Tags

, , , , , , ,

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.