Tags

, , ,

Image result for martin luther king jr quotes on intellectuals

ఎం కోటేశ్వరరావు

” చెడ్డవారి ద్వేష పూరితమైన మాటలు, చేతలకే కాదు, భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటించే మంచి వారి గురించి కూడా మనం ఈ తరంలో పశ్చాత్తాప పడాల్సి వుంటుంది.” మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన మాటలివి. దేశంలో నేడు పెరుగుతున్న విద్వేష ధోరణులు, వాటిని పెంచి పోషిస్తున్న వారి తీరును గురించి నోరు విప్పని వారికి ఇవి చక్కగా వర్తిసాయి.కొంత కాలం క్రితం ఆవుల సంరక్షణ పేరుతో దాడులు చేసి చంపివేస్తే, ఇప్పుడు కొంత మంది ఆకస్మికంగా ప్రత్యక్షమై మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని జై శ్రీరామ్‌ అనాలని వత్తిడి చేయటం, నిరాకరించిన వారి మీద దాడులు చేస్తున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూలన జరుగుతున్నాయి. వీటిని న్యాయ విచారణ పద్దతిని పాటించని దాడులు, హత్యలు(ఆటవిక) అంటున్నారు. అలాంటి వాటిని నిరోధించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు. దానికి ప్రతిగా ప్రతిగా 62 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాసిన వారి మీద దాడి చేస్తూ మరో లేఖ రాసి మోడీకి మద్దతు పలికారు. రాముడి పేరుతో ఆటవిక దాడులు చేసి పేరును దుర్వినియోగం చేయవద్దు అని కోరిన రాముడి భక్తుల మీద దాడి ప్రారంభించి పేరు మార్చుకోండి, భూమ్మీద వుండవద్దు అని బరితెగిస్తున్నారు.

ఈ ఏడాది మార్చినెలలో సుప్రీం కోర్టు ముందుకు ఒక పిటీషన్‌ వచ్చింది. అదేమంటే దేశంలోని ముస్లింలను పాకిస్ధాన్‌ పంపాలంటూ కోర్టు ఆదేశించాలంటూ దాన్ని దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ మరియు వినీత్‌ శరణ్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు చేపట్టింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాదిని పిటీషన్‌లోని అంశాన్ని గట్టిగా చదవమని న్యాయమూర్తి నారిమన్‌ అడిగారు. చదివిన తరువాత మీరు నిజంగా ఈ కేసును వాదించదలచుకున్నారా, తరువాత మీ మీద విమర్శలు చేయాల్సి వుంటుంది అని వ్యాఖ్యానించటంతో సదరు న్యాయవాది లేదు అని చెప్పి జారుకున్నాడు. ఆటవిక హత్యల గురించి నరేంద్రమోడీకి లేఖ రాసిన 49 మందిలో ప్రఖ్యాత దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ ఒకరు. ఆ లేఖను సహించలేని కేరళ బిజెపి నేత ఒకరు గోపాలకృష్ణన్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.చేశారు. జై శ్రీరామ్‌ నినాదాన్ని భరించలేకపోతే శ్రీహరి కోటలో పేరు నమోదు చేసుకొని చంద్రుడి మీదకో లేదా మరో గ్రహానికో పొమ్మని, పేరు మార్చుకుంటే మంచిదని నోరు పారవేసుకున్నాడు. అయితే అలాగే వెళతా చంద్రుడి మీదకు టిక్కెట్‌ ఏర్పాటు చేయండి అని మరోమారు నోరెత్తకుండా కృష్ణన్‌ సమాధానమిచ్చారు అనుకోండి.

Image result for adoor gopalakrishnan

విద్వేషం ముదిరి ముస్లింలు అయితే పాకిస్ధాన్‌ పోవాలంటున్న వారు హిందువుల వరకు వచ్చే సరికి అసలు భూమ్మీదే వుండకూడదని చెబుతున్నారు. దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి, గౌరీ లంకేష్‌లను అలాగే లేకుండా చేసిన విషయం తెలిసిందే. గోపాలకృష్ణన్‌ విషయానికి వస్తే ఆయన ప్రముఖ మళయాళీ, కేరళ వాసి కావటంతో పర్యవసానాలను గమనంలో వుంచుకొని అంతం చేస్తామని బెదిరించలేదు తప్ప ఈ దేశంలోనే కాదు, అసలు భూమ్మీదే వుండవద్దని చెప్పారు. అంతే కాదు, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం నుంచి గోపాలకృష్ణన్‌కు ఇంతవరకు ఎలాంటి సత్కారాలు జరగలేదు కనుక ఇలా మాట్లాడుతున్నారని కూడా నోరు పారవేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రతిభా పాటవాలను బట్టిగాక భావజాలాన్ని బట్టి బిజెపి గుర్తిస్తుందన్న వాస్తవాన్ని ఆ పెద్ద మనిషి దాచుకోలేకపోయాడు. ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అనటానికి తాను వ్యతిరేకం తప్ప ఎవరైనా వచ్చి తన ఇంటి ముందు ఆ నినాదం చేస్తే తాను కూడా వారితో గొంతు కలుపుతానని, తనకు ఇప్పటికే ఎన్నో ఘనమైన గౌరవాలు దక్కాయని, ఇంకా కావాలన్న ఆసక్తి లేదని కూడా గోపాల కృష్ణన్‌ చెప్పారు. తాను కూడా భక్తుడనేనని, రాముడు ఆదర్శ పురుషుడు, ఆయనను ఇలాంటి పద్దతుల్లో అవమానించకూడదని ఆయన స్పష్టం చేశారు.

తమతో విబేధించిన వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం సంఘపరివార్‌ శక్తులకు కొత్త అంశం కాదు. మధ్యలోనే రాజీనామా చేసిన రిజర్వుబ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌, ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక వారు బాధ్యతల్లో వున్నపుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో ఆశించి విమర్శిస్తున్నారంటూ దాడి చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు. జరుగుతున్న లోపాలు తెలిసి కూడా అనేక మంది నోరు విప్పటం లేదు. గుడులకు పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాక్కువ వచ్చిన కాషాయ దళాలు తమ కుతర్కంతో తమ మానాన తాము వున్న మేథావుల మీద కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను,దేశంలో జరిగే అవాంఛనీయ ధోరణులను విమర్శించే వారికి ‘ ఏదో ఆశించి లేదా ఆశించింది దక్కక ‘ అన్న ముద్రవేస్తున్నారు. నచ్చని విధానాల మీద బహిరంగంగా స్పందించే ధైర్యవంతులను కాసేపు పక్కన పెడదాం. స్పందించని వారి సంగతేమిటి? స్పందించే వారి మీద ఎదురుదాడులు పెరిగే కొద్దీ నోరు మూసుకొని వుండే వారికి మోడీ ఎంత ముట్టచెప్పారు లేదా ఏ పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారు అన్న ప్రశ్నలు ప్రారంభం అవుతాయి. ఇక నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రకటన చేసేవారికి అంతకంటే ఎక్కువే ముట్టింది కనుక బస్తీమే సవాల్‌ అంటూ మోడీ విమర్శకుల మీద తొడ కొడుతున్నారని అనుకోవాలి. ఈ దేశంలో జై శ్రీరామ్‌ అనకూడదా అంటూ కు తర్కం, విపరీతార్ధం తీసి వ్యాఖ్యానించిన తెలుగు సినీ రంగంలో వర్దమాన రచయిత అనంత శ్రీరామ్‌ 49 మంది మీద విమర్శలకు దిగాడు,మరో 62 మంది పోటీ ప్రకటన చేశారు, వారూ, శ్రీరామ్‌ మోడీకి, బిజెపికి ఎంతకు అమ్ముడు పోయారు అంటే ఎవరు జవాబు చెబుతారు.

ఏదో ఆశించి విమర్శలు చేస్తున్నారనేది ఇప్పుడు అన్ని రంగాలలో ఒక ఆయుధంగా మారిపోయింది. ఎవరూ సరైన వారు కాదు, అందరిలో లోపాలు వున్నాయనే దాడి వెనుక తమ తప్పిదాలను, దుర్మార్గాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడ దాగి వుంది. తమకు నచ్చని ఏ చిన్న సూచన, లేదా విమర్శ చేసినా సహించే స్ధితి లేదు. అందుకే 49 మంది లేఖపై అంత అసహనం. ఇంతకీ ఆ లేఖలో ఏముందో చూద్దాం.

Image result for narendra modi on lynchings

‘ జూలై 23, 2019,

శ్రీ నరేంద్ర దామోదర్‌ మోడీ,

గౌరవనీయమైన భారత ప్రధాని.

ప్రియమైన ప్రధాన మంత్రి,

శాంతిని ప్రేమించే మరియు భారతీయులంగా గర్వించే మేము ఇటీవలి కాలంలో మన ప్రియమైన దేశంలో జరుగుతున్న అనేక విషాదకర ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. అన్ని మతాలు,తెగలు,కులాలు, లింగపరంగా అందరినీ సమానులుగా పరిగణించే మన రాజ్యాంగం దేశాన్ని సమసమాజ, ప్రజాస్వామ్య సర్వసత్తాక దేశంగా వర్ణించింది. అందువలన అతడు లేదా ఆమెకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి వారూ అనుభవించేట్లు చూడాల్సి వుంది. అందుకు గాను మావినతి ఇలా వున్నది.

1. ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలను న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపటాన్ని(ఆటవిక హత్యలు) వెంటనే నిలుపుదల చేయించాలి.2016లో దళితుల మీద 840 అత్యాచారాలు జరిగినట్లు, ఆ వుదంతాలలో శిక్షలు పడుతున్న శాతం పడిపోతుండటాన్ని జాతీయ నేర నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) ద్వారా తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాము. అంతేకాదు 2009 జనవరి ఒకటి నుంచి 2018 అక్టోబరు 29 మధ్య మత సంబంధమైన గుర్తింపు ప్రాతిపదికన 254విద్వేష పూరిత నేరాలు జరిగినట్లు నమోదైంది. వాటిలో 91 మంది మరణించగా 579 మంది గాయపడ్డారు.(ఫ్యాక్ట్‌ చెకర్‌ డేటా, 2018 అక్టోబరు 30) ది సిటిజన్స్‌ రిలీజియస్‌ హేట్‌ క్రైమ్‌ వాచ్‌ నమోదు చేసిన దాని ప్రకారం 62శాతం కేసులలో ముస్లింలు (భారత జనాభాలో 14శాతం మంది), క్రైస్తవులు(దేశ జనాభాలో రెండుశాతం) 14శాతం కేసులలో బాధితులు. వీటిలో 90శాతం దాడులు జాతీయంగా మీ ప్రభుత్వం అధికారం స్వీకరించిన 2014 మే నెల తరువాత నమోదైనవి.

ఎటువంటి న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపిన వుదంతాలను ప్రధాన మంత్రిగా మీరు పార్లమెంట్‌లో విమర్శించారు, అయితే అది చాలదు. దుష్కార్యాలకు పాల్పడిన వారి మీద ఏ చర్య తీసుకున్నారు ? అటువంటి నేరాలకు పాల్పడిన వారికి బెయిలు ఇవ్వకూడదని, ఇతరులు భయపడేవిధంగా శిక్షలు వుండాలని, వేగంగా, తప్పకుండా పడాలని మేము గట్టిగా భావిస్తున్నాము.హత్యలు చేసినపుడు ఎలాంటి పెరోల్‌ లేకుండా జీవితకాల శిక్షలు వేయటానికి అవకాశం వున్నపుడు అంతకంటే క్రూరమైన ఆటవిక హత్యలకు పాల్పడుతున్నవారికి అలాంటి శిక్షలు ఎందుకు వేయకూడదు ? ఆమె లేదా అతను ఎవరూ తమ స్వంత దేశంలో భయంతో బతక కూడదు.

దురదృష్టకరంగా నేడు ‘జై శ్రీరామ్‌’ రెచ్చగొట్టే పోరు నినాదంగా మారింది. అది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తున్నది.ఆ పేరుతో ఆటవిక హత్యలు చోటు చేసుకుంటున్నాయి. మతం పేరుతో ఎక్కువగా హింసాకాండకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఇవి మధ్య యుగాలు కావు. భారత్‌లో మెజారిటీగా వున్న జనంలో అనేక మందికిి రాముడి పేరు పవిత్రమైనది. దేశంలోనే అత్యున్నత బాధ్యతల్లో వున్న మీరు రాముడి పేరును ఈ విధంగా భష్ట్రు పట్టించటాన్ని వెంటనే నిలుపుదల చేయించాలి.

2.భిన్నాభి ప్రాయం లేపోతే ప్రజాస్వామ్యమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని వ్యక్త పరచేవారిని ఆ కారణంతో దేశ వ్యతిరేకులు లేదా అర్బన్‌ నక్సల్‌ అని నిర్బంధించకూడదు. రాజ్యాంగం కల్పించిన రక్షణ ఆర్టికల్‌ 19ప్రకారం భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్చలో అసమ్మతి అంతర్భాగం.

పాలకపార్టీని విమర్శించటం అంటే దేశాన్ని విమర్శించినట్లు కాదు. అధికారంలో వున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా దేశానికి పర్యాయపదం కాదు. అది ఆ దేశంలోని రాజకీయ పార్టీలలో ఒకటి మాత్రమే. అందువలన ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని జాతీయ వ్యతిరేక మనోభావాలతో సమంగా చూడకూడదు. ఎక్కడైతే అసమ్మతిని అణచివేయని స్వేచ్చా వాతావరణం వుంటుందో అది మాత్రమే బలమైన దేశాన్ని తయారు చేస్తుంది. మన దేశ భవితవ్యత కొరకు సమంజసమైన మరియు ఆతృత కలిగిన భారతీయులంగా మేము దేనికొరకైతే సూచనలు చేశామో వాటిని ఆ స్ఫూర్తితో పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము.’

అంటూ 49 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, మణిరత్నం, అపర్ణాసేన్‌, రామచంద్ర గుహ వంటి ప్రముఖులు వున్నారు. దీనికి ప్రతిగా 62 మంది ప్రముఖులు పై లేఖ రాసిన వారి మీద ఎదురు దాడి చేస్తూ అంతకంటే పెద్ద లేఖను రాశారు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదు, నరేంద్రమోడీ దేశాన్ని ఐక్యంగా వుంచుతుంటే, విదేశాల్లో దేశపరువు తీసే విధంగా, మోడీని ప్రతినాయకుడిగా చూపుతున్నారంటూ 49 మంది లేఖలో లేని అంశాలను ఏకరువు పెట్టారు. దేశంలో ఎవరు ఏ అంశం మీద అయినా స్పందించేందుకు హక్కు వుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే 49 మంది లేఖలో ఎక్కడా ప్రధానిని కించపరచలేదు, జరుగుతున్నదాడులకు బాధ్యుడు మోడీ అని లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, సంస్ధలని ఎక్కడా ప్రస్తావించలేదు. తాము చూస్తున్న,జరుగుతున్న పరిణామాల మీద స్పందించారు. దానికి జవాబు నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని ఎవరైనా ఆశిస్తారు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం లేదా తీర్పు చెప్పాలని తనను నరేంద్రమోడీయే స్వయంగా కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. స్వయంగా తన మీద వచ్చిన అంశానికే నోరు విప్పేందుకు నరేంద్రమోడీకి ధైర్యం లేకపోయింది. మా ప్రధాని అలా అడగలేదు అనటం తప్ప ట్రంప్‌ అబద్దం చెప్పాడు అని మంత్రులు లేదా ప్రభుత్వం ప్రకటన చేసే దమ్మును 56 అంగుళాల ఛాతీ ప్రదర్శించలేకపోయింది.

నలభై తొమ్మిది మంది మన దేశానికే పరిమితమై మన ప్రధానికే లేఖ రాశారు. ఇదే పరువు తీసే అంశమైతే అంతర్జాతీయ స్ధాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మోడీ గురించి చెప్పిన అంశం మన దేశ, ప్రధాని పరువు నిలబెట్టేదని 62 మంది మేథావులు భావిస్తున్నారా? అవునంటే ట్రంప్‌ను అభినందించారా కాకపోతే ఖండిస్తూ ప్రకటన ఏమైనా చేశారా అంటే లేదు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదని ఇతరులను ప్రశ్నిస్తున్న వారు యావత్‌ దేశ ప్రతిష్టకు, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా మోడీ అడిగినట్లు చెప్పిన అంశం మీద ఎందుకు స్పందించలేదో చెబుతారా ? అంతర్జాతీయంగా మోడీ గబ్బుపట్టినా, అపహాస్యం పాలైనా ఫరవాలేదని 62 మంది అనుకుంటున్నారా ? కొన్ని ఎంపిక చేసిన అంశాల మీదనే స్పందిస్తున్నారని 62 మంది మేథావులు ప్రశ్నించారు. మీ లేఖలో మీరు ఎంపిక చేసుకున్న అంశాలు గాక ఇతర వాటిని ఎందుకు విస్మరించారో చెప్పాలి.ఈ దేశంలో 49 మందే కాదు 62 మంది కూడా అన్ని అంశాల మీద స్పందించాలని నిర్ణయించుకున్న బృందాలు కావు, అది సాధ్యం కూడా కాదు. కొందరు ప్రస్తావించిన దాని మీద చర్చ లేక స్పందనకు పరిమితం కాకుండా లేని అంశాలను ఎందుకు లేవనెత్తలేదనటం అడ్డగోలు వాదన తప్ప మేథావితనం కాదేమో ! ప్రధానికి లేఖ రాస్తే స్పందించాల్సింది ఆయన లేదా ప్రధాని కార్యాలయం, వారు చేయాల్సిన దాని మీద స్పందించే బాధ్యతను మీకు ఎవరైనా ఇచ్చారా ? లేదూ ఆ బాధ్యతను మీరు స్వచ్చందంగా పుచ్చుకుంటే మీరు ఎన్నింటి మీద, ఎప్పుడు, ఎలా స్పందించారో వివరించండి.

Image result for karl marx on intellectuals

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు కోపం అన్నట్లు 62 మంది స్పందన వుంది. దేశంలో జరుగుతున్న నేరాల గురించి జాతీయ నేరాల నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన అంశాలనే 49 మంది తమ లేఖలో వుటంకించారు. అంటే సదరు ఎన్‌సిఆర్‌బి అంతర్జాతీయంగా దేశం, మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని నమోదు చేసినట్లా ? ఆటవిక హత్యల గురించి గతంలో ఎన్నడూ ఎవరూ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయలేదు. గతంలో జరిగిన ఆటవిక హత్యలేమైనా వుంటే అవి శాంతి భద్రతల సమస్యల్లో భాగంగా జరిగాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆవు సంరక్షణ పేరుతో, జైశ్రీరామ్‌ పేరుతో మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, హత్యలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఆటవిక దాడులు, వాటిని నిరోధించేందుకు, శిక్షాపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని ఒక వాజ్యంలో సుప్రీం కోర్టు గతేడాది జూలైలో కేంద్రం, మానవహక్కుల కమిషన్‌, రాష్ట్రాలను కోరింది. ఆటవిక హత్యలను ప్రత్యేక నేరంగా పరిగణించాలని పార్లమెంట్‌ను కూడా కోరింది. ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్‌ వెల్లడించిన 45పేజీల తీర్పు మన దేశంలో నెలకొన్న పరిస్ధితికి పాలకులను తీవ్రంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. పరువు, ప్రతిష్ట గురించి పాకులాడే వారికి ఇంతకంటే పరువుతక్కువ మరొకటి వుండదు. అలాంటి తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా గడచినా స్పందన లేదేమిటని అదే కోర్టు మరోసారి ఈనెలల అడగటం అంటే మన చర్మాలు ఎంత మొద్దుబారాయో గుర్తు చేయటమే. ఎంపిక చేసుకున్న అంశాల మీద లేఖలు రాస్తున్నారని 49 మందిని విమర్శించిన 62 మంది సుప్రీం కోర్టు స్పందన గురించి ఏమంటారు. కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో వుండగా దీన్ని పట్టించుకోవటంలో దురుద్ధేశ్యం వుందని, కేంద్రాన్ని ఎండగట్టేందుకు కేసులను ఎంపిక చేసుకుందని తప్పుపడతారా ? ఆవేదన చెందిన ప్రముఖులు కోరినా, చివరకు సర్వోన్నత న్యాయస్ధానం అడిగినా స్పందించని వారి గురించి 62 మంది ఏమంటారు? అసలు 62 మంది సమస్య ఏమిటి?

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ కొద్ది రోజుల క్రితం ముంబై సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ 150 వార్షికోత్సంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి తన పాలనా కాలంలో ఆర్ధిక వ్యవస్ధను రెండింతలు చేసి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు నిర్ణయించటం అభినందనీయం అన్నారు. అయితే దేశంలో అంతా సవ్యంగా లేదు, సామాజిక రంగంలో తీవ్ర ఆందోళనకర పరిస్ధితులు వున్నాయి. తీవ్రమైన దారిద్య్రం మన సమాజాన్ని పీడిస్తోంది. అది వేగాన్ని మందగింప చేసి మనం ముందుకు పోవటానికి ఆటంకం అవుతుంది. అసహనం పెరగటం, విద్వేష పూరిత నేరాలు, తమకు తోచిన నీతి, రీతిని ఇతరుల మీద బలవంతంగా రుద్దటం వంటి అంశాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దేశంలో సామాజిక అస్ధిరత పెరుగుతోంది.మహిళల మీద నేరాలు, కుల, మత ప్రాతిపదికన హింసాకాండ వంటి ఇతర అన్ని రకాల అసహనం దేశమంతటా ప్రబలిపోయింది. సామాజిక సామరస్యతను సాధించేందుకు ఆటంకంగా మారుతున్నది. దేశంలో నిరుద్యోగం 6.1శాతం వుండటం నాలుగుదశాబ్దాల రికార్డు, దాన్ని త్వరలో పరిష్కరించాలి. నీటి సంక్షోభం వుంది, వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయి. తోటి వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే దేశంలో ఆర్యోగ సంరక్షణకు చేస్తున్న ఖర్చు అట్టడుగున వుంది. కొన్ని అంశాలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు పూనుకోవాలి అని కూడా ఆది గోద్రెజ్‌ చెప్పారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఆటవిక హత్య గురించి పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ తనకు బాధ కలిగించిందని, నిందితులకు సాధ్యమైన మేరకు కఠిన శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు.పోలీసుల ముందే జరిగిన మూకదాడి గురించి పార్లమెంటులో మాట్లాడక తప్పని స్ధితి వచ్చింది. వీటి గురించి 62 మంది మేథావులు ఏమంటారు? ఆది గోద్రెజ్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని కాలేజీ సభను ఎంపిక చేసుకొని మాట్లాడారా ?

ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయటాన్ని లేదా ఆ నినాదాలు చేస్తూ ఆటవిక చర్యలు చేపట్టటాన్ని సభ్య సమాజం తప్పుపడుతోంది. ఆ చర్యలు మన దేశ సంస్కృతి కాదు, పురాణాలు, ఇతర గ్రంధాల్లో చరిత్రలో ఎక్కడా జై శ్రీరామ్‌ పేరుతో ఆటవిక పద్దతులను పాటించటమే మన సంస్కృతి అని ఎక్కడా చెప్పలేదు. మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో, జర్మనీలో హిట్లర్‌ను పొగిడే సందర్భంలో ఇలాంటి వున్మాద పూరితమైన వ్యవహారాలు జరిగాయి తప్ప మరెక్కడా కానరాదు. మోడీకి లేఖ రాసిన 49 మంది తమవైన రాజకీయ అభిప్రాయాలు కలిగి వుండవచ్చు తప్ప వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు, రాజకీయాల్లో వున్న వారు కాదు.అలాగే మోడీకి మద్దతుగా లేఖ రాసిన వారు 62 మంది ఏ పార్టీకి చెందినవారన్నది సమస్య కాదు. ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులుగా జనం ముందుకు వచ్చారన్నదే ముఖ్యం.

Image result for intellectual's

మతోన్మాదులు, ఫాసిస్టులు, నాజీలు, ఇతర నియంతలు ఏలిన దేశాల చరిత్రను చూస్తే మేథావులు ఎప్పుడూ, ఎక్కడా ఒకే వైఖరితో లేరు. దోపిడీ పద్దతులు, విధానాలను రూపొందించిందీ, దోపిడీని నిర్మూలించే, సమసమాజాన్ని నిర్మించే పద్దతులనూ చెప్పింది కూడా మేథావులే. 1925లో ఇటలీలో ఫాసిస్టు మేథావులు సభ జరిపి తమ ప్రణాళికను ప్రకటించిన తరువాత ఫాసిస్టు వ్యతిరేక మేథావులు తమ ప్రణాళికను ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు అనేక దేశాల్లో జరిగాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి సమీకరణ జరుగుతున్నది. వాస్తవానికి దాన్ని సంఘపరివార్‌ శక్తులు వేగవంతం చేస్తున్నాయి. మేథావులుగా వున్న వారు తాము ఎటు వైపో తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వారు కల్పిస్తున్నారు. మేము అటు వామపక్షం కాదు ఇటు మితవాద పక్షం కాదు అనుకునే వారు కూడా ఏదో ఒకవైపు సమీకరణ అయ్యేందుకు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మితవాదులు వారిని మధ్యలో వుండనివ్వరు. తమను విమర్శించే వారందరూ తమకు వ్యతిరేకులే అన్నది ఇప్పుడు నడుస్తున్న ధోరణి. తమకు అనుకూలంగా లేనివారందరూ కూడా వ్యతిరేకులే అనే సూచనలు కనిపిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను మన దేశంలో ఫాసిస్టులు, నాజీలకు ప్రతిరూపాలుగా వున్న శక్తులు సహించే స్ధితిలో లేవు. మేథావులు ఎప్పుడూ రెండు తరగతులుగా వుంటారని చరిత్ర చెప్పింది. ఒక తరగతి పాలకవర్గాలకు వూడిగం చేసేందుకు తమ మేథోశక్తిని వుపయోగించి చరిత్ర చెత్తబుట్టలోకి పోతే, మరో తరగతి ప్రజల గొంతుకగా ముందుండి నిరంతరం జనం నోళ్లలో నానుతున్నారు. అందువలన మేథావులు ఎటు వైపు వుండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్న మైంది !