Tags

, , ,

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.