Tags

, , , ,

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం చేరుతుందా లేదా అన్న అంశంపై చివరి క్షణం వరకూ ఉత్కంఠకు గురి చేసి ఇప్పటికైతే చేరటం లేదు అని ప్రధాని నరేంద్రమోడీ దానికి తెరదించారు.మన వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యానికి హాని కలిగించే తద్వారా మన ఆర్ధిక వ్యవస్ధను మరింత దిగజార్చి జనాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా తాత్కాలికంగా అయినా నివారించారు. అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులు, చివరి నిమిషం వరకూ ఏమి జరుగుతుందో తెలియకుండా యావత్‌ దేశాన్ని ఉంచిన తీరు గత విశ్లేషణల్లో పేర్కొన్నందున చర్విత చరణం చేయనవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక పని చేసిన అంశాలేమిటి ? పర్యవసానాలేమిటి ? అనే చర్చ ఇప్పుడు దేశంలో ప్రారంభమైంది. ఒప్పందంలో చేరటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నందున అంతిమంగా ఒక వైఖరిని ప్రకటించే వరకు ఎవరి అనుమానాలు వారికి ఉండటం సహజం. అప్పటి వరకు మెడమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఒప్పందంలో చేరితే ఎగుమతుల పోటీని మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేదు, నష్టం అనే కారణాలే వెనుకడుగుకు ప్రధాన కారణం. అయితే ఇది సమాజంలోని కోట్లాది మంది కార్మికులను దెబ్బతీస్తుందా ?
రైతులు, పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ముప్పు తప్పిందిలెమ్మని ఆదమరవ కూడదు. ఒప్పందంలో చేరాలని ఇప్పటికీ వత్తిడి చేసే బలమైన కార్పొరేట్‌ శక్తులు ఉన్నాయని మరచి పోరాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, అనుసరించిన విధానాలు మన రైతాంగాన్ని నిండా ముంచాయి. వాటిని వెనక్కు తీసుకొనేందుకు, రైతుల జీవితాలను బాగు పరిచేందుకు గత ఐదున్నర సంవత్సరాలుగా తీసుకున్న చర్యలేమీ లేవని గ్రహించాలి. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వసూలు చేస్తున్న పన్నులను గణనీయంగా తగ్గించటాన్ని మనం చూశాము. ఇది కార్పొరేట్‌శక్తులకు ఇచ్చిన అతిపెద్ద సబ్సిడీ. మరోవైపున రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. ఉన్నవాటిని మరింత తగ్గించటం తప్ప కొత్తగా పెంచిందేమీ లేదు. ఇప్పుడు రైతాంగాన్ని మరింత ముంచకుండా చూశారు తప్ప అదనపు మేలేమీ లేదు. మరింతగా దిగజారకుండా చూడటమే గొప్ప మేలు కదా అని ఎవరైనా అంటే వారి మేథకు జోహార్లు.
ఆర్‌సిఇపి ఒప్పందం- మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు అనే శీర్షికతో అక్టోబరు 19వ తేదీన కొన్ని అంశాల మీద, ఒప్పంద ఖరారు సమావేశం నవంబరు నాలుగవ తేదీకి ఒక రోజు ముందుగా ‘ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత-ఎవరు దేశ భక్తులు ? అనే శీర్షికతో మరికొన్ని అంశాలను చర్చించాను. దీనికి సంబంధించిన మంచి చెడ్డలను స్ధలాభావం రీత్యా పరిమితంగానే రెండు వ్యాసాల్లో విశ్లేషణ చేశాను.
ఒప్పందం మీద సంతకాలు చేయరాదని నిర్ణయించటం వెనుక ఏ కారణం ఎంత మేరకు పని చేసింది అనే అంశాన్ని పక్కన పెడితే భవిష్యత్‌లో కూడా మోడీ సర్కార్‌ ఇదే వైఖరికి కట్టుబడితే హర్షించాల్సిందే. మోడీ ఈ నిర్ణయానికి రావటానికి కారణాలను మరోసారి చర్చించబోయే ముందు గత రెండు వ్యాసాల్లో ఏమి రాశానో పాఠకులకు గుర్తు చేయటం అవసరం.(ఆసక్తి వున్న వారు పూర్తి వ్యాసాలు ఇక్కడే చదవుకోవచ్చు)
అక్టోబరు 19 వ్యాసంలో ” ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది. ”
నవంబరు మూడవ తేదీ వ్యాసంలో ఇలా పేర్కొన్నాను ” ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.”

Image result for rcep modi
సమావేశం జరిగిన సోమవారం నాడు ఒప్పందం మీద సంతకాలు చేయరాదని మన సర్కార్‌ నిర్ణయించింది.దీనికి ఓట్ల లెక్కలే ప్రధానంగా పని చేశాయన్నది స్పష్టం. ఒప్పందం ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తుంది కనుక వ్యతిరేకించినట్లు బిజెపి చెప్పింది. ఇది భారత విజయం అని కూడా పేర్కొన్నది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఒప్పందంలో చేరటం సరైంది కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. ఇది మా విజయమే అని కాంగ్రెస్‌ ప్రకటించుకుంది. తాము గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేయటంతో తప్పనిసరై బిజెపి సర్కార్‌ వెనక్కు తగ్గిందని వ్యాఖ్యానించింది. మంత్రులు పియూష్‌ గోయల్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇంకా ఇతరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. మోడీని అభినందించారు. సర్కార్‌ వెనక్కు తగ్గటం వెనుక వత్తిడిలో ఎవరి వాటా ఎంతో తేల్చటం కష్టం గనుక ఆ లెక్కలను వదలి వేద్దాం. తాత్కాలికంగా కొంతకాలం పాటు అయినా రైతాంగం, చిన్న వ్యాపారులు, తోటల రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అనటం నిస్సందేహం.
అయితే అది ఎంతకాలం? ఇంతటితో ఆర్‌సిఇపి కథ ముగిసినట్లేనా ? ఇప్పుడు జరగాల్సింది ఏమిటి ? ఏదో ఒకసాకుతో ముగిసిన అధ్యాయాన్ని తిరిగి ప్రారంభిస్తారా ? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం, హర్షిద్దాం అయితే ముసాయిదా ఒప్పందంలోని ఏఏ అంశాల మీద మన సర్కార్‌ ఎలాంటి సవరణలు కోరింది? అవి ఏమిటో అధికారయుతంగా వెల్లడిస్తే అనేక ఊహాగానాలకు తెరపడుతుంది. ఒప్పందంలో చేరితే చైనా, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయన్న అభిప్రాయాలు, ముంచెత్తుతున్న వాస్తవాలూ పాతవే. వాటిని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలని మన సర్కార్‌ కోరింది, చైనాతో సహా మిగతా దేశాలు ఎక్కడ విబేధించాయి అన్నది తెలియాల్సి ఉంది.
పదహారు దేశాల కూటమి నుంచి మన దేశం సంతకం చేయటం లేదని ప్రకటించటంతో మిగిలిన దేశాలన్నీ ముందుకు పోవాలని నిర్ణయించాయి. భారత్‌ ఎప్పుడైనా చేరవచ్చని పేర్కొన్నాయి. అంటే ద్వారాలు ఇంకా తెరిచే ఉంచారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఒకేసారి చేరలేదు. ఏదైనా ఒక ఒప్పందాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన తరువాత ఆయా దేశాల రాజ్యాంగాలను బట్టి వాటికి చట్టసభలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అందువలన సంతకాల కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
అమెరికా ప్రభావంతో మన దేశం వెనక్కు తగ్గిందా ? ఆర్‌సిఇపిని చూపి మన దేశం బేరమాడుతోందా ?
ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక బడా కొర్పొరేట్ల మానస పుత్రిక అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో సైబల్‌ దాస్‌గుప్తా అనే వ్యాఖ్యాత చేసిన విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకం చేయటం అమెరికాకు వ్యతిరేకంగా బల ప్రదర్శన అవుతుంది. ఈ బృందంలో చేరేందుకు భారత్‌ తిరస్కరించటం, తద్వారా దాన్ని బలిష్టం కావించేందుకు తిరస్కరించటాన్ని ఈ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. భారత్‌ నిర్ణయాన్ని కొంత మేరకు అమెరికా ప్రభావితం చేసిందని చైనా సర్కార్‌తో ముడిపడిపడి వున్న నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో బేరమాడేందుకు ఈ నిర్ణయాన్ని భారత్‌ ఉపయోగించేందుకు సాధ్యపడుతుంది అని ఏనాన్‌ అకాడమీలో భారత అధ్యయనాల కేంద్రం పరిశోధకుడు మావో కెజీ చెప్పారు. ఇందుకు గాను ట్రంప్‌ యంత్రాంగం భారత్‌కు లబ్ది చేకూరుస్తుందనిగానీ లేదా భారత కంపెనీలతో సామరస్య వైఖరి తీసుకుంటుందని ఎవరూ అనుకోవటం లేదు.
తక్షణ ప్రశ్న ఏమంటే భారత్‌ నుంచి ఔషధాలు ముఖ్యంగా కాన్సర్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలన్న చైనా పధకాల మీద మోడీ నిర్ణయం ప్రభావం చూపుతుందా అన్నది. పశ్చిమ దేశాల కంపెనీలతో మాదిరి చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం లేదా భారత ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేయాలని గానీ చైనీయులు కోరుతున్నారు. ఇందుకు భారత తయారీదారులు ఉత్సాహంగా లేరు.ఔషధాల తయారీ సాంకేతిక పద్దతులను చైనీయులు అపహరిస్తారని భయపడుతున్నారు. ధరలు తక్కువగా ఉండే భారత ఔషధాలకు చైనాలో డిమాండ్‌ పెరుగుతున్నందున తలుపులు మూయటం చైనాకు అంత సులభం కాదు. సంతకం చేయకపోవటం ద్వారా భారత్‌కు జరుగుతుందని చెబుతున్న నష్టం ఏమైనా అది తాత్కాలికమే.” అని దాస్‌ గుప్తా పేర్కొన్నారు.
చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌ దేనితో అయినా బేరమాడేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు తప్పు పట్టనవసరం లేదు. అయితే అది మన రైతాంగం, పరిశ్రమలకు మొత్తంగా ఎంతమేరకు ఉపయోగపడుతుందన్నది గీటు రాయిగా ఉండాలి. గతంలో ఆ విధంగా బేరమాడిన పర్యవసానమే నాటి సోవియట్‌ యూనియన్‌ సహకారంతో అనేక ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు, అంతరిక్ష పరిశోధనలకు ఊపు ఇచ్చిన క్రయోజనిక్‌ ఇంజన్ల పరిజ్ఞానం, ఆయుధాలు మనకు అందాయి. వాటితో మనకు కలిగిన లబ్ది తెలిసిందే. ఇప్పుడు అంతా ప్రయివేటీకరణ, ప్రయివేటు రంగం తప్ప ప్రభుత్వరంగం లేనందున జనానికి ఎలా లబ్ది కలిగిస్తారో తెలుసుకోవటం అవసరం.
దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్ధితిపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపధ్యంలో ఒప్పందంపై సంతకం చేయరాదన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రాముఖ్యత వుందని మింట్‌ పత్రిక వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పనితీరు తక్కువగా ఉండటం, త్వరలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం జరిగింది. ఒప్పందం వలన భారత మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరవటం తప్ప చైనా వంటి మార్కెట్లలో ప్రవేశానికి ఎలాంటి హామీ లేకపోవటం ఒప్పందం మీద సంతకం చేయకపోవటానికి ఒక ప్రధాన కారణం అని ఒప్పందం గురించి బాగా తెలిసిన ఒకరు చెప్పినట్లు మింట్‌ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
సిఐఐ ఏమి చెప్పింది ?
ఆర్‌సిఇపిలో మన దేశం భాగస్వామి కానట్లయితే ప్రాంతీయ, ప్రపంచ గుంపులో చేరే ప్రయత్నాలకు నష్టం జరిగి దేశ ఎగుమతులు, పెట్టుబడుల ప్రవాహానికి హాని జరుగుతుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ(సిఐఐ) ఒప్పంద గడువు సోమవారానికి ఒక రోజు ముందు ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సంస్ధ దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలకు ప్రతినిధి అన్నవిషయం తెలిసిందే. ప్రతి చోటా బడా పెట్టుబడిదారులు-చిన్న పెట్టుబడిదారుల మధ్య ఉండే మిత్రవైరుధ్యం దీనిలో చూడవచ్చు. ఒప్పందం కుదిరిన తరువాత పదహారు భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఎగుమతుల అవకాశాలు దెబ్బతింటాయని సిఐఐ పేర్కొన్నది. చైనా నుంచి ద్వైపాక్షికంగా మనం రాయితీలు పొందటం అన్ని వేళలా ఎంతో కష్టమని తెలిసిందే, ఇప్పుడు ఆర్‌సిఇపిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవటంలో మనం వైఫల్యం చెందామని వ్యాఖ్యానించింది. మన పరిశ్రమలోని కొందరు ఈ రోజు ఏమిటని చూస్తున్నారు. ఈ ప్రాంతంలోని సచేతనమైన 15 ఇతర దేశాల్లో ప్రవేశించాలని పదేండ్ల తరువాత వీరే కోరతారని సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. ఒక దేశం ప్రాతిపదికగా మనం ఆందోళన చెందకూడదని దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాన్ని చూడాలన్నారు. ఈ ఒప్పందం గురించి చర్చలు ప్రారంభమైన 2012లో ఇప్పుడు చర్చిస్తున్న అంశాలు లేవని, మొత్తం వ్యవహారమంతా స్వకీయ రక్షణ, చైనా నుంచి రక్షణ గురించి మాట్లాడుతున్నారని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ చిత్తశుద్ది గురించి ఎవరికీ భ్రమలు ఉండనవసరం లేదు. ఆర్‌సిఇపి ఒప్పందం చర్చల్లో చైనా వస్తువుల గురించి ఒక ప్రధాన సమస్యగా వస్తోంది. వాస్తవం కూడా, అయితే దీనికి బాధ్యులెవరు ? మనకు అవసరమైన వాటిని చైనా నుంచి గాకపోతే అమెరికా లేదా ఐరోపా యూనియన్‌ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా నుంచి దిగుమతులు లాభసాటి గనుక సైద్ధాంతికంగా బిజెపి సర్కార్‌ చైనాను వ్యతిరేకిస్తున్నా గత ఐదు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు పెరగటానికి అనుమతి ఇచ్చింది. ఒప్పందంలో చేరితే పాడి రైతాంగం నష్టపోతారు. దీనికి చైనా కాదు, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా అన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా మన వేరుశనగ, ఇతర చమురు గింజల, పామాయిల్‌ రైతులు నష్టపోయేది ఇండోనేషియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌ తప్ప మరొక దేశం నుంచి కాదు. ఒప్పందం జరగక ముందే సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాల నుంచి శ్రీలంకకు వచ్చి అక్కడి నుంచి మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒప్పందంలో చేరి ఉంటే మరింతగా వరదలా పారతాయన్నది నిజం. అందుకే రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం మంచిదే. కానీ అంతటితో సమస్య పరిష్కారం అవుతుందా ? వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం సమసి పోతుందా ?
అసలే ఆర్ధిక మందగమనం లేదా మాంద్యం, ఎగుమతులు తగ్గటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మన దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసు దాఖలు చేసి గెలిచింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఎగుమతి రాయితీ లేదా సబ్సిడీ పధకాలను రద్దు చేయాలన్నది ఈనెల ప్రారంభంలో వచ్చిన కేసు తీర్పు సారాంశం. దీని వలన కేవలం ఎగుమతుల కోసమే ఏర్పాటు చేసిన సంస్ధలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కులు, ఎగుమతి దారులకు పన్నులేని దిగుమతుల అనుమతులు, ఇలా అనేక పధకాలకు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. దీనికి చైనా కారణం కాదు. తలసరి జిడిపి భారత్‌లో వెయ్యి డాలర్లు దాటింది కనుక ఎగుమతుల ప్రోత్సాహక సబ్సిడీలు ఇవ్వకూడదని కూడా తీర్పులో ఉంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు తలసరి జిడిపి వెయ్యి డాలర్లు దాటితే అన్ని రకాల ఎగుమతుల రాయితీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఉక్కు, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు, ఐటి వంటి వాటికి వెంటనే రాయితీలను మూడు నుంచి నాలుగు నెలల్లోగా నిలిపివేయాలని డబ్ల్యుటిఓ మన దేశాన్ని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు ఒక నెల గడువు ఇచ్చింది.

Image result for labour reforms india protest citu
అమెరికా వంటి దేశాలు మనలను ప్రపంచవాణిజ్య సంస్ధలో ఇలాంటి ఇబ్బందులను పెడుతుంటే మరోవైపున ఏమి జరుగుతోందో చూద్దాం. ఎగుమతుల్లో పోటీ పడాలంటే పారిశ్రామికవేత్తలకు చౌకగా వస్తువులు తయారు కావాలి. అందుకు గాను మన దేశంలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని, కార్మిక చట్టాలు ఆటంకంగా వున్నాయని, వేతనాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలను ముందుకు తెస్తూ ఆ రంగాలలో మార్పులను డిమాండ్‌ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు వేతనాలపై నవంబరు ఒకటి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసి దాని మీద డిసెంబరు ఒకటిలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బిఎంఎస్‌కే అవి మింగుడుపడలేదు. అనేక లోపాలు వున్నాయని, కొన్ని అంశాల మీద స్పష్టత లేదని చెప్పాల్సి వచ్చింది. వేతనాల గురించి స్పష్టత ఇవ్వలేదు గానీ రోజుకు తొమ్మిది గంటలను పని వ్యవధిగా చేయాలనే ప్రతిపాదన చేశారు. వేతన నిర్ణాయక సంఘాలలో కార్మిక సంఘాలకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం గురించి ముసాయిదా పత్రంలో ప్రతిపాదన లేదు. ఎగుమతుల కోసం లేదా వస్తువులు చౌకగా తయారు అయ్యేందుకు కార్మికుల మీద భారాలు మోపటం ఏమిటి ? కర్షకులను మరింత ఇబ్బందుల పాలు కాకుండా ఆర్‌సిఇపిలో చేరేందుకు నిరాకరించినందుకు సంతోషించాలా? అదే సమయంలో కార్మికులపై భారాలు మోపేందుకు, వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పూనుకున్నందుకు ఆగ్రహించాలా ? కార్మికులు, కర్షకులు మిత్రులే తప్ప శత్రువులు కాదు, ఒకరి ప్రయోజనాలకు ఒకరు బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లు అనిపించటం లేదూ !