Tags
attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi
ఎం కోటేశ్వరరావు
ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్ సర్కార్ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ పటేల్ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.
నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.
మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?
పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.
ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.
ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.
1975లో నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్ వాయిస్ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.
భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్ వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.
కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్ రవిదాస్ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్ పేర్కొన్నది.
డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.
తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్ బహాల్ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్ క్వింట్ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.
దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్, దాని యజమాని ముకేష్ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్ ఛానల్స్, వైర్, స్క్రోల్, బూమ్‌లైవ్, న్యూస్ మినిట్, ఆల్ట్‌న్యూస్ వంటి వెబ్ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.
One after the other are effected.We could see some Industrialists too have come out speaking about the downfall in Economy. True the voice of effected masses is camaflouged in the media as they are with Government.Once people although divided comes out no power in this country can stop the downfall of this Government
LikeLike