Tags

, , , , , ,

Image result for narendra modi offensive attacks
(ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 2 ముగింపు భాగం)
ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాది అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన గురించి పార్లమెంట్‌లో మాట్లాడారు. పిఎఫ్‌ పధకంలో ఎంత మంది చేరిందీ, వైద్యులు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్ల గురించి అంకెలు చెబుతూ ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన చేయకపోతే అవన్నీ ఎలా సాధ్యమని ఎదురుదాడి చేశారు. తరువాత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కూడా అదే కబుర్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడైంది. నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించి నిరుద్యోగశాతం 6.1కి చేరిందన్నది దాని సారం. అయితే తాము కల్పించిన ఉద్యోగాలన్నీ లెక్కల్లోకి చేరలేదని, తప్పుడు లెక్కలని పకోడీ బండి పెట్టుకోవటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వెల్లడైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వాస్తవం కాదని బుకాయించిన సర్కార్‌ అనంతరం అదే నివేదికను వాస్తవమైనదిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.2శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబరులో 8.5కు చేరింది.
నిరుద్యోగం లేదా ఉద్యోగాల కల్పన గురించి ప్రధాని, బిజెపి నేతలు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 2017 సెప్టెంబరు-2018నవంబరు మధ్య తొలిసారిగా కోటీ ఎనభై లక్షల మంది ప్రావిడెంట్‌ ఫండ్‌కు తమ వాటాను జమచేయటం ప్రారంభించారని వారిలో 65లక్షల మంది 28ఏండ్ల లోపు వారేనని, వారందరికీ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన కారణంగానే అది జరిగిందని, అదే విధంగా 2014 మార్చి నుంచి 2018 అక్టోబరు వరకు కోటీ ఇరవై లక్షల మంది నూతన పెన్షన్‌ పధకంలో నమోదైనట్లు కూడా మోడీ చెప్పారు.
ఇక్కడ మోడీ మహాశయుడు నాణానికి ఒక వైపును మాత్రమే చూపారు. రెండో వైపు చూద్దాం. ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌లో ఈ లెక్కలన్నీ పెడుతున్నారు. మోడీ గారు కోటీ 79లక్షల నమోదు కాలంలోనే కోటీ 39లక్షల మంది ఈ పధకం నుంచి తప్పుకున్నారు. 33లక్షల మంది గతంలో చేరి తప్పుకొని తిరిగి చేరిన వారు ఉన్నారు. అంటే నిఖరంగా నిలిచిన వారు 73లక్షల మందే. తప్పుకున్నవారందరూ నిరుద్యోగం సైన్యంలో చేరినట్లా లేక ఉద్యోగవిరమణ చేసినట్లా ? ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికుల పేరుతో యజమానులకు మేలుచేసే సబ్సిడీ పధకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహ యోజన. దాని ప్రకారం తమ పధకం ప్రారంభం నాటికే ఉన్న సిబ్బంది గాకుండా తరువాత కొత్తగా చేరిన సిబ్బందిని ప్రావిడెంట్‌ పధకంలో చేర్చితే వారి ఖాతాలకు యజమానులు చెల్లించాల్సిన సొమ్మును మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా పదిహేను వేల రూపాయల లోపు వేతన ఉన్న వారికి మాత్రమే. అందువలన అనేక యజమానులు దాన్ని వినియోగించుకొని అప్పటికే ఉద్యోగాల్లో వున్నా పిఎఫ్‌ పధకంలో చేర్చని వారిని కొత్తవారిగా చేర్పించి వుండవచ్చు. అందువలన ఒక్కసారిగా ఉద్యోగాలు పెరిగినట్లు చిత్రిస్తున్నారు.
అంకెలతో జనాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహయోజన పధకం ప్రారంభమైన 2016 నుంచి 2019 నవంబరు 18 వరకు విస్తరించిన జౌళి రంగ కార్మికులతో సహా లబ్ది పొందిన వారు కోటీ 24 లక్షల 33వేల 819 మంది. లబ్ది పొందిన సంస్ధల సంఖ్య లక్షా 53వేల 574. ఇందుకు గాను ప్రభుత్వం యజమానుల వాటాగా చెల్లించిన సొమ్ము 6,887 కోట్ల రూపాయలు. సగటున ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో వేసిన సొమ్ము రూ.5,539. మరి ఈ లెక్కలను మోడీ గారు కాదంటారా తప్పంటారా ?
మోడీ గారు మరో లెక్క చెప్పారు. అదేమంటే 2014 నుంచి కొత్తగా 36లక్షల కొత్త వాణిజ్య ట్రక్కులు,27లక్షల ఆటోలు, కోటీ 50లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయం జరిగిందని, తద్వారా రవాణా రంగంలో కోటీ 25లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు వివరించారు. ఇక్కడ చూడాల్సింది, పాతవాహనాలు ఎన్ని వినియోగం నుంచి తప్పుకున్నాయి. కొత్తవాహనాలకు కొత్త ఉద్యోగులే వచ్చారనుకుందాం, వారిలో ఎవరూ అంతకు ముందు ఎక్కడా ఏ పనీ చేయటం లేదా కొత్త వాహనాల మీద అప్పటికే పని చేస్తున్నవారు గాక కొత్తవారు ఉద్యోగాల్లో చేరినట్లు రుజువులు ఏమిటి?
టూరిజం రంగంలో కొత్త హౌటళ్లకు అనుమతులు 50శాతం పెరిగాయని, దీని వలన మరో కోటీ 50లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోడీ చెప్పారు. దీనికి కూడా రవాణా రంగం మాదిరే అధికారుల అంచనా లెక్కలు తప్ప ఆధారాలేమీ లేవు.
తొలిసారిగా ముద్ర రుణపధకం కింద నాలుగు కోట్ల 25లక్షల మంది రుణాలు పొందారని, అయితే ఉపాధి వివరాలు లేవని మోడీ చెప్పారు. అంటే రుణాలు తీసుకున్నవారందరికీ ఉపాధి చూపినట్లే అనుకోవాలనా ? ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 15.59 కోట్ల మందికి ఇచ్చిన రుణాల మొత్తం రెండులక్షల 75వేల కోట్లు, అంటే సగటున ఇచ్చిన మొత్తం రు 17,582, దీనితో వచ్చే ఉపాధి ఎంత అన్నది ప్రశ్న.

Image result for narendra modi offensive attacks
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతున్నది. ప్రధాని నరేంద్రమోడీకి ఇన్ని వివరాలు తెలిసినపుడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) లేదా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అవెందుకు ప్రతిబింబించటం లేదు. లెక్కలు సరిగా వేయటం లేదంటున్నారు. ఐదున్నర సంవత్సరాల పాలనలో లెక్కల విధానాన్ని కూడా సరి చేసి సరైన లెక్కలు చెప్పటంలో మోడీ సర్కార్‌ విఫలమైనట్లు అంగీకరించటమే కదా ! లేదూ సరైన లెక్కల విధానాన్ని అమల్లోకి తెచ్చేంత వరకు ఆ సంస్ధ రూపొందించిన వాటిని ఎందుకు అంగీకరించటం లేదు ? ప్రతి సారీ వివాదం ఎందుకు రేపుతున్నట్లు ? మోడీ సర్కార్‌ కోసం ఎన్‌ఎస్‌ఓ కొత్త పద్దతినేమీ ప్రవేశపెట్టలేదు కదా, అంతకు ముందున్నదాని కొనసాగింపే కదా ? పోనీ నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు? అవి సరైనవే అయితే నిరుద్యోగం పెరగటం, వినిమయశక్తి తగ్గటం వంటి వివరాలు తప్పుడు లెక్కలు ఎలా అవుతాయి ?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఆచరణ సంగతి పక్కన పెడదాం. రైతుల ఆదాయం ఎంత అన్నది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా ? రైతుల పరిస్ధితి గురించి శ్వేతపత్రం ఏమైనా ప్రకటించిందా అంటే లేదు. ప్రభుత్వ సంస్ధలు చెబుతున్న లెక్కలు తప్పు, వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు అంటున్నారు. స్వచ్చ భారత్‌ లేదా బహిరంగ మలవిసర్జన నిరోధ పధకం కింద మరుగుదొడ్ల గురించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాటిలో ఎన్నింటిని వినియోగిస్తున్నారు అన్న అంశంపై తయారు చేసిన విశ్లేషణ నివేదికను మాత్రం బయట పెట్టకుండా తొక్కి పెట్టారు.
మరుగుదొడ్ల నివేదిక సర్వేను ఎందుకు మూసిపెట్టారు ? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ మన దేశంలో ఇప్పుడు ఎక్కడా బహిరంగ మలవిసర్జన లేదని అంతర్జాతీయ సమాజానికి చెప్పేశారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా చిత్రించారు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అహమ్మదాబాద్‌ సబర్మతి నదీ తీరంలో ఇరవై వేల గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేశారు. ఇంత హడావుడి చేసిన తరువాత అధికారిక నివేదికను విడుదల చేస్తే మోడీ గారి గాలి తీసినట్లు అవుతుంది. దేశంలో మరుగుదొడ్లు 75శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, వాటిలో 80శాతం మాత్రమే వినియోగంలో ఉన్నట్లు సదరు ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 76వ నివేదికకోసం 2018 జూలై నుంచి డిసెంబరు మధ్య సర్వే చేశారు. దానిలో చేర్చిన ప్రశ్నావళి మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిసారిగా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఉంటే దాన్ని వినియోగిస్తున్నారా ? వినియోగించకపోతే కారణాలేమిటి ? అని అడిగారు. ఈ నివేదిక సర్వేలో 75శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నట్లు తేలింది. సర్వే ముగిసిన డిసెంబరు తరువాత కేవలం తొమ్మిది నెలల కాలంలో మిగిలిన 25శాతం మరుగుదొడ్లు కట్టటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది కనుక మోడీ సర్కార్‌ దీన్ని తొక్కి పెట్టిందన్నది స్పష్టం. ఇదే నివేదికను తరువాత ఎప్పుడో జనం మరచిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల అనంతరం నిరుద్యోగ నివేదిక మాదిరి విడుదల చేస్తారా ?

Image result for narendra modi offensive attacks
ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి రేటు ఏడు వాస్తవం కాదని, నాలుగున్నరశాతానికి మించదని ప్రధాని ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణ్యం , అభివృద్ధి అంకెలకు ఉపాధి కల్పనకు పొసగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అరవింద సుబ్రమణ్యం గణించిన తీరులో లోపాలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం. అవెలా తప్పో ఇంతవరకు మోడీ సర్కార్‌ ఎందుకు అసలు గుట్టు విప్పి చెప్పలేదు, అడ్డుకున్నదెవరు ? ప్రతి అంశానికి సమాధానం చెబుతామని రంకెలు వేశారు, ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుబడిన అంకెలు సుబ్రమణ్యం చెప్పిందే సరైనవని నిర్ధారించటం లేదా ? మోడీ స్వయంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యవలన జిడిపి వృద్ధిరేటు 6.7 నుంచి 8.2శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే అంతకు ముందు వేసిన అంచనాలను సవరించింది. కానీ ఆచరణలో ఆ చర్య వృద్దిని దెబ్బతీసిందని రుజువు చేసింది. అంటే కొందరి బుర్రల్లో తలెత్తిన ఆలోచనల మేరకు చేసిన అంకెల గారడీ తప్ప ప్రాతిపదిక లేదు లేదా తప్పుడు ప్రాతిపదికన అంకెలను సవరించారన్నది స్పష్టం. అభివృద్ది సూచికల తయారీకి తీసుకొనే అంశాలైన కార్ల అమ్మకాలు, విమానాల్లో సరకు రవాణా, కొనుగోలు శక్తి తదితర అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వృద్ది గురించి అతి అంచనాలు వేసినట్లు రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.
దేశంలో ఆర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉందా మాంద్యంలో ఉందా అనే పండిత చర్చను కాసేపు పక్కన పెడితే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్దలు ఎంత సామర్ధ్యంతో పని చేస్తున్నాయి, అంచనాల మేరకు విద్యుత్‌ ఎందుకు అమ్ముడు పోవటం లేదంటే పరిశ్రమలు, వాణిజ్యం కొత్తగా రాకపోవటమే అన్నది స్పష్టం. అందుకే విద్యుత్‌ కంపెనీల దివాళా. ఈ పూర్వరంగంలో సమాచారం వెలువడుతున్న అనుమానాలు మన అధికారయంత్రాంగం, పాలకుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయని గుర్తించాల్సి ఉంది.