Tags

,

Image result for What is new in YS Jagan first Budget

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన తొలి బడ్జెట్‌లో ఎన్నో విన్యాసాలు ప్రదర్శించారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, ఓట్ల యాత్రల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వాగ్దానాలు, విసిరిన వాగ్బాణాలకు అనుగుణ్యంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. అధికారానికి వచ్చిన రెండో నెల్లోనే బడ్జెట్‌ పెట్టాల్సి రావటం కసరత్తు చేసేందుకు తగిన సమయం లేదని చెప్పుకొనేందుకు, ఎవరైనా నిజమే కదా అనేందుకు ఆస్కారం వుంటుంది. దానిలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. బడ్జెట్‌ కొత్త మంత్రులకు హడావుడి తప్ప నిరంతరం కొనసాగే అధికార యంత్రాంగానికి రోజువారీ వ్యవహారమే. అందునా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ముందుకు గానే ఏర్పాట్లు చేశారు కనుక, నూతన పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని శాఖల, పధకాలకు కోత, వాత, కొన్నింటికి మోత అన్నట్లుగా సవరణలు చేయటం తప్ప పెద్దగా ఇబ్బంది వుండదు. ఫిబ్రవరి మాసంలో నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండు లక్షల 26వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రతిపాదిస్తే, రాజేంద్రనాధ్‌ రెండు లక్షల 27వేల కోట్లతో ప్రపతిపాదించారు.

అడుక్కొనే దగ్గర పిసినారి తనం ఎందుకన్నది పెద్దల మందలింపు వంటి సలహా. బడ్జెట్‌లో విషయంలో కూడా పాలకులు దీన్నే ప్రదర్శిస్తూ భారీగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయంలో ఎవరికీ పేచీ లేదు గానీ అవే సర్వస్వం, జిందా తిలిస్మాత్‌ (సర్వరోగ నివారిణి అన్నది దాని తయారీదార్ల ప్రచార నినాదం) అంటే కుదరదు. అవి సంక్షోభం లేదా సమస్యల్లో వున్న జనానికి పూత మందు వంటి వుపశమన చర్యలు మాత్రమే అన్నది ముందుగా చెప్పకతప్పదు. జగన్‌ సర్కార్‌ కూడా పిసినారితనం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ అంటే అంకెల గజిబిజి కనుక సమీప అంకెల్లోకి మార్చి చెప్పుకుందాం. ప్రతిపాదించిన రెండులక్షల 27వేల కోట్లలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంటులు, రాష్ట్రం తీసుకొనే అప్పులు అన్నీ కలసి వుంటాయి. బడ్జెట్లో చూపిన అంకెలను చూసి ఎవరైనా చూశారా మా జగన్‌ తడాఖా అని ఛాతీ విరుచుకున్నారో తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన పరాభవమే పునరావృతం అవుతుంది.

మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్‌ లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు కుదించింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నే రెండులక్షల 27వేల కోట్లకు పెంచి చూశారా చంద్రబాబు కంటే తాము 19శాతం బడ్జెట్‌ పెంచాము అని గొప్పలు చెప్పుకొంటోంది. ఆచరణలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. గతేడాది తెలుగుదేశం సర్కార్‌ అప్పుల ఆదాయం మినహా మిగిలిన మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు. గత ఏడాది ఆశించిన మేర రాని కారణంగానే లక్షా 55వేల 507 కోట్ల అంచనాను లక్షా 14వేల 684 కోట్లకు తగ్గించారు. అయినా రాజేంద్రనాధ్‌ వర్తమాన సంవత్సరంలో లక్షా 78వేల 697 కోట్లను చూపారు. రాకపోతే చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరే కోత పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. తెలుగుదేశం సర్కార్‌ గతేడాది 33,461 కోట్ల రూపాయలను అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టి 38,245 కోట్లకు పెంచింది. ఇప్పుడు జగన్‌ ఆ మొత్తాన్ని 47వేల కోట్లకు పెంచనున్నట్లు ప్రతిపాదించారు.

ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. బడ్జెట్‌కు ముందుగా ఆర్ధికశాఖ ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించింది. ఇదే ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రభుత్వాలు మారగానే వాటిలోని పదజాలం వ్యాఖ్యానాలు కూడా మారిపోయాయి. ఆర్ధిక శాఖ లేదా ప్రభుత్వం ప్రకటించే పత్రాలు వాస్తవ అంకెలను జనం ముందుంచి వారి విచక్షణ, వ్యాఖ్యానాలకు వదలి వేయాలి తప్ప రాజకీయ వ్యాఖ్యానాలను చొప్పించినపుడు వాటి విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. వెంటనే వాటి మీద తలెత్తే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. గత ఐదు సంవత్సరాలలో పాలన, ఆర్ధిక యాజమాన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, మానవ, భౌతిక పెట్టుబడులపై పూర్తి నిర్లక్ష్యం, దానికి అవినీతి తోడై చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టారని (జగన్‌ సర్కార్‌ ఆర్ధిక శాఖ శ్వేత పత్రం-పేరా 8) వ్యాఖ్యానించారు. సహజవనరులను ప్రయివేటు వారు లబ్దిపొందే విధంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, నీకిది నాకది అనే పద్దతుల్లో ప్రభుత్వ సంస్ధలను ప్రయివేటీకరించారని దానిలో పేర్కొన్నారు. ఈ విమర్శను తెలుగుదేశం అంగీకరించకపోవచ్చుగానీ మిగతా పార్టీలు, నిష్పాక్షికంగా చూసే వారికి ఎలాంటి అభ్యంతరమూ వుండదు. ఇక్కడ సమస్య జగన్‌ సర్కార్‌ దీన్నుంచి తీసుకున్న గుణపాఠాలు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు అనుసరించే వారి విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. సహజవనరులను ప్రయివేటు వారి దోపిడికీ వదలి వేయకుండా తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యలేమిటి? ప్రయివేటీకరణ మీద నూతన ప్రభుత్వ విధానం ఏమిటి అన్నదానికి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా సమాధానం కనపడదు.

రెవెన్యూ ఖర్చు మీద గత ప్రభుత్వానికి అదుపు లేదని, అది విపరీతంగా పెరిగిపోయిందని,సమర్దవంతంగా నిర్వహించలేదని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిర్ణయాల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లను తీసుకుంటూనే రెవెన్యూ ఖాతా ఖర్చుకు గాను ప్రభుత్వం అప్పులు చేసిందని, మూలధన పెట్టుబడి ఖాతాకు అన్నింటికీ మించి మానవ వనరుల అభివృద్ధికి నిధులను గణనీయంగా తగ్గించటంతో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార సేవలు దిగజారి పోయినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో అందుకు భిన్నమైన విధానం అనుసరించారా అని చూస్తే అలాంటిదేమీ కనపడదు. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించటం అంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని సమకూర్చితే మొత్తంగా జనానికి చౌకగా వైద్యం అందుతుంది, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ నివారణ అవుతుంది. విద్యారంగంలో ప్రయివేటు సంస్ధలు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌, లేదా ఇతర సంస్దలేవీ ప్రమాణాలను పెంచటం లేదని అనేక సర్వేలు వెల్లడించాయి.చేరే వారు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. అందువలన ప్రభుత్వం సర్కారీ బడులను అభివృద్ధి చేయకుండా అమ్మ వడి పేరుతో డబ్బు ఖర్చు చేస్తే ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్ధలకే తిరిగి ప్రయోజనం జరుగుతుంది.

చంద్రబాబు సర్కార్‌ 2017ా18లో మూలధన పెట్టుబడి ఖాతాలో మొత్తం రూ.13,490 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 28,678 కోట్లు ప్రతిపాదించి, 20,398 కోట్లకు సవరించింది. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ 32,293 కోట్లను ప్రతిపాదించింది.ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే స్వల్ప పెంపుదల తప్ప చంద్రబాబుకుాజగన్‌కు పెద్ద తేడాలేదని అంకెలు చెబుతున్నాయి. దీనిలో కీలకమైన సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్‌లో 15,915 కోట్లు కేటాయించి 13,385 కోట్లకు సవరిస్తే, ఈ మొత్తం కూడా లేకుండా జగన్‌ 11,981 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపులు పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. ఇదిలా వుంటే భారీ ఖర్చుతో తెలంగాణా గడ్డ మీద నుంచి శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించే ఎత్తి పోతల పధకాల గురించి జగన్‌ సర్కార్‌ ఆలోచన చేయటం మరింత విడ్డూరంగా వుంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. గత ఐదేండ్లలోఅది 2018ా19 నాటికి రెండులక్షల 59వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 57వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 20వేల కోట్లకు చేరింది. సర్కార్‌ అప్పుమీద వడ్డీ ఇరవైవేల కోట్లు, అసలు తీర్చేందుకు మరో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జగన్‌ సర్కార్‌ తీసుకోదలచినట్లు ప్రతిపాదించిన రుణం 47వేల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తాన్ని మూలధన పెట్టుబడులకు ఖర్చు చేసి వుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ రూపురేఖలే మారిపోయి వుండేవని, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి చెందితే రాష్ట్రం పారిశ్రామిక, సేవారంగాల ఆధారిత రాష్ట్రంగా మారిపోయి వుండేదని తద్వారా ఆదాయ పెంపు సామర్ధ్యం పెరిగి వుండేదని శ్వేత పత్రం పేర్కొన్నది. దానికి అనుగుణమైన కేటాయింపులు బడ్జెట్లో కనిపించటం లేదు.

Image result for What is new in YS Jagan first Budget

బాబస్తే జాబస్తుందని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2017-18లో పారిశ్రామిక రంగంలో మూలధన పెట్టుబడి ఖర్చు వంద కోట్ల రూపాయలు(బడ్జెట్‌ పత్రాల్లో అంకెల ప్రకారం). ఈ మొత్తాన్ని గతేడాది బడ్జెట్లో 1464 కోట్లుగా ప్రతిపాదించి 653 కోట్లకు సవరించారు. జగన్‌ సర్కార్‌ 1116 కోట్లుగా ప్రకటించింది. దీని భావమేమి తిరుమలేశా ! కడప వుక్కు కర్మాగారం గురించి ప్రస్తావన స్వల్ప నామ మాత్ర కేటాయింపు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అంటే అదొక్కటే కాదు.1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు పరిశ్రమల స్ధాపన బాధ్యతను విస్మరించాయి. ఆ తరువాత ఎక్కడైనా ఒకటీ అరాచోట రక్షణ రంగ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప ఇతరంగా ఏవీ రాలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను వదిలించుకొనేందుకు తెగనమ్మటమే విధానంగా ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ కూడా దాని కొనసాగింపుగానే వుంది తప్ప మరొకటి కాదు.ప్రతి ఏటా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వారికి రాయితీలు ఇస్తున్నారు. దాని వలన వ్యవసాయ కార్మికులకు వుపాధి పోతోంది. వారికి ప్రత్యామ్నాయం పారిశ్రామిక రంగం తప్ప మరొకటి కాదు. మానవ శ్రమ పాత్రను తగ్గించేలా పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు, కొత్త పరిశ్రమల్లో అసలు ప్రారంభం నుంచి అదే పరిస్ధితి. అందుకే అభివృద్ధి అంకెలను వెల్లడిస్తున్నా దానికి తగిన విధంగా వుపాధి పెంపొందటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దశలోకి మన దేశం రోజురోజుకూ వేగంగా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ దానికి మినహాయింపుగా వుండజాలదు. రెండవది ప్రయివేటు రంగంలోని ఐటి సంస్ధలు ఇప్పటికే కేంద్రీకృతం అయిన నగరాల్లో తప్ప మిగతా చోట్లకు రావని గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అనుభవం తెలిపింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా వున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చేతి వృత్తి దారుల ఆదాయాలు గణనీయంగా పెరగకుండా రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగదు. అది లేకుండా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి కావు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగదు. అసంఘటిత రంగ కార్మికులకు పదేండ్లు, అంతకు ముందు నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వుద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాల్సిందే, వేతన సవరణ జరగాల్సిందే. అసంఘటిత రంగ కార్మికుల, చిరుద్యోగుల సంగతేమిటి? బడ్జెట్‌ వుపన్యాసంలో అ సలు ఈ ప్రస్తావనే లేదు. జగన్‌ పర్యటనల్లో ఎవరూ వీటి గురించి అడగలేదు అనుకోవాలా ? ఈ పూర్వరంగంలో వివిధ తరగతుల ఆదాయాలను పెంచేందుకు,నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జగన్‌ సర్కార్‌ నవరత్నాల పరిధి దాటి ఆలోచించటమే కొత్తదనం అవుతుంది. ఈ బడ్జెట్‌లో అదేమీ లేదు. అసెంబ్లీ చర్చలో అయినా ఇలాంటి లోపాలను సవరిస్తారా ?