Tags
Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi
(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)
ఎం కోటేశ్వరరావు
ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఎకనమిక్ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ కేసును మూడు సంస్ధలు, పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన నీరవ్ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్ స్టీల్స్ అక్రమాల కేసులో ఎండీ నీరజ్ సింగాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.
2015 నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.
గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.
2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్ చోక్సి, నీరవ్ మోడీ, జతిన్ మెహతా, ఆషిష్ జోబన్ పుత్ర, చేతన్ జయంతిలాల్ సందేశరా, నితిన్ జయంతి లాల్ సందేశరా, దీప్తిబెన్ చేతన్ కుమార్ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.
పుష్ప బైద్, అషిష్ జీబన్ పుత్ర, ప్రీతి అషిష్ జీబన్ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్ కుమార్ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్ మెహతా, వుమేష్ పరేఖ్, కమలేష్ పరేఖ్, నిలేష్ పరేఖ్, ఏకలవ్య గార్గ్, వినరు మిట్టల్,చేతన్ జయంతిలాల్ సందేశరా, నితిన్ జయంతి లాల్ సందేశరా, దీప్తిబెన్ చేతన్ కుమార్ సందేశరా, నీరవ్ మోడీ, నీషాల్ మోడీ, సబయ సేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, లలిత్ మోడీ, రితేష్ జైన్, హితేష్ నరేంద్రభారు పటేల్, మయూరీ బెన్ పటేల్.
గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్ తల్వార్, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్ జాతీయుడు క్రిస్టియన్ మిచెల్, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్ లేదా ఫరూక్ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్ కదిర్ లోనట్ అలెగ్జాండ్రును సింగపూర్ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్ నుంచి అబ్దుల్ రౌత్ మర్చంట్ మహమ్మద్ సుల్తాన్, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్ నుంచి కుమార్ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్ వాహిద్ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్ చెటియా నుంచి బంగ్లాదేశ్ నుంచి, కిడ్నాప్, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్ నుంచి జగతార్ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.
వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్ ఎయిర్‌వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్, అనిత గోయల్, దీపక్ కొచార్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్ గోయల్, అనితా గోయల్ దుబారు మీదుగా లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన నీరవ్ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.
ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?
ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్ ఎస్ అంక్లేసరియా అయ్యర్ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.
” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్, యూనిటెక్, లాంకో, ఐవిఆర్‌సిఎల్) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్ మోటార్స్, ప్రీమియర్ ఆటోమొబైల్స్, జెకె సింథటిక్స్, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.
భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.
దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్ స్ప్రెక్ట్రమ్ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?