ఎం కోటేశ్వరరావు
ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ‘అభినందనలు’ చెప్పాలి. కార్మికులు, వుద్యోగులు,సకల కష్ట జీవుల్లో నెలకొన్న భ్రమలను తొలగించేందుకు, కార్మిక, వుద్యోగ సంఘాల ఐక్యతకు దోహదం చేస్తున్న ‘ఒకే ఒక్కడు ‘ కెసిఆర్ అంటే అతిశయోక్తి కాదు. చరిత్రలో అనేక సందర్భాలలో ఇదే రుజువైంది.దశాబ్దాల తరబడి చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించిన ఉద్యమకారుల కృషి కంటే కొందరు పాలకుల ఒకటి రెండు చర్యలు జనానికి కనువిప్పు కలిగించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
పోరుబాట వదలి, పాలక పార్టీల సార్ల ముందు సాష్టాంగ ప్రమాణ బాట పడితే సమస్యలన్నీ పరిష్కారమౌతాయంటూ ఇటీవలి కాలంలో అనేక సంఘాల నాయకత్వాలు చెప్పిన సూక్ష్మంలో మోక్షాన్ని అందుకోవచ్చని కష్టజీవులు కూడా గుడ్డిగా నమ్మారు. ఎండమావుల వెంట పరుగులెత్తుతున్నారు. ఇదేదో రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామం కాదు. రూపం మార్చుకున్న పెట్టుబడిదారీ విధానం నేతి బీరలో నెయ్యి మాదిరి నయా వుదారవాదం ముందుకు తెచ్చిన అస్ధిత్వ ధోరణులు లేదా రాజకీయాలు కష్టజీవులను భ్రమల్లో ముంచుతున్నాయి. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా కష్టజీవుల పరిస్ధితి తయారైంది.
సమ్మెలో పాల్గొన్న కార్మికులను వుద్యోగాల నుంచి ఊడగొడతానని సార్ కెసిఆర్ ఇప్పుడు కొత్తగా ప్రకటించారని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి గతేడాది జూన్ 11 నుంచి తలపెట్టిన సమ్మె సందర్భంగానే హెచ్చరించారని మరచి పోరాదు. అయినా సరే తరువాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఆయన నాయకత్వానికే ఓటు వేశారు. తెలంగాణా రాష్ట్ర ఆందోళన సమయంలో తామంతా పాల్గొన్నామని ఇప్పుడు ఇలా చేయటం ఏమిటని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. పరాయి పాలకులను నెత్తినెక్కించుకోవటం కంటే మా దొరలను మోయటమే మాకు గర్వకారణంగా వుంటుందని గతంలో వాదించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. అలా దొరలను నెత్తినెక్కించుకున్న వారిలో కార్మికులు, వుద్యోగులు, వుపాధ్యాయులతో సహా ఎవరూ తక్కువ కాదు.
ఒకసారి అస్ధిత్వ ధోరణులకు ప్రభావితులై వర్గదృక్పధం కోల్పోయిన తరువాత దొరలు, దొరసానులనే కాదు చివరకు వివిధ రూపాల్లో ముందుకు వచ్చే ఫాసిస్టు లక్షణాలను, ఫాసిస్టు శక్తులను సైతం బలపరచటానికి జనం వెనుకాడరు. ప్రపంచ ద్రవ్యపెట్టుబడి విధానాల పర్యవసానంగా జీవనోపాధి కుచించుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఉద్యోగాలలో వున్న వారు గతంలో సంపాదించుకున్న హక్కులను నిలబెట్టుకొనేందుకుగానీ, పోగొట్టుకున్నవాటిని తిరిగి పొందేందుకు గానీ ముందుకు రాకపోగా అధికార పార్టీని ఆశ్రయిస్తే ఎలాగొలా నెట్టుకురావచ్చని ఆశపడతారు.పోరుబాటను విడిచిపెడతారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దేనికైనా సిద్ధపడతారు. కనుకనే తాను కొత్తగా ఆర్టీసిలోకి తీసుకోబోయే ఉద్యోగులు తాము యూనియన్లకు, సమ్మెలకు దూరంగా వుంటామని హామీ పత్రాలను రాసివ్వాల్సి వుంటుందనే ఒక నిరంకుశమైన అంశాన్ని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పగలుగుతున్నారు. రిక్రూట్‌మెంట్ చేస్తే గీస్తే ప్రభుత్వ వుద్యోగులు, వుపాధ్యాయులు కూడా తాము ఏ యూనియన్ సభ్యత్వం తీసుకోము అని రాసివ్వాలని అడగరనే హమీ ఎక్కడుంది. ఇన్ని సంఘాలు ఎందుకని ఒకసారి మాట్లాడతారు. తాను ఇచ్చిన హామీలనే అమలు జరపమని కోరినందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల సిబ్బందిని వుద్దేశించి తోక కుక్కను నడుపుతుందా లేక కుక్క తోకను ఆడిస్తుందా అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఒక్కో సమయంలో ఒక్కో శాఖ సిబ్బందిని అవమానాలపాలు చేసి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్టీసి యూనియన్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయని అంటున్నారు.
అస్ధిత్వ ధోరణుల కారణంగానే ఎవరి సంగతి వారు చూసుకోవాలనే వైఖరి నేడు వివిధ కార్మిక సంఘాల మధ్య నెలకొని వుంది. ఆర్టీసి వుద్యోగులకు రెండున్నర సంవత్సరాలుగా పిఆర్‌సి డిమాండ్‌ను పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రభుత్వ వుద్యోగులు తమ పిఆర్‌సిని పట్టించుకుంటారని నమ్మటం భ్రమగాకపోతే ఏమిటి? ఆర్‌టిసి కార్మికుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంటే మిగతా వుద్యోగ, కార్మిక సంఘాలు ఖండించటం, తోటి వుద్యోగులకు కనీసం నైతిక మద్దతు ప్రకటన కూడా ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి ? రేపు తాము పోరుబాట పడితే ఇతరుల మద్దతు అవసరం లేదా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
ఆర్‌టిసి కార్మికుల విషయానికి వస్తే దసరా పండగ ముందు సమ్మె చేయటం ఏమిటంటూ వారికి వ్యతిరేకంగా జనంలో మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. సామాజిక మాధ్యమంలో హిందూత్వ ప్రభావానికి లోనైన వారు హిందువుల పండగ సందర్భంగానే సమ్మె చేస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. వారికి మతోన్మాదం తప్ప సమ్మెలో వున్నవారు కూడా అత్యధికులు హిందువులే అన్న విషయం వారికి పట్టదు. గతేడాది జూన్‌లో సమ్మె నోటీసు ఇచ్చినపుడు ఏ పండగా లేదు. అయినా సరే ప్రభుత్వం సమ్మె నోటీసును తీవ్రంగా తీసుకుంది. జూన్ 7న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ ఒక వేళ సమ్మెంటూ జరిగితే ఆర్‌టిసి చరిత్రలో ఇదే చివరిది అవుతుంది, సిబ్బంది వుద్యోగాలను కోల్పోతారు అని బెదిరించారు. అప్పుడు మూడువేల కోట్ల నష్టం గురించి మాట్లాడిన సిఎం దాన్ని పూడ్చేందుకు లేదా కొత్త నష్టాలను నివారించేందుకు తీసుకున్న చర్యలేమీ లేవు. ఇప్పుడు తిరిగి తాజా అంకెలతో, ప్రయివేటు బస్సులు, కొత్త సిబ్బంది అంటూ కార్మికులను భయపెట్టేందుకు లేదా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. పదహారు నెలల క్రితం చేసిన వాదనలనే ముందుకు తెచ్చారు. కొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. అవన్నీ ఆర్‌టిసిని మరింతగా దెబ్బతీసేవే తప్ప బాగు చేసేవి కాదు. ఆ సంస్ధకు వున్న విలువైన ఆస్ధులను కాజేసేందుకు ఎవరు అధికారంలో వున్నప్పటికీ పాలకపార్టీల పెద్దలు ఉమ్మడిగా వున్నపుడు, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయత్నిస్తూనే వున్నారు.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐర్ అండ్ పిఆర్( తాత్కాలిక భృతి, వేతన సవరణ)పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేవు గనుక వాటిని సాధ్యమైన మేరకు వాయిదా వేసేందుకు, ఒక వేళ ఇవ్వాల్సి వచ్చినా నామ మాత్రంగా పెంచేందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్దం చేశారని ఉద్యోగులు మరచి పోరాదు. సంక్షేమ చర్యలతో జనాలను ఆకర్షించేందుకు చూసే పాలకులు ఆర్ధిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నపుడు వాటికే ఎసరు పెడతారని గ్రహించాలి. అలాంటి పరిస్ధితి ఎదురైనపుడు కార్మికులు, వుద్యోగుల ముందు రెండు మార్గాలు వున్నాయి. బెదిరింపులకు భయపడి ప్రభుత్వాలకు లొంగిపోయి ఆర్ధికంగా నష్టపోవటం ఒకటైతే అందరూ ఒక్కటై ఒకరికి ఒకరు తోడై ఉమ్మడిగా పోరుబాట పట్టి న్యాయమైన కోర్కెలను సాధించుకోవటం రెండవది. ప్రపంచ వ్యాపితంగా మొదటిదే ఎక్కువగా జరుగుతోంది. నయా వుదారవాద ప్రభావం కార్మికవర్గం మీద తీవ్రంగా వుంది.
ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనాలో ఏటేటా కార్మికుల,వుద్యోగుల వేతనాలు పెరుగుతున్నందున పరిశ్రమలు, వాణిజ్యాలు గిట్టుబాటుగాక వేతనాలు ఎక్కడ తక్కువగా వుంటాయో అక్కడికి తరలి పోవాలని చూస్తున్నాయనే వార్తలను చూస్తున్నాము. దానికి కారణం అక్కడి పాలకులు కష్టజీవుల పక్షాన వుండటమే అన్నది స్పష్టం. చైనా నుంచి బయటకు పోయే వాటిని మన దేశానికి రప్పించాలని కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ, ఆయన విధానాలనే అనుసరిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు. ప్రభుత్వ వుద్యోగులు, కార్మికుల వేతనాలు పెరిగితే ప్రయివేటు రంగంలో వున్న వారి వేతనాల పెంపుదలకు వత్తిడి, ఆందోళనలూ ప్రారంభమౌతాయి. అందువలన సంఘటితంగా వున్న వారినే దెబ్బతీస్తే అసంఘటిత రంగంలో వున్న వారు ముందే నీరుగారి పోతారు.
పెట్టుబడులను ఆకర్షించాలని చూసే ప్రతి రాష్ట్ర పాలకులూ ఈ పరిస్ధితినే కోరుకుంటారు. దీనికి కెసిఆర్ మినహాయింపు కాదని అర్ధం చేసుకోవాలి. ఉన్న యూనియన్ల నాయకత్వాలను లోబరచుకోవటం, సాధ్యంగాకపోతే వాటిని చీల్చి తమ కనుసన్నలలో పనిచేసే వారితో కొత్త సంఘాలను ఏర్పాటు చేయటం వంటి పాలక టీఆర్‌ఎస్ పార్టీ అజెండా, పరిణామాలు, పర్యవసానాలన్నీ దానిలో భాగమే. ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ప్రభుత్వ బెదిరింపులు కార్మికుల మీద పని చేయలేదు. తోటి వుద్యోగ, కార్మిక సంఘాల మద్దతు లేకపోతే ఈ ఐక్యత, పట్టుదల ఎన్ని రోజులు వుంటుంది అన్నది సమస్య. దసరా తరువాత నిరంకుశ, నిర్బంధ చట్టాల దుమ్ముదులుపుతారు. ఆర్‌టిసి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి వారికే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. యావత్ వుద్యోగ, కార్మికులకూ ఆ ముప్పు పొంచి వుంది.