుతో జనానికి వడ్డించారు. ఇష్టమైనపుడు వుంగరాల వేళ్లతో మొట్టినా సరదాగానే వుంటుందంటారు. ఇది కూడా అంతేనా !