Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.