Tags

, , , , ,

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !