Tags

, , ,

Image result for savarkar, chitragupta

ఎం కోటేశ్వరరావు
విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చితే ఫలాన చర్యలు చేపడతామని ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము వినాయక దామోదర్‌ సావర్కర్‌కు (విడి సావర్కర్‌) భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి పరోక్షంగా తన హిందూత్వ అజెండాకు ఆమోదం పొందేందుకు పూనుకుంది. పెన్సిలిన్‌ ఇంజక్షన్లు అందరి శరీరాలకు సరిపడవు. అందువలన పరీక్ష చేసేందుకు రోగికి పరిమిత మొత్తంలో ముందు ఎక్కించి వికటించిన లక్షణాలు కనిపించకపోతే నిర్ణీత డోనుసు అందించటాన్ని మనం చూశాము. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగం బిజెపి ద్వారా అటువంటి ప్రయోగానికే పూనుకుందని చెప్పవచ్చు. సావర్కర్‌ ఒక్కడి గురించి చెబితే తలెత్తే వ్యతిరేకతను నీరు గార్చేందుకు లేదా ఒక ఎత్తుగడగా మహారాష్ట్రకు చెందిన సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే పేర్ల సరసన సావర్కర్‌ను చేర్చారు. ఇది పూలే దంపతులను అవమానించటం తప్ప మరొకటి కాదు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మతోన్మాద శక్తులు తప్ప వామపక్ష భావజాలం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధను కోరుకొనే వారి వరకు సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రాతిపదికగా పని చేశారు. దేశంలో ఉన్న సామాజిక పరిస్ధితుల్లో లౌకిక వాదం ఒక ఐక్యతా శక్తిగా పని చేసింది. అందువల్లనే మన చరిత్రను దానికి అనుగుణ్యంగానే చరిత్రకారులు రచించారు. అనేక మంది చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంలో శాస్త్రీయంగా రూపొందించేందుకు ప్రయత్నించారు. వారిలో కమ్యూనిజంతో సంబంధం లేని వారు, కమ్యూనిస్టులు కాని వారు ఎందరో ఉన్నారు.

బిజెపి నయా భారత్‌ , నయా దేశ పిత, నయా భారత రత్నలు !
జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కోణంతో చూసే తిరోగమన శక్తులు మతకోణంతో చరిత్రను జనాల మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా మతోన్మాద భావజాల ప్రాతిపదికగా పని చేసే వారు పార్లమెంటరీ వ్యవస్ధలోని నాలుగు ప్రధాన పదవులైన తొలిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్లుగా బాధ్యతల్లో ఉన్న సమయమిది. గతంలో అనేక రంగాలలో ఆశక్తులు ప్రవేశించినప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగిన సమయమిదే. అంటే ఆ శక్తులు విజయం సాధించాయి. వారి చర్యలు ఇప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ చరిత్ర గురించి చెప్పిన అంశాలను గుర్తుకు తెస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ తాను నూతన భారత్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పుకోవటం ద్వారా నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ పిత అని వర్ణించాడు. దేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన భారత రత్నలో మతోన్మాదులు ఎవరూ లేరు. నయా భారత్‌ కనుక రాబోయే రోజుల్లో వారే నిజమైన జాతీయవాదులు, జాతి రత్నాలుగా చరిత్రకు ఎక్కనున్నారంటే అతిశయోక్తి కాదు.

విప్లవకారుడు-విద్రోహి -మతోన్మాది !

మన దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ వాద భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు సుభాస్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే యువకులు బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు సావర్కర్‌ తోడ్పడ్డారని, స్వాతంత్య్ర సమరాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ భావజాలాన్ని ముందుకు తెచ్చారని విమర్శకులు పేర్కొన్నారు. చివరకు మహాత్మా గాంధీ హత్యకేసులో కూడా సావర్కర్‌ ఒక ముద్దాయని, సాంకేతిక కారణాలతో కేసునుంచి బయటపడ్డారని పరిశీలకులు పేర్కొన్నారు.

Image result for vd savarkar chitraguptaఇద్దరు దేశ భక్తులు – రెండు లేఖలు- ఎంత తేడా !
సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడు. అదే సావర్కర్‌ విషయానికి వస్తే తనను జైలు నుంచి విడుదల చేసిన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిపోయి స్వాతంత్య్ర వుద్యమం నుంచి దూరం అయ్యాడు. హిందూత్వశక్తిగా మారాడు.

ద్విజాతి సిద్ధాంతం, పాక్‌ ఏర్పాటును కోరిన ముస్లింలీగ్‌తో అధికారం !

పాకిస్ధాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి రెండు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. 1948 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్‌ నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర గురించి ప్రస్తావించారు. హిందూమహాసభకు చెందిన మతపిచ్చిగల వారు నేరుగా సావర్కర్‌ నాయకత్వంలో చేసిన, అమలు జరిపిన కుట్రలో భాగంగానే బాపూ హత్య జరిగిందని పేర్కొన్నారు. కుట్ర గురించి విచారణ జరిపిన కపూర్‌ కమిషన్‌ కూడా పటేల్‌ వ్యాఖ్యలను నిర్ధారించింది.

Related image
సావర్కర్‌ ‘విలువల ‘ ప్రాతిపదికన జాతి నిర్మాణం-మోడీ !

సావర్కర్‌ విలువల ప్రాతిపదికనే జాతీయవాదంతో జాతి నిర్మాణం జరుగుతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారే వీర సావర్కర్‌ను కించపరుస్తూ ఇంతవరకు భారత రత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.సావర్కర్‌ భరతమాత నిజమైన పుత్రుడని గతంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వారు కొద్ది రోజులు పోతే మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేకు సైతం భారత రత్న ఇస్తారని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తే సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా గుర్తించింది సావర్కర్‌ అని హౌమంత్రి అమిత్‌ షా ఒక సభలో చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ఇందిరా గాంధీ స్వయంగా సావర్కర్‌ను అనుసరించారని ఆయన సమీప బంధువు రంజీత్‌ చెప్పారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని బిజెపి చెప్పిన అంశం జనం ముందు వుంది. అది తప్పనుకుంటే జనం వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నాడు.

కాంగ్రెస్‌ అవకాశవాదం !
వాజ్‌పేయి ప్రధానిగా వున్న సమయంలో సావర్కర్‌ చిత్రపటాన్ని పార్లమెంట్‌ హాలులో పెట్టాలన్న స్పీకర్‌ మనోహర్‌ జోషి ప్రతిపాదనను కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. స్పీకర్ల ప్రతిపాదనలను ఎవరూ వ్యతిరేకించరని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ స్మారక నిధికి 1970లో వ్యక్తిగతంగా పదకొండు వేల రూపాయల విరాళం ఇచ్చారని, ఆయన స్మారకంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారని అయితే సోనియా గాంధీ సావర్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని బిజెపి విమర్శలు కురిపించింది. బ్రిటీష్‌ పలకులకు సావర్కర్‌ క్షమాభిక్ష పెట్టమని లేఖలు రాసిన విషయం ఇందిరా గాంధీకి తెలిసి వుండకపోవుచ్చు, తెలిసిన తరువాత సోనియా గాంధీ ఎందుకు సమర్ధించాలి అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి.సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు, అయితే ఆయన హిందూత్వను మాత్రం అంగీకరించం అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.

Image result for savarkar, chitraguptaImage result for savarkar, chitragupta
వీర సావర్కర్‌ బిరుదు వెనుక అసలు కధ !
సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.

Image result for vd savarkar chitragupta
అతిశయోక్తులు – అవాస్తవాలు !
‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

ఆవు దేవత కాదన్న సావర్కర్‌ !
గోమాత అంటూ గోరక్షకుల పేరుతో కొందరు చేసిన దాడులతో మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అడుగంటిన విషయం తెలిసిందే. అసలైన హిందూ హృదయ సామ్రాట్‌గా పరిగణించే సావర్కర్‌ ఆవు ఒక సాధారణ జంతువు తప్ప దేవత కాదని అన్నారు. అవి మానవులకు ఉపయోగపడతాయి గనుక వాటిని కాపాడుకోవాలి తప్ప దేవతలు కాదని రాశారు. పాలకు ప్రతీక ఆవు తప్ప హిందూ దేశానికి కాదని కూడా పేర్కొన్నారు.
‘స్వంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు సావర్కర్‌కు ఉంది. ఆయన హేతువాదాన్ని నమ్మారు.మనోద్వేగాల కంటే వుపయోగితావాదానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే అదే సమయంలో గాంధీ కూడా ప్రజల మనోద్వేగాలను గౌరవించారు ‘ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజివైద్య వ్యాఖ్యానించారు.

అమిత్‌ షా అతియోక్తి !
1857లో జరిగిన ఉదంతాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటీష్‌ పాలకులు ప్రచారం చేశారు. కొందరు చరిత్రకారులు కూడా అదే విధంగా చూశారు. అయితే ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు.

హిందూత్వ-నాజీ పోలిక !
హిందూత్వ ఒక జీవన విధానం తప్ప మతానికి సంబంధించింది కాదని సంఘపరివార్‌ శక్తులు పదే పదే చెబుతారు, కొంత మంది అది నిజమే అనుకుంటున్నారు. యావత్‌ ప్రపంచం హిట్లర్‌ మూకలు, అనుయాయులను నాజీలు అని పిలిచే విషయం తెలిసిందే. అయితే హిట్లర్‌, ఆతగాడి అనుయాయులు ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు, తమను జర్మన్‌ జాతీయ సోషలిస్టులుగా, తమది జాతీయ సోషలిజంగా వర్ణించుకున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన హిందూత్వశక్తులుగా రంగంలో వున్నాయి. హిందూత్వకు సావర్కర్‌ ప్రతీకగా వున్నారు. స్వాతంత్య్రవుద్యమసమయంలో సావర్కర్‌ భావజాలాన్ని మరాఠాలు ఆమోదించలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో అనేక దశాబ్దాలపాటు ఆయన అనుయాయులు చేసిన ప్రచారం కారణంగా అనేక మంది సావర్కర్‌ నిజమైన జాతీయవాది అని భావిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బిజెపి ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ముందు వక్రీకరణలతో గందరగోళాన్ని సృష్టించటం, మెల్లగా తమ అజెండాను ఎక్కించటాన్ని చూస్తున్నాము. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని అమలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ హిందూ మతోన్మాదశక్తులను జాతీయవాదులుగా చిత్రించి అసలైన జాతీయవాదులు, లౌకికశక్తుల మీద దాడి చేస్తున్నారు. దానిలో భాగమే సావర్కర్‌కు భారత రత్న బిరుదు సాధన వాగ్దానం. అది అమలు జరిగితే తదుపరి గాంధీని హత్యచేసిన గాడ్సేను ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. విజేతలే చరిత్రను రాయటం అంటే ఇదే. అందువలన ‘చరిత్రను విస్మరించిన తరానికి గతమూ, భవిష్యత్‌ రెండూ ఉండవు ‘ అని చెప్పిన రాబర్ట్‌ హెయిన్‌లిన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తేవాల్సి ఉంది. ఏది అసలైన చరిత్ర ? ఏది నకిలీ ? వాట్సాప్‌ యూనివర్సిటీ చరిత్ర పాఠాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త ! అక్కడ వైద్య శాస్త్రం చదవకుండా వైద్యం చేసే నకిలీ వైద్యుల మాదిరి చరిత్ర తెలియని వారు సుప్రసిద్ధ చరిత్ర కారులుగా మనకు బోధిస్తారు !