Tags

, , , , ,

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.