Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

1.గతంలో ఏం జరిగిందనేది వదిలేద్దాం !

గతంలో జరిగిందాన్ని వదిలేద్దాం, ఎందుకు వదలి వేయాలి, ఎలా వదలి వేస్తాం, సరే వాదన కోసం అంగీకరిద్దాం. ఒక్క కాశ్మీర్‌ విషయమేనా లేక భారత చరిత్ర మొత్తాన్ని వదలి వేయాలా ? మనం ఒకదారిలో కొంతదూరం ప్రయాణించాం. ఎటువైపు నుంచి వచ్చామో గుర్తులేకపోతే, మననం చేసుకోకపోతే ఎటుపోవాలో ఎలా తెలుస్తుంది. కాశ్మీర్‌ విషయంలో చారిత్రక తప్పిదం జరిగింది, దానికి నెహ్రూ అసలు కారకుడని బిజెపి, సంఘపరివార్‌ లేదా వారి మద్దతుదారులు, వారు రాసిందాన్ని గుడ్డిగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నవారంతా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారానికి ఆధారం ఏమిటి? గత చరిత్రే కదా. వారు దాన్ని విస్మరించనపుడు మిగతా వారెందుకు వదిలివేయాలి. తమకు ఒక ప్రమాణం, ఇతరులకు మరొకటా ? చరిత్రను, వాస్తవాలను వక్రీకరించే కదా ఇంతవరకు తెచ్చింది. అందువలన చరిత్రలోకి పోవద్దు అనటం అంటే వారి బండారం బయటపడుతుందనే భయమే కారణమా ?

2.వారి బండారం, చరిత్ర అంటున్నారు, అసలు వారెవరు ?

బ్రిటీష్‌ ఇండియాలో అఖిల భారత హిందూ మహాసభను ఏర్పాటు చేస్తే జమ్మూలోని డోగ్రా హిందువులను సమీకరించేందుకు ఆల్‌ జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే జమ్మూలో 1939లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ ఏర్పడింది. తరువాత దాన్ని మరింత విస్తరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ను తొలుత జమ్మూకు, తరువాత కాశ్మీర్‌ లోయకు పంపారు. సదరు హిందూ సభ నేత ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌చాలక్‌ ప్రేమనాధ్‌ డోగ్రా. దేశ విభజన నిర్ణయం జరిగిన తరువాత 1947 మే నెలలో కాశ్మీర్‌ సంస్ధాన భవిష్యత్‌ గురించి రాజు హరి సింగ్‌ ఏ వైఖరి తీసుకుంటే అదే తమ వైఖరి అని హిందూ సభ చెప్పింది. అపర దేశభక్తి అంటే ఇదేనా ? రాజు స్వతంత్ర దేశంగా వుంటామని ప్రకటించాడు. అయితే అదే ఏడాది అక్టోబరులో పాకిస్ధాన్‌ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు పూనుకుంటే రాజు భారత రక్షణ కోరాడు. రాజుగారితో పాటు దేశభక్తులూ మారారు. తరువాత హిందూ సభను ప్రజాపరిషత్‌ పార్టీగా మార్చారు. దీని లక్ష్యం ఏమిటయ్యా అంటే కాశ్మీర్‌ను దేశంతో పూర్తిగా విలీనం గావించటం, కమ్యూనిస్టుల ఆధిపత్యం వున్న డోగ్రా వ్యతిరేక షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం అని బలరాజ్‌ మధోక్‌ ప్రకటించాడు. మరి ఈ చరిత్రను కూడా మరచి పోవాలా ?

2. ఆర్టికల్‌ 370,35ఏ రద్దు దేశానికే మంచిది? అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జరగలేదు. ఈ చర్యతో దేశంలో పూర్తి విలీనం జరిగింది.

సదరు ఆర్టికల్స్‌ కాశ్మీర్‌కే పరిమితం, వాటి రద్దు వలన దేశానికి లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే మంచేమిటి ? ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు రద్దయితే మొత్తం దేశానికి వచ్చేదేమిటి? పూర్తి విలీనం జరగకపోతే గత ఏడు దశాబ్దాలుగా అక్కడ ఏడులక్షల మంది సైనికులు, ఇతర భద్రతా బలగాలు ఎందుకు, ఎలా వున్నట్లు ? ఇప్పుడు పూర్తి విలీనం అయింది కనుక వారంతా వెనక్కు వస్తారా ? జమ్మూకాశ్మీర్‌లో చేసిన ఖర్చు మొత్తం ఆ రాష్ట్ర ప్రజలకు చేసినట్లు ఎలా అవుతుంది. మిలిటరీ, సిఆర్‌పిఎఫ్‌, సరిహద్దు రక్షణ ఖర్చును కూడా కాశ్మీరీల ఖాతాలో వేస్తారా ? అదే అయితే చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కూడా సరిహద్దులు, వాటి రక్షణకు సైనిక బలగాలు వున్నాయి, ఆ ఖర్చు మొత్తాన్ని ఆయా పరిసర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఇచ్చిన నిధులుగా పరిగణిస్తారా ?

3. ఇప్పుడు ఆర్టికల్స్‌ రద్దువద్దని చెప్పే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారు వుగ్రవాదుల దాడుల సమయంలో కాశ్మీర్‌ పండిట్లను తరిమివేసినపుడు ఎ్కడ వున్నారు ?

కాశ్మీరీ పండిట్లపై కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, పాక్‌ మద్దతువున్న మతశక్తులు జరిపిన దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వేర్పాటు, వుగ్రవాద సంస్ధలు తప్ప కమ్యూనిస్టులతో సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సమర్ధించలేదు. ఖండించాయి. పండిట్ల పేరుతో గుండెలు బాదుకుంటున్న బిజెపి ఇతర పార్టీలు అంతకు మించి అదనంగా చేసింది ఏమిటి?

4.పాకిస్తానీ యువకులు కాశ్మీర్‌కు వచ్చి అక్కడి యువతులను వివాహం చేసుకొని పౌరసత్వం పొందుతున్నారు.!

గత ఐదు సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది, మధ్యలో పిడిపితో కలసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ కాలంలో ఎంత మంది పాక్‌ యువకులు వచ్చి కాశ్మీరీ యువతులను వివాహం చేసుకొని భారత పౌరసత్వం పొందారో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి వారు లెక్కలు చెప్పగలరా ? పాకిస్ధాన్‌ నుంచి ఎవరైనా భారత్‌కు రావాలంటే వీసా వుండాలి. లేదా దొంగచాటుగా రావాలి. కేంద్రప్రభుత్వం ఎందరికి వీసా ఇచ్చింది? లేదా దొంగచాటుగా వచ్చే వారిని కేంద్ర ఆధీనంలోని సరహద్దు భద్రతా దళాలు లేదా ఇతర భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ? భద్రతా సిబ్బంది గానీ, లవ్‌ జీహాద్‌ను వ్యతిరేకిస్తున్నామని తిరిగే హిందూత్వ సంస్ధలవారు గాని ఎంత మంది దొంగ పెళ్లికొడుకులను పట్టుకున్నారో చెబుతారా ?

5.కాశ్మీర్‌ హిందువులు, సిక్కులు మైనారిటీలు,దళితులు, గిరిజనులు, బిసిల వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు !

మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీర్‌లో రిజర్వేషన్లు లేవన్నది పచ్చి అబద్దం. దేశంలో అన్ని చోట్లా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వుంటే ఎక్కడా లేని విధంగా కాశ్మీరులో వెనుకబడిన ప్రాంతాల వారికి రిజర్వేషన్లు వున్నాయి.2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి.

6. పాకిస్ధాన్‌ నుంచి వలస వచ్చిన వారికి కాశ్మీర్‌లో పునరావాసం కల్పించే అవకాశం లేదు !

పాకిస్ధాన్‌ లేదా మరొక దేశం ఎక్కడి నుంచి వలస వచ్చినా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వారికి ఎక్కడైనా పునరావాసం కల్పించవచ్చు. కాశ్మీర్‌లోనే అని ఎందుకు పట్టుబడుతున్నారు? గతంలో పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా , శ్రీలంక, టిబెట్‌ నుంచి వచ్చిన వారికి దేశంలో అనేక ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. తెలుగు ప్రాంతాల్లో బర్మా కాలనీల పేరుతో అనేకం వున్నాయి. ఏదో ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయలేదు. ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనటం వెనుక వున్న వుద్ధేశ్యాలేమిటి ?

7. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలిగించినందువలన ప్రయోజనం లేదని తేలిపోయింది !

ఈ అంశంపై బిజెపికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరింది తామే అని ప్రచారం చేసుకున్న అంశం, 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ వాగ్దానాన్ని మరచిపోయారా ? పార్లమెంట్‌లో కాశ్మీర్‌ హోదా రద్దుకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, వైసిపి పార్టీలు 70ఏండ్లుగా కాశ్మీర్‌కు ప్రయోజనం లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఎందుకు అడుగుతున్నట్లు ? ఏమిటీ రెండు నాలుకల వైఖరి ?

8. కాశ్మీర్‌పై ఇంతకంటే ఏమి చర్చించాలి?

అదే ప్రాతిపదిక అయితే రేపు మరొక అంశానికి ఈ మాత్రం కూడా చర్చించాల్సిన పనేమిటి, ఎలాగూ వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు కనుక మేము చేయదలచుకున్నది చేశాం, పార్లమెంట్‌,అసెంబ్లీల్లో మాకు మెజారిటీ వుంది కనుక ఆమోదించుకుంటాం అంటే ఏం చేస్తారు ? ప్రజాస్వామ్యం అంటే ఇదా ? ఒక బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టాలంటే ముందుగా సభానిర్వహణ సలహా కమిటీకి తెలియచేయాలి, సభ్యులకు ముసాయిదా బిల్లులను ముందుగా అందచేయాలి. కాశ్మీర్‌ విషయంలో అదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంట్‌ తలుపులు మూసి చేశారు మేము, తెరిచే చేశాము అంటున్నారు. అప్పుడు తలుపులు మూసినపుడు ఆ చీకట్లోనే బిజెపి, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ కలిసే కదా చేసింది. నాడు చేయని విమర్శ బిజెపి ఇప్పుడెందుకు చేస్తున్నట్లు ? ఏ ఒక్క రాష్ట్ర విభజన సమయంలో అయినా ఆ రాష్ట్రాల్లో కాశ్మీరులో మాదిరి 144సెక్షన్లు, కర్ఫ్యూలు, పోన్లు, ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టలేదు, వ్యతిరేకించినా, అనుకూలించినా అసెంబ్లీల్లో చర్చకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎందుకు జరపలేదు. అసెంబ్లీ లేని సమయంలో బిల్లులు పెట్టాల్సిన తొందరేమొచ్చింది?

9. పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత వ్యతిరేకించటం ఏమిటి ?

పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన ప్రజలకు, పార్టీలకు వ్యతిరేకించే హక్కులేదా ? ప్రపంచంలో ప్రతి నియంత అన్నింటినీ చట్టబద్దంగానే చేశారు. వాటిని ప్రజలెందుకు వ్యతిరేకించినట్లు ? 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితికి అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు కారణాలుగా చూపారు. పార్లమెంట్‌లో పూర్తి ఆమోదం పొందారు. దాన్ని బిజెపి పూర్వరూపం జనసంఘం ఆమోదించిందా వ్యతిరేకించిందా, ఇంకా అనేక పార్టీలు ఎందుకు వ్యతిరేకించినట్లు ? జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ కూడా అంతా పార్లమెంట్‌ ఆమోదం పేరుతోనే ప్రపంచాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నాడు. మరి హిట్లర్‌ను ఎందుకు వ్యతిరేకించినట్లు ?

10. రిజర్వేషన్లు కూడా ఆయా తరగతుల వారిని వుద్దరించింది లేదు !

కాశ్మీర్‌ విషయంలో 370 చేకూర్చిన ప్రయోజనం లేదని వాదిస్తున్న వారిలో అనేక మంది విద్యా, వుద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఆయా తరగతులను వుద్దరించలేదు, గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నిషేధ చట్టాల వలన గిరిజనులు కూడా అభివృద్ధి చెందలేదు, అక్కడ పరిశ్రమలు రావటం లేదు కనుక ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజమే కదా అని వాటిని కూడా రద్దు చేస్తే పరిస్ధితి ఏమిటి ?

వక్రీకరణలు – వాస్తవాలు !

పాకిస్తానీయులు కాశ్మీర్‌ వచ్చి అక్కడి యువతిని వివాహం చేసుకొని స్ధానికులుగా మారి వుగ్రవాదానికి పాల్పడుతున్నారు- ఒక ప్రచారం.

పాకిస్ధానీ యువకులే కాదు, ఏ విదేశీయువకులైనా కాశ్మీరీ యువతినే కాదు, ఇష్టమైతే ఏ రాష్ట్ర యువతిని అయినా వివాహం చేసుకోవచ్చు. భారతీయ పౌరసత్వం తీసుకోవచ్చు. చట్టంలో అటువంటి అవకాశం వుంది. వుగ్రవాదానికి పాల్పడుతున్నారంటారా? వారే కాదు, మన గడ్డమీద పుట్టి పెరిగిన వారు అయినా వుగ్రవాదానికి పాల్పడితే చర్యలు తీసుకోవటానికి కూడా చట్టాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల యువతీ యువకులు అనేక మంది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎందరో వెళుతున్నారు. వారు అక్కడి యువతీ, యువకులను వివాహాలు చేసుకొని పౌరసత్వం పొందుతున్నారా లేదా ? ఏ విదేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్టు, వీసాలు కావాలి.మనం విదేశాలకు వెళుతున్నట్లే పాకిస్ధాన్‌ లేదా మరొక దేశ వాసులు ఎవరైనా అలాంటి చట్టబద్ద పద్దతుల్లో మన దేశం రావటానికీ అవకాశం వుంది.

పాకిస్ధాన్‌ గురించి ముస్లింల గురించీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలూ వారిని అనుసరించే వ్యక్తులూ నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రచారాలను చేస్తున్నారు. వాటిని అనేక మంది నమ్ముతున్నారు. ఆ తప్పుడు ప్రచారం చేసే వారూ వాటిని గుడ్డిగా నమ్ముతున్నవారికి ఒక చేదు నిజం చెప్పకతప్పదు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ చివరి మూడు సంవత్సరాల్లో విదేశీయులకు మంజూరు చేసిన పౌరసత్వం కంటే నరేంద్రమోడీ మొదటి మూడు సంవత్సరాల్లో మంజూరు చేసిన వారి సంఖ్య రెట్టింపుకు పైగా వుంది. రెండు ప్రభుత్వాల ఆరు సంవత్సరాల కాలంలో 5,477 మందికి భారతీయ పౌరసత్వం ఇస్తే మోడీ గారు వచ్చిన తరువాత 3,800 మందికి ఇచ్చారు. మొత్తం ఆరు సంవత్సరాల కాలంలో 2,157 మంది పాకిస్ధానీయులు,1,461 మంది ఏ దేశానికీ చెందని వారు,918 మంది ఆఫ్ఘన్స్‌, 218 బంగ్లా, 145 బ్రిటన్‌, 108 శ్రీలంక, 66 ఇరాన్‌, 61 మంది అమెరికా నుంచి వచ్చిన వారితో సహా మొత్తం 56దేశాల నుంచి వచ్చిన వారు పౌరసత్వం పొందారు. రామన్‌ శర్మ అనే జమ్మూ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు దరఖాస్తుదారుకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ 2017లో ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలున్నట్లు 2017 మార్చి 31న ట్రిబ్యూన్‌ పత్రిక ప్రచురించింది. ‘ 2014 నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 3,801, ఇదే అంతకు ముందు ప్రభుత్వ(కాంగ్రెస్‌ సర్కార్‌) హయాంలో 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 1,676 ‘ అని సమాధానంలో వున్నట్లు ట్రిబ్యూన్‌ రాసింది.

సంవత్సరాల వారీ చూస్తే 2016లో గరిష్టంగా 660 మంది పాకిస్ధానీయులకు పౌరసత్వం ఇచ్చారు.అంతకు ముందు 2014,2015లో 267,263 చొప్పున ఇచ్చారు. మొత్తం 918 మంది ఆఫ్ఘన్‌ జాతీయులకు పౌరసత్వం ఇస్తే 204ా16 మధ్య ఇచ్చిన వారే 700 మంది వున్నారు. పాకిస్తానీయులకు మోడీ సర్కార్‌ పౌరసత్వం ఇచ్చిందంటే దాని అర్ధం వుగ్రవాదులకు ఇచ్చినట్లా ?

మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కానట్లయితే, ఎవరైనా విదేశీయులు భారత పౌరులను వివాహం చేసుకుంటే చట్టబద్దంగా మన దేశంలో ఏడు సంవత్సరాలు నివశించిన తరువాత వారు స్ధానిక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే వారికి మంజూరు చేస్తారు. మన పౌరులు విదేశీయులను వివాహం చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. ఇందాద్‌ షామిల్‌ అనే కేరళ అబ్బాయి, మరయం యూసఫ్‌ అనే పాకిస్ధాన్‌ అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం లాహోర్‌లోనూ, పాలక్కాడ్‌లోనూ వివాహం, వివాహం, విందులు ఇచ్చి ఒక్కటయ్యారు. 2008లో మరయం కేరళకు వచ్చింది. వారికి ఇద్దరు పిల్లులు, ఏడు సంవత్సరాల భారత నివాస నిబంధన పూర్తి అయిన తరువాత 2017లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది జనవరిలో మంజూరైనట్లు మళయాళ మనోరమ పత్రిక తెలిపింది.

ఇలా పాకిస్ధానీయులు కాశ్మీర్‌ యువతులను లేదా భారతీయులు పాక్‌ యువతులనే కాదు, ఏ ప్రాంతం, రాష్ట్రం, మతం, కులం వారైనా ఏదేశం వారినైనా వివాహాలు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఎందరికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసిందో, వారిలో ఎందరు వుగ్రవాదులుగా మారారో, ఎంత మందిని పట్టుకున్నారో తెలుపుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచార పూర్వరంగంలో అధికారయుతంగా ప్రకటించి వక్రీకరణలకు తెరదించాల్సిన అవసరం వుందా లేదా ?

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు మూసుకున్నాను

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారు ఎవరూ మిగల్లేదు

ఇది హిట్లర్‌ నాజీ మూకల గురించి జైల్లో ఒక మతాధికారి రాసిన ప్రఖ్యాత కవిత. కాశ్మీరీల ప్రత్యేక హక్కుల మీద జరిగిన దాడిని వ్యతిరేకించకపోతే రేపు తమదాకా వస్తే ఏమిటో ప్రతివారూ ఆలోచించాలా వద్దా ? అది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోనల్‌ వ్యవస్ధ కావచ్చు,లోకల్‌, నాన్‌ లోకల్‌ కావచ్చు. వుద్యోగుల వేతన సంఘాలు కావచ్చు, కార్మిక చట్టాలు, ఇతర సంక్షేమ చట్టాలు ఏవైనా దాడికి, రద్దుకు గురి అయితే ఏమిటి ?