Tags

, , , , , ,

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !