ఎం కోటే శ్వరరావు
ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో మే ఒకటవ తేదీ కార్మిక దినం. చిత్రం ఏమిటంటే మే డే పోరాటాల గడ్డ అమెరికాలో మాత్రం అధికారయుతంగా సెప్టెంబరు 2 కార్మిక దినం. అంతర్జాతీయ కార్మిక వుద్యమం ఖరారు చేసిన మే డేను అంగీకరిస్తే కార్మికవర్గం ఎక్కడ కమ్యూనిజం వైపు పయనిస్తుందో అనే భయంతో అమెరికా పారిశ్రామికవేత్తలు దానికి బదులుగా 1880దశకంలో సెప్టెంబరు రెండవ తేదీని కార్మిక దినంగా నిర్ణయించాలని తమకు అనుకూలురైన కార్మికులతో ఒక ప్రతిపాదన చేయించారు. ముందే తెలుసుగనుక నాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ అంగీకరించారు. అంటే ఆచరణలో అది కార్మికవర్గానికి చెందినది కాదు యజమానుల దినం.
అమెరికా కార్మికదినాన్ని జరుపుకొనేందుకు నిజానికి అక్కడి కార్మికవర్గం సంతోషించాల్సిందేమీ లేదు. నానాటికీ వారి పరిస్ధితులు దిగజారుతున్నాయి.2003తో పోల్చితే సగం అమెరికన్ కుటుంబాల(12.9 కోట్ల మంది) సంపద ఇప్పుడు 32శాతం తక్కువ. ఇదే కాలంలో ఎగువన వున్న ఒక శాతం మంది(పన్నెండు లక్షల 90వేల మంది) ధనికుల సంపద రెండు రెట్లు పెరిగింది.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రతి ఏటా సగటు వేతనాలు 1970వరకు పెరిగాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగా మారారు. డోనాల్డ్ ట్రంప్ బడ్జెట్‌లో లక్ష కోట్ల డాలర్లమేరకు లోటును పెంచి ఒక శాతం ధనికులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చాడు. ఇది వారికి రాయితీలు అనటం కంటే పేదల మీద విధించిన పన్ను అనటం సబబు.
1894లో అమెరికా పార్లమెంట్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబరులో వచ్చే మొదటి సోమవారం సెలవు ప్రకటించి అమెరికా కార్మిదినంగా పాటించాల్సి వుంది. అదే ఏడాది అమెరికా రైల్వే కార్మికుల సమ్మెను నిరంకుశంగా అణచివేయటంలో అప్పటి అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ పేరు మోశాడు. ప్రస్తుతం అమెరికాలో యూనియన్‌లు నామ మాత్రంగా మారాయన్నది ఒక అభిప్రాయం. ఈ కారణంగానే వారి ఆదాయాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి, మధ్యతరగతి అంతరిస్తున్నది.1950దశకంలో మూడో వంతు మంది కార్మికులు ఏదో ఒక యూనియన్‌లో వుండే వారు. 1983 నాటికి ప్రయివేటు రంగంలోని కార్మికులు 16.8శాతం మంది యూనియన్లలో వుండగా గతేడాది అది 6.4శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగంలో 37 నుంచి 34శాతానికి తగ్గింది. యూనియన్లకు కార్మికులు ఎప్పుడైతే దూరంగా వుంటారో అప్పుడు కార్మిక సంఘాల బేరమాడేశక్తి తగ్గుతుంది.1940 దశకం నుంచి చూస్తే 66శాతం మేరకు యూనియన్ల సభ్యత్వం పడిపోగా ఆర్ధిక అసమానతలు 30శాతం వరకు పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.
అమెరికాలో ఏర్పడిన మహా సంక్షోభ సమయంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ తన తొలి పదవీ కాలం 1935లో జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం ప్రయివేటు రంగంలోని కార్మికులకు యూనియన్ ఏర్పాటు చేసుకొనే హక్కుతో పాటు బేరమాడే, సమ్మె చేసే హక్కులు కూడా సంక్రమించాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత న్యాయమైన కార్మిక ప్రమాణాల పేరుతో మరొక చట్టాన్ని తెచ్చారు.దాన్లో భాగంగానే కనీస వేతన వ్యవస్ధను ఏర్పాటు చేశారు. బాలలతో పని చేయించటాన్ని నిషేధించటం, వారానికి నలభై గంటలకు మించి పని చేసిన వారికి ఒకటిన్నర రెట్లు ఓవర్ టైమ్ చెల్లింపులు వచ్చాయి. ఈ కారణంగానే నేటికీ అమెరికాలో వున్న మేరకు కార్మిక సంఘాలు ఎక్కువ భాగం డెమోక్రటిక్ పార్టీతోనే వుంటాయి.
కార్మికులు పై మెరుగులు, నాయకుల దయాదాక్షిణ్యాలను కాదు, తమకు అనుకూలమైన ఆర్ధిక వ్యవస్ధ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని కార్మికదినం సందర్భంగా క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎఎఫ్‌ఎల్-సిఐఓ అధ్యక్షుడు రిచర్డ్ ట్రమ్‌కా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వున్న అభ్యర్ధులను తాము ఇదే అడుగుతున్నామని అన్నారు.కేవలం వాణిజ్య ఒప్పందాలు కాదు, ఆర్ధిక వ్యవస్దలో మార్పులు తెచ్చే కార్యాచరణ కావాలి. యూనియన్ల అవసరం వుందని గుర్తించిన వారి సంఖ్య 64శాతానికి పెరిగినట్లు గాలప్ పోల్ వెల్లడించింది, అయితే అమెరికా కార్మిక చట్టంలోని లోపాల కారణంగా అది సభ్యత్వంగా మారటం లేదు అన్నారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ప్రభుత్వ రంగంలోని వుద్యోగులు యూనియన్లలో చేరటం తగ్గవచ్చని భయపడ్డాము కానీ వుద్యోగ సంఘంలో రెండు లక్షల మంది, టీచర్స్ యూనియన్‌లో 88వేల మంది తోడయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులను అడగాల్సి ప్రశ్నల గురించి కార్మిక సంఘాలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని వెల్లడించారు. స్ధంభించిన వేతనాలు, పెన్షన్ల గురించే కాదు ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న ఖర్చు, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా వుద్యోగాలను మెక్సికో, ఇతర చోట్లకు తరలించటం వంటి అనేక అంశాల గురించి పోటీ చేయనున్న అభ్యర్దులను ప్రశ్నిస్తామని అన్నారు. కొత్త ఒప్పందంలో భాగస్వాములు కానున్న అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో కార్మికుల హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడవలసి వుందని చెప్పారు. గతంలో మెక్సికోలోని అమెరికా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ అనుకూల, కంపెనీ అనుకూల యూనియన్లతో ఏడు లక్షల ఒప్పందాల గురించి చర్చించాయని కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగు సంవత్సరాల కాలంలో వాటిని రద్దు చేసి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకొనే విధంగా చేస్తామనే మెక్సికో ప్రతిన ఎంతమేరకు నెరవేరుతుందో, అక్కడి కార్మికుల వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయో అనుమానమే అన్నారు. చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేకపోతే అది కార్మికుల పాలిట వినాశకరంగానూ, కార్పొరేట్లకు విపరీత లాభాలకు దారి తీస్తుందని, మెక్సికో నూతన అధ్యక్షుడు ఒబ్రాడర్ కార్మికుల హక్కులను కాపాడతానన్న తన హామీని ఎలా నిలబెట్టుకుంటారో వెల్లడించాలని అన్నారు.
ఇతర దేశాలతో ఎగుమతుల్లో పోటీ పడేందుకు కార్మికులు వేతనాలు తగ్గించుకొని దేశ భక్తిని చూపాలని లేకపోతే వున్న వుద్యోగాలు కూడా వుండవని బెదిరించిన అమెరికన్ కార్పొరేట్ల వత్తిడికి కార్మికవర్గం తలవంచి వేతన స్ధంభనకు అంగీకరించింది. అయినా ఎగుమతులు పెరగలేదు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదుగూ బొదుగూ లేదు. ఈ పూర్వరంగంలోనే చైనా, ఐరోపా యూనియన్ తదితర దేశాలతో డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. మరోవైపున ట్రంప్ కార్మికవర్గం మీద మొత్తంగా దాడి కొనసాగిస్తూనే వున్నాడు. అనేక సంక్షేమ చర్యలకు కోతపెట్టటం దానిలో భాగమే. పేరుకు అనేక పధకాలు వున్నప్పటికీ వాటిని పొందాలంటే కార్మికులు ఎంతో నష్టపోవాల్సి వుంది. మన దేశంలో ఇఎస్‌ఐ ఆసుపత్రులలో వైద్యం కోసం కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తున్నదే. కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు యూనియన్లను దెబ్బతీస్తున్నారు.
కుటుంబ నియంత్రణ కార్యక్రమ ప్రచారానికి దానిని వ్యతిరేకించే వారిని నియమించినట్లుగా కార్మిక వ్యతిరేకులుగా రుజువైన వారిని కార్మిక మంత్రులుగా నియమించటం వంటి చర్యలకు ట్రంప్ పూనుకున్నాడు. తన సంస్దలలో కార్మిక చట్టాలను వుల్లంఘించి, కార్మికులను మోసం చేసి విధిలేక మిలియన్ల డాలర్ల మేరకు జరిమానాలు చెల్లించిన ఒకరిని కార్మిక మంత్రిగా నియమిస్తే రిపబ్లికన్లు కూడా అంగీకరించలేదు. రెండవ మంత్రి కూడా అలాంటి వ్యక్తే, తాజాగా ప్రతిపాదించిన మూడవ మంత్రి ఇప్పటివరకు చేసిందేమిటయ్యా అంటే వాణిజ్య సంస్ధలను సమర్ధించటమే పని. ట్రంప్ విషయానికి వస్తే ఎన్నికల్లో చేసిన సామాజిక భద్రత, వైద్యం గురించి వాగ్దానాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడు. సామాజిక భద్రత యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున తగ్గించి దరఖాస్తుల పరిశీలన తతంగాన్ని సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారు. మంజూరైన తరువాత కూడా లబ్ది అందుకోవటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒక వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ట్రంప్ తక్కువ తినలేదు. అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు సంవత్సరాలలో కార్మికులు, వుద్యోగులను వేధించిన చరిత్ర చాలా వుంది. పని చేయించుకొని కాంట్రాక్టర్లు, కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, చట్టాల వుల్లంఘన వంటి వివిధ వుదంతాలకు సంబంధించి అరవై కేసులను ట్రంప్ సంస్దలు ఎదుర్కొన్నాయి.
అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది గనుక సహజంగానే కార్మికులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎనిమిదేండ్ల డెమోక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా పాలనలో వుద్యోగాలను కాపాడటంలో, కొత్త వాటి కల్పనలో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో వాగ్దానాలతో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో విఫలమై వుద్యోగాల రక్షణ, మరొక పేరుతో అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు. చైనా, భారత్ వంటి దేశాలతో బలవంతంగా అధికరేట్లకు తమ సరకులు కొనాలని వత్తిడి, ప్రతి చర్యలకు దిగుతున్నాడు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎలిజబెత్ వారెన్, బెర్నీ శాండర్స్‌తో పాటు మరికొందరు అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతూ తాము అధికారానికి వస్తే ఏం చేయనున్నారో వెల్లడిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి.
గంటకు పదిహేను డాలర్ల కనీస వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకు డెమోక్రటిక్ పార్టీనేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాల్లో మాదిరి కార్పొరేట్ డైరెక్టర్ల బోర్డుల్లో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలన్న ప్రతిపాదనలను కూడా చేస్తున్నవారు లేకపోలేదు. జవాబుదారీ పెట్టుబడిదారీ బిల్లు ప్రతిపాదన వాటిలో ఒకటి. దాని ప్రకారం డైరెక్టర్లుగా 40శాతం మంది కార్మికుల నుంచి ఎన్నుకోవాల్సి వుంటుంది. జర్మనీలో కొన్ని పరిశ్రమల్లో సగం మంది వరకు డైరెక్టర్లు కార్మికుల నుంచి వున్నారు. పని స్ధలాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్న బెర్నీ శాండర్స్ కూడా కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. బ్రిటన్‌లోని బడా పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పదిశాతం వాటాల వరకు వచ్చిన మొత్తాన్ని కార్మిక నిధులకు జమ చేస్తారు. ప్రతి ఏటా కార్మికులు 600 పౌండ్లు డివిడెండ్ పొందుతారు. ఇలాంటి అంశాలను చర్చకు తెస్తున్నారు.
కార్మికోద్యమాన్ని నిర్మించకుండా అమెరికాలో మధ్యతరగతి పెరిగే అవకాశాలు లేవని బెర్నీ శాండర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారాలన్నీ యజమానులు, బడా కార్పొరేట్ల చేతుల్లో వున్నాయి, యూనియన్లు లేకుండా వేతనాలు, ఇతర లబ్ది పొందటం అసాధ్యం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మౌలికంగా వీటి స్వభావం సంస్కరణలు తప్ప మౌలిక మార్పులను కోరేవి కాదు. అమెరికాలో ఇప్పుడున్న వాతావరణంలో ఆ పెట్టుబడిదారీ సంస్కరణల మీద కూడా దాడి జరుగుతున్నది, కనీసం వాటిని రక్షించుకొనే స్ధితిలో కూడా కార్మికవర్గం లేదని గమనించాలి.