Tags

, , ,

Image result for great eagerness about the Uruguay run-off election results

డేనియల్‌ మార్టినెజ్‌                                    లూయీస్‌ లాసలే

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాల దేశమైన ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠనెల కొన్నది. అక్టోబరు27నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమెజారిటీ ఓట్లు రాకపోవటంతో ఈనెల 24న అత్యధిక ఓట్లు తెచ్చుకున్న రెండు పార్టీల మధ్య అంతిమ పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 49.38శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష మితవాద నేషనల్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 51.62శాతం ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఓట్ల పరంగా తేడా 28,666 మాత్రమే. ఇవిగాక మరో 34,500 నిర్ణయాత్మక ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీంతో తుది ఫలితాన్ని వెల్లడించటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఉరుగ్వే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఓటరు నిర్ణీత పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయలేని పక్షంలో సరైన కారణాలు చూపి మరొక చోట ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సాధారణంగా గత ఎన్నికలలో అలాంటి ఓట్ల లెక్కింపుతో పని లేకుండానే స్పష్టమైన మెజారీటీ తెచ్చుకోవటంతో అభ్యర్ధుల అంతిమ ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు పైన చెప్పుకున్నట్లుగా మెజారిటీ కంటే నిర్ణయాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిని కూడా లెక్కించిన తరువాత గానీ ఫలితం తేలదు. ఇటువంటి పరిస్దితి ఏర్పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
అక్టోబరు 27న జరిగిన తొలి దఫా ఓటింగ్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.49, ప్రతిపక్ష సమీప అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 29.70, మరో రెండు మితవాద పార్టీలకు 12.80, 11.46శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మొత్తం 11 పార్టీలు పోటీ చేశాయి. రాజ్యాంగాన్ని సవరించి నూతన ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెచ్చిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలో బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలి సారి మాత్రమే తొలిదఫాలోనే మెజారిటీ తెచ్చుకొని విజయం సాధించింది. గత రెండు ఎన్నికలలో రెండవ దఫా జరిగిన ఎన్నికలలోనే ఆ పార్టీ అభ్యర్దులు , జోస్‌ ముజికా, డేనియల్‌ మార్టినెజ్‌ విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో డేనియల్‌ మార్టినెజ్‌కు తొలి దఫా ఎన్నికల్లో 49.45శాతం ఓట్లు రాగా తుది ఎన్నికల్లో 56.63శాతం వచ్చాయి. 2009 ఎన్నికల్లో మాజీ గెరిల్లా దళనేత జోస్‌ ముజికా తొలిదశలో 49.36 శాతం, రెండవ సారి 54.63శాతం ఓట్లతో విజయం సాధించారు. బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలిసారిగా అధికారానికి వచ్చిన 2004ఎన్నికల్లో అభ్యర్ధిగా ఉన్న తబరే వాజ్‌క్వెజ్‌ తొలిసారే 51.67శాతం ఓట్లతో విజయం సాధించారు.
గత మూడు ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలిదఫా ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 50శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు అంకెలు వెల్లడించాయి. రెండవ దఫా ఎన్నికల్లో మితవాత శక్తులను వ్యతిరేకించే శక్తులు బ్రాడ్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వటంతో గత రెండు సార్లు విజయం సాధించారు. ఈ సారి తొలి దఫా ఎన్నికల్లోల్లోనే బ్రాడ్‌ ఫ్రంట్‌కు గతంతో పోల్చితే తొమ్మిదిశాతం వరకు ఓట్లు తగ్గాయి. ఈ సారి మితవాద శక్తులను ్యవతిరేకించే ఓట్లను పెద్దగా రాబట్టలేకపోయిందని స్పష్టమైంది. ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు జోస్‌ అరోసియేనా ఒక ప్రకటన చేస్తూ నిర్ణయాత్మక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఈనెల 28 లేదా 29న ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. అయితే వచ్చిన ఓట్లను బట్టి తాను విజయం సాధించినట్లు ప్రతిపక్ష అభ్యర్ధి లూయీస్‌ లాసలే ప్రకటించారు. అధికారిక ప్రకటన వరకు వేచి చూడాలని తన అభిమానులతో చెప్పారు. ‘మనలను భూ స్ధాపితం చేయాలని వారు చూశారు, అయితే మనం గరిక వంటి వారమని వారికి తెలియదు. దేశంలో అసాధారణ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. అంతిమ ఫలితం వెలువడే వరకు వేచి చూద్దాం ‘ అన్నారు.
అధ్యక్ష ఎన్నికలతో పాటు 30 స్ధానాలున్న సెనెట్‌, 90 స్ధానాలున్న పార్లమెంట్‌కు కూడా పోలింగ్‌ జరిగింది. రద్దయిన సెనెట్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు 15 సీట్లు ఉండగా ఇప్పుడు 13కు తగ్గాయి. పార్లమెంట్‌లో 90కి గాను 50 స్ధానాలుండగా ఇప్పుడు 42 సీట్లతో పెద్ద పార్టీగా ముందుంది. గతంలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని కొలరాడో పార్టీ ఈ సారి 13, కొత్తగా ఏర్పడిన ఓపెన్‌ కాబిల్డో పార్టీ 11 స్ధానాలను తెచ్చుకుంది. ఈ సమీకరణాలను బట్టి మితవాద శక్తులు పార్లమెంట్‌ రెండు సభల్లోనూ మెజారిటీ సాధించినట్లయింది.
రెండవ దఫా ఎన్నికలకు ముందు మితవాద శక్తులన్నీ ఏకం కావటం, సామాజిక మాధ్యమం, సంప్రదాయ మీడియాలో పెద్ద ఎత్తున వామపక్ష, ప్రజాతంత్ర బ్రాడ్‌ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా విషప్రచారాన్ని సాగింది. వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని సైనిక, పోలీసు బలగాలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారంటే ప్రచారం ఏ తీరున సాగిందో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మరో దే శమైన బొలీవియాలో మిలిటరీ, పోలీసు బలగాలు అక్కడి వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ను రాజీనామా చేయాల్సిందిగా వత్తిడి, తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావంతో పాటు అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో మితవాద శక్తులు పై చేయి సాధిస్తున్న అంశాలు, కుట్రలు కూడా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
గత పదిహేను, ఇరవై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాలు అనేక విజయాలు సాధించాయన్నది నిర్వివాదాంశం. అయినా ఇటీవల కొన్ని దేశాలలో ఎదురు దెబ్బలు కూడా తిన్నాయి. పదిహేను సంవత్సరాల పాటు బ్రాడ్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉండి అస్తవ్యస్ధంగా ఉన్న దేశ పరిస్ధితులను చక్కదిద్దటంలో ఎంతో కృషి చేసింది. విద్య, ఆరోగ్య, గృహరంగాలలో, దారిద్య్ర నిర్మూలనలో ఎన్నో విజయాలు సాధించింది. ద్రవ్యోల్బణానికి మించి వేతనాలు, పెన్షన్లను పెంచటంతో పాటు కార్మికులకు అనేక హక్కులను కలిగించింది. క్రైస్తవమతం వైపు నుంచి ఎంతగా వ్యతిరేకత వెలువడినా స్వలింగ వివాహాలను అనుమతించటంతో పాటు స్త్రీ పురుషులు కాని వారికి హక్కులను వర్తింప చేయటం, కొన్ని ప్రత్యేక పరిస్దితులలో అబార్షన్లను అనుమతించటం, వివాహసమానత్వాన్ని గుర్తించటం వంటి పురోగామి చర్యలు అమలు జరిపింది.
లాటిన్‌ అమెరికాలో నియంతలు, నిరంకుశపాలనతో పాటు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలుగా అక్కడి దేశాలను మార్చారు. ఫలితంగా జనం ముఖ్యంగా కార్మికవర్గం అనేక విధాలుగా దోపిడీకి గురైంది. నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తిన పూర్వరంగంలో తలెత్తిన సామాజిక ఉద్యమాలు అనేక చోట్ల వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటానికి దోహదం చేశాయి. ఉన్నంతలో సంక్షేమ పధకాలను అమలు జరిపి ఎంతో స్వాంత్వన చేకూర్చాయి. అందువల్లనే పదిహేను, ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో మనగలిగాయి. అయితే నయా ఉదారవాద విధానాల నుంచి సంపూర్ణంగా వెనక్కు మళ్లకుండా, అదే వ్య వస్ద మీద సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యం కాదు అనే అంశం ఇప్పుడు ప్రతి చోటా వ్యక్తం అవుతోంది.
ఉరుగ్వేలో 175 సంవత్సరాల పాటు మితవాద కొలరాడో లేదా నేషనల్‌ పార్టీలు, మిలిటరీ అధికారులు అధికారంలో ఉన్నారు. తొలిసారిగా 2004లో బ్రాడ్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఉరుగ్వేలో 2015వరకు ఆర్ధిక వృద్ధిసాగింది. దారిద్య్రం 39.9 నుంచి 9.7శాతానికి పడిపోయింది. దుర్భరదారిద్య్రం 4.7 నుంచి 0.3శాతానికి తగ్గింది. తరువాత కాలంలో ఇంకా తగ్గింది. లాటిన్‌ అమెరికా మొత్తంగా చూస్తే అత్యంత తక్కువ స్ధాయికి గినీ కోఎఫిసియెంట్‌ సూచిక 0.46 నుంచి 0.38కి పడిపోయింది. అయినప్పటికీ నయా వుదార విధాన పునాదులు అలాగే ఉన్న కారణంగా సంపద కేంద్రీకరణ పెరిగింది. ఆఫ్రో-ఉరుగ్వేయన్లు, యువతలో దారిద్య్ర పెరుగుదల కనిపించింది.శ్వేత జాతీయుల కంటే పదిశాతం ఎక్కువ మంది ఈ సామాజిక తరగతిలో దారిద్య్రంతో ఉన్నారు.లాటిన్‌ అమెరికా దేశాలను ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మార్చివేసిన పూర్వరంగాన్ని చూస్తేనే అక్కడి సమస్యలను అర్ధం చేసుకోగలం.2017లో మాడ్రిడ్‌ నుంచి వెలువడే ఎల్‌ పాయిస్‌ అనే పత్రిక వివేచన గల ఉరుగ్వే వామపక్ష అద్భుతం పేరుతో అక్కడి బ్రాడ్‌ ఫ్రంట్‌ సర్కార్‌ సాధించిన విజయాలను పేర్కొన్నది.
అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు కొనసాగుతున్న పూర్వరంగంలో ఎగుమతి ఆధారిత వ్యవస్దలు గల దేశాలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉరుగ్వేలో కొన్ని దశాబ్దాల తరువాత ఎనిమిది సంవత్సరాల క్రితం 6.3శాతానికి నిరుద్యోగం పడిపోయిన తరువాత ఇటీవలి కాలంలో తిరిగి ఎనిమిది శాతానికి పెరిగింది. అనేక సంస్ధలు ఉద్యోగులను తీసుకోవటం గణనీయంగా తగ్గించాయి. సంక్షేమ పధకాలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఇటీవలి కాలంలో అనేక తరగతుల్లో అసంతృప్తి పెరిగింది. పదిహేను సంవత్సరాల తరువాత తొలిసారిగా మితవాద నేషనల్‌ ఫ్రంట్‌ వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ విధానాల కారణంగానే నిరుద్యోగం, ప్రతికూల ఆర్ధిక సమస్యలు పెరుగుతున్నాయనే దాడి ప్రారంభించింది. దీనికి మీడియా కూడా తోడైంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తొలిసారిగా అసమానతలు, దారిద్య్రం పెరుగుతున్నట్లు వెల్లడైంది. సామాజిక వ్యవస్ధల నిర్మాణమే దీనికి కారణమని తేలింది. బ్రాడ్‌ ఫ్రంట్‌లో ఉన్న పార్టీలకు చెందిన కొందరు అవినీతికి పాల్పడటం కూడా ఫ్రంట్‌ ప్రభ మసకబారటానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. 2017లో రావుల్‌ సెండిక్‌ జూనియర్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి అవినీతి కేసులలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసిన తరువాత కొందరు మేధావులు చేస్తున్న సూచనలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. వామపక్షాలు స్వల్పకాలిక కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడా ఒకే సమయంలో పని చేయాల్సి ఉంది. ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత ప్రతి నెలాఖరుకు కార్మికులు, ఇతర పేదలకు ఏమి కావాలో సమకూర్చటం మీదే కేంద్రీకరించి దీర్ఘకాలిక లక్ష్యా లను మరవకూడదన్నదే వాటి సారాంశం.