Tags

, , , ,

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !