Tags
finance minister nirmala sitharaman, India Data Crisis, India Economic slowdown, Narendra Modi, narendra modi credibility crisis
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సుమతీ శతకకర్త బద్దెన భూపాలుడు లేక భద్ర భూపాల. అయితే ఆయన దాన్ని వాడిన సందర్భం తెలియదు గానీ మన రాజకీయనేతలు మాత్రం దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. కొందరిని కొంత కాలం అలాంటి మాటలతో మభ్యపరచవచ్చుగానీ ఎల్లరనూ ఎల్లకాలం మోసం చేయటం కుదురుతుందా ?
మోడీగారు తనకు ఇబ్బంది కలిగించే అంశాల మీద నోరు విప్పరు. ఆయన మాదిరి నోరు మూసుకొని ఉండటం మంత్రులకు సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడకపోతే ప్రభుత్వ దుకాణం మూతపడిందని జనం అనుకుంటారు. ఆటోమొబైల్ రంగం మందగమనం లేదా రాయంచనడక సంగతేమిటమ్మా అని అడిగితే కుర్రాళ్ల మైండ్ సెట్ మారింది, స్వంతకారుకు నెలవారీ వాయిదాలు చెల్లించే బదులు ఓలా, ఉబర్ వంటి వాటిని ఉపయోగించటం, త్వరలో వచ్చే కొత్త మోడల్స్ కోసం ఎదురు చూస్తూ పాతవాటిని కొనుగోళ్లను వాయిదా వేయటం వంటి కారణాలున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబరులో చెప్పారు. ఆయితే ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో ఆమె కాస్త తగ్గారు. దేశ ఆర్థిక వ్యవస్ధ మందగించింది తప్ప మాంద్యంలోకి జారలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబరు 18న లోక్‌సభకు సమర్పించిన రాత పూర్వక సమాధానంలో చెప్పారు. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం ఆర్ధిక వ్యవస్ధ అధమ స్ధాయిలోకి దిగజారలేదన్నారు. మందగించినా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 20దేశాల బృందంలో మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధిస్తామని కూడా లోక్‌సభలో చెప్పారు.
మంత్రులు లేదా మరొకరు చట్టసభల వెలుపల మాట్లాడేవాటిలో అతిశయోక్తులు, అవాస్తవాలు, వక్రీకరణలు ఉండటాన్ని ప్రాణ, విత్త,మాన భంగములతో పాటు రాజకీయములందు కూడా అబద్దములాడవచ్చని సరిపెట్టుకుందాం. నిర్మలా సీతారామన్ సమాధానం తరువాత అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను ఆమె జూనియర్ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వీకరించారు. నిజమే చెబుతాను అబద్దాలు చెప్పను అని ప్రమాణం చేసిన ఆ మంత్రిగారు ఆధారాలు లేని అంశాలను చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయిందని(ఇది ఆరేండ్ల కనిష్టం) ప్రభుత్వమే చెప్పింది. ఐదుశాతం మాంద్యం లేదని సదరు మంత్రి అడ్డంగా మాట్లాడారు.
అంతేనా ! పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను చెల్లింపుదార్ల ప్రాతిపదిక రెట్టింపు కాగా, ప్రత్యక్ష పన్నుల వసూలు మొత్తం రెట్టింపు అయిందని బయట బహిరంగ సభల్లో చెప్పే అంశాలను పార్లమెంటులోనూ చెప్పారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల ప్రకారం 2016-17లో 6.92కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉంటే 2018-19 నాటికి 8.45 కోట్ల మందికి పెరిగారు. కూడికలు తీసివేతలు మాత్రమే తెలిసిన వారికి కూడా ఇది రెట్టింపు కాదు కదా నాలుగోవంతుకు తక్కువ ఐదో వంతుకు ఎక్కువ అన్నది స్పష్టం. ఇక పన్ను వసూళ్లు 2015-16లో అంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ 7,41,945 కోట్లు కాగా అవి 11,37,685 కోట్లకు పెరిగాయి, అంటే యాభైశాతానికి కొద్దిగా ఎక్కువ. మరి రెట్టింపు ఎక్కడ ? సమర్ధించుకోవటానికి మంత్రులు ఎలాంటి పాట్లు పడుతున్నారో ఇంకా చూడండి !
జాతీయ సెలవు దినం అక్టోబరు రెండవ తేదీ ఒక్క రోజే మూడు సినిమాలు 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయని చిత్ర విమర్శకుడు కోమల్ నహతా నాకు చెప్పాడు. ఒక దేశంలో 120 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఆ దేశం గట్టి ఆర్దిక వ్యవస్ధను కలిగి ఉన్నట్లే అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ఆక్టోబరు 12న ముంబై పత్రికా గోష్టిలో వ్యాఖ్యానించారు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన వ్యాఖ్యను అసందర్భంగా పేర్కొని వక్రీకరించారని, తానెంతో సున్నిత మనస్కుడను కనుక చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా వాటిని ఉపసంహరించుకుంటున్నా అని మరుసటి రోజు సదరు మంత్రి ప్రకటించారు.
తాజాగా నవంబరు 16న కేంద్ర మంత్రి సురేష్ అంగాడీ ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా ఉందని దానికి నిదర్శనం వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో జనం పెద్ద సంఖ్యలో కనిపించటమే అని సెలవిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అంతే కాదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందని, తరువాత పుంజుకుంటుందని ఇది ఒక చక్రమణం వంటిదని వివరించారు. దేశంలో పౌరుల వినిమయ ఖర్చు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 2017-18లో పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదికలో వెల్లడి కావటం గురించి మంత్రి సురేష్ అంగాడీ పై వ్యాఖ్యలు చే శారు.
నరేంద్రమోడీ చెబుతున్న ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ పగటికల అన్నది ఒక అభిప్రాయం. కానీ కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ తెల్లవారు ఝామున వచ్చిన కల నిజం అవుతుందనే మూఢనమ్మకంతో ఉన్నారు. ఈ జిడిపి అంకెలతో ఐదులక్షల కోట్లడాలర్ల ఆర్ధిక వ్య వస్ధ సాధ్యమా అని ప్రశ్నిస్తే జనాలు అంకెలను, ఆర్ధిక వ్యవస్ధ లెక్కలను పట్టించుకోవద్దు అన్నారు. అంతటితో ఆగితే ఫరవాలేదు. సాంద్రత సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలేమీ ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.వాస్తవానికి ఐనిస్టీన్ సాపేక్షతా సిద్దాంతాన్ని న్యూటన్ సాంద్రతా సిద్దాంతాన్ని కనుగొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్ధే తెలివి తేటల సంగతి తరువాత, పై వ్యాఖ్యలను చూసిన తరువాత వారికి ఎప్పుడు, ఏం మాట్లాడాలో కూడా తెలియదనుకొనే పరిస్ధితులు తలెత్తాయని ఎవరైనా భావిస్తే అది వారి తప్పు కాదు. ఇప్పుడు ప్రధాని నాయకత్వం విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే అతిశయోక్తి కాదు.
ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి మాదిరి విదేశీ పర్యటనలు జరిపి దేశ ప్రతిష్టను పెంచి ఎక్కడికో తీసుకుపోయారని బిజెపి నేతలు చెప్పటాన్ని అంగీకరిద్దాం ! భారత ప్రభుత్వ అధికారిక సమాచారం గురించి ఆర్ధికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వార్తా విశ్లేషణను విడుదల చేసింది. జిడిపి పెరుగుదలను అభివృద్దిగా చూపేందుకు మోడీ సర్కార్ పడుతున్న తాపత్రయం గురించి తెలిసిందే. 2016 జూలై నుంచి 2017 జూన్ వరకు పన్నెండు నెలల కాలంలో గణాంక మంత్రిత్వశాఖ ఒక సర్వే జరిపింది. దేశ జిడిపి లెక్కల్లో ఉపయోగించిన కంపెనీల సమాచారాన్ని ఎంచుకొని జరిపిన సర్వేలో 36శాతం కంపెనీల ఉనికి లేకపోవటం లేదా తప్పుడుగా వర్గీకరించినట్లు తేలింది. సమాచార సేకరణలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూనే జిడిపి అంచనాల మీద వాటి ప్రభావం ఉండదని, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రిత్వశాఖ చెప్పింది. నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయికి చేరిందన్న నివేదికను విడుదల చేయకుండా తొక్కి పట్టటాన్ని , జిడిపి గణాంకాలను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని నమ్మటానికి లేదనే నిర్ధారణకు రాయిటర్స్ వచ్చింది. ఈ కారణంగానే తాము ప్రత్యాయమ్నాయ సమాచార వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నామని రాయిటర్స్ విలేకర్లు ఇంటర్వ్యూలు చేసిన ఆర్ధికవేత్తలు, బ్యాంకుల విశ్లేషకులు, మేథావులు చెప్పారు.
దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతున్నది. ఎనిమిదిశాతంగా ఉన్నది ఈ ఏడాది రెండవ త్రైమాసంలో ఐదు శాతానికి పడిపోయినట్లు, నిరుద్యోగులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.2020 ఆర్ధిక సంవత్సరంలో ముందుగా అంచనా వేసిన వృద్ధి రేటు 6.8శాతానికి బదులు 6.1శాతానికి మించకపోవచ్చునని రిజర్వుబ్యాంకు జోశ్యం చెప్పింది. వినిమయంపై జనాల ఖర్చు పడిపోవటం ఆందోళన కలిగిస్తోందని జాతీయ గణాంక సంస్ధ సర్వే చెప్పింది. నాలుగు దశాబ్దాల తరువాత ఆహార వినియోగం తగ్గిపోయిందని, దేశం పోషకాహారలేమి వైపు పయనిస్తోందని, వినిమయం తగ్గటం అంటే దారిద్య్రంలోకి జారుతున్న జనం పెరుగుదలను సూచిస్తోందని గణాంకాలు వెల్లడించాయి.1972-73లో కంటే వినిమయ ఖర్చు తగ్గిపోయింది. అప్పుడు వినిమయ ఖర్చు తగ్గుదలకు చమురు ధరల పెరుగుదలను కారణంగా చెప్పారు. ఎన్‌ఎస్‌ఓ తాజా నివేదికను తొలుత సర్కార్ బయటకు రాకుండా తొక్కి పెట్టింది. అది ఎలాగో బయటికి వచ్చింది, దాంతో గణాంకాల ప్రమాణాల మీద అనుమానాలు వున్నాయని, ఇది ముసాయిదా తప్ప నిర్ధారించినది కాదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మోడీ సర్కార్ అచ్చేదిన్ బండారాన్ని ఎండగట్టింది కనుక అంకెలను మార్చి అంతా బాగుంది అని విడుదల చేస్తారా ?
2011-12లో గ్రామీణులు సగటున నెలకు ఆహారం మీద రూ.643 ఖర్చు చేస్తే 2017-18లో రూ.580కి తగ్గింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం రూ.943 నుంచి 946కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా వినిమయ ఖర్చు ఇదే కాలంలో 8.8శాతం పడిపోగా, పట్టణాల్లో రెండుశాతం పెరిగింది. ఆహారం మీద వినియోగం తగ్గటం అంటే పోషకాహారలేమి పెరగటానికి ఒక సూచిక. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం అధమ స్ధానంలో ఉంది. ఎన్నో విజయాలు సాధించామని సులభరత వాణిజ్య సూచిక మెరుగుదల గురించి పదే పదే చెబుతున్న నరేంద్రమోడీ వంది మాగధులు దీని గురించి మాట్లాడరు.2014లో 76దేశాల వివరాలను విశ్లేషించగా మన దేశం 55వ స్ధానంలో ఉంది. 2019లో 117 దేశాల్లో 102వ స్ధానంలో ఉంది. అంటే దేశంలో ఆకలి పెరిగిందని స్పష్టంగా చెబుతోంది. అయితే దీనిలో అనేక తప్పులు ఉన్నాయని, వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబించలేదని నీతి ఆయోగ్ నిపుణులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్ధలు అనుసరించే పద్దతులు అనేక సందర్భాలలో మారుతున్నాయి. ఆ మేరకు మన దేశానికి వచ్చిన పాయింట్లలో ఒక ఏడాది నివేదికకు మరొక ఏడాది దానికి పొంతన ఉండటం లేదన్నది విమర్శ. గణాంక పద్దతులు ఏడాది కేడాది మారవచ్చు తప్ప దేశానికి దేశానికి మారవు. తప్పులుంటే అన్ని దేశాల సూచికల మీద ప్రతిబింబిస్తాయి. మన పరిస్ధితి గత ఐదు సంవత్సరాల్లో మెరుగుపడిందో లేదో చెప్పకుండా లెక్కల్లో తప్పులని తప్పించుకో చూస్తున్నారు.
నిజానికి దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారుడు యుపిఏ చివరి రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే దాని పాలనా కాలంలో జరిగిన భారీ కుంభకోణాల మీద ప్రతిపక్షాల, మీడియా దాడి కేంద్రీకృతం కావటంతో జనంలో పెద్దగా చర్చ సాగలేదు. విసిగిపోయి ఉన్న జనం నరేంద్రమోడీ ఆకర్షక నినాదాలతో పట్టం కట్టారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చమురు ధరల భారీగా పడిపోయిన కారణంగా ఖజానాకు ఎంతో మిగులుతో పరిస్దితి తొలి రోజుల్లో స్ధిరంగా ఉంది. అయితే చమురు ధరలు ఒక స్ధితికి చేరిన తరువాత తిరిగి అన్ని రంగాల దిగజారుడు ప్రారంభమైంది. వాటిని మూసిపెట్టి భావోద్వేగాల మీద జనం దృష్టిని మళ్లించి, ఇతర అంశాలను ముందుకు తెచ్చి రెండవసారి అధికారానికి వచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పియూష్ గోయల్, రవిశంకర ప్రసాద్, సురేష్ అంగాడీ, నిర్మలా సీతారామన్ వంటి వారు అలా మాట్లాడటానికి కారణాలను విస్మరించకూడదు. అలాంటి ప్రకటనలు చేయాలని స్వయంగా నరేంద్రమోడీయే దారి చూపారంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. భిన్నమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఒకే పనిని పదే పదే చేయటం గురించి ఐనిస్టీన్ ఒక సందర్భంగా చెప్పారు. కొందరు ఏదీ నేర్చుకోరు, దేన్నీ మరచిపోరు అన్న విషయం కూడా తెలిసిందే. (ముగింపు రెండవ భాగంలో )