ఎం కోటేశ్వరరావు
చైనాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు నెలల మాంద్యం మూల్యం చెల్లించటానికి తాను అంగీకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు చెప్పారు. చైనా పట్ల దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి స్వల్పకాలంలో బాధ పెట్టినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని, రెండు నెలల పాటు మాంద్యాన్ని అమెరికా ఎదుర్కోగలదని అన్నారు. మాంద్యమనే భావన అసంగతం, చైనా మీద చర్య తప్పని సరి, స్వల్పకాలంపాటు మాంద్య మంచిదా కాదా అన్నది సమయాన్ని బట్టి వుంటుంది, మీరు మాంద్యం గురించి చెబుతున్నారు, మనం రెండు నెలల పాటు మాంద్యానికి గురవుతాం, ఎవరో ఒకరు చైనా మీద చర్య తీసుకోవాలి కదా అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. మాంద్యానికి అమెరికా చాలా దూరంగా వుంది, ఫెడరల్ రిజర్వు ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా అన్నారు. తరువాత అధ్యక్ష ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా మాంద్యం వైపు వెళుతోందనటాన్ని అధ్యక్షుడు విశ్వసించటం లేదని, ఆయన విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంటో పటిష్టంగా వుందని అన్నారు.
అమెరికా – చైనా వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన అనిశ్చితి కారణంగా 2021నాటికి 97లక్షల కోట్ల ప్రపంచ జిడిపి 585 బిలియన్ డాలర్ల మేరకు 0.6శాతం నష్టపోనుందని, ప్రపంచ జిడిపి బ్లూమ్‌బెర్గ్ ఆర్ధిక నివేదిక పేర్కొన్నది. ఈ పూర్వరంగంలోనే ప్రపంచ వత్తిడి లేదా పర్యవసానాలకు తమనే బాధ్యులుగా చేస్తారనే భయం, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే అనే ఆలోచన తో గానీ చైనాతో వాణిజ్య పోరును ట్రంప్ కొంత కాలం పాటు వాయిదా వేశారు. బ్రిటన్, జర్మనీ, రష్యా,సింగపూర్, బ్రెజిల్‌తో సహా తొమ్మిది దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యపు అంచున లేదా మాంద్యంలోకి జారినట్లు భావిస్తున్నారు. తదుపురి వంతు 2021లో అమెరికాదే అని ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు.
ఈ నేపధ్యంలో సెప్టెంబరు ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికలను సాకుగా చూపి డిసెంబరు 15 నాటికి డోనాల్డ్ ట్రంప్ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోట్లాది మంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్‌మార్ట్ తదితర దుకాణాల సంస్ధలు స్పష్టం చేశాయి. మరోవైపున చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్నుల పెంపుదల క్రిస్మన్ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కనుక వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్ రెచ్చగొట్టుడును మానుకోలేదు. హాంకాంగ్ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.
వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్ చెప్పాడు. అయితే చైనాను వూబిలో దించబోయి ట్రంపే తన వూబిలో తానే పడ్డట్లు అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్దంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్‌ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెయ్, దాని అనుబంధంగా వున్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90 రోజుల పాటు నవంబరు 19 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రోస్ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెయ్ కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెయ్ కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జి) నెట్‌వర్క్ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే వున్నాయి. ఫిన్లండ్‌కు చెందిన నోకియా 43, స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ 22 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెయ్ పోటీదారు జడ్‌టియి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది.
మూడు వందల బిలియన్ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్ తరువాత ఆ మొత్తాన్ని 160 బిలియన్లకు తగ్గించి సెప్టెంబరు ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబరు 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు.అయితే అమెరికా రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని రాయిటర్స్ ఒక వార్తను ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేక మంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి వుత్పత్తుల మీద పన్నుల విధించిన కారణంగా అక్కడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా వుత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అమెరికా స్టాక్‌మార్కెట్ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్ధిక వ్యవస్ధతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్ విలువను తగ్గించుకొనేందుకు సిద్ధంగా వుందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్లయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు వుండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.
అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు , మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది.2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్దానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్ నుంచి బోయింగ్ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్ధిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్‌ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్‌లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్‌బస్‌ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్ వినటం లేదు.
హాంకాంగ్‌లో నిరసన తెలుపుతున్న వారి మీద తియన్మెన్ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్‌లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్దం మీద ప్రభావం చూపుతాయని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు.ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.
ఇలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్దంగా వుందని తాను సిద్దంగా లేనని, ముందు హాంకాంగ్ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్య భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్ హౌస్ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారం నాడు అమెరికా స్టాక్ మార్కెట్ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ ఛానల్‌లో పేర్కొన్నాడు.
విదేశాంగ విధానం అంటే న్యూయార్క్ రియలెస్టేట్‌లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్లుగా వుంది, రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వుండవని తెలుసుకోవాలని ట్రంప్‌కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్‌ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు.చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణ పత్రాలు(బాండ్లు)న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్ధితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) వుంది, అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా వుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. ఇప్పటికే వాణిజ్య యుద్దం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గర అవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్చా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్ ఇప్పుడు బీజింగ్‌వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్చా వాణిజ్యం గురించి వుదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం ఇప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్ధితికి లోనైందో వెల్లడిస్తున్నది.
Good article with present situation in capitalist market.
LikeLike