Tags

, , ,

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.