Tags

, ,

Image result for TSRTC staff strike-some illogical arguments

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు ఐదవ తేదీ నుంచి జరుగుతున్న సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్‌టిసి కార్మికులు నిర్ణయించారు. వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అదేశించారు. ఈ సందర్భంగా ముందుకు వస్తున్న వాదనల తీరుతెన్నులను చూద్దాం.
ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదని పాలక టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. నిజమే పెట్టలేదు.ఆర్‌టిసిలో 20శాతం రూట్లను ప్రయివేటు వారికి ఇస్తామని కూడా టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పనిదాన్ని అమలు జరపాలని కెసిఆర్‌ ఎందుకు ఆదేశించినట్లు ? నామాటే శాసనం అన్నట్లుగా మాట్లాడే కెసిఆర్‌ తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ అధికారానికి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారు అన్నారు. మరి దాన్నెందుకు నిలబెట్టుకోలేదు. పోనీ దళితులకు భూమి వాగ్దానం ఎందుకు అమలు జరపలేదు.
మన దేశంలో పార్టీల ఎన్నికల ప్రణాళికలు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వంటివే తప్ప ఓటర్లకు హక్కులు ఇచ్చేవి కాదు. టిఆర్‌ఎస్‌ చెబుతున్నదాని ప్రకారం ప్రణాళికలో పెట్టిన వాటిని ఎంతమేరకు అమలు జరిపారు ? మచ్చుకు 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి మండల కేంద్రంలో 30పడకలు, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకలు, ప్రతి జిల్లా కేంద్రంలో (24) నిమ్స్‌ తరహా ఆసుపత్రులు అని చెప్పారు. ఎన్ని చోట్ల అమలు జరిపారో చెప్పగలరా ? వాటి అమలుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారో వివరించగలరా ?
2018 ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా ? గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి మొత్తం అమలు జరిపామని, అవిగాక రైతు బంధువంటి చెప్పని కొత్త పధకాలు అమలు జరిపామని కూడా చెప్పుకున్నారు. అందువలన వారి మాదిరే ఆయా పరిస్ధితులను బట్టి వివిధ తరగతులు కూడా ఎన్నికల ప్రణాళికలతో నిమిత్తం లేకుండా తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టే హక్కు కలిగి వున్నారు.
ఉద్యోగులు లేదా ఇతర కష్టజీవులు కోరుతున్న లేదా లేవనెత్తే న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికకు ముడిపెట్టటం ఒక ప్రమాదకర పోకడ. ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయానికి రావటం విధి. దాన్ని ఎన్ని రోజులు నిర్వహించారు? సిఎం కార్యాలయానికి రారు, నివాసాన్నే కార్యాలయంగా చేసుకుంటారని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదే ?
రోడ్డు రవాణా సంస్ధల విలీనం ఇతర రాష్ట్రాలలో లేదని అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతు బంధును తెలంగాణాలోనే ప్రవేశపెట్టామని చెప్పుకున్నవారు ఈ విషయంలో చొరవ ఎందుకు చూపకూడదు? విలీనం చేయకూడదనే అడ్డంకులేమీ లేవు కదా ! అసలు అలా విలీనం చేస్తే తలెత్తే సమస్యలేమిటో, ఎందుకు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారో రాష్ట్రప్రజలకు, కార్మికులకు చెప్పకుండా ఇతర రాష్ట్రాల గురించి అడ్డగోలు వాదనలు ఎందుకు?
హర్యానా, పంజాబ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్‌, చండీఘర్‌ వంటి చోట్ల బస్సు సర్వీసులు ప్రభుత్వశాఖల్లో భాగంగానే నిర్వహిస్తున్న విషయం టిఆర్‌ఎస్‌ నేతలకు తెలియదా ? వాటి సంగతేమిటి ?
విలీన డిమాండ్‌ రావటానికి కారణం ఏమిటి ? ప్రయివేటు బస్సుల కంటే ఆర్టీసి బస్సులకు పన్ను ఎక్కువ, గతంలో వున్న ఆర్టీసి ఒక డీలరుగా డీజిల్‌, పెట్రోలు కొనటం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్ధకు జమచేసే వారు. డీలరుషిప్పులను రద్దు చేసి ప్రయివేటు వారికి లబ్ది కలిగించారు. రాయితీలు ప్రకటించేది ప్రభుత్వం-అమలు జరపాల్సింది ఆర్‌టిసి. వచ్చే నష్టాన్ని ప్రభుత్వం సంస్ధకు చెల్లించటంలేదు. ప్రయివేటు బస్సులు స్టేజికారేజ్‌లుగా తిరుగుతూ ఆర్‌టిసి ఆదాయానికి గండిగొడుతుంటే పాలకులకు పట్టదు. నష్టాలకు అదొక కారణం. వాటిని నియంత్రించే అధికారం ఆర్‌టిసికి లేదు. రవాణాశాఖ తాను చేయాల్సిన పని తాను చేయదు. అందుకే అసలు ఇవన్నీ ఎందుకు విలీనం చేసి ప్రభుత్వమే నడిపితే పోలా అనే విధంగా కార్మికులలో ఆలోచన కలిగించింది ప్రభుత్వ పెద్దలు కాదా ?

Image result for TSRTC staff strike-some illogical arguments
ప్రయివేటీకరణ విషయంలో బిజెపి, కాంగ్రెస్‌ రెండు నాల్కలతో మాట్లాడితే, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే వాటి గురించి జనమే తేల్చుకుంటారు. బిజెపి నేడు కేంద్రంలో అనేక అప్రజాస్వామిక అంశాలను ముందుకు తెస్తున్నది, వాటన్నింటినీ సమర్ధిస్తున్నది టిఆర్‌ఎస్‌. తమ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండుగా చీల్చాలని, ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని ఏ కాశ్మీరీ అయినా టిఆర్‌ఎస్‌ను అడిగారా ? ఆర్టికల్‌ 370 రద్దు బిజెపి వాగ్దానం, మరి దానికి టిఆర్‌ఎస్‌ ఎందుకు మద్దతు ఇచ్చినట్లు ? కాశ్మీర్‌ రాష్ట్ర హొదా రద్దు ఏ పార్టీ ప్రణాళికలోనూ లేదు, దానికి ఎందుకు పార్లమెంట్‌లో ఓటువేసినట్లు ? టిఆర్‌ఎస్‌ తన ప్రణాళికలో వాటి గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదే !
రైల్వేల ప్రయివేటీకరణ గురించి ఇప్పుడు టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారు? వాటి మీద పార్టీ వైఖరి ఏమిటి? వ్యతిరేకమైతే ఎప్పుడైనా నోరు విప్పారా ? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నట్లు ? కేంద్రంలో బిజెపి చేస్తే లేని తప్పు తాము చేస్తే ఎలా తప్పు అని అంటున్నారు తప్ప తాము ఆ తప్పు చేయటం లేదు అని ఎందుకు చెప్పరు ? అటు రైల్వేలు, ఇటు ఆర్‌టిసి ప్రయివేటీకరణ అయితే జేబులు గుల్ల చేసుకొనేది జనమే. ఇదంతా తోడు దొంగల ఆటలా వుందంటే తప్పేముంది?
1990 నుంచి అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్దల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వాలు వదిలించుకోవాలన్నది ఒక షరతు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్ధలను నిర్వీర్యం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌,చత్తీస్‌ఘర్‌, ఝార్కండ్‌ వంటి చోట్ల మూసివేశారు. తెలంగాణా విధానం కూడా అదే అయితే సూటిగా చెప్పాలి. న్యాయమైన కోర్కెలకోసం జరుపుతున్న ఆందోళనను సాకుగా తీసుకొని మూసివేతకు లేదా నిర్వీర్యానికి పూనుకోవటాన్ని ఏమనాలి? అలాంటి చోట్ల విద్యార్ధులు, వుద్యోగులు, ఇతర తరగతులకు మన ఆర్టీసిల్లో మాదిరి వుచిత పాస్‌లు, రాయితీలు కోల్పోయారు. కెసిఆర్‌ కూడా అందుకు శ్రీకారం చుడితే సూటిగా చెప్పాలి.

Image result for TSRTC staff strike
ప్రభుత్వశాఖలో ఆర్టీసి విలీనం డిమాండ్‌ను ప్రతిపక్షాలు ముందుకు తేలేదు,సిబ్బంది సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సమ్మెలోకి పోయేంతవరకు విలీనంతో సహా ఏ ఒక్క డిమాండ్‌ గురించి చర్చలు జరపని సర్కార్‌ కార్మికులకు మద్దతు ప్రకటించిన పార్టీల మీద విరుచుకుపడటం ఏమిటి? అసలు వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి?
బస్సులన్నీ నడుస్తున్నాయని ఒక వైపు చెబుతారు, మరోవైపు విద్యాసంస్ధలకు సెలవులను పొడిగిస్తారు. సిబ్బంది ఉద్యోగాలన్నీ పోయినట్లే అని ప్రకటిస్తారు? మరోవైపు రోజువారీ పని చేసే తాత్కాలిక వుద్యోగులను నియమించాలని ఆదేశాలిస్తారు? బస్సులు నడిపేందుకు రిటైరైన వారిని నియమించాలని చెప్పటం అంటే ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు నిర్ణయించటం తప్ప జవాబుదారీతనం వున్న ప్రభుత్వం చేసే పనేనా ?