Tags

, , , ,

Image result for not cow stories Mr narendra modi speak on country economy

ఎం కోటేశ్వరరావు

చరిత్రకు పక్షపాతం లేదు. దాన్నుంచి తీసుకొనే పాఠాలకే ఏదో ఒక పక్షపాతం. అది దోపిడీదారులకు అనుకూలమైనది కావచ్చు, దోపిడీకి గురయ్యేవారిని మేల్కొలిపేదిగానూ వుండవచ్చు. గాంధీ గురించి ఎంత రాసినా స్వీకరించింది, ఆయన హంతకుడు గాడ్సేను ఎంత పొగిడినా అదే రీతిలో చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంటున్నది. అదే చరిత్ర మనకు కావలసినంత వినోదం, విషాదాలతో పాటు చతురతను కూడా అందిస్తుంది.

మనకు జ్ఞాపకశక్తి తక్కువని గుర్తు చేయటం కాదుగానీ మన ప్రధాని నరేంద్రమోడీ 2018వ సంవత్సరానికి ఒక అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. మోడీకి ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ‘మోడినోమిక్స్‌’ (మోడీ అర్ధశాస్త్రం- ఎవరైనా ఒక ప్రత్యేక సిద్దాంతం లేదా మరొకదాన్ని కనిపెట్టినా, అభివృద్ధి చేసినా వారి కృషికి గుర్తింపుగా ఆ పేరుతో వ్యవహరిస్తారు) ద్వారా భారత్‌, ప్రపంచ ఆర్ధిక పురోభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారని మన విదేశాంగశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికి ఆయన పునరంకితమైన తీరు, ప్రపంచ ఆర్ధిక అభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా రూపుదిద్ది భారతీయుల అభివృద్ధికి చేసిన కృషికి, అవినీతి వ్యతిరేక చర్యలు, సమాజాన్ని ఒకటిగా చేసిన కృషికి గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీగారికి ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు, తెలిసినా దేశభద్రత దృష్ట్యా వెల్లడించకూడదనుకోండి. మరోవైపు అందరికీ తెలిసిన డిగ్రీలు కలిగి ఆర్ధిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లు ప్రధానిగా వున్నా అదేమిటో ఒక్క అంతర్జాతీయ అవార్డూ రాలేదు. (ఆయన ఆర్ధిక విధానాలు, వైఖరితో ఏకీభవించినా లేకున్నా, అవి ఎవరికి వుపయోగపడతాయన్నది వేరే అంశం కావచ్చుగానీ ఆయన పట్టాలు వున్న ఒక ఆర్ధికవేత్త )

చరిత్రలో వినోదం, విషాదం అని ఎందుకన్నానంటే మన్మోహన్‌ సింగ్‌ దేశంలో తలెత్తిన ఆర్దిక మందగమనం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ అవార్డు గ్రహీత నరేంద్రమోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్ధకు బదులు ఆవు వ్యాసం, కథల గురించి దేశ ప్రజలకు చెబుతున్నారు. ఓం, ఆవు అనే మాటలు వినపడితే కొంత మందికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, దేశం 16,17 శతాబ్దాల వెనక్కు పోయిందని మాట్లాడతారని 2019 సెప్టెంబరు పదకొండున చెప్పారు. ఓం, ఆవులకు ఆ రెండు శతాబ్దాలకు సంబంధం ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. ఎందుకంటే అవి రెండూ అంతకంటే చాలా పురాతనమైనవి. దేశాన్ని ఆ కాలానికి తీసుకుపోవాలన్నది మోడీ అండ్‌కో ప్రయత్నం అన్నది తెలిసిందే. మేకిన్‌ ఇండియా పిలుపు ఏమైందో, అచ్చేదిన్‌ ఎప్పుడొస్తాయో, ఒక వేళ ఆర్ధిక మాంద్యం లేకపోతే లేదనైనా చెప్పకుండా ఈ అవుగోలేందో, ఎవరో దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్నారని అంటూ ఎదురుదాడి చేయటం ఏమిటో ఎవరికైనా అంతుపడుతోందా ?

అంటే అన్నారని ఏడుస్తారు. మోడీ సర్కార్‌ రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ అనే సంస్ధను తాత్కాలిక బడ్జెట్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయాల్సి వుంది. జాతీయ మహిళ, జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ల మాదిరి ఇది జాతీయ ఆవు కమిషన్‌. ఆవు పేడ, గోమూత్రం, వాటితో వుత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు యువతీ, యువకులు ఏర్పాటు చేసే అంకుర సంస్ధలకు 60శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నదని జాతీయ ఆవు కమిషన్‌ అధ్యక్షుడు వల్లభ్‌ కథిరియా నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. పేడ, మూత్రాలతో ఔషధాలను తయారు చేస్తున్నామని, వాటిని మనుషులతో పాటు వ్యవసాయానికి వినియోగించవచ్చని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాడి ఎండిపోయిన తరువాత ఆవులు దేనికీ పనికిరావనుకోవటం సరైంది కాదని పేడ, మూత్రం వస్తాయని, వాటిలో వున్న ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరినట్లు కథిరియా చెప్పారు. గోశాల నిర్వాహకుల నైపుణ్య అభివృద్దికి శిక్షణ ఇస్తామని కూడా అన్నారు. ఆవు పేడ, మూత్రాలతో తయారు చేసే ప్రత్యేక ఔషధం పంచగవ్యను గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వున్నతమైన తెలివిగల పిల్లలు పుడతారని ఆయుష్‌, జాతీయ ఆవు కమిషన్‌ అధికారులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Image result for cow stories,narendra modi cartoon

గ్రామాల నుంచి వుద్యోగాల కోసం యువత పట్టణాలకు రాకుండా చూసేందుకు మోడీనోమిక్స్‌లో ఇదొకటి. పంచగవ్యతో పాటు ఆవు, పేడ మూత్రాలతో సబ్బులు, దోమల నివారణ పిడకలు, కాగితం తయారీ వంటి వాటిని యువకులకు వుపాధిగా చూపాలని తలపెట్టారు. వీటిని వ్యాపారపరంగా తయారు చేసే వారికి పన్నెండు సంవత్సరాల్లో తీర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఆవు వుండే విధంగా చేయాలన్నది మోడీగారి లక్ష్యం. తాము అధికారానికి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామన్నది తెలంగాణా బిజెపి ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి.

కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌) పధకాల్లో గోశాలల నిర్మాణం కూడా ఒకటిగా చేరుస్తూ యుపి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది, రెండు శాతం ఆవు పన్ను విధించింది. అన్ని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆయుర్వేద, ఖాదీ కేంద్రాలలో ఆవు సంబందిత వుత్పత్తులను విక్రయిస్తారు.

మోడీ గారు దేశం గురించి ఎప్పుడు నోరు తెరుస్తారో, శాశ్వతంగా మూసుకుంటారో తెలియదు. ఆది గోద్రెజ్‌, ఆయనేమీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకి కాదు, పాకిస్ధానీ మద్దతుదారు లేదా తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అసలే కాదు. ప్రముఖ పారిశ్రామిక సంస్ధ గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌. ‘ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది, వుదాహరణకు కాశ్మీర్‌, కానీ వాణిజ్య విషయాల్లో వేగంగా నిర్ణయాలు చేయకపోవటం మంచిది కాదు ‘ అన్నారాయన. దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న అసహనం లేదా అసంతృప్తికి నిదర్శనం. ఈ వ్యాఖ్య ఈ ఏడాది తొలి త్రైమాసిక ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని, ఎనిమిది ప్రధాన రంగాలలో గతేడాది జాలైలో 7.3శాతంగా వున్న వృద్ధి రేటు ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖే ప్రకటించటానికి ముందే గోద్రెజ్‌ మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఎవరైనా పాక్‌ ఏజంట్లు చొరబడ్డారేమో, వారి మీద మెరుపు దాడులు చేయాలేమో మోడీ గారు ఆలోచించాలి. రాయిటర్స్‌ వార్తా సంస్ధ చేసిన ఇంటర్వ్యూలలో డజనుకు పైగా ప్రముఖులు గోద్రెజ్‌ మాదిరే ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు, కొంత మంది పేరు రాయటానికి ఇష్టపడలేదు. వారంతా మోడీ విజయానికి హారతులు పట్టిన వారే సుమా ! వీరి అభిప్రాయాలపై వ్యాఖ్యానించాలని అడగ్గా ప్రధాని కార్యాలయం తిరస్కరించిందట. మోడీ గారే మాట్లాడనపుడు కందకు లేని దురద కత్తి పీటకెందుకు అన్నట్లుగా ఆయన ఆఫీసు ఎలా స్పందిస్తుంది. జూలై నెలలో ఈ విదేశీ మదుపుదార్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు వుపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వుద్దీపన చర్యలు, బ్యాంకుల విలీనాలు ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

తాము అప్పుల పాలయ్యామని, దివాలా తీశామని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు కనుక రుణాల రద్దు, సబ్సిడీలను కొనసాగించాలన్న కోట్లాది రైతాంగ వినతుల సందర్భంగా మీడియా, పారిశ్రామికవేత్తలు కూడా వాటికి వ్యతిరేకమైన వాదనలు చేస్తున్న విషయం తెలిసింది. ఎవరైనా స్వంత కాళ్ల మీద నిలబడాలి తప్ప ప్రభుత్వాలు ఆదుకుంటే సోమరితనాన్ని పెంచినట్లే అని సుభాషితాలు పలికారు. అవే నోళ్లు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని బయటపడవేసేందుకు వుద్దీపన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రాయిటర్స్‌ కధనం ప్రకారం కొంత మంది బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గ.ారిని కలిశారు. వారు చెప్పిన అంశాల మీద ఎలాంటి చర్చ లేకుండా కృతజ్ఞతలు, మేం పరిశీలిస్తామని చెప్పి పంపారు. ఎక్కువ సమావేశాల తంతు ఇలాగే వుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతుండటంతో దిక్కుతోచని ప్రభుత్వం జనం దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున సిబిఐ, ఇడి, ఇతర ఆర్ధిక దర్యాప్తు సంస్ధల దాడులను ప్రారంభించింది. అక్రమాల మీద చర్య తీసుకోవటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు తీసుకున్న చర్యలేమిటన్నది అసలు ప్రశ్న. ఐదేండ్ల క్రితం ఒక నవయువకుడు ప్రేమలో పడినట్లుగా మేము వున్నాం, ఇప్పుడు కలలు కల్లలైనట్లుగా తయారైంది అని ఒక వాణిజ్య వేత్త వ్యాఖ్యానించారు. అది నరేంద్రమోడీ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.

Image result for cow stories,narendra modi cartoon

దేశం ఆర్ధికంగా దిగజారుతోంది అని గుర్తించటానికి కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడటం లేదు. ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు స్ధిరచిత్తం గలవారు చెప్పే మాటలను ఆలకించండి అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి ఏం చెబుతారని విలేకర్లు అడిగితే ఆయనేం చెప్పారో నాకు తెలియదు, చెప్పినదాని మీద నాకెలాంటి ఆలోచన లేదు, ఆయన చెప్పింది నేను విన్నాను అంతే అని ముక్తసరిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువతీ యువకులు కార్లు కొనటం మాని ఓలాలు, వూబర్‌లు ఎక్కుతున్నారని ఆమె సెలవిచ్చిన విషయం తెలిసిందే.

దేశంలో నిరుద్యోగుల శాతం 8.2కు పెరిగిందని, పట్టణాల్లో అది 9.4శాతంగా వుందని సిఎంఐఇ చెప్పింది. పెంచిన సర్‌ఛార్జిని వుపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా విదేశీ (ఎప్‌పిఐ) మదుపుదార్లు పెట్టుబడులను వుపంసంహరించటం ఆగలేదు. రూపాయి విలువ 72 దాటి పతనమైంది. ఒక వైపు పరిస్ధితి ఇలా వుంటే ఇప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది అంటూ గతనెల 26న బిజెపి ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. పని గట్టుకొని ఎగవేస్తున్న వారి నుంచి బ్యాంకు రుణాలు వసూలు చేయటం మీద అంతగా శ్రద్ద పెట్టని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని ముందుకు తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం అభివృద్ధి మందగించటానికి అవే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నా అంగీకరించటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. వీటి గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే ప్రస్తావించని మోడీ గారు దేశానికి ఆవు పాఠాలు చెబుతున్నారు. దేశాన్ని ఎవరు వెనక్కు తీసుకుపోతున్నారు ? ఇది వినోదమా దేశానికి పట్టిన విషాదమా ?