Tags

, , , ,

Image result for not his manki baat-modi duping and diversionary tactics

మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు అక్షింతలు కూడా అందుకో ! గత ఐదు సంవత్సరాలుగా దేశభక్తి, జాతీయవాదాన్ని జనం చేత తినిపించి, తాగించి, పీల్పించారు. అదేదో సినిమాలో డివైన్‌ అంటే వైన్‌ ఎంత తాగితే అంత జ్ఞానం వస్తుంది అని చెప్పినట్లుగా వాటికి అర్ధం తెలియకుండానే, తప్పుడు లేదా అనర్ధక అర్ధాలను వ్యాపింప చేసిన వారి స్వరూపం తెలియకనే చాలా మంది వాటిని పాటించారు, పాటిస్తున్నారు.

మన ఘనత వహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధిక విషయాల్లో ఆయన పరిజ్ఞానం గురించి మీ వంటి వారంతా ఇప్పటికీ నమ్ముతూ ఆహా, ఓహో అంటూ హారతులు పడుతూనే వున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు తరువాత చూడండి అంటే నిజమే కామోసు అనుకున్నారు, నాలాంటి వారు ఎవరైనా కాదంటే ఖండించి మీద పడి కొట్టినంత పని చేశారు. మూడేండ్లు కావస్తోంది, ఆ ఛాయలు లేవు, మోడీ మాటల్లో ఆ వూసుల్లేవు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే అది మా మోడీ ప్రత్యేకం మోడినోమిక్స్‌ అన్నారు. ఇప్పుడు దేశం మాంద్యంలోకి పోతోంది అంటే అది ప్రపంచ పరిణామాల్లో భాగం అని పన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీవి నోళ్లా , మరింకేమైనానా ! మోడీ-షా ద్వయం తెలివితేటలు ఏ మయ్యాయి. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే వారికి డామిట్‌ కధ అడ్డం తిరిగింది అని గిరీశాన్ని తలచుకోవాల్సిన రోజులు దగ్గరలోనే వున్నాయి.

సందర్భం ఏమంటే మిత్రమా గతనెల మన్‌కీ బాత్‌ విన్న తరువాత అవధానం గుర్తుకు వచ్చింది. అష్టావధాని గారికి ఎనిమిది మంది ప్రచ్చకులు సమస్యలను, ప్రశ్నలను సంధిస్తారు. అలాంటి వారిలో ఒకరు అసందర్భ ప్రలాపి వుంటారు. అంటే అవధాని దృష్టిని మళ్లించినా గాడి తప్పకుండా తన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి వుద్దేశించింది. దేశమంతటా దిగజారుతున్న ఆర్ధిక స్ధితి గురించి పృచ్ఛకులు అంటే ప్రాశ్నికులు లేదా ప్రశ్నించేవారు సంధిస్తున్న ప్రశ్నలకు అవధాని స్ధానంలో వుండి సమాధానం చెప్పాల్సిన నరేంద్రమోడీ తానే ఒక పృచ్ఛకుడిగా మారి అదీ అసందర్బ Ûప్రలాపి పాత్ర తీసుకున్నారని నేనంటే నీకు, నీ బృందానికి చెప్పుకోలేని చోట మండటం సహజం.

మన్‌కీ బాత్‌ కంటే ముందు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి మోడీగారు సెలవిచ్చారు. ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి ఎందరో ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటో వాటి ఫలితాలేమిటో చెప్పి సుభాషితాలను కొనసాగించి వుంటే విశ్వసనీయత వుండేది. ఇలా వ్యాఖ్యానించిన వారు మీ దృష్టిలో దేశద్రోహులు అవుతారని తెలుసు. రాబోయే రోజుల్లో ఇలాంటి దేశద్రోహులు మరింతగా పెరిగే విధంగా మోడీగారి తీరు తెన్నులు వున్నందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే వుంటారు అని కమ్యూనిస్టు అగ్రనేత లెనిన్‌ మహాశయుడు చెప్పారు. కొందరిని కొంత కాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరని మన పెద్దలు చెప్పారు. రెండింటి అర్ధం ఒకటే. ఐదేండ్ల క్రితం మోడీ చెప్పిందేమిటి, దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, మోడీ నోట వెలువడుతున్న మాటలేమిటి ? ఒకదానికికొకటికి పొంతన వుందా ? ఏ ఒక్క సమస్యపై అయినా సమగ్రంగా పని చేశారా? ఫలితాలు సాధించారా ?

మిత్రమా నా లాంటి వారు చెబితే కుహనా మేథావులు, విదేశీ తొత్తులు, తప్పుదారి పట్టించేందుకు ఇస్తున్న తప్పుడు సలహాలు అని పక్కన పెట్టేస్తారు. మీ మోడీగారికి ప్రసంగాలు, అంశాలను రాసిచ్చే వారు మోడీని విమర్శించే వారికి అవసరమైన సమాచారాన్ని సరఫరా చేస్తున్నారని మీరైనా చెప్పండి. గొడ్డు మాంసం ద్వారా గో సంతతికి ముప్పు తెస్తున్నారని మోడీ అండ్‌కో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆవు మనోభావాలను రెచ్చగొట్టిన విషయం గుర్తుందా ? అదే మోడీ గారి చేత గో హంతకులంటే ప్లాస్టిక్‌ వల్లనే ఆవులకు ముప్పు ఎక్కువగా వుందని,చనిపోతున్నాయని చెప్పించిన దానిని యాది చేసుకోండి.2015 సెప్టెంబరు 28 గో రక్షకుల ముసుగులో మహమ్మద్‌ అఖ్లక్‌ను దాద్రి గ్రామంలో హత్య చేసిన పదకొండు నెలలకు మోడీగారు నోరు తెరిచారు. ఆ దురంతాన్ని ఖండించేందుకు కాదు సుమా !

పంజాబ్‌, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ‘ కొందరు జనాలు గో రక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది రాత్రిపూట సంఘవ్యతిరేక పనులు చేస్తారు, పగలు గోరక్షకులుగా వ్యవహరిస్తారు. ఇలాంటి చెడ్డ పనులు చేసిన వారిలో 70 నుంచి 80శాతం మంది చర్యలను సమాజం అంగీకరించలేదు, వారి చెడు కార్యకలాపాలను కప్పి పుచ్చుకొనేందుకు గోరక్షకుల ముసుగు వేసుకున్నారు ‘ అని చెప్పిన ప్రధాని పార్టీ వారు ఆ పేరుతో నేరాలకు పాల్పడిన వారిని బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎందరిని శిక్షించారు. మోడీ అంతటితో ఆగలేదు గోహంతకుల చేతుల్లో కంటే ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్న ఆవులే ఎక్కువ అని కూడా చెప్పారు. జనం సంగతి వదలి పెట్టండి వుద్యోగం సద్యోగం, ఆదాయం లేకపోయినా మోడీగారి పుణ్యమా అని దేశభక్తి, జాతీయవాదంతో ప్రాణాలు నిలుపు కుంటున్నారు. గోవులకు అంత బుర్రలేదు కనుక కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా తీసుకున్న చర్యలు ఏమిటో సెలవిస్తారా మిత్రమా ? గోరక్షకులు లేదా వారి వెనుక వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెనుక తిరుగుతూ కాపాడుతున్న సేవా దృశ్యాలు మనకు ఎక్కడా కానరావు.

ఆవులు తిన కుండా వుండేందుకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలంటూ కరుణా సొసైటీ సుప్రీం కోర్టులో 2012లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.2016లో దాని మీద తీర్పు చెబుతూ నిషేధం గురించి పరిశీలించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇంతవరకు మోడీ సర్కార్‌ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ నిషేధం గురించి కబుర్లు చెబుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవుల రక్షణకు చట్టాలను చేశారు గానీ మోడీ చెప్పినట్లు వాటి మరణాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్‌ గురించి ఎలాంటి చర్యలూ లేవు. గతంలో స్కైలాబ్‌ కూలిపోతోందనే వార్తలతో జనం రాత్రింబవళ్లు అదేదో తమ మీదే పడనుందన్నట్లు భయపడ్డారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ ముప్పు గురించి కొత్తగా వెలువడిన ఆకస్మిక సమాచారమూ లేదు, కొత్తగా ఆందోళన పడాల్సిందీ లేదు. మరొక సమస్యదీ లేనట్లు మోడీ గారు దాని గురించి చెబుతుంటే ఆయన గారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. రిజర్వుబ్యాంకు నిధులను ఖాళీ చేసి దాన్ని దివాలా తీయించటానికి రంగం సిద్ధం చేశారన్న విమర్శలూ పట్టవు, ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతోందన్న ఆందోళనా లేదు. రోమ్‌ తగులబడుతోంటే పట్టించుకోకుండా ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ప్లాస్టిక్‌, ఫిట్‌ నెస్‌ గురించి కబుర్లు చెప్పటం ఏమిటి ?

మిత్రమా నీకు ఒక ప్రశ్న వేయక తప్పదు. ప్లాస్టిక్‌ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే వినాయకవిగ్రహాలు, వాటిని నీటి వనరుల్లో కలిపి కలుషితం చేస్తున్న తీరు గురించి ఎందుకు నోరు విప్పరు. మీరే చెప్పినట్లు మెజారిటీ రాష్ట్రాల్లో మెజారిటీ జనం మీ వెనుకే వున్నారు, అంటే మెజారిటీ కాలుష్య వినాయక విగ్రహాలకు కూడా మీరే బాధ్యులు. మరి దాని గురించి ఎందుకు చెప్పరు? వినాయకుడి పేరుతో వసూలు చేసే వారి వుపాధి, ఆదాయాలు పోతాయనా, మీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందనా? కాలుష్యం, పర్యావరణ రక్షణ అంటే సమగ్ర చర్యలు తీసుకోవాలి తప్ప ప్లాస్టిక్‌ వరకే పరిమితం కాకూడదు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ది పర్యావరణ పట్ల శ్రద్ద వుంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన వినాయక బొమ్మలు పెట్టిన పందిళ్లను సందర్శించటం మానుకోవాలి, నిమజ్జనాలకు దూరంగా వుండాలి.లేకపోతే మోడీ ప్లాస్టిక్‌ మీద చెప్పిన సుద్దులను తుంగలో తొక్కినట్లే అనుకోవాల్సి వస్తుంది.

మోడీగారి మన్‌కీ బాత్‌లో మరొక అంశం ఫిట్‌ ఇండియా ! మిత్రమా కాలేజీ రోజుల్లో నువ్వెంత కష్టపడినా బక్కపీచుగానే వుండిపోయావు గుర్తుందా ? మోడీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మీరిచ్చిన ప్రోత్సాహంతో ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావు గారు కోడి గుడ్లు తినేవారి దగ్గరకు దేవతలు రారని వేదాల్లో వుంది అంటారు. మీరేమో ప్రొటీన్లు అధికంగా వుండి చౌకగా లభించే బీఫ్‌ను ఎవరైనా తింటే ఆవు మాంసం తింటున్నారంటూ దాడులు చేస్తారు, బీఫ్‌ నిషేధించాలంటారు. మరోవైపు ఫిట్‌గా వుండాలంటారు, ఇదెక్కడి విపరీతం ! దేశంలో 2022 నాటికి మన పిల్లల్లో 31.4శాతం మంది గిడసబారి పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్ధితిలో కడుపునిండా తిండి లేని వారికి ఫిట్‌నెస్‌ గురించి మోడీ గారు పాఠాలు చెబుతున్నారు. ఇంతకు ముందు యోగా, స్వచ్చ భారత్‌ గురించి హడావుడి చేశారు. జనం వాటిని మరచి పోయారు గనుక ఫిట్‌నెస్‌ గురించి కొత్త పల్లవి అందుకున్నారు. మీరు, మీ మిత్రులు పరిపాలన సాగించే బీహార్‌, యుపిల్లో ప్రతి ఇద్దరిలో ఒక పిల్ల లేదా పిల్లవాడు గిడసబారి వున్నారు.

Image result for manki baat-modi

బండ బడ మీ వ్యవహారం చూస్తా వుంటే దేశంలో ముంచుకు వస్తున్న ఆర్ధిక తిరోగమనం, మాంద్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ప్రధాని పని చేస్తున్నట్లుగా వుంది. ఆర్ధికరంగంలో పరిస్ధితి గురించి మీడియాకు ఇష్టం వున్నా లేకపోయినా వార్తలు ఇవ్వక తప్పటం లేదు. గత నెల రోజులుగా ఏదో ఒక వార్త వస్తోంది. మీడియాతో మాట్లాడటానికి అంటే ధైర్యం లేదు గనుక పత్రికా గోష్టి పెట్టరు అని సరిపెట్టుకుందాం. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి అవకాశం వున్న మన్‌కీ బాత్‌లో ఆ విషయాలు ప్రస్తావించరా ? మీడియా వార్తలన్నీ తప్పు , దేశమంతా భేషుగ్గా వుంది, అచ్చేదినాల్లోనే వున్నాం అని చెప్పొచ్చుగా ! ప్రతిపక్షాలకు మోడీ అన్నా ఆయన సర్కార్‌ అన్నా గిట్టదు అనుకుందాం. నీతి అయోగ్‌ అధిపతి రాజీవ్‌ కుమార్‌ 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్ధితి వచ్చిందన్నారు, మోడీ కోరి ఎంచుకున్న రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా మాట్లాడారు. మోడీగారు పత్రికలు చదవరు, టీవీలు చూసే తీరిక వుండదు, సంసార బంధనాలు లేవు ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తారు అనుకుందాం, కనీసం తాను నియమించుకున్న వారి మాటలు కూడా పట్టించుకోరా ?

ఈ మధ్య ప్రధాని, రాష్ట్రాలో ముఖ్యమంత్రులు ఇబ్బంది కలిగించే, వివాదాస్పద అంశాలపై నేరుగా మాట్లాడకుండా వుత్సవిగ్రహాలతో మాట్లాడించి స్పందన ఎలా వుందో చూస్తున్నారు. మోడీ మౌనంతో బిజెపి నేతలు తమ అతితెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియటం లేదు.ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ లక్ష్యానికి తిలోదకాలివ్వాలి. మనకు ధైర్యం లేదు, ఆర్ధిక వ్యవస్ధను ఎలా కాపాడాలో తెలివీ లేదు అని బిజెపి నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో మాంద్యం వున్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్ధ ఎంతో బాగా పని చేస్తోందని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర వర్ణించారు. దీనికి గత ఆరు సంవత్సరాలలో జిఎస్‌టి, పన్నుల సంస్కరణల వంటి పునాదులు వేశారని అన్నారు. అంతటితో ఆగలేదు, మోడీ ఆర్ధిక విధానం ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఒకదానిగా దేశాన్ని తీసుకుపోయింది, మోడీ కారణంగానే ఇది సాధ్యమైందనే వాతావరణం ఇప్పుడుంది అన్నారు. బిజెపికి చెందిన బీహార్‌ వుప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ కొత్త ప్రచారానికి తెరతీశారు. ప్రతి ఏటా ఐదు, ఆరు హిందూ నెలల్లో ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందట. ఎన్నికల్లో ఓడిపోయిన అసంతృప్తిని వెల్లడించేందుకు రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఈ ఏడాది గోల చేస్తున్నాయట. తొలిసారిగా గత ఆరు సంవత్సరాల్లో మొదటి మూడు మాసాల్లో అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని ప్రభుత్వమే ప్రకటించినా, ఇది ప్రతి ఏటా జరిగేదే అని బుకాయిస్తున్నారంటే జనం ఇంకా చెవుల్లో పూలు పెట్టుకున్నారనే అనుకుంటున్నారు.

మిత్రమా ఇంకా నయం దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూయే కారణం అని చెప్పినా మీ లాంటి వారంతా గొర్రెల్లా తలలూపుతారనే నమ్మకం బిజెపి నేతల్లో గట్టిగా వున్నట్లుంది,జనం తాము తాగించిన దేశభక్తి, జాతీయవాద మత్తులోనే జనం వూగుతూ తూగుతున్నారనే అనుకుంటున్నారు ! ఈ స్ధితిలో వున్న వారికి ఎదుటి వారు చెప్పేది ఎక్కదు కదా ! మరో సమస్య మీద మరో లేఖ రాస్తా ! వుంటా మరి.

ఎం కోటేశ్వరరావు