Tags

, ,

Image result for turkey military offensive in syria
ఎం కోటేశ్వరరావు
రాజీ లేదా మారణహౌమం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పౌరులే తమకు ముఖ్యమని, అందుకే సిరియా అధ్యక్షుడు అసాద్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో ఒక అవగాహనకు వచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డిఎఫ్‌) ప్రధాన కమాండర్‌ మజులుమ్‌ అబ్దీ చెప్పారు. కొద్ది రోజులుగా టర్కీ దళాలు సిరియాలోని కర్దుల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరుపుతున్న పూర్వరంగంలో తాజా పరిణామం చేసుకుంది. ఒక వైపు టర్కీ దాడులు కొనసాగిస్తుండగా సిరియా-టర్కీ సరిహద్దుల్లో వుగ్రవాదులకు వ్యతిరేక పోరు పేరుతో దించిన తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది జరగ్గానే సిరియా అధ్యక్షుడితో ఎస్‌డిఎఫ్‌ ఒక అవగాహనకు వచ్చింది. వెంటనే సిరియా దళాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లి టర్కీ దాడులను అడ్డుకునేందుకు సిద్దం అయ్యాయి. ఈ పరిణామంతో యావత్‌ సిరియా ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లు అయిందని, రష్యా, ఇరాన్‌ ఆ ప్రాంతంపై పై చేయి సాధించినట్లే అనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాల్లో ఇది మరొక మలుపు.
టర్కీ ప్రారంభించిన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇది సమగ్రమైనది కాదని తేలిపోయింది. అమెరికా దీన్ని ముందుకు తెచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు పెనెస్‌ ప్రకటించినదాని ప్రకారం సిరియాలోని కర్దు ప్రాంతాలపై ఐదు రోజుల పాటు టర్కీ దాడులను నిలిపివేస్తుంది. అమెరికా తన వంతుగా ఆప్రాంతంలో ఉన్న కర్దు దళాలను అక్కడి నుంచి ఉపసంహరించే విధంగా అమెరికా పని చేస్తుంది. తమ దళాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తాయి తప్ప శాశ్వతంగా కాదని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. టర్కీ-సిరియా సరిహద్దులో 30కిలో మీటర్ల మేర ప్రాంతంలో వున్న తమ దళాలు కొన్ని చోట్ల నుంచి మాత్రమే వెనక్కు పోతాయి తప్ప పూర్తిగా కాదని స్పష్టం చేశారు. తమ దళాలు వెనక్కు వచ్చేందుకు ఒక నడవాను ఏర్పాటు చేయమని అడిగారని, ఇదే సమయంలో టర్కీ దళాలు అందుకు పూనుకోలేదని అన్నారు. మంగళవారం నాటికి కర్దు దళాల ఉపసంహరణ జరగనట్లయితే తిరిగి దాడులను ప్రారంభిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించాడు.
సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ) 354-60 ఓట్లతో తిరస్కరించింది. ఐఎస్‌ తీవ్రవాదుల మీద పోరులో అమెరికాకు కీలక మిత్రులుగా ఉన్న కర్దిష్‌ యోధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటమే అని సిఐఏ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డేవిడ్‌ పెట్రాస్‌ వ్యాఖ్యానించాడు. తమకు పర్వతాలు తప్ప ఇతర మిత్రులు ఎవరూ లేరని కర్దులు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అయితే అమెరికన్లు వారికి మిత్రులే అని ట్రంప్‌ చర్య విద్రోహం తప్ప వేరు కాదని అన్నారు. ఐఎస్‌పై పోరులో పదివేల మంది కర్దులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పటి వరకు సిరియాలోని అమెరికా దళాలు ఐఎస్‌ వ్యతిరేక పోరులో ముందు పీఠీన లేవని పోరాడుతున్న వారికి సాయం చేసే పాత్ర పోషించాయని చెప్పారు.
అమెరికా దళాలు అర్ధంతరంగా ఖాళీ చేసిన సైనిక కేంద్రాన్ని రష్యన్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయని, అక్కడ చూస్తే అమెరికన్లు వదలి వెళ్లిన సగం సగం ఆహార పదార్దాలతో వున్న ప్లేటు బల్లలపై కనిపించాయని ఒక టీవీ పేర్కొన్నది. రష్యన్లు ఐఎస్‌ తీవ్రవాదుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, ఇతర చోట్ల మాదిరే సిరియాలో కూడా వారిని చంపివేస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు మిత్రులుగా మారతారో, శత్రువులుగా తయారవుతారో తెలియని స్ధితి. ఈ ప్రాంతంలోని దేశాలు, అక్కడ వున్న సహజ సంపదలను కొల్లగొట్టటంతో పాటు మిలిటరీ రీత్యా పట్టుసాధించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు మారణహౌమాన్ని సృష్టిస్తూ శాంతిని లేకుండా చేస్తున్నాయి. తన లక్ష్యాల సాధనకు కర్దిస్ధాన్‌ ఏర్పాటుకు తోడ్పడతామని ఆశ చూపుతూ ఆ ప్రాంతంలోని కర్దులను అమెరికా పావులుగా వాడుకొంటున్నది. తామే ప్రవేశపెట్టిన ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో అ క్కడ తిష్టవేయాలని చూసిన అమెరికా, ఐరోపా యూనియన్‌, వాటితో చేతులు కలిపిన టర్కీ దేశాలకు తాజా పరిణామం పెద్ద ఎదురు దెబ్బ.
మజులుమ్‌ అబ్దీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా సిరియా మీద దాడులకు దిగిన జీహాదీ లేదా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే కర్దులు పోరాడారు తప్ప టర్కీ, అమెరికా మిలిటరీ మీద ఒక్క తూటాను కూడా కాల్చలేదు. కర్దు ప్రాంతాలను ఆక్రమించిన ఐఎస్‌ తీవ్రవాదులను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టర్కీ, అమెరికా రెండూ కర్దులకు ఆయుధాలిచ్చాయి. కర్దులు ఐఎస్‌ తీవ్రవాదులను సిరియాలో అదుపు చేశారు. ఇదే సమయంలో అమెరికా హామీ మేరకు దాని మాటలు నమ్మి టర్కీ తమ మీద దాడులకు దిగదనే భరోసాతో కర్దులు టర్కీ సరిహద్దులనుంచి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం టర్కీ అదే ఐఎస్‌ తీవ్రవాదులకు ఆయుధాలిచ్చి సిరియా ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగుతున్నది. ఈ దశలో కూడా సిరియన్‌ కర్దులు అమెరికా మీద విశ్వాసం వుంచి టర్కీ మీద పలుకుబడిని వుపయోగించి సిరియా సమస్యను పరిష్కరించాలనే కోరుతున్నారు. అమెరికా అక్కడి నుంచి తన సైన్యాన్ని ఉపసంహరిస్తానని చెప్పటాన్ని కూడా వారు తప్పుపట్టటం లేదు. దాని ఇబ్బందులు దానికి వున్నాయని సరిపెట్టుకుంటున్నారు. టర్కీ దాడులు తీవ్రతరం కావటంతో విధిలేని పరిస్ధితుల్లో తమ జనాన్ని రక్షించుకొనేందుకు సిరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మిలిటరీని దించేందుకు అంగీకరించామని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. జనాన్ని రక్షిస్తామని సిరియా, రష్యా ప్రతినిధులు చెప్పటాన్ని కూడా మేము పూర్తిగా నమ్మటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, విధిలేని పరిస్ధితుల్లో అంగీకరించాము అన్నారు.
ఆదివారం నాడు కుదిరిన ఒప్పందం మేరకు కర్దు దళాల ఆధీనంలో వున్న రెండు పట్టణాల ప్రాంతాన్ని సిరియా సైన్యానికి అప్పగించారు. గత ఆరు రోజులుగా టర్కీ చేస్తున్న దాడులకు ఉత్తర సిరియాలో ఎందరు మరణించిందీ తెలియదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదమూడువేల మంది ఐఎస్‌ తీవ్రవాదులను తాము బందీలుగా చేశామని కర్దులు ప్రకటించారు. కర్దుల ప్రాంతాలపై దాడుల కారణంగా అనేక వందల మంది ఐఎస్‌ తీవ్రవాదులు బందీల శిబిరాల నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారిని కర్దులే విడుదల చేశారని అమెరికన్‌ మీడియా చెబుతోంది. టర్కీ చర్యలను భారత్‌తో సహా అనేక దేశాలు ఖండించాయి. ఐరోపా యూనియన్‌ టర్కీ మీద ఆంక్షలను విధించాలని తలపెట్టినా దాని మీద వచ్చిన వత్తిడి కారణంగా సభ్యదేశాల విచక్షణకు వదలివేశారు. యుద్ద విమానాలతో సహా టర్కీ ఆయుధాలన్నీ అమెరికా, ఐరోపా దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నది. కర్దు తిరుగుబాటుదార్లను టర్కీ ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. సిరియా విముక్తి సేనపేరుతో వున్న ఐఎస్‌ తీవ్రవాదులను సిరియా విముక్తి ప్రదాతలుగా పరిగణిస్తోంది.
సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సేనలను వుపసంహరించుకుంటామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ టర్కీ వత్తిడికి లొంగిపోయిన ట్రంప్‌ ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో కర్దులు హతాశులయ్యారు. అమెరికా తమను మోసం చేసిందని భావిస్తున్నారు. అందుకే వెంటనే రష్యా మధ్యవర్తిత్వంతో సిరియా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో కర్దులను అణిచివేయటంలో సిరియా ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కర్దుల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత మరోసారి అణచివేతకు పూనుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇంతకాలం ఐఎస్‌ తీవ్రవాదులను అణచేందుకే ఉత్తర సిరియాలో వున్నామని ప్రకటించిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం అంటే మొత్తంగా సిరియాను ప్రభుత్వానికి అప్పగించి తోకముడిచినట్లే అన్నది కొందరి వ్యాఖ్యానం. ఇదే సమయంలో టర్కీతో సిరియా యుద్ద పర్యవసానాలు ఎలా వుంటాయన్నది చూడాల్సి వుంది. తమ దేశంలో తలదాచుకున్న 20లక్షల మంది సిరియన్ల రక్షణ ప్రాంతాలను ఏర్పరచేందుకే తాము దాడులు చేస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ చెబుతున్నాడు.
పశ్చిమాసియాలో అనేక తెగలలో కర్దిష్‌ ఒకటి. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలపై ఆధిపత్య పోరు లో సఫావిద్‌ – ఒట్టోమన్‌ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా కర్దులు గణనీయంగా లేదా మెజారిటీ వున్న ప్రాంతాలు చీలిపోయాయి. సులభంగా అర్ధం చేసుకోవాలంటే నేటి టర్కీ, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌ దేశాలలో ఈ ప్రాంతాలు వున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ముక్కలు చేశారు. తరువాత వాటికి స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో యూదులకు ఇజ్రాయెల్‌ మాతృదేశంతో పాటు కర్దులకు ఆయా దేశాలలో స్వయం పాలిత ప్రతిపత్తి మంజూరును పరిశీలించాలని సామ్రాజ్యవాదులు సూచించారు. టర్కీ తప్ప మిగిలిన దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. టర్కీ అయితే తమ దేశంలో కర్దు అనే పదం వినపడకుండా చేసింది. చివరకు ఆ భాష మాట్లేవారిని కూడా వెంటాడి వేధించింది. కర్దులకు కొండ ప్రాంతాల టర్కులని పేరు పెట్టింది. ఈ నేపధ్యంలో కర్దు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి.పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ ఏర్పాటు నిర్ణయం జరగటం, స్వయంప్రతిపత్తి ప్రాంతాల డిమాండ్‌ను సక్రమంగా అమలు జరపకపోవటంతో అది 1945లో నాలుగుదేశాలలోని కర్దు ప్రాంతాలతో కర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలనే నినాదంగా మారింది.

Image result for Syrian Kurds  fight
కర్దిస్ధాన్‌ సాధనకు నాలుగు దేశాలలో తలెత్తిన ఉద్యమాలు సాయుధ రూపం తీసుకున్నాయి. వాటిని అణచివేయటంలో ఏ దేశ పాలకులూ తక్కువ తినలేదు. ఇదే సమయంలో తన రాజకీయ, ఆధిపత్య ఎత్తుగడలలో భాగంగా అమెరికన్లు నాలుగు చోట్లా కర్దులకు మద్దతు ఇచ్చి వారి తిరుగుబాట్లను ప్రోత్సహించారు. వాటిలో కర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ(పికెకె) ప్రధాన సంస్ధగా ముందుకు వచ్చింది. టర్కీలో కర్దులపై అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్ధులు దీనిని ప్రారంభించారు.1984లో పూర్తి స్ధాయి తిరుగుబాటుగా మారింది.అనేక పరిణామాల తరువాత 2013లో పికెకె కాల్పుల విరమణ ప్రకటించింది. రెండు సంవత్సరాల తరువాత టర్కీ దాడులు, ఇతర పరిణామాల కారణంగా కాల్పుల విరమణ విరమించింది.
ఇరాక్‌, సిరియాలలో కర్దుల స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటును టర్కీ వ్యతిరేకించటమే కాదు, ఆ ప్రాంతాలలోని కర్దులపై తరచుగా దాడులు చేస్తున్నది. ఇరాకీ కర్దు ప్రాంతాలలో తనకు అనుకూలమైన ఉగ్రవాద బృందాలకు సాయం చేసి ఆ ప్రాంతంలో తన తొత్తులను ప్రతిష్టించాలని కూడా టర్కీ చూసింది. ఇప్పుడు అమెరికా,ఐరోపా యూనియన్‌ మద్దతుతో మరోసారి సిరియాలోని కర్దు ప్రాంతాలపై దాడులకు దిగుతున్నది, ఐఎస్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చి సిరియాను అస్ధిరం చేయాలని చూస్తున్నది. మంగళవారంతో ఐదు రోజుల కాల్పుల విరమణ గడువు ముగియనున్నది. ఒప్పందానికి టర్కీ-కర్దులు తమవైన భాష్యాలు చెబుతున్నందున తిరిగి మరోసారి టర్కీ దాడులకు తెగబడుతుందా ? టర్కీని అమెరికా నివారిస్తుందా ?