Tags

, , , ,

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయంగా ప్రధాని నరేంద్రమోడీ నాయక (ప్రజా) రంజకత్వం సహజంగా పెరిగిందా లేక కృత్రిమంగా పెంచారా అని తర్జన భర్జనలు పడేవారున్నారు. ఏది జరిగినప్పటకీ పెరిగిందనే ఎక్కువ మంది భావిస్తున్నారు. ఏకీభవించటమా లేదా అన్నది ఎవరిష్టం వారిదే.
ఎక్కువ మంది భావిస్తున్నదాని ప్రకారం మోడీ-ప్రపంచ నేతలు ఎవరి అవసరాల కోసం వారు పరస్పరం సహకరించుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హౌడీ మోడీ కార్యక్రమం సందర్భంగా హూస్టన్‌ స్డేడియంలో జరిగిన సభ. దానిలో మోడీ గారు ట్రంప్‌కు ఎన్నికల ప్రచారం చేశారు. దానికి ప్రతిగా మోడీ దేశపిత అని ట్రంప్‌ బదులు తీర్చుకున్నారు. హూస్టన్‌ అభిమానుల సంబరం అంబరాన్ని అంటితే, వెలుపల నిరసనకారుల అసమ్మతి కూడా వెల్లడైంది. అయితే ‘నిష్పాక్షికం’ అని చెప్పుకొనే మీడియా ఆనంద సమయంలో అసమ్మతి వినిపించటం, కనిపించటం అశుభం అని కాబోలు స్డేడియం లోపలి హేలనే చూపింది తప్ప వెలుపలి గోలను పట్టించుకోలేదు.
చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ మహాబలిపుర ఇష్టాగోష్టి సమావేశానికి రాక సందర్భంగా చైనాను మనం ఎలా కట్టడి చేయవచ్చో కథలతో పాటు మనకు నమ్మదగ్గ మిత్ర దేశం కాదని మీడియా హితవు చెప్పి కాషాయ దళాల ముందు తన దేశభక్తిని ప్రదర్శించుకుంది. జింపింగ్‌తో కలసి మహాబలిపుర సందర్శన చేస్తే వచ్చే ప్రచారంలో మోడీ వాటా సగమే. అందువలన పైచేయి సాధించేందుకు శనివారం పొద్దున్నే లేచి ఒక సంచి భుజాన వేసుకొని మహాబలిపురం బీచ్‌లో పడివున్న ప్లాస్టిక్‌ సీసాలను సేకరించి స్వచ్చ భారత్‌ గురించి చెప్పటమే కాదు ఆచరించి చూపిన ప్రధానిగా ప్రత్యేక ప్రచారాన్ని పొందారు.

ఇద్దరు మహానేతలు సందర్శనకు వచ్చే సమయంలో బీచ్‌లో వ్యర్ధాలను కూడా తొలగించరా ! ఇదేమి మర్యాద ? ప్రపంచ అగ్రనేతలు వచ్చే సమయాల్లో ఎంతో ముందుగానే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని అణువణువూ గాలించి ఎలాంటి పేలుడు పదార్ధాలు సముద్ర తీరంలో లేవని నిర్ధారించుకుంటారు కదా ! పర్యటన ముగిసే వరకు సాధారణ పర్యాటకులను రానివ్వరు కదా ! అలాంటపుడు వ్యర్ధాలు వేయటాన్ని సిబ్బంది ఎలా అనుమతించారు? ఎలా వదలివేశారు అని అంతర్జాతీయ మీడియాలో కాస్త బుర్రవున్నవారు ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి ? ఇలాంటి నాటకీయ చర్యలతో మోడీ ప్రతిష్ట పెరుగుతుందా ?

Image result for narendra modi swachh bharat mahabalipuram
రోజూ ఎందరో యువతీ యువకులు సంచులను భుజాన వేసుకొని వీధుల్లో చెత్తను ఏరుకుంటూ పొట్టపోసుకొనే దృశ్యాలు మనం చూసేవే. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి వారి సంఖ్య ఐదు లక్షలని, దేశం మొత్తం మీద 15 నుంచి 40లక్షల మంది వరకు వున్నారని ఒక అంచనా. వారి గాధలను మీడియా ఏమేరకు ఇచ్చిందో మనకు తెలియదు. ప్రధానికి వచ్చే రేటింగ్‌కు వారికి రాదు. స్వచ్చ భారత్‌, ప్లాస్టిక్‌పై నిషేధం అమలు జరిగితే వారిలో కనీసం సగం మందికి ఆ వుపాధిపోవటం ఖాయం.( ఈ విశ్లేషణ రాసే సమయానికి మహాబలిపుర ఇష్టాగోష్టి ఫలితాలు వెలువడలేదు. కనుక మీడియాలో వెల్లడైన కొన్ని అంశాలకు మాత్రమే ఇది పరిమితం అని గమనించ మనవి)
కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారి అంతరంగం ప్రకారం(బహిరంగంగా చెబితే మన ఖర్మ ఎలా కాలుతుందో అనే భయం కావచ్చు) రెండో సారి నరేంద్రమోడీకి అంతగా కలసి రావటం లేదట. అంతర్జాతీయంగా నేతల ప్రశంసలు తప్ప మిగతా అంశాలలో దేశీయ ఆర్ధిక రంగంలో అన్నీ అశుభాలే ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అదే సిద్దాంతం ప్రకారం ఎవరు చేసిన దానిని వారు అనుభవించకతప్పదని ఎవరైనా అంటే మనోభావాలను కించపరిచే, దేశద్రోహలు అయిపోతారు.’ ఇదేమి ఖర్మమో ‘ !

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
గత ఐదు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచ మార్కెట్లో పోటీకి తట్టుకొనేదిగా తయారు చేస్తున్నామని నరేంద్రమోడీ చెప్పుకోవటాన్ని కొందరు అంగీకరించకపోయినా ఎక్కువ మంది జేజేలు పలికారు. మరి అదేమిటో ఏ రోజు ఏ పత్రిక తిరగేస్తే, ఏ టీవీని చూస్తే ఆర్ధిక రంగంలో దిగజారుడు ఏ ఏడాదితో పోలుస్తారో అని సందేహించాల్సి వస్తోంది. దవోస్‌ కేంద్రంగా పనిచేసే ప్రపంచ అర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) రూపొందిస్తున్న ప్రపంచ పోటీతత్వ సూచిక 2019లో మన దేశం గత ఏడాది కంటే పది పాయింట్లు దిగజారి 68వ స్ధానంలోకి పోయింది. 2008-09 నుంచి ప్రారంభమైన ఈ సూచికలో పదేండ్ల క్రితం చైనా 30వ స్ధానంలో వున్నది. స్ధిరంగా నిలుపుకోవటం లేదా మెరుగుపరచుకోవటం తప్ప అంతకంటే దిగజారలేదు, తాజా సూచికలో 28వ స్దానంలో వుంది. అదే మన దేశం విషయానికి వస్తే 50వ స్ధానంతో ప్రారంభమైంది. తాజా సూచిక 68. మెరుగుపడటం లేదా కనీసం స్ధిరంగా వుండటం లేదన్నది స్పష్టం. ఇదంతా ఎప్పుడు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ విరుచుకొని ఐదేండ్లు సాము చేసిన తరువాత !

నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయ గాధలలో వినిపించేది దేశపు సులభతర వాణిజ్య సూచిక. 2014లో 142గా వున్నది 2018 నాటికి 77వ స్ధానానికి ఎగబాకటం. ఇది రాస్తున్న సమయానికి 2019 సూచిక ఇంకా వెలువడలేదు. అది మరింత ఎగబాకినా, దిగజారినా నరేంద్రమోడీకి సంకటమే. సులభతరవాణిజ్య సూచిక ఇంకా ఎగబాకితే ఆర్ధిక వ్యవస్ధలో కనిపిస్తున్న ‘అశుభాల’ సంగతేమిటని జనం ప్రశ్నించకపోయినా ఆలోచిస్తారు. జనం మెదళ్లు పని చేయటం ప్రారంభించటం పాలకులకు ఎల్లవేళలా ప్రమాదరకమే. సూచిక దిగజారితే కబుర్లు తప్ప మాకు ఒరగబెట్టిందేమీ లేదని కార్పొరేట్‌ శక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి. వారి సంఖ్య తక్కువ, వారేమనుకుంటే మాకేం జాతీయ భావాలతో ఓటేసే జనం వుండగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జనం రంగంలోకి రానంత వరకు ఏ పాలకుడిని ఎప్పుడు అందలమెక్కించాలో, ఎప్పుడు దించాలో నిర్ణయించేది వారే.
అమెరికా-చైనా వాణిజ్య యుద్దంతో దెబ్బలాడుకుంటుంటే చైనా కంపెనీలు మన దేశానికి తరలి వస్తాయని, మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే మనం చెప్పినట్లు చైనా వింటుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మీడియా ‘అగ్రహారీకులు’ కొందరు దీనికి అనుగుణ్యంగా అమెరికా తరువాత చైనా వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకొనేది మనమే అన్నట్లుగా తాము నమ్మటమే కాదు, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

2018 వివరాల ప్రకారం చైనా నుంచి వంద రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి జరిగితే మన దేశానికి వచ్చినవి అక్షరాలా మూడు రూపాయల పదిపైసల కిమ్మత్తు కలిగినవి. మన కంటే ఎగువన వున్న ఆరు దేశాలు, ప్రాంతాలు 48.10 రూపాయల విలువగల వస్తువులను దిగుమతులు చేసుకున్నాయి. వాటిలో అమెరికా 19.20, హాంకాంగ్‌ 12.10, జపాన్‌ 5.40, దక్షిణ కొరియా 4.40, వియత్నాం 3.40, జర్మనీ 3.10 చొప్పున దిగుమతి చేసుకున్నాయి. అందువలన మన కోడి కూయకపోతే చైనాకు తెల్లవారదు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా వస్తువుల ఎగుమతుల వైఫల్యం, మేడిన్‌ చైనా దిగుమతులు చేసుకుంటున్నట్లు అంగీకరించటమే.

గత రెండు దశాబ్దాలలో చూస్తే ఉభయ దేశాల మధ్య వాణిజ్య గణనీయంగా పెరిగింది.2000-01లో చైనా నుంచి దిగుమతులు 150 కోట్ల డాలర్లయితే మన ఎగుమతులు 83.1కోట్ల డాలర్లు, తేడా 67.1కోట్ల డాలర్లు. అదే 2008-09 నాటికి మన దిగుమతులు 32 బిలియన్లకు పెరగ్గా ఎగుమతులు 2007-08 నాటికి పదిబిలియన్‌ డాలర్లకు మించలేదు.2012 -13లో గరిష్టంగా 18 బిలియన్లకు చేరాయి తరువాత ఐదు సంవత్సరాల పాటు 13 బిలియన్‌ డాలర్లకు మించి జరగలేదు. చైనా నుంచి దిగుమతులు మాత్రం రెట్టింపు అయ్యాయి.2018లో మన ఎగుమతులు 16.5 బిలియన్‌ డాలర్ల కిమ్మత్తు కలిగినవి. మన కంటే చైనా దిగుమతులు 57.4బిలియన్‌ డాలర్లు ఎక్కువ, అంటే 74 బిలియన్‌ డాలర్ల మేర మనం దిగుమతులు చేసుకున్నాం. కమ్యూనిస్టు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవటం నేరం, ఘోరం, దేశద్రోహం అని ఎవరైనా అంటే పై అంకెలను బట్టి అతల్‌ బిహారీ వాజ్‌పేయి, తరువాత ఏలుబడి సాగించిన మన్మోహన్‌ సింగ్‌ కంటే నరేంద్రమోడీ పెద్ద దేశద్రోహం చేసినట్లే ! చైనాతో పోలిస్తే ఘోరంగా విఫలమైనట్లే ? ఈ ఐదేండ్ల కాలంలో సామాజిక మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కాషాయ దళాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. నరేంద్రమోడీ ఆచరణ భిన్నంగా వుంది.

ఇటీవలి కాలంలో మన మీడియాలో చైనా నుంచి వలసపోతున్న కంపెనీల గురించి వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అది వాస్తవమే, అయితే చైనాలో వున్న ఫ్యాక్టరీలెన్ని వాటిలో తరలిపోయే వాటి శాతం ఎంత అన్న నిర్దిష్ట సమాచారం లేదు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది మన సంస్కృతి అని ఒక వైపు చెబుతూనే మన దేశంలో రోజు రోజుకూ మూతబడుతున్న ఫ్యాక్టరీల గురించి పట్టని మీడియా చైనా ఫ్యాక్టరీల గురించి అత్యుత్సాహం ప్రదర్శించటాన్ని ఏమనాలి?
చైనా నుంచి తరలిపోతున్న ఫ్యాక్టరీలు ఎక్కువగా వియత్నాం, తైవాన్‌, చిలీలకు పోతున్నాయన్నది తాజాగా వెలువడిన ఒక విశ్లేషణ సారాంశం. దీనికి అమెరికాతో వాణిజ్య యుద్దం కంటే ఇతర కారణాలు ప్రధానంగా పని చేస్తున్నాయని, ఈ పోటీలో నష్టపోయేది దక్షిణాసియా అంటే భారత్‌ అని కూడా చెబుతున్నారు. రెనే యువాన్‌ సన్‌ అనే పరిశోధకురాలు ‘ తదుపరి ప్రపంచ ఫ్యాక్టరీ : చైనా పెట్టుబడులు ఆఫ్రికాను ఎలా పున:రూపకల్పన చేస్తున్నాయి ‘ అనే గ్రంధం రాశారు. ఆమె తాజాగా రాసిన విశ్లేషణ సారాంశం దిగువ విధంగా వుంది.

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
‘ గత దశాబ్దకాలంగా ముందుకు వస్తున్న ఒక ముఖ్యమైన ధోరణిని వాణిజ్యయుద్దం కేవలం వేగవంతం చేసింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా చైనా వుత్పత్తిదారులు కార్మికులను తగ్గించే యాంత్రీకరణ సాంకేతికతల మీద పెట్టుబడులు పెట్టటమా లేక ఫ్యాక్టరీలను వేరే చోట్లకు తరలించటమా అన్నది ఎంచుకోవాల్సి వుంది. రెండవ అంశాన్ని వారు ఎంచుకుంటున్నారు. తమ దేశంలో పెద్ద సంఖ్యలో జనాభా వుంది కనుక పెట్టుబడిదారులు వాలిపోతారనే మితిమీరిన విశ్వాసాన్ని భారత్‌ వదిలిపెట్టాలి.’
మరో విశ్లేషకుడు ఎమాన్‌ బారెట్‌ చెప్పిన అంశాల సారం ఇలా వుంది.’ తయారీదారులు చైనాను వదలి వెళ్లాలని చూస్తున్నారు, అయితే అదంతా వాణిజ్య యుద్దం వలన కాదు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రకటించక ముందే చైనా వేతన ఖర్చులు పెరుగుతున్నాయి. 2008 గ్వాంగ్‌డూయింగ్‌ రాష్ట్రంలో కనీసవేతనం 4.12 యువాన్లు వుంటే 2018నాటికి 14.4యువాన్లకు పెరిగింది. జౌళి కర్మాగారాలు అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తరలిపోవాలని కోరుకుంటున్నాయి. సాంకేతికత తక్కువగా వుండే ఇలాంటివి తరలిపోవటం దీర్ఘకాలంలో చైనాకు అనుకూలంగా మారతాయి.2015లో చైనా ప్రకటించిన మేడిన్‌ చైనా 2025 ప్రకారం ఆధునిక తయారీ కేంద్రంగా మారాలన్నది లక్ష్యం. తక్కువ ఖర్చుతో పని చేసే ఫ్యాక్టరీలు తరలిపోతే మిగిలినవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది. జర్మనీ పరిశ్రమ 4.0 నవీకరణ చేసేందుకు బిలియన్ల డాలర్లను సమకూర్చుకుంటున్నది, చైనా విధానం కూడా దానికి దగ్గరగా వుంది. పశ్చిమ దేశాల సాయం లేకుండా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకోగలదా అనే సమస్య వాణిజ్య యుద్ధాన్ని తొందరపరచింది. అనేక కంపెనీలు పూర్తిగా చైనాను వదలి పెట్టాలని అనుకోవటం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం రెండవ పెద్ద మార్కెట్‌గా వున్న చైనాను వదలి పెట్టాలని ఎవరూ అనుకోవటం లేదు. ప్రధాన మైన భాగాలను చైనాలో తయారు చేసి వాటిని నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలించి అక్కడ ఆ దేశాల పేరుతో అంతిమంగా వస్తువులను తయారు చేసి ఇవ్వాలనే అనే ఆలోచనతో వున్నాయి.(ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మారుతీ కార్ల ప్రధాన భాగాలు జపాన్‌లో తయారు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు తరలించి ఆయా దేశాల బ్రాండ్ల పేరుతో వాటిని విక్రయించిన మాదిరి) ”

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
ఈ నేపధ్యంలో చైనా నుంచి మన దేశానికి వచ్చే ఫ్యాక్టరీల మీద ఆశపెట్టుకోవటం మబ్బులను చూసి ముంతలోని నీరు పారపోసుకోవటం తప్ప వేరు కాదు. ఒక వేళ వచ్చినా అవి ఆధునికమైనవి కాదు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో వస్తూత్పత్తికి అవసరమైన నైపుణ్యం మన దేశంలో లేకపోవటం మన ప్రపంచ పోటీతత్వ సూచికలో మన వెనుకబడటానికి, దిగజారటానికి కారణాల్లో ఒకటన్నది స్పష్టం. జనాభా ఎంత మంది అన్నది కాదు, వారిలో ఎందరికి నైపుణ్య సామర్ధ్యం సమకూర్చామన్నది ముఖ్యం. ఈ విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ విజయం సాధించిందా ? వైఫల్యం చెందిందా ? యాభైఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయలేనిదాన్ని ఐదేండ్లలో, 70 ఏండ్లలో చేయలేని దాన్ని 70 రోజుల్లో చేశామని చెప్పుకుంటున్నవారు ఈ విషయంలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?