ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.
జగన్ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్ వుత్పత్తి సంస్ధలు విద్యుత్ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.
ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.
తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.
అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.
తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.
గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.