Tags

, , , , ,

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు