Tags

, , , ,

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
ఎం కోటేశ ్వరరావు
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ(టిఎస్‌ఆర్‌టిసి) సిబ్బంది సమ్మె నలభై మూడు రోజులు దాటి ఇప్పటికే కొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతకాలం హైకోర్టు, కార్మికులు, సామాన్య జనాన్ని తప్పుదారి పట్టించిన సర్కార్‌ అంతిమంగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అసలు విషయం బయట పెట్టింది. కార్మికులతో చర్చించేదేమీ లేదు, ఆర్టీసీ నష్టాల్లో ఉంది, డిమాండ్లను అంగీకరించేది లేదు. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినా తిరిగి ముందుకు తీసుకువచ్చే అవకాశం వుంది. జెఎసి రాజకీయ పార్టీలతో చేతులు కలిపింది.ఇలా సాగింది(ఇది రాసే సమయానికి వివరాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు).
చరిత్రాత్మక ఈ సమ్మె పట్ల అనుసరించిన వైఖరి తమ ఖ్యాతిని పెంచుతుంది అనుకుంటే కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నిరభ్యంతరంగా తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం. శనివారం నాడు ఆర్‌టిసి యూనియన్ల నేతలపై ప్రభుత్వం నిర్బంధాన్ని మరింతగా పెంచింది. సమ్మెపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు నవంబరు 18వ తేదీకి వాయిదా వేసింది. అంటే మరో రెండు రోజులతో 45 రోజులకు చేరనుంది. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలిసింది కనుక కోర్టు అభిప్రాయాన్ని బట్టి తదుపరి ఏమి జరగునుందో తెలుస్తుంది తప్ప ముందుగా జోశ్యం చెప్పలేము.ముగ్గురు పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో మధ్యవర్తుల కమిటీ వేసి సమ్మె అంశాలను వారికి నివేదించాలన్న హైకోర్టు సూచనకు 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. మరోవైపు 14వ తేదీన సమావేశమైన ఆర్‌టిసి జెఏసి తమ డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని మిగిలిన అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మిక సంఘాలు పందొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్య క్రమాలను ప్రకటించారు. అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు, ఇందిరాపార్క్‌ వద్ద జేఏసీ నేతల దీక్ష , అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.. 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్‌ని కలుస్తామని, ఎన్‌హెచ్‌ఆర్సీ అపాయింట్‌మెంట్‌ కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచించినట్లుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తినపుడు పరిష్కారం కోసం ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీని వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అఫిడవిట్‌ను అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ చట్టంలోని పదో సెక్షన్‌ ప్రకారం దీనిపై లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ వివాదంపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టు విచారణ చేస్తున్నందున ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.పిటిషనర్ల తరఫు న్యాయవాది ‘శివారావ్‌ శాంతారావ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసే అధికారాలు ఈ న్యాయస్థానానికి ఉంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాల ఆర్టీసీ సమ్మెపై, బస్సు రూట్ల ప్రయివేటీకరణపై రెండు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏజీ వాదిస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఎస్మా కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీని ఎస్మా కిందకు చేర్చుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని ఏజీ బదులిచ్చారు. ఆర్టీసీ సేవలు ప్రజోపయోగం కిందకు వస్తాయని చెప్పారు. వాటికి భంగం కలిగించిన వారిపై ఎస్మా కింద చర్యలు చేపట్టవచ్చన్నారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా కిందకు రాదని కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి బదులిచ్చారు. టీఎస్‌ ఆర్టీసీని ఆర్టీసీ యాక్టు 1950, ఏపీ పునర్‌విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 3 కింద ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు వివరించారు.

ఈ వాదనలను ధర్మాసనం తొలుత తోసిపుచ్చింది. ”ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉందని, టీఎస్‌ ఆర్టీసీని కేంద్రం గుర్తించడం లేదని గతంలో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. ఆర్టీసీని విభజించాలంటే ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 47ఏ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అనుమతి లేకుండా ఏర్పాటు చేయడానికి వీల్లేదు” అని న్యాయస్థానం ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని, ఈ చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను రెండు రాష్ట్రాల మధ్యన పంచవచ్చని ఏజీ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ నుంచి సాంకేతికంగా వేరు పడనప్పటికీ బస్సులను చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించారన్నారు.

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేశామని, అలాంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. టీఎసఆర్టీసీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌ తరుపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదించారు.1994లో ‘సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా? అని తేల్చే అధికారం హైకోర్టుకు లేదని చెప్పారు. దాన్ని లేబర్‌ కోర్టే తేల్చాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సమస్యను లేబర్‌కోర్టుకు రిఫర్‌చేస్తే నిర్ణీత కాలంలో సమస్యకు పరిష్కారం చూపగలదా? అని ఏజీని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇది ముఖ్యమైన సమస్య అయినందున లేబర్‌కోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకోదని హైకోర్టుకు నివేదించారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెపై హైకోర్టులో ఇన్ని రోజులు విచారణ జరగటమే ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆర్‌టిసికి సంబంధించి కోర్టుకు నివేదించిన తప్పుడు లెక్కలను చూసిన తరువాత అసెంబ్లీకి సమర్పించే బడ్జెట్‌ అంకెలు, సభలో మంత్రులు చేసే ప్రకటనలు, చెప్పే సమాచార విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఆర్‌టిసికి రావాల్సిన బకాయిల గురించి అసెంబ్లీకి ఒక సమాచారం, హైకోర్టుకు ఒక సమాచారం ఇవ్వటం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరులకు ఎవరికి వారు తమకు అనుకూలమైన భాష్యాలు చెప్పేందుకు వీలుగా లోపాలతో కూడిన వాటిని తయారు చేయటం వంటి అనేక అంశాలు యావత్‌ ప్రజానీకానికి కనువిప్పు కలిగించాయి.
మేక పిల్లను తినదలచుకున్న తోడేలు మాదిరి ఆర్‌టిసిని దెబ్బతీయటానికి తద్వారా దానికి ఉన్న విలువైన ఆస్ధులను కాజేయటానికి రాష్ట్ర ప్రభుత్వ నేతలు యత్నిస్తున్నారనే అభిప్రాయం మరింత బలపడింది.ఈ సమ్మె ఒక్క తెలంగాణాలోని కార్మికవర్గానికే కాదు, దేశవ్యాపితంగా యావత్‌ కార్మికులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. సవాళ్లను ముందుకు తెచ్చింది. గత పాలకుల హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్ధులను అప్పనంగా నీకిది నాకది అన్న పద్దతిలో కారుచౌకగా ఆశ్రితులకు అప్పగించారు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఎక్కడి కక్కడ ఆశ్రితులకు కట్టబెట్టేందుకు మిగిలి ఉంది ఆర్‌టిసి ఒక్కటే అన్నది తేలిపోయింది. సచివాలయాన్ని వేరే చోటకు తరలించి ఆ స్దలాన్ని కూడా అన్యాక్రాంతం చేసే అజెండా అలాగే ఇంకా ఉందనుకోండి.
దేశంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలను మరింత ఉథృతంగా అమలు జరిపేందుకు కేంద్ర పాలకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలలోని మెజారిటీ బిజెపి పాలిత ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలకులు గానీ వాటికి వ్యతిరేకం కాదు.పోటీ, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే సాకుతో ఆర్‌టిసి రూట్లలో ప్రయివేటు బస్‌లను తిప్పేందుకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టంలో తెచ్చిన మార్పును ఉపయోగించుకొని ఆర్‌టిసిని దెబ్బతీసేందుకు పూనుకున్న తొలి ప్రభుత్వంగా తెలంగాణా టిఆర్‌ఎస్‌ సర్కార్‌ చరిత్రకెక్కింది.దీనికి కేంద్ర బిజెపి సర్కార్‌ పరోక్ష సాయం తక్కువేమీ కాదు.
సమ్మె నోటీసుపై చర్చలు ప్రారంభమైన తరువాత వాటి ఫలితం ప్రతికూలంగా ఉంటే ఏడు రోజుల వరకు సమ్మెకు వెళ్లకూడదన్న నిబంధనతో కార్మికులపై వేటు వేసేందుకు ఉన్నత అధికార యంత్రాంగం వేసిన ఎత్తుగడను కార్మిక సంఘాలు పసిగట్టలేకపోయినట్లు స్పష్టం అవుతోంది. అక్టోబరు ఐదు నుంచి సమ్మెకు పిలుపు ఇస్తే నాలుగవ తేదీన చర్చల ప్రహసనాన్ని ప్రభుత్వం నడిపింది. మరుసటి రోజు నుంచి సమ్మెలోకి వెళ్లటంతో ఏడు రోజుల నిబంధనను ముందుకు తెచ్చి సమ్మె చట్టవిరుద్దమని తొలి నుంచి సర్కార్‌ వాదించింది. అందుకే దాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించాలని పదే పదే డిమాండ్‌ చేసింది.
విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజనీతిని తెలంగాణా సర్కార్‌ ఈ సందర్భంగా ప్రదర్శించింది. ఎన్‌జిఓలు, టీచర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, కార్మికులు సంఘీభావంగా ఆందోళనలోకి రాకుండా చేసింది. నిజానికి వారంతా ముందుకు వచ్చి ఉంటే సమ్మె ఇన్ని రోజులు జరిగి ఉండేది కాదు. ఒకవైపు ఎన్నడూ లేని రీతిలో సంపూర్ణ సమ్మె జరుగుతుండగా పది పన్నెండు రోజుల్లో పిఆర్‌సి నివేదిక ఇమ్మని ముఖ్యమంత్రి కమిషన్‌ను ఆదేశించిట్లు ప్రకటించారు. బండి గుర్రం నోటికి చిక్కెం కట్టి కళ్ల ముందు గడ్డి కట్టను ఉంచటం తప్ప వేరు కాదు. దానిలో ఉద్యోగులకు ఏమేరకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.

Image result for tsrtc staff strike- adamant government -kcr
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి విద్యార్ధులను కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు అప్పగించారు. త్వరలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కూడా రానున్నాయి. వైద్యరంగంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసి రోగులను కార్పొరేట్‌ జలగల పాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రయివేటు బస్‌ ఆపరేటర్ల విషయంలో చేసిన వాదనల ప్రకారం కార్పొరేట్ల మధ్య పోటీ ఏర్పడి విద్యా, వైద్య సంస్ధలలో వసూలు చేసే మొత్తాలు తగ్గాలి. ఎక్కడా తగ్గకపోగా జనం రుణగ్రస్తులు కావటానికి కారణాలలో ఈ రెండు రంగాలు కూడా చేరాయి. ఇప్పుడు ఆర్‌టిసిని నిర్వీర్యం చేసి ప్రయివేటు ఆపరేటర్లపాలు చేస్తే జరిగేది కూడా ఇదే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయివేటు మోజుల్లో జనం పడితే అంతిమంగా నష్టపోయేది తామే అని ఏ మాత్రం జనానికి అవగాన ఉన్నా ప్రభుత్వం మీద ఇంకా వత్తిడి పెరిగి ఉండేది.

ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఏమౌతుంది అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. తాము ఏ ఒక్క డిమాండ్‌ను అంగీకరించేది లేదని ప్రభుత్వం తన ఆఖరి మాటగా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.ఇప్పటివరకైతే కార్మికులను సమ్మె విరమించాలని కోర్టు వైపు నుంచి ఎలాంటి సూచనలు వెల్లడి కాలేదు. ఇది వారి కోర్కెలు సమంజసమైనవే అని కోర్టు భావిస్తోందని అనుకొనేందుకు ఆస్కారమివ్వవచ్చు. తమను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టటం కూడా చూశాము. మొండి వైఖరిని కూడా చూసింది. కోర్టు ముందు ఉన్న వివాదం ఏదైనప్పటికీ ఇది 50వేల మంది కార్మికులు, రోజువారీ ప్రయాణించే దాదాపు కోటి మంది ప్రయాణీకుల వ్యవస్ధ కనుక తనకున్న ప్రత్యేక అధికారాలతో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందా ? సమ్మె విరమించమని కార్మికులకు సూచిస్తుందా లేక మూడో మార్గం దేన్నయినా ఎంచుకుంటుందా అన్నది చూడాలి. తాజా పరిణామాలపై సిబ్బంది సంఘాల జెఎసి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి వుంది.
డజన్ల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు లేదా ఆవేదనతో మరణించటం ఒక ఆందోళనకరమైన అంశం.ఫ్యూడల్‌ సమాజానికి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, అంతరించి పోతున్న చేతివృత్తుల కుటుంబాల నుంచి వస్తున్న వారికి పూర్తిగా కార్మికవర్గ లక్షణాలు, ఆలోచనలు వెంటనే రావు. ఇది ఒక సంధి సమయం. తెలంగాణా రాష్ట్ర సాధన ఆందోళన సమయంలో ఆత్మాహుతుల ఉదంతాలు దీనికి పురికొల్పాయా లేక పాలకుల మీద విపరీతమైన భ్రమలు పెట్టుకొని హతాశులై ఇలాంటి తీవ్రచర్యలకు పాల్పడ్డారా అన్న అన్నది పరిశోధించాల్సి ఉంది. పోరాటం తప్ప ఆత్మహత్యలు కార్మికవర్గ లక్షణం కాదు. కార్మిక సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కార్మికులు, ఉద్యోగులను ఆమేరకు చైతన్యవంతం చేసేందుకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామం ముందుకు తెచ్చింది.

Image result for adamant kcr
కార్మికుల న్యాయమైన సమస్యలపై చివరి ఆయుధంగానే కార్మికులు సమ్మెకు దిగుతారు. ఆర్‌టిసి చరిత్రలో సూపర్‌వైజర్‌లు తొలిసారిగా సమ్మెకు దిగితే, చిన్నా పెద్దా, గుర్తింపు పొందిన, లేని యూనియన్లన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెకు దిగటం ఒక మంచి పరిణామం. కార్మికులు కూడా నాయకత్వంపై విశ్వాసం ఉంచి నిలబడ్డారు. ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలను ఖాతరు చేయలేదు. ప్రపంచ చరిత్రను, మన దేశ చరిత్రను చూసినపుడు గానీ కార్మికుల సమ్మెలన్నీ జయప్రదం కాలేదు. అనివార్యమై రాజీ పడి విరమించాల్సి వచ్చినా ఒక సంస్ధ లేదా ఒక తరగతి కార్మికులు నిరాశా నిస్పృహలకు గురైనా అది తాత్కాలికమే. నిరంకుశమైన యాజమాన్యాలు కార్మికులను పీల్చిపిప్పి చేస్తున్నంత కాలం కార్మికుల ఆందోళనలకు అంతం ఉండదు. ప్రతి సమ్మె విజయం లేదా వైఫల్యం కూడా భవిష్యత్‌లో అదే సంస్ధ లేదా ఇతర సంస్ధల కార్మికులకు అనేక పాఠాలు నేర్పుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ప్రపంచంలో మంచి భూస్వామి, మంచి వ్యాపారి, మంచి పెట్టుబడిదారుడు, మంచి కార్పొరేట్‌ సంస్ధ, పాలకవర్గ పార్టీలలో మంచి పాలకుల కోసం వెతకటం నేతి బీరలో నెయ్యి కోసం దేవులాడినట్లే !
ఆర్‌టిసి కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్య మంత్రి కెసిఆర్‌ యూనియన్లకు, కార్మికులు సంఘటితం కావటానికి ఎంత బద్ద వ్యతిరేకో స్పష్టంగా చెప్పారు. యూనియన్లను లేకుండా చేస్తానని అన్నారు. చరిత్రలో ఇలాంటి యూనియన్‌ విచ్చిన్నకులు కాలగర్భంలో కలసి పోయారు. ఈ పరిణామం తరువాత పాలకపార్టీ నేతలతో అంటకాగితే తమకేదో మేలు జరుగుతుందని ప్రలోభపెట్టేవారిని కార్మికవర్గం అంతతేలికగా విశ్వసించదు. అధికారపార్టీకి చెందిన వారు కూడా కార్మికుల దగ్గరకు వచ్చి యూనియన్లుపెట్టి ఉద్దరిస్తామని చెప్పేందుకు వెనుకాడే స్ధితి వస్తుంది. పాలకపార్టీల మీద కార్మికవర్గంలో భమ్రలు తొలగటానికి ఈ సమ్మె నాంది. ఆర్‌టిసి సమ్మె జయప్రదమైతే ఇతర కార్మికులు, ఉద్యోగులు మరింత వేగంగా తమ సమస్యల మీద పోరు బాట పడతారు. ఒక వేళ విఫలమైతే కాస్త విరామం వచ్చినా మరింత జాగరూకతతో వ్యవహరించి పోరుబాట ఎక్కటం తప్ప మరొక దగ్గర మార్గం ఉండదు.