Tags

, , ,

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

అమ్మా నిర్మలమ్మా ఒక తెలుగింటి కోడలివనే గౌరవంతో ఒక తెలుగువాడిగా ఈ బహిరంగ లేఖలో నాలుగు ముక్కలు రాస్తున్నా. ఆటో మొబైల్‌ పరిశ్రమలో తలెత్తిన పరిస్ధితికి కారణాలను వివరించాలని మీరే అనుకున్నారో, విలేకర్లు ఎవరైనా వ్యాఖ్యానించమని కోరారో తెలియదు. మీ అధినేత ప్రధాని నరేంద్రమోడీయే ఇంతవరకు నోరు విప్పలేదు, మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ప్లాస్టిక్‌ గురించి, ఫిట్‌నెస్‌ వంటి సుభాషితాలనే పలికారు. మీ రెందుకమ్మా అలా వ్యాఖ్యానించారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువత ఓలాలు, వూబర్‌లు, మెట్రోలు ఎక్కటం, వాయిదాలు కట్టేందుకు సిద్దం గాకపోవటం, బిఎస్‌ 6 కారణాలని చెప్పటం ఏమిటి తల్లీ ?

తెలుగునాట ఒక సామెత వుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడుందో చూడటానికని చెప్పాడట ఒకడు. అసలు విషయం కల్లుకోసం ఎక్కాడని వేరే చెప్పనవసరం లేదు. మీరు కూడా సమస్య వుంది, పరిశీలిస్తున్నాం, తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటాం ఇలా ఏదో ఒకటి చెప్పకుండా ఈ సహస్రాబ్ది కుర్రకారు మానసిక స్ధితి గురించి అలా మాట్లాడారేమి తల్లీ ! అయినా కార్ల అమ్మకాలు, కుర్రకారు గురించి మీరు చెప్పిన మాటలను ఏడాది క్రితమే మహింద్రా సంస్ధ అధిపతి ఆనంద్‌ మహింద్ర, మారుతి కంపెనీ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ చెప్పారమ్మా. వాటినే ఇప్పుడు మీరు పునశ్చరణ చేశారు. కార్లంటే అదేదో కుర్ర వ్యవహారంగా మార్చి వేశారు. మన దేశంలో వున్న జనాభాలో 40 కోట్ల మంది కుర్రకారే. వారిలో ఒక కోటి మంది కొనుగోలు చేసినా ఎంతో మార్కెట్‌ వుంటుంది. 2018 మార్చినెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో మన దేశంలో వుత్పత్తి అయిన అన్ని రకాల మోటారు వాహనాల సంఖ్య 2.91 కోట్లు. వీటిలో ద్విచక్ర వాహనాలు 2.31 కోట్లు, కార్లు 21.7లక్షలు, త్రిచక్ర వాహనాలు పది లక్షలు, వాణిజ్య వాహనాలు ఆరులక్షల అరవై వేలు,ఎగుమతి చేసిన కార్లు ఏడు లక్షలు, ద్విచక్ర వాహనాలు 32.6లక్షలు, వాణిజ్యవాహనాలు లక్ష,త్రిచక్ర వాహనాలు 5.3లక్షలు.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు వూహా లోకంలో వున్నట్లున్నారు. మన యువతీ, యువకులందరూ కార్లు కొనేంతగా వేతనాలు తెచ్చుకోవటం లేదు గనుక మన దగ్గర అంత సీన్‌ లేదు తల్లీ. 2018 డిసెంబరు 12న ఆటో. ఎకనమిక్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మందికి 22 కార్లు వుంటే చైనాలో 164, జపాన్‌లో 591, కెనడాలో 662, ఆస్ట్రేలియాలో 740, న్యూజీలాండ్‌లో 774, బ్రిటన్‌లో 850, అమెరికాలో 980 వున్నాయట. సహస్రాబ్ది కుర్రకారు అందరూ కార్లు కొనటం మానుకోలేదు. వారికి అంత ఆర్ధిక శక్తి కూడా లేదు. అంతర్జాతీయ చమురు సంస్ధ(ఐఇఏ) అంచనా ప్రకారం 2040 నాటికి మన దేశంలో వెయ్యి మందికి 175 కార్లు వుంటాయట. మోడీగారు చెప్పినట్లు పకోడీల బండ్లు నిర్వహించే వారు కూడా వుద్యోగులే అయితే వారందరికీ ఐటి ఇంజనీర్లలో కొంత మందికి వస్తున్న మంచి ఆదాయాలు వారికి కూడా వస్తే వారు కూడా కారులో వచ్చి పకోడీలు అమ్మి తిరిగి కారుల్లోనే ఇండ్లకు వెళతారు. అమెరికాలో రోడ్లు వూడ్చే వారు కూడా కార్లలో వస్తారని మా చిన్నపుడు చెబితే అబ్బో అక్కడికి వెళ్లి వీధులూడ్చినా మన జీవితం ధన్యం అనుకొనే వాళ్లం. ఎందుకంటే అసమయంలో సినిమాల్లో తప్ప పల్లెటూళ్లలో వాస్తవంగా కార్లు చూసిన వారి సంఖ్య చాలా నామమాత్రంగా వుండేది మరి.

అనేక కంపెనీలు మందగమనం కారణంగా తమ వుత్పాదకతను తగ్గించిన తరువాత ఈ ఏడాది జూలై నెలలో కార్లు 25-30 రోజుల వుత్పత్తి, వాణిజ్య వాహనాలు 55-60 రోజుల, ద్విచక్ర వాహనాలు 60ా65 రోజుల వుత్పత్తి నిల్వలు వున్నాయని ఆటో పరిశ్రమ అంచనా. కుర్రకారంటే కార్లు కొనటం లేదు, మరి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో ఎందుకు మాంద్యం ఏర్పడినట్లు ? బిఎస్‌ 6 ను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది కూడా అంతగా అతకటం లేదమ్మా! బిఎస్‌ ఒకటి నుంచి ఐదు వరకు లేని సమస్య ఆరుకు వచ్చిందంటే ఎలా? కొత్తగా వచ్చే తరం వాహనాల కోసం ఎదురు చూసే వారు చాలా నామమాత్రంగా వుంటారు తప్ప అసలు కొనుగోళ్లను బంద్‌ చేసిన వుదంతం లేదు. అసలు కంపెనీలే కొత్త తరం గడువుకు అనుగుణ్యంగా తమ పాత తరం వుత్పత్తి క్రమంగా తగ్గించటం లేదా నిలిపివేసే ప్రణాళికలను రూపొందించుకుంటాయి తప్ప అమాయకంగా అమ్ముడు పోని వాహనాలను తయారు చేసి పెట్టుకుంటాయా ? మన కార్పొరేట్‌ సంస్ధలు మరీ అంత అమాయకంగా లేవు తల్లీ !

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు గానీ మీ సర్కార్‌ గానీ దేశంలో ఆర్దిక మాంద్యం పెరుగుతోంది అని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కుర్రకారు కార్లు కొనేందుకు విముఖత చూపుతున్నారు గనుక ఆటోమొబైల్‌ రంగం కుదేలైందని కాసేపు మీ అభిప్రాయాన్ని అంగీకరిద్దాం. అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని వుపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గత 25నెలల్లో అత్యంత కనిష్టంగా టోకు ధరల సూచి పెరుగుదల 1.8శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల వున్నా పెద్దగా లేవు. అయినప్పటికీ వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది. వీటికి ఓలా, వూబర్‌లు ఎక్కే కుర్రకారేనా ? అందుకే తల్లీ నిజాలను అంగీకరించండి, ఆత్మావలోకనం చేసుకోండి. వైఫల్యానికి ఎవరో ఒకరిని బలి చేయాలి కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కొత్త బమ్మను రంగంలోకి తెస్తే ఏమో గాని లేకపోతే మరో నాలుగు సంవత్సరాల వరకు మీ సర్కార్‌కు ఎలాంటి ఢోకా వుండదు. నిజాన్ని అంగీకరించి నివారణ చర్యలు చేపట్టండి, మూసిపెడితే పాచిపోతుందని గుర్తించండి.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

చెన్నయ్‌లో మీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు విన్న వారు టీవీల్లో కన్నవారిలో కుర్రకారు ఒకటే జోకులు వేసిన విషయం మీ వరకు వచ్చే వుంటుంది. ఏది ఏమైతేనేం ఒకందుకు మాత్రం మిమ్మల్ని అభినందించక తప్పదు. రేపేం కానుందో అని అన్ని తరగతుల వారు ఆందోళనపడుతున్న తరుణంలో మీ ప్రకటనతో పేలుతున్న జోకులతో విషాదంలో వినోదం మాదిరి నవ్వుకుంటున్నారంటే అది మీ పుణ్యమే. ఇదే మాట నరేంద్రమోడీ నోట వచ్చి వుంటే దేశం ఇంకా విరగబడి నవ్వి వుండేది. కొన్ని జోకులు ఎలా వున్నాయో మీకు చెబుదామనుకుంటున్న. దేశంలో మంచి నీటి కొరతకు మిలీనియల్స్‌ ఎక్కువగా తాగటం, ఆక్సిజన్‌ కొరతకు ఎక్కువగా పీల్చటం. పారగాన్‌ చెప్పుల అమ్మకాలు పడిపోవటానికి మిలీనియల్స్‌ చెప్పులు లేకుండా తిరగటమే కారణం. ఎంఎల్‌ ఏలను కొనేందుకు అమిత్‌ షా పేటిఎంను వినియోగిస్తున్న కారణంగా నల్లధనం తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ అప్పులు చెప్పులు చెల్లిస్తున్నందున నిరర్ధక ఆస్ధులు తగ్గుతున్నాయి. పార్లమెంట్‌ సభ్యురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బిజెపి మంత్రుల మీద చేతబడి చేస్తున్న కారణంగా జనాభా తగ్గుతోంది. కార్ల అమ్మకాలు ఢమాల్‌ అన్నందుకు దేశం నుంచి మిలీనియన్స్‌ను బహిష్కరించాలంటూ ఒకటే ట్వీట్లు. ఇంకా వున్నాయి గానీ వినోదం కాస్త విషాదం అవుతుంది. వుంటా మరి

ఓ తెలుగోడు

ఎం కోటేశ్వరరావు