Tags

, , , ,

Image result for not cow, donkeys milk is gold

ఎం కోటేశ్వరరావు
బిజెపి నేతలు తమ అగ్రజుడు నరేంద్ర మోడీకి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సైన్సు గురించి తాను మాట్లాడి, అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడే స్వేచ్చ ఇచ్చారు కదా ! ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన బెంగాల్‌ బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌ అపర ‘దేశభక్త’ తెగ తండాలో ఉన్నారు కనుక సరిపోయింది.అదే ఆవు దాని పాలు, మూత్రం, పేడ గురించి ఇతర తెగ వారు ఏమైనా మాట్లాడి ఉంటే ….. ?
ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పటంతో బెంగాల్లో ఒక రైతు తన రెండు ఆవులను మనప్పురం బంగారం తాకట్టు కార్యాలయానికి తీసుకుపోయి వాటిని తాకట్టుపెట్టుకొని రుణం ఇవ్వాలని కోరాడట. తనకు ఇరవై ఆవులున్నాయని, రుణం ఇస్తే వ్యాపారాన్ని పెంచుకుంటానని కూడా ప్రాధేయపడ్డాడట. ఆవు పాలల్లో బంగారం లేదు, ఆవులను తాకట్టుపెట్టుకొని ఎవరూ రుణాలు ఇవ్వరని తన దగ్గరకు ఆవులతో సహా వచ్చి తమ ఆవులు రోజుకు 15-16 లీటర్ల పాలు ఇస్తాయని వాటికి ఎంత రుణం వస్తుందంటూ అడుగుతున్న రైతాంగానికి నచ్చచెప్పలేక చస్తున్నానని బెంగాల్‌ హుగ్లీ జిల్లా గార్‌లగ్‌చా పంచాయతీ అధ్యక్షుడు మనోజ్‌ సింగ్‌ వాపోయారు. ఈ పరిస్ధితికి కారకుడైన బిజెపినేత దిలీప్‌ సింగ్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని, ఇదంతా విన్న తనకు ఎంతో సిగ్గుగా ఉందని కూడా అన్నాడు.
బర్ద్వాన్‌ జిల్లాలో ఒక సభలో మాట్లాడిన దిలీప్‌ ఘోష్‌ భారతీయ ఆవులకు మూపురాలు ఉంటాయి, విదేశీ ఆవులు గేదె(బర్రెలు)ల వంటివి. మూపురాల్లో ఒక నరం ఉంటుంది దాన్ని స్వర్ణనారి అంటారు. దాని మీద వెలుగు పడగానే బంగారం తయారవుతుంది. అందువల్లనే ఆవు పాలు పచ్చగా లేదా బంగారం రంగులో ఉంటాయి. ఇలాంటి ఆవు పాలు రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. మరొక పదార్ధమేదీ తినకుండా కేవలం ఈ పాలు తాగి బతకవచ్చు, ఇది సంపూర్ణ ఆహారం అని దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. ఇంకా నయం మూపురాలు హిందూ ఆవులకు మాత్రమే ఉంటాయని చెప్పలేదు. అంతే కాదు ఆవులను చంపటం, పవిత్ర భారత భూమిలో గొడ్డు మాంసం తినేవారిని సంఘవ్యతిరేక శక్తులుగా పరిగణిస్తాం. కొంత మంది మేథావులు రోడ్ల మీద గొడ్డు మాంసం తింటారు, వారు కుక్క మాంసం కూడా తినాలని చెబుతున్నాను నేను, ఏది కావాలనుకుంటే దాన్ని ఇండ్లలో తినమనండి, రోడ్ల మీద ఎందుకు ? ఆవు మన తల్లి వంటిది, ఎవరైనా నా తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని ఏమి చెయ్యాలో అదిచేస్తా. దేశీ ఆవులు మాత్రమే మన తల్లుల వంటివి విదేశీవి కాదు. విదేశీ భార్యలను జెర్సీ ఆవులతో పోల్చుతూ కొందరు విదేశీ భార్యలను తెచ్చుకుంటారు, వారంతా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అని కూడా సెలవిచ్చారు.
బిజెపి దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నది. శాస్త్రవేత్తలకు ఏమైంది అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నెల మొదటి వారంలో కొల్‌కతాలో జరిగిన ఐదవ భారత అంతర్జాతీయ సైన్స్‌ ఉత్సవాన్ని ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రారంభించారు.అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్న ఆ సమావేశంలో మోడీ ప్రసంగం సందర్భంగా జై శ్రీరామ్‌ అనే నినాదాలు చేయటం, వారిని అడ్డుకున్నవారు లేకపోవటం నిజంగా ఆందోళనకరమే. శాస్త్రవేత్తలైనా మరొకరు ఎవరైనా జై శ్రీరామ్‌ నినాదాలు లేదా భజనలు చేయదలచుకుంటే అందుకు వేరే స్ధలాలు, సందర్భాలు లేవా ?
వేల సంవత్సరాల నాడే ఇంథనంతో నిమిత్తం లేకుండా, పైకి కిందికి ఎలా కావాలంటే అలా ఎగిరే, ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు దొరికే విమానాలు ఉన్నాయని, మనిషికి ఏనుగు తలను అతికించిన పరిజ్ఞానం మన దగ్గర ఎప్పుడో ఉందని చెప్పిన వారిని మన శాస్త్రవేత్తలు గట్టిగా ఎదుర్కొని ఉంటే దిలీప్‌ ఘోష్‌ వంటి వారు ఆవు పాలల్లో బంగారం గురించి , మరొకరు మరొక ఆశాస్త్రీయ అంశం గురించి చెప్పి ఉండేవారా ? ఇలాంటి వాతావరణంలో మన భావి భారత పౌరులు ఏమి నేర్చుకుంటారు? కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి, అనురక్తి ఎలా కలిగి ఉంటారు. మన దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారు? సమాజంలో మత ఛాందసాన్ని నింపిన అనేక దేశాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాము, వాటి సరసకు మనలను తీసుకుపోతున్నారు. ఇదే దేశభక్తి అని చెబుతున్నారు. వినాయకుడు పాలు తాగాడంటే గుడ్డిగా నమ్మిన జనాన్ని చూశాము. ఆధునిక ఆవిష్కరణలు, రోబోట్స్‌తో సహా అనేకం మన ప్రాచీన గ్రంధాలలో ఉన్నాయని సభలు పెట్టి మరీ సంఘపరివారం ప్రచారం చేయటాన్ని చూశాము.
బిజెపి నేతలు లేదా ప్రవచన కారులు, ఇతర ప్రముఖులు చెప్పే ఆశాస్త్రీయ అంశాల గురించి నవ్వుకొని వదలి వేస్తున్నారు చాలా మంది. కానీ దీర్ఘకాలంలో అవి చేసే హాని, పర్యవసానాల గురించి ఆలోచించటం లేదు. ఏదో కొంత నిజం లేకపోతే శాస్త్రవేత్తలందరూ ఎందుకు వ్యతిరేకించటం లేదు అనే అర్ధం లేని తర్కంతో నమ్మటమే కాదు, వారే ప్రచారకర్తలుగా మారతారు. ఆవు మూత్రం, పేడ గురించి ఎలా నమ్ముతున్నారో, వాట్సాప్‌లో తిరుగుతున్న అసంబద్ధ సమాచారానికి కారణమిదే. ఇలాంటి సమాచారాన్ని ఎండగట్టే వారు సమాజంలో ఉన్నప్పటికీ అది నిరంతర ప్రక్రియగా సాగటం లేదు. మనం అటువంటి మూర్ఖత్వానికి లోను కాలేదుగా అని తగినంతగా ముందుకు రావటం లేదు.

Image result for not cow, donkeys milk is gold
ఇక దిలీప్‌ ఘోష్‌ గారి పరిజ్ఞానం గురించి చూద్దాం. ఆవు పాలైనా గాడిద పాలైనా పాలు పాలే, ఒకదానిలో బంగారం మరొకదానిలో మట్టి ఉండదు, నిజానికి లీటరు నాలుగువేల రూపాయల వరకు పలుకుతున్న గాడిద పాలే బంగారంతో సమానం అంటే ఆశ్చర్యపడవద్దు. ఇలా చెప్పిన వారిని గోమాతను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, హైందవ ద్రోహులు, దేశద్రోహులు అని జై శ్రీరాం నినాదాలతో ఎదురు దాడికి దిగినా ఆశ్చర్యం లేదు. అలవిగానివిగా ఉన్న ఆవులు, గాడిదలు రెండింటినీ ముందుగా మచ్చిక చేసుకొని పెంపకం మొదలు పెట్టింది ఆఫ్రికా,ఐరోపాలోని నేటి ముస్లిం దేశాలతో కూడిన ప్రాంతంలో అంటే కొంత మందికి ఏమౌతుందో తెలియదు. కనుక వారి మీద దయతో ఇంతటితో వదలివేద్దాం.
ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ(ఎఫ్‌ఏఓ) ప్రకారం గాడిద పాలు కూడా తల్లిపాలవంటివే.విలువైన విటమిన్స్‌, ఫాటీ యాసిడ్స్‌ ఉన్నాయని, కొన్ని ప్రత్యేక పోషకాహార ఉపయోగాలున్నాయని చెప్పిన అంశంతో ఏకీభవిస్తారా లేకపోతే గాడిద అని తృణీకరిస్తారా ? గాడిదలకూ మనోభావాలు ఉంటాయి, అవి తమవైన శైలిలో తన్నకుండా చూసుకోవాలి మరి !