Tags

, ,

Image result for Andhra CM’s DA case

ఎం కోటేశ్వరరావు
ఆర్థిక నేరాల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన వినతిని హైదరాబాద్‌ నాంపల్లి సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామం ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ముందుకు తెచ్చింది. మినహాయింపునకు కోరిన కారణాలతో పాటు అభ్యంతరానికి చెప్పిన కారణాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. సీఎంగా బిజీగా ఉన్నందున, ప్రతివారం హైదరాబాద్‌ వచ్చి వెళ్లాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరారు.
జగన్‌ పిటిషన్‌ విచారణకు అర్హమైందే కాదని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఛార్జిషీట్లు దాఖలై ఆరేళ్లయినా విచారణ ప్రారంభం కాలేదని ఆయన ఏదో ఒక కారణంతో విచారణను జాప్యం చేస్తారని, జగన్‌ పిటిషన్‌లో పేర్కొన్న ఏపీ పునర్విభజన, గత ప్రభుత్వ పనితీరు అంశాలు ఈ కేసుతో సంబంధం లేనివని, జగన్‌ వ్యక్తిగత హౌదాలోనే నిందితుడిగా ఉన్నారని, ఆయనపై నమోదైన అభియోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపుతాయని, విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్‌లోని కోర్టుకురావడం పెద్ద కష్టమేం కాదని వాదించింది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఆయన్ను గతంలో అరెస్టు చేశామని. ఇప్పుడు అందుకు ఆస్కారం ఎక్కువ ఉందని, కేసులో సాక్షులుగా ఉన్న అధికారులు సీఎంగా ఉన్న జగన్‌ అధీనంలోనే ఉన్నారని వాదించింది.
అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆ రోజు మినహాయింపు కోరవచ్చని సూచించింది. ప్రభుత్వ విధుల్లో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలనడం రాజ్యాంగ విరుద్ధం, చట్టం ముందు అందరూ సమానులేనని సీబీఐ పేర్కొంది.
సిఎం పదవిలో ఉన్నందున వారానికోసారి హైదరాబాద్‌ కోర్టుకు రావటం ఇబ్బంది అనటం పొసగని వాదన. రాజధాని, సచివాలయాన్ని వదలి ముఖ్యమంత్రి విదేశీ, రాష్ట్రేతర, రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు జరుపుతున్నపుడు లేని ఇబ్బంది కోర్టుకు వచ్చినపుడు కొత్తగా వచ్చేదేమిటో తెలియదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్య మంత్రులను నియమించుకున్న సిఎంకు నిజానికి వెసులు బాటు ఎక్కువగా వుంటుంది. రాజధాని వదలి వెళ్లిన సమయాల్లో ఏదైనా అసాధారణ సమస్య తలెత్తితే విధానపరమైన అంశాలు మిగిలిన రోజువారీ అంశాలపై చర్యలు తీసుకొనేందుకు అధికార యంత్రాంగం, మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించవచ్చు. రెండవది ఖర్చు గురించిన అంశం. ఒక వ్యక్తిగా ఉన్నపుడు దాఖలైన కేసును ఎదుర్కొనేందుకు జనం సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి ? ముఖ్యమంత్రి కుటుంబంతో సహా జెరూసలేం సందర్శించినపుడు ఖర్చును స్వయంగా భరించినట్లు చెప్పారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా స్వంత ఖర్చుతోనే కోర్టులకు హాజరు కావాలి కదా ? గవర్నర్‌ మాదిరి ముఖ్యమంత్రికి మినహాయింపులు లేనపుడు ఖర్చులు భరించటానికి అనుమతి సరైనదేనా ? స్వంత ఖర్చుతోనే కోర్టుకు వెళ్లాలి కదా !
సిబిఐ వాదనను కోర్టు అంగీకరించి జగన్‌ వినతిని తిరస్కరించింది. దాని గురించి పై కోర్టులకు వెళతారా లేక కోర్టు ఆదేశాన్ని పాటించి హాజరవుతారా అన్నది వేరే అంశం. ఇక్కడ న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. ఇక సీబీఐ వాదన తీరుతెన్నులను చూద్దాం. వారానికోసారి విచారణ నుంచి హాజరు కాకుండా మినహాయింపు ఇస్తే జగన్‌ సాక్షుల్ని ప్రభావితం చేస్తారనడం అసంగతంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాలను తారు మారు చేసే బలం జగన్‌కు ఉందని అందుకే అరెస్ట్‌ చేశామని సీబీఐ చెప్పింది. ఇప్పుడు సీఎం హౌదాలో ఉన్న జగన్‌ మరింత బలపడ్డారు. సిబిఐ వాదన ప్రకారం సాక్ష్యాలను తారు మారు జరిగితే ఇప్పటికే జరిగి ఉండాలి. అయినా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైతే అలాంటి అక్రమాన్ని ఎలా అడ్డుకుంటారో సామాన్యులకు అర్ధం కావటం లేదు. వారంలో ఆరు రోజులు అలాంటి అవకాశం ఇచ్చి ఏడో రోజు అడ్డుకుంటారా ?
ఇక ముఖ్యమంత్రులు ఎడతెగని పనిలో ఉంటారు కనుక కోర్టులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదన మీద ఢిల్లీ హైకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చింది. బిజెపి నేత మీద కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ ఒక పరువు నష్టం కేసు వేశారు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పని వత్తిడిలో ఉంటారని అందువలన కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది కోర్టును కోరారు. అందుకు తిరస్కరించిన కోర్టు ఆమె హాజరు కానట్లయితే కేసు కొట్టివేస్తామని స్పష్టం చేసి తదుపరి వాయిదాకు రావాలని అదేశించింది. రెండు పరువు నష్టం కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ కేసు తేలేవరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని ఆ రాష్ట్ర హైకోర్టు, మెట్రోపాలిటన్‌ కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచినపుడు కోర్టుకు వస్తామని హామీ ఇవ్వాలని కేజరీవాల్‌ను హైకోర్టు కోరింది.తన పరోక్షంలో కేసు విచారణ కొనసాగించవచ్చని రాసివ్వాలని కోరింది. ఇది తమనేతకు ఎందుకు వర్తించదు అని వైసిపి శ్రేణులు ప్రశ్నించవచ్చు. కేజరీవాల్‌ది పరువు నష్టం కేసు, జగన్‌ది అవినీతి అక్రమాల కేసు అనేతేడా తప్ప ఇద్దరూ నిందితులే, ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నవారే. ఒకే చట్టం ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో భిన్నమైన అన్వయం.

Image result for Andhra CM’s DA case
కేజరీవాల్‌ అయినా, జగన్‌ అయినా ప్రతి ప్రజాప్రతినిది అనే కారణం చూపి అటువంటి మినహాయింపు కోరితే చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి అర్ధం ఏమిటి అన్నది ప్రశ్న. ఈ కేసులకు ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు. వ్యక్తిగత స్ధాయిలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ ఆ కేసులో నిందితుడు. అలాంటి వ్యక్తిని కేంద్ర బిజెపి సర్కార్‌ గవర్నర్‌గా నియమించటం నైతికమా అనైతికమా అన్నది ఒక అంశం. గవర్నర్‌ పదవిలో ఉన్నారు కనుక రాజ్యాగంలోని ఆర్టికల్‌ 361కింద గత ఐదు సంవత్సరాలుగా మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరు కావటానికి కల్యాణ్‌ సింగ్‌కు మినహాయింపు లభించింది. ఆ పదవి కాలం అయిపోగానే ఆయన కోర్టుకు రాకతప్పదని సిబిఐ పేర్కొన్నది. ముఖ్యమంత్రికి అటువంటి మినహాయింపులు లేకపోవటం లోపమా లేక ప్రజాస్వామ్య బద్దమా అన్న అంశాన్ని చర్చించాలి. గవర్నర్‌తో సహా ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకోసం చేసిన పనుల పర్యవసానాలు కాదు.