Tags
Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan
ఎం కోటేశ్వరరావు
మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.
తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.
గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.
అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్ కమిషన్ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?
అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.
అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్ సర్కార్ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.
రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్ రాజధానిగా డెహ్రాడూన్ వుంది. గుజరాత్లో పెద్ద నగరం అహమ్మదాబాద్ వున్నప్పటికీ గాంధీనగర్ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.
చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్, షాపింగ్ మాల్స్ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్ ప్రదేశ్, వుత్తరాఖండ్ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్ కల్యాణ్ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్ కల్యాణ్ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?
రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్మోహన్ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.