Tags

, , ,

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.