Tags

, , , , , , ,

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic societyఎం కోటేశ్వరరావు
నవంబరు 27న హైదరాబాద్‌ పశువైద్యురాలు దిశపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతంలో అరెస్టు చేసిన నలుగురు నిందితులను డిసెంబరు ఆరు శుక్రవారం తెల్లవారు ఝామున షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌ పల్లి వద్ద పోలీసులు కాల్చి చంపారు. దిశను ఎక్కడైతే సజీవదహనం చేశారో అక్కడే, ఏ సమయంలో ఆ దుండగానికి పాల్పడ్డారో అదే సమయానికి వారిని హతమార్చినట్లు చెబుతున్నారు. దిశ దారుణోదంతంపై వెల్లడైన తీవ్ర నిరసన, పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన వత్తిడి పూర్వరంగంలో ఇలాంటిదేదో జరుగుతుందని, తమ బాధ్యతను దులిపివేసుకొంటారని బయటకు చెప్పకపోయినా అనేక మంది ముందే ఊహించారు. దుండగులపై తక్షణమే చర్య అంటే కాల్చివేయాలని పెద్ద ఎత్తున వివిధ తరగతులకు చెందిన వారు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. వారు కోరుకున్నట్లుగానే జరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పండుగ చేసుకుంటూ వివిధ రూపాల్లో దాన్ని ప్రదర్శించారు. పోలీసుల మీద పూలవర్షం కురిపించారు, జయజయ ధ్వానాలు పలికారు. పాలకులను కూడా అదే విధంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఇది చైతన్యమా ? దానికి విరుద్దమా ?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎన్‌కౌంటర్‌పేరుతో నిందితులను హతమార్చారు, ఇది చట్ట ఉల్లంఘన అని అభిప్రాయపడిన వారిని అనేక మంది నిందితులకు మద్దతుదారులు,అత్యాచారాలను సమర్ధించేవారు అన్నట్లు శాపనార్ధాలు పెట్టారు. ఒకవైపు చట్టాలకు అందరూ, అన్ని సమయాలలో లోబడే ఉండాలని చెబుతూనే, కొందరి పట్ల కొన్ని సమయాల్లో చట్టాల ప్రకారం పోతే కుదరదు సత్వర న్యాయం జరగాలంటూ చట్ట వ్యతిరేక చర్యలకు బహిరంగంగా మద్దతు పలుకుతూ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.ఒక అనాగరిక చర్యకు ప్రతిక్రియ పేరుతో మరొక అనాగరిక ప్రతిచర్యను సమర్దించారు. ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోవాల్సిందే తప్ప అంగీకరించాల్సిన ధోరణి కాదని చెప్పకతప్పదు. ఉద్రేకాల నుంచి తగ్గి ఆలోచించాల్సిన సమయమిది.
దిశ ఉదంతం అత్యంత కిరాతకమైనదనటంలో ఎలాంటి సందేహం లేదు. నిందితులను ఏ ఒక్కరూ, ఏ ఒక్క పార్టీయే కాదు, చివరకు వారి కుటుంబ సభ్యులు కూడా సమర్ధించలేదు. దురంతానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటానికి ఎవరూ వెనుకాడలేదు. వారు చేసిన నేరానికి మరణశిక్ష పడేందుకు కూడా అవకాశం ఉందని నిర్భయ కేసు ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో తోబుట్టువులైన గీతా-సంజరు కిడ్నాప్‌, హత్య కేసులో నేరగాండ్లు రంగా, బిల్లాలకు ఉరిశిక్షను అమలు చేసిన ఉదంతం తెలిసిందే. అయినా పోలీసులు, కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లటం, కాలహరణ నేపధ్యంలో వెంటనే నిందితులను కాల్చిచంపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.
సమాజంలో సర్వకాల సర్వావస్దలలో మనోభావాలు ఉంటాయి. ఆయా ఉదంతాలు, సందర్భాలను బట్టి అవి వెల్లడయ్యే రూపాలు ఉంటాయి. గత కొంత కాలంగా మన దేశంలో మనోభావాలు వెల్లడవుతున్న తీరు, కొన్ని అంశాలలో రెచ్చగొడుతున్న(నిర్భయ, దిశ వంటి దారుణాతి దారుణ ఉదంతాల విషయంలో కాదని మనవి) తీరు వివాదాస్పదం అవుతోంది. ఆవు, ఆలయాల పేరుతో జరుగుతున్నవి అందుకు తిరుగులేని ఉదాహరణలు. మనోభావాలు, ఆవేశ, కావేషాలు గతం కంటే పెరుగుతున్నాయి, అదే సమయంలో ప్రతి దారుణం, అన్యాయం పట్ల ఒకే విధంగా స్పందన ఎందుకు ఉండటం లేదు అన్న ప్రశ్నలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దిశ దారుణం, అనంతరం దానికి పాల్పడి అరెస్టయిన నిందితుల కాల్చివేత జరిగిపోయాయి. ఉద్రేకాలు చల్లారాయి గనుక వీటి పర్యవసానాలు, మరో దిశ ఉదంతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలి.
ఎన్‌కౌంటర్‌ పేరుతో దిశ కేసులో నిందితుల కాల్చివేత చట్టవిరుద్దం అనటమే పెద్ద నేరం అన్నట్లుగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం ఆందోళనకరం. ఎవరికైనా దేన్నయినా ప్రశ్నించే హక్కు ఉంది, వాటిని కోరుకొనే వారికి బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేయాల్సి వస్తోంది. ఏకపక్షం అంటే కుదురుతుందా ? షాద్‌నగర్‌ పోలీసు చర్యను సమర్ధించేవారు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దిశ తలితండ్రులు తమ కుమార్తె అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినపుడు మా స్టేషన్‌ పరిధి కాదంటూ పోలీసులు తిరస్కరించారు. అంతటితో ఊరుకోలేదు, మీ అమ్మాయికి ఎవరితో అయినా ప్రేమ వ్యవహారం ఉందా, ఎవరితో అయినా లేచిపోయిందనే అనుమానాలున్నాయా అని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇది అత్యాచారం కంటే మరింత బాధాకరమైన, బాధ్యతా రహితమైన చర్య. బిడ్డ సంగతి దేవుడెరుగు, అనాగరికంగా ప్రవర్తించేే పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వచ్చామురా బాబూ అని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారు అనుకోవాల్సిన పరిస్దితులు పోలీసు వ్యవస్ధలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి పోలీసులపై చర్యకు సభ్య సమాజం ఎందుకు డిమాండ్‌ చేయలేదు. నిందితులను కాల్చిచంపగానే పోలీసుల మీద పూలు చల్లటాన్ని ఏమనాలి, మనమేం చేస్తున్నామో అనే చైతన్యంలో ఉండే ఆ పని చేశారా ?
పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం, సహాయ పోలీసు ఫోన్‌కు సమాచారం అందించకు పోవటం దిశదే తప్పు అన్నట్లుగా మాట్లాడిన మంత్రులు, అధికారయంత్రాంగంపై తీసుకున్న చర్యలేమిటి ? దిశపై అత్యాచారానికి ముందు ఆదిలాబాద్‌ ప్రాంతంలో టేకు లక్ష్మి, అదే సమయంలో వరంగల్‌ మానసలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఈ దురంతాలను మీడియా ఎందుకు విస్మరించింది ? బలహీనవర్గాలుగా ఉన్నవారి మీద ఇలాంటివి సర్వ సాధారణమే, వాటిని సంచలనాత్మకంగా అందిస్తే రేటింగు, సర్క్యులేషన్‌ల పెరుగుదల ఉండదని లెక్కలు వేసుకుంటున్నదా ? మీడియాకు ఏది లాభసాటి అయితే దాని మీదే కేంద్రీకరిస్తుందని సరిపెట్టుకుందాం, సభ్య సమాజం సంగతి ఏమిటి ? దానికేమైంది ? దిశ ఉదంతంపై మాదిరి ఎందుకు స్పందించలేదో ఎవరైనా చెప్పగలరా ? అత్యాచారం అన్న తరువాత ఎవరి మీద జరిగినా అది దారుణమే, కొందరి మీద దారుణాతి దారుణంగా మరికొందరి మీద సుఖవంతంగా జరుగుతుందా? తీవ్రంగా ఖండించాల్సిన ఉదంతమే, అన్నింటి పట్ల ఎందుకు ఒకే మాదిరి స్పందించటం లేదు? దిశ విద్యావంతురాలిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో భాగంగానే బయటకు వెళ్లింది. టేకు లక్ష్మి విద్యావంతురాలు కాదు గనుక గ్రామాల్లో తిరుగుతూ బూరలు, పూసల వంటి వాటిని అమ్ముకుంటూ కుటుంబ పోషణకు తన వంతు చేస్తున్నది. ఆ క్రమంలోనే ఆమె దుండగులకు బలైంది.
లక్ష్మి, మానస కుటుంబ సభ్యులు, పరిమితంగానే అయినా వారికి మద్దతుగా నిలిచిన వారు నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని మాత్రమే కోరారు. దిశ కేసు నిందితులను కాల్చివేసిన తరువాత తమ వారి కేసుల్లో కూడా నిందితులను కాల్చివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తరువాత హైదరాబాదు, తెలంగాణా లేదా ఏ రాష్ట్రంలో అయినా ఆడపిల్లలు నిర్భయంగా స్వేచ్చగా తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారా ? తలి దండ్రులు లేదా సంరక్షకులు భయపడకుండా తమ పిల్లలను బయటకు పంపగలరా ? నేరాలు చేయాలనుకునే వారంతా భయంతో ఉన్నారని పోలీసు అధికారి సజ్జనార్‌ చెప్పగలరా ? లేకపోతే ఎందుకు అని సంజాయిషీ, సమాధానం చెప్పకపోయినా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సి ఉంది.
ఎన్‌కౌంటర్లతో దుష్ట లేదా నేర స్వభావం ఉన్నవారిని భయపెట్టి అదుపు చేయగలరా ? పోలీసులకు అనుమతి ఉన్న తుపాకులు ఉన్నాయి కనుక దిశ కేసులో నిందితులను కాల్చిచంపి ఇతరులను భయపెట్టాలని చూశారని చెబుతున్నారు. సరే అనుకుందాం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దిశ తలిదండ్రులు, గతంలో అనేక మంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు మరొక అభాగిని తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకుండా వారిలో భయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదా ? వారినలాగే వదిలేస్తారా ? దానికి పోలీసు ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం చేసింది ఏమిటి ?
అమెరికాలో ఏ చిన్న నేరానికి పాల్పడినా వెంటనే విచారణ, శిక్షలు వేస్తారు. ఎక్కడా లేని విధంగా జనాలతో జైళ్లను నింపివేస్తున్నారు. అయినా నేరాలు చేసేవారెవరూ భయపడటం లేదు. ఏ తెల్లపోలీసు ఏ నల్లవాడిని ఎప్పుడు, ఎందుకు కాల్చిచంపుతాడో తెలియదు. పౌరుల విషయానికి వస్తే ఎవడు ఎప్పుడు తుపాకి తీసుకొని ఉట్టిపుణ్యానికి తోటి వారిని ఎందుకు చంపుతాడో తెలియదు. నల్లవారిని చంపిన తెల్ల పోలీసుల మీద అత్యధిక సందర్భాలలో చర్యలుండవు, ఆత్మరక్షణ, అనుమానంతో కాల్చిచంపామని ఎలాంటి ‘భయం’ లేకుండా దర్జాగా తిరుగుతుంటారు. ఇక తుపాకులతో సామూహిక హత్యాకాండలకు పాల్పడిన ఉదంతాలలో పోలీసులు అత్యధిక సందర్భాలలో నిందితులను అక్కడికక్కడే కాల్చిచంపుతున్నట్లు వచ్చే వార్తలు తెలిసిందే. అది భయం కలిగించేదే అయినా అలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ అమెరికాలో ఎందుకు పునరావృతం అవుతున్నాయి.

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
మన దేశంలో నమోదైన నేరాలలో కేవలం 46.48శాతం(2016) మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. రాష్ట్రాల వారీ చూస్తే కేరళలో 84శాతం ఉంటే బీహార్‌లో పదిశాతం మాత్రమే. అదే అమెరికాలో 93, జపాన్‌, కెనడాలలో 99శాతం వరకు ఉంటున్నాయి.మన కంటే వేగంగా కేసుల దర్యాప్తు, కోర్టు విచారణ జరుగుతోంది అయినా ఒకసారి కేసుపెడితే శిక్ష తప్పుదు అనే భయం ఆయా సమాజాలలో కలగటం లేదు. నేరాలు పునరావృతం అవుతున్నాయి. మన దేశంలో ప్రతి లక్షమంది జనాభాకు జైళ్లలో ఉన్నవారు కేవలం 30 మంది మాత్రమే. అదే అమెరికాలో 737 మంది, రష్యాలో 615 మంది ఉన్నారు. అంతమంది జైలు పాలవుతున్నా అక్కడ భయం ఎందుకు ఉండటం లేదు ?
అందువలన ఎన్‌కౌంటర్ల ద్వారా, సత్వర శిక్షల ద్వారా కూడా భయం కలుగుతుందని చెప్పలేము. ముందుస్ధు ఆలోచనలు లేదా పధకాలతో నేరాలకు పాల్పడేవారు తాము చట్టం, సమాజం నుంచి తప్పించుకోగలమనే ధీమాతోనే పాల్పడతారు. దిశ ఉదంతంపై నిరసన తెలిపి రాత్రయ్యే సరికి తప్పతాగి గంతులు వేసేందుకు హైదరాబాద్‌లో పబ్‌కు వెళ్లిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఒక యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయ తెలిసిందే. అలాంటి వారిని జైళ్లపాలు చేసి సమాజానికి దూరంగా ఉంచటం తప్ప సత్వరన్యాయం పేరుతో అంతం చేయటానికి నాగరిక సమాజం అంగీకరించటం లేదు. ఎన్నో అనుభవాల తరువాతనే ప్రస్తుతం ఉన్న చట్టాలను రూపొందించామని అందరూ గుర్తించటం అవసరం. అసలు నేరాలుండని సమాజం కోసం కృషి చేయటం తప్ప మరొక దగ్గర మార్గం ఏముంది. అయితే అందుకు ఎంతకాలం ఎదురు చూడాలి అన్నది తక్షణమే వెలువడే ప్రశ్న. నిర్భయ, దిశలకు ముందు అనేక మంది అభాగినులు అత్యాచారాలకు గురయ్యారు. అయినా స్పందించటానికి సమాజం ఇంతకాలం ఎందుకు వ్యవధి తీసుకుంది, ఎందుకు ముందుకు రాలేదు అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరక్కపోదు. మన సమాజం ఈ స్ధితికి రావటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ ఒక ఇంట్లోనే అందరి ఆలోచనలూ, చైతన్య స్ధాయి ఒకే విధంగా ఉండటం లేదని, అలాంటపుడు చైతన్యాన్ని వేగిరంగా కలిగించేందుకు కృషి చేయటం తప్ప మరొక దగ్గరదారి లేదన్నది అవగతం అవుతుంది.
ప్రతీకారం తీర్చుకోవటమే అయితే న్యాయం తన లక్షణాన్ని కోల్పోతుందని మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ కథనాలపై స్పందించారు. న్యాయం అన్నది ఎన్నడూ తక్షణం లభించేది కాదు, అది ప్రతీకారంగా మారితే దాని స్వభావాన్నే కోల్పోతుంది, నేర వ్యవహారాల కేసుల పట్ల అలసత్వం, వ్యవధి తీసుకోవటం గురించి వైఖరిని పునరాలోచించుకోవాలన్నారు.
కోర్టులలో విచారణ ఆలస్యం కావటం మీద పౌరులలో అసంతృప్తి పెరుగుతోంది. నిర్భయ ఉదంతం తరువాత వెల్లడైన నిరసనల పూర్వరంగంలో న్యాయం వేగంగా జరిగేందుకు సూచనలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ వర్మ ఆధ్వర్యంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు లీలా సేథ్‌, గోపాల్‌ సుబ్రమణియమ్‌లతో కూడిన కమిటీని 2012లో ఏర్పాటు చేశారు. ఉరిశిక్ష ద్వారా అత్యాచారాల నిరోధించటం లేదా పరిష్కారం కాదని స్పష్టం చేస్తూ అలాంటి నేరాలు నిరోధించేందుకు తీసుకోవాల్సిన సామాజిక మరియు భౌతిక అంశాలకు సంబంధించి అది కొన్ని సూచనలు చేసింది. ఆరు సంవత్సరాలు గడిచినా వాటిని అమలు జరపటంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి.
ఈ నివేదికను సమర్పించిన తరువాత మహిళలను కించపరిచే అనేక మంది గత ఆరు సంవత్సరాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయ్యారు.ఉత్తర ప్రదేశ్‌లో అధికార పార్టీ ఎంఎల్‌ఏ ఒక అత్యాచార కేసులో నిందితుడు.కాశ్మీర్‌లో అసిఫా మీద అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు, న్యాయవాదులు ఏకంగా ప్రదర్శనలే చేశారు. వర్మకమిటీ చేసిన సిఫార్సులలో మరణశిక్ష లేదు. అత్యాచార నేరంగాండ్లకు జీవితకాల శిక్ష విధించాలని పేర్కొన్నది. కేసులను నమోదు చేసేందుకు తిరస్కరించిన లేదా దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులు నేరం చేసినట్లుగా భావించి శిక్షార్హులను చేయాలన్నది. ఎంత మందిని ఆ విధంగా శిక్షించారు? విచారణ అధికారులందరూ చిత్త శుద్దితోనే పని చే శారని చెప్పగలరా ? దిశ ఉదంతం మా పరిధి కేసు కాదని తిరస్కరించిన వారిపై చర్యలేమిటి అన్నది ప్రశ్న. అదేవిధంగా అత్యాచారానికి గురైన వారికి జరిపే వైద్య పరీక్షలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించాలని పేర్కొన్నది. రాష్ట్రాలలో భద్రత కమిషన్లను ఏర్పాటు అన్నది ఒక సూచన. ఇంతవరకు ఎన్ని రాష్ట్రాలు అలాంటి కమిషన్లను ఏర్పాటు చేశాయి ? వచ్చిన వార్తలు, నేరుగా అందిన ఫిర్యాదులను స్వీకరించి కోర్టులు విచారణకు తీసుకోవచ్చని కమిటీ పేర్కొన్నది. రాజకీయ సంస్కరణల్లో భాగంగా నేరచరిత్ర ఉన్నవారిని ప్రజాప్రతినిధులుగా తీసుకోవద్దని, రాజకీయాలను నేరపూరితంగా మార్చవద్దని కూడా వర్మకమిటీ కోరింది.ఎన్ని పార్టీలు అమలు జరుపుతున్నాయి?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
వర్మకమిటీ సిఫార్సులు వచ్చిన తరువాత రాజకీయ వ్య వస్ధ పరిస్ధితి ఏమిటో చూద్దాం.2014లో ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులలో నేర చరిత్రకలవారు 26శాతం మంది ఉంటే, 2019లో 43శాతానికి పెరిగారు. ఎడిఆర్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం 539 మంది లోక్‌ సభ సభ్యులలో 233 మంది నేర చరిత కలిగిన వారున్నారు. వీరిలో బిజెపికి చెందిన వారు 116, తరువాత కాంగ్రెస్‌ 29,జెడియు 13, డిఎంకె 10,టిఎంసి నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇక పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసులలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు,యత్నాలు, కిడ్నాప్‌ల వంటివి 29శాతం ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి ఎంపీ, ఎంఎల్‌ఏ అభ్యర్ధులలో నేర చరిత కలిగిన వారు బిజెపిలో ఎక్కువ మంది ఉండగా రెండవ స్ధానంలో బిఎస్‌పి ఉందని ఏడిఆర్‌ మరొక అధ్యయనంలో పేర్కొన్నది. ఇలాంటి వారి చేతిలో పాలన పెడితే జరిగేదేమిటో సభ్యసమాజం ఆలోచిస్తున్నదా ? అభ్యర్ధుల నేర చరిత్ర గురించి అఫిడవిట్లలో వారే స్వయంగా ఇస్తున్నారు. వాటిని విశ్లేషించి ఎడిఆర్‌ సంస్ధ నిర్వాహకులు పోలింగ్‌కు ముందే ప్రకటిస్తున్నారు. అయినా సభ్యసమాజం అలాంటి వారిని ఎందుకు ఎన్నుకుంటున్నట్లు ? సభ్య సమాజానికి బాధ్యత లేదా ?
దిశ నిందితుల కాల్చివేత జరిగి కొన్ని గంటలు కూడా జరగక ముందే హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్త, భయం ఏమైనట్లు ? సభ్య సమాజం ఆలోచించాలి.