Tags

, , ,

Image result for crony capitalism in indiaమొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది పాత సామెత. లాభం వుంటేనే రాజకీయనేతలు, వ్యాపారులు కూడా వరద, కరవు ప్రాంతాలకు పోతారు అన్నది సరికొత్త నానుడి. ప్రస్తుతం లాభం, వ్యాపారం, రాజకీయాలను, వాటికోసం పని చేసే వారిని విడదీసి చూడలేని స్ధితి. తొలి పార్లమెంట్‌లో లక్షాధికారులైన ఎంపీలు ఎందరున్నారు అని వెతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కోట్లకు పడగలెత్తని, వ్యాపారులు కాని ఎంపీలు ఎందరున్నారు అని తెలుసుకొనేందుకు బూతద్దాలతో చూడాల్సి వస్తోంది.
రాజకీయం-వ్యాపారానికి వున్న సంబంధాలను మన దేశంలో రెండుగా చూడాల్సి వుంది. ఇది పరాయి దేశాల వలసలుగా, అక్రమణలుగా మారిన అన్ని దేశాలలో పూసల్లో దారంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు పరాయి పాలకులను పారద్రోలేందుకు సమాజంలోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సహా అన్ని తరగతుల వారూ పాల్గొన్నారు. ఏ తరగతి అజెండా వారికి వున్నప్పటికీ వాటిని ముందుకు తీసుకుపోవాలంటే పరాయిపాలకులు ఆటంకంగా వున్నారన్న ఏకైక కారణమే వారిని ఒక వేదిక మీదకు తెచ్చింది. అందువల్లనే జాతీయ వాదంలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి దోపిడీకి గురయ్యే కష్టజీవులు తాము దోపిడీ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. రెండవది స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్య శక్తులు బలపడి తాము స్వంతంగా వ్యవహరించగలం అనుకున్న తరువాత విదేశీ కంపెనీలతో పోటీకి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని ముందుకు తేవటం. స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో బ్రిటీష్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా అక్కడి పెట్టుబడిదారులు విధానాలను నిర్దేశించారు. తరువాత మన దేశంలో పెట్టుబడిదారులు, ఫ్యూడల్‌ వ్యవస్ధ ఇంకా బలంగా వున్న వున్నందున పెట్టుబడిదారులు, భూస్వామ్య తరగతులను కలుపుకొని తమ అజెండాను అమలు జరిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలకు పోటీ రాకుండా చూసేందుకు అప్పటికే ఒక స్ధాయికి చేరిన వారు లైసన్స్‌ పద్దతిని ముందుకు తీసుకు వచ్చారు. భూస్వాముల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ వ్యవస్ధను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశారు. భూ సంస్కరణల చట్టాలను ఆలశ్యం చేయటం, చేసిన వాటిని నీరుగార్చటం దానిలో భాగమే.
స్వాతంత్య్రం తరువాత ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే లైసన్సులు అవసరం. వాటికోసం పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అధికారంలో వున్న రాజకీయ నేతలను ఆశ్రయించటంతో అవినీతి ప్రారంభమైంది. తమ పనులు జరిపించుకొనేందుకు కొందరు రాజకీయనేతలను లాబీయిస్టులుగా మార్చుకోవటం లేదా అలాంటి వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించి నిధులిచ్చి గెలిపించుకోవటం చేసే వారు. 1991కి ముందే వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయటం, రాజకీయాల్లో వున్న వారు వ్యాపారాల్లో ప్రవేశించటం ప్రారంభమైనా ఆ తరువాత అది మరింత వేగం పుంజుకుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే విధానపర నిర్ణయాల తరువాత అది జనానికి మరింత స్పష్టంగా కనిపించింది. దాన్నే నీకది, నాకిది అని అందరూ కుమ్మక్కై పంచుకోవటంగా చూస్తున్నాము. ఇది వాటంగా వున్న తరువాత పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. బెల్లం ఎక్కడ వుంటే అక్కడకు చీమలు చేరినట్లు ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరటం, దానికి కార్యకర్తల అభీష్టమనో, నియోజకవర్గ అభివృద్ధి అనో చెప్పే వారు. ఇప్పుడు వాటి జాబితాలోకి దేశ ప్రయోజనాల కోసం అని కొత్త పదాన్ని చేర్చారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు వేటికీ అంటూ సొంటూ, నీతి, అవినీతి తేడా లేదు.

Image result for crony capitalism in india
సంపదలను పోగేసుకొనేందుకు ఎంతకైనా తెగించే వ్యాపారులు, రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నత అధికారగణం ఒక దగ్గర చేరినపుడు నీకిది, నాకది, వారికది అని పంచుకుంటారు. దీన్నే క్రోనీ కాపిటలిజం లేదా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటున్నాము. మీడియా రంగంలో సైతం ఏ పత్రిక, ఏ ఛానల్‌ చరిత్ర చూసినా ఏమున్నది కొత్తదనం, సమస్తం వ్యాపారమయం అన్నట్లుగా ఇలాంటి వ్యాపార-రాజకీయవేత్తలు వాటి వెనుక వుంటారు. వార్తలను అందించి జనానికి సేవ చేద్దామని కాదు, అది కూడా తమ రాజకీయ లాభం కోసమే అన్నది తెలిసిందే. గత ప్రభుత్వం తమ ఆశ్రితులకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి అపరిమితంగా రుణాలిప్పించి అక్రమాలకు పాల్పడిందన్నది ప్రస్తుత పాలకుల తీవ్ర ఆరోపణ. చిత్రం ఏమిటంటే అలాంటి అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నది అంతగా ఎవరూ అడగటం లేదు. గతంలో వారు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం మీద ఎలా ప్రభావం చూపుతుందో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 ఆగస్టు 11న లలిత్‌ దోషి స్మారక వుపన్యాసంలో రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. దీని వుచ్చునుంచి బయట పడాలంటే పౌర సేవలను పటిష్టం చేయటం ఒక మార్గం అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పారదర్శకత, పోటీని దెబ్బతీసి చివరకు ఆర్ధిక పురోగతిని మందగింప చేస్తుందని అన్నారు.(అంటే లైసన్స్‌ రాజ్యాన్ని మరోరూపంలో ముందుకు తెస్తుంది) ” వుపాధి, పౌర సేవలను పొందేందుకు పేదలు, నోరు లేని వారికి రాజకీయ నేతల అవసరం వుంది. కుటిల రాజకీయవేత్తకు అందుకు గాను నిధులు, ఇతర అవసరాల కోసం వాణిజ్యవేత్తల ప్రాపకం అవసరం. అవినీతి పరులైన వాణిజ్యవేత్తలు పౌర వనరులు, కాంట్రాక్టులను చౌకగా పొందాలంటే కుటిల రాజకీయవేత్తల మద్దతు అవసరం. రాజకీయవేత్తలకు పేదలు, నోరులేని వారి ఓట్లు అవసరం. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడే బంధంతో ఒక వలయంలో వున్నారు. అది యథాతధ స్ధితిని పటిష్టపరుస్తుంది….ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యాధికారం గల కొందరు ధనిక పెద్దలను సృష్టిస్తుంది, అది అభివృద్ధిని మందగింప చేస్తుంది” అన్నారు.

Image result for crony capitalism in india

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి చెల్లించగల శక్తి వుండి కూడా ఎగవేసే వారిని బుద్ది పూర్వక ఎగవేతదారులు అంటున్నాము. 2015 మార్చి నెల నుంచి 2019 మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరం వరకు బుద్ధి పూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 5,349 నుంచి 8,582కు పెరిగిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 25న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. అంటే ఐదేండ్లలో 60శాతం పెరిగారు. వీరిలో 6,251కేసులలో తనఖా వున్న ఆస్ధుల మీద చర్యలు ప్రారంభించారు, 8,121కేసులలో రుణ వసూలు దావాలు వేశారు, 2,915 కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగవేసిన వారి నుంచి 7,600 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్యాంకులకు ఇలాంటి బాపతు చెల్లించాల్సిన సొమ్మునే నిరర్ధక ఆస్తులంటున్నాము. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ మొత్తం 8.06లక్షల కోట్ల రూపాయలు. 2016-19 ఆర్ధిక సంవత్సరాల మధ్య బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము 3.59లక్షల కోట్లు పోను ఇంకా రావాల్సింది పైన పేర్కొన్న మొత్తం. యాభై కోట్ల రూపాయలు, అంతకు మించి రుణాలు తీసుకొని ఎగవేసిన వారి ఫొటోలను బ్యాంకుల్లో ప్రదర్శించాలని(పోలీస్‌ స్టేషన్లలో పాత నేరస్దులు, కేడీ గాండ్ల మాదిరి) ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. వారి కోసం గాలింపునకు నోటీసులు జారీ చేయాలని కూడా కోరింది. వారి పాస్‌పోర్టుల సర్టిఫైడ్‌ కాపీలను సంపాదించాలని సూచించింది.

Image result for crony capitalism in india

సాధారణ పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు, వ్యాపారం వర్ధిల్లాలి అంటే నష్టభయం వుంటుంది. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో లాభాలను ఎలా సంపాదించాలో వ్యాపారులు-అధికారంలో వున్న రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నతాధికారులు కుమ్మక్కై ముందుగానే నిర్ధారించుకొని అందుకు అనుగుణ్యం పావులు కదుపుతారు. దీనిలో మరొకరితో పోటీ వుండదు. కావాల్సిన అనుమతులు, ప్రభుత్వ నిధులు, పన్నుల రాయితీలు ఇతర అన్ని రకాల సౌకర్యాలను అధికారంలో వున్న పెద్దలు సమకూర్చుతారు. దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇలాంటి వారు మన కళ్ల ముందే అనూహ్యంగా అపార సంపదలను పోగేసుకుంటారు. దీనికి అనువైన అవకాశాలను నయావుదారవాద విధానాలు కల్పించాయి. తెలంగాణాలో ప్రాజక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చేసిన పనుల మీద తలెత్తిన అవినీతి ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింత, టెండర్ల విధానం. రెండు చోట్లా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వివాదాలు వీటి పర్యవసానమే.
మిలిటరీ, సరిహద్దులు, కరెన్సీ, పోలీసుల వంటి విభాగాలు మినహా మిగిలిన అన్ని రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి, ప్రయివేటు రంగానికి, విదేశీ కంపెనీలకు గేట్లు బార్లా తెరవాలని సంస్కరణల పేరుతో ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏ దోపిడీ విధానమైనా దానికి అవినీతి తోడుగా వుంటుంది. ఈ కారణంగానే దేశంలో నేడు ఏ పెద్ద కంపెనీ ఏ అక్రమానికి పాల్పడింది, దాని వెనుక ఏ రాజకీయనేతలున్నారో అనే వార్తలు వెలువడుతున్నాయి. అధికార అండచూసుకొని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి ఇచ్చిన మేరకు అప్పులు, ప్రభుత్వం నుంచి రాయితీలు దండుకో, నిధులను దేశం దాటించు, వాటినే విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తీసుకురా లేదా ఇతర బినామీ కంపెనీలకు మళ్లించు, సంస్ధలను దివాలా తీయించు. కేసులు పెడతారా విదేశాలకు పారిపో లేదా దొరికిపోతావా పోయేదేముంది పైసాకు కొరగాని పరువు తప్ప కూడబెట్టుకున్న ఆస్ధులేవీ పోగొట్టుకున్నవారెవరూ లేరుగా ! ఇదే కదా పై నుంచి కింది వరకు నేడు దేశంలో వున్న ఆలోచనా సరళి.
Image result for crony capitalism in india
మన దేశంలో నయా వుదారవాదం 1980దశకంలోనే ప్రారంభమైనా 1991లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత సంస్కరణల పేరుతో గత విధానాలకు తిలోదకాలివ్వటం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు ఎప్పుడైతే తీసుకున్నామో వాటికి విధించిన షరతుల్లో భాగంగా విదేశీ వస్తువులపై ఆంక్షలను ఎత్తివేసి ఆ కంపెనీలకు మార్కెట్‌ను తెరిచే, ప్రయివేటు రంగానికి అన్ని బాధ్యతలు, అవకాశాలను ఇచ్చే నయా వుదారవాద విధానాలు ప్రారంభమయ్యాయి. వీటిని కాంగ్రెస్‌ ప్రారంభించినా తరువాత అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వం కూడా పూర్తిగా, మరింత ఎక్కువగా అమలు జరిపింది, జరుపుతోంది. అంతకు ముందు వివిధ కారణాలతో అప్పులపాలైన రైతులు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడినా, 1991లో నూతన విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తి రోజూ ఏదో ఒక మూలన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.