Tags

, , , ,

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge

ఎం కోటేశ్వరరావు
గతవారం, డిసెంబరు 3,4 తేదీలలో లండన్‌లో జరిగిన నాటో కూటమి 70వార్షికోత్సవ సమావేశ ముగింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించాల్సిన పత్రికా గోష్టిని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని నాటోలో ఉన్న సంక్షోభానికి నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఎందుకు రద్దు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే సమావేశ వివరాల గురించి రెండు రోజుల పాటు ఎన్నో వివరించారని, అందువలన ట్రంప్‌ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కనుక రద్దు చేసినట్లు తెలిపారు. అయితే అసలు విషయం ఏమంటే నాటో సభ్య రాజ్యాల మధ్య ఉన్న విబేధాలు మరింతగా ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న భయంతోనే ట్రంప్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారని భావిస్తున్నారు. సమావేశం పూర్తిగా ముగియక ముందే ట్రంప్‌ వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. తొలిసారిగా నాటో చరిత్రలో చైనాను తొలిసారిగా ఒక బూచిగా చూపేందుకు ప్రయత్నం జరగటం ఈ సమావేశ విశేషం.
ఉత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ, దీన్నే ‘నాటో’ అంటారు. మొత్తం 29 దేశాలలో అమెరికా,కెనడా మినహా మిగిలిన 27 సభ్య రాజ్యాలూ ఐరోపా ఖండానికి చెందినవే.ఈ సంస్ధ 70వ వార్షికోత్సవం గతవారం లండన్‌లో జరిగింది.రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను సోవియట్‌ కమ్యూనిస్టులు మట్టి కరిపించారు. అయినప్పటికీ జర్మనీ లేదా సోవియట్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని 1947లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరుసటి ఏడాది దాన్ని బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్సెంబర్గ్‌లకు విస్తరించాయి.1949లో ఈ ఐదు దేశాలతో పాటు అమెరికా, కెనడా, ఇటలీ పోర్చుగల్‌, నార్వే, ఐస్‌లాండ్‌,డెన్మార్క్‌లను కూడా కలుపుకొని పన్నెండు దేశాలతో ‘నాటో’ ఏర్పడింది. తరువాత జర్మనీతో సహా మరో 17 దేశాలకు దాన్ని విస్తరించారు. ఇవిగాక దానిలో చేరాలనుకుంటున్న మరో ఐదు దేశాలను నాటో గుర్తించింది. శాంతికోసం కలసి పని చేస్తామనే సాకుతో మరో 21భాగస్వాములు అవుతున్నాయి, సంప్రదింపుల పేరుతో 15 దేశాలు నాటోతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం వంద రూపాయలు మిలిటరీ ఖర్చు చేస్తుంటే నాటో దేశాల వాటా 70గా ఉంది. ఈ సంస్ధ సభ్య రాజ్యాలపై ఇతరులెవరన్నా దాడి చేస్తే ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నది లక్ష్యం. ఇంతవరకు అలాంటి దాడులేవీ జరగకపోగా నాటో కూటమే ఇతర దేశాలపై దాడులకు, జోక్యానికి తెగబడింది.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenges and threats
ఏడు దశాబ్దాల నాటో కూటమి చరిత్రలో తొలిసారిగా తమ కూటమికి చైనా నుంచి తలెత్తుతున్న సవాళ్లంటూ లండన్‌ శిఖరాగ్ర సభ ప్రకటనలో పేర్కొనటం గమనించాల్సిన ముఖ్యపరిణామం. సంస్ద ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో రక్షణ ఖర్చులో రెండవ పెద్ద దేశంగా చైనా ఉంది, భవిష్యత్‌లో అగ్రరాజ్యాల మధ్య కుదిరే ప్రధాన ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో చైనాను కూడా భాగస్వామిని చేయాలి. దీనర్దం దక్షిణ చైనా సముద్రంలోకి నాటో వెళుతోందని కాదు. చైనా మన సమీపానికి వస్తోన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త శత్రువును నాటో సృష్టిస్తోందనటం వాస్తవం కాదు అని స్టోలెన్‌బర్గ్‌ చెప్పారు. ఎటు తిప్పి ఎటు చెప్పినా చైనా సంగతి చూడాలన్న దుష్ట ఆలోచన లండన్‌ సమావేశంలో చోటు చేసుకుంది.
కమ్యూ నిజం వ్యాప్తిని అరికట్టే ప్రధాన లక్ష్యంగా ముందుకు వచ్చిన నాటో కూటమి సోవియట్‌, తూర్పు ఐరోపా దే శాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసింది. ఇప్పుడు చైనా మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. అమెరికా-చైనా మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపధ్యం, నాటో సారధి అమెరికాయే గనుక దాని ప్రమేయంతోనే తొలిసారిగా లండన్‌ సమావేశంలో చైనా ముప్పు గురించి ప్రస్తావించారు. దీన్నే పరిశీలకులు మరో ప్రచ్చన్న యుద్దంగా వర్ణిస్తున్నారు.ఈ ముఖ్యపరిణామాన్ని ప్రపంచ మీడియా కావాలనే విస్మరించిందా ? కొంత మంది అవుననే అంటుండగా మరి కొందరు నాటో కూటమి విబేధాలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా చైనా అంశం మరుగున పడిందని అన్నారు.
నాటోకు ప్రాణం ఉన్నా మెదడు చచ్చిందని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ అన్నాడు. నాటోది కాదు ఫ్రెంచి అధ్యక్షుడి మెదడే ప్రాణం లేనిదిగా మారిందని టర్కీనేత ఎర్డోగన్‌ తిప్పికొట్టాడు. నాటో నేతల మందుకొట్టే కార్యక్రమంలో కెనడా నేత జస్టిన్‌ ట్రుదెవ్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పరిహాసాలాడాడు. దానికి ప్రతిగా కెనడాకు రెండు ముఖాలున్నాయంటూ ట్రంప్‌ జవాబిచ్చాడు. అగ్రరాజ్యాల నేతలు ఇలా మీడియాకు వినోదం పంచినప్పటికీ ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్ధికంగా తమకు సవాలు విసురుతున్న చైనా విషయాన్ని ప్రస్తావించటంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారు.అయితే చైనా విషయంలో నాటో నేతల్లో ఏకాభిప్రాయం లేదని ప్రకటనలో వినియోగించిన పదజాలం స్పష్టం చేసింది. అందుకే ఇలా పేర్కొన్నది.’ ప్రస్తుత పెరుగుతున్న చైనా ప్రభావం మరియు దాని అంతర్జాతీయ విధానాలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయి, వాటిని ఒక కూటమిగా ఐక్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రష్యా ఇప్పుడు కమ్యూనిస్టు దేశం కానప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్ధలో మిగతా అగ్రరాజ్యాలకు అది మిలిటరీ, ఇతర సవాళ్లను విసరగలిగే స్ధితిలో ఉంది. ఆ కారణంగానే దాని ముంగిట్లోకి నాటోను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ప్రతిగా చైనాతో భాగస్వామ్యాన్ని అది పెంచుకుంటున్నది. తాజాగా దాదాపు మూడువేల కిలోమీటర్ల పొడవు గ్యాస్‌పైప్‌లైన్‌తో సహా అనేక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఉన్న నాలుగువేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దులో ఎలాంటి సమస్యలూ ప్రస్తుతం లేవు. నాటోలోని అనేక దేశాలలో గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు- ప్రస్తుత చైనా వ్యవస్ధలను పోల్చుకొని చైనాతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. చైనాతో పోటీ-విబేధాలతో వచ్చే పర్యవసానాలను అంచనావేయటంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంపై ఆమెరికా ప్రభావం తగ్గుతుండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తగ్గినప్పటికీ అమెరికా ఇప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యమే అన్నది గమనంలో ఉంచుకోవాలి.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge
తాజాగా అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ మూడు సంవత్సరాల ట్రంప్‌ పాలన తీరు తెన్నులపై వివిధ రంగాలకు చెందిన వారితో జరిపిన ఇంటర్వ్యూలలో మారుతున్న ప్రపంచ వ్యవస్ధలో అమెరికా కీలకపాత్ర పరిమితంగా ఉన్నట్లు తేలింది. లండన్‌ నాటో సమావేశాల్లో కూడా పెరుగుతున్న చైనా,తరుగుతున్న అమెరికా ప్రభావం గురించే గుసగుసలు సాగినట్లు మీడియా పేర్కొన్నది. గతంలో సన్నిహిత అనుయాయులుగా ఉన్న ఫ్రాన్స్‌,జర్మనీ, టర్కీ,ఈజిప్టు, పాకిస్ధాన్‌,మెక్సికో వంటి దేశాలు గత మూడు సంవత్సరాలలో మరింత దూరం జరిగాయి. కొన్ని సందర్భాలలో బహిరంగంగానే దానితో విబేధించాయి. దీర్ఘకాలంగా అమెరికాతో స్నేహంగా ఉన్న అనేక దేశాలు ఇటీవలి కాలంలో తరచుగా రష్యా , చైనాలవైపు చూస్తున్నాయి. టర్కీ, పాకిస్ధాన్‌, ఫిలిప్పీన్స్‌, ఈజిప్టు అందుకు ఉదాహరణలు.
ఐరోపాలో అమెరికా పాత్ర బలహీనపడితే రష్యా ప్రభావం అనివార్యంగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి వరకు నాటో ఖర్చులో సింహభాగాన్ని అమెరికా భరించేది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇతర సభ్యరాజ్యాలు పెద్ద మొత్తంలో ఖర్చులను భరించే విధంగా వత్తిడి తెచ్చారు. తామెంత కాలం భారాన్ని మోస్తామని ప్రశ్నించారు. అలాంటపుడు అమెరికాతో నిమిత్తం లేకుండా తమ వ్యూహాలను తాము రచించుకుంటామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి.నాటో రక్షణ ఖర్చును భరించేందుకు సభ్యదే శాల జిడిపిలో రెండుశాతం కేటాయింపులు జరపాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంత రక్షణ కోసం ఖర్చు పెట్టేబదులు ఆ మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఫలితం ఎక్కువ అని అనేక దే శాలు భావిస్తున్నాయి. వాణిజ్య యుద్ధాల నుంచి ఇరాన్‌ అణు సమస్య వరకు ఐరోపా చూడాల్సింది చైనా వైపు మాత్రమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ గురించి చెబుతూ నాటో మెదడు చచ్చిపోతోందనటానికి సూచిక అని ఎకనమిస్టు పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఫసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం నుంచి అమెరికా వెనక్కు తగ్గటం ద్వారా ప్రత్యామ్నాయ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో ముందుకు పోవటానికి చైనాకు అవకాశం ఇచ్చినట్లయిందని ఐరోపా నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు అమెరికా ప్రభావం తగ్గుతున్నట్లు భావిస్తుండగా, ఆ దేశ నాయకత్వంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలను సహించలేని స్ధితి. నాటో సమావేశాల సందర్భంగా కోపెన్‌హాగన్‌ నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో అమెరికాకు చెందిన నిపుణుడు స్టాన్లీ ఆర్‌ సోలన్‌ ప్రధాన వక్తగా ప్రసంగించాల్సి ఉంది. దానిని అమెరికా, డెన్మార్క్‌లోని ఒక సంస్ధ నిర్వహిస్తోంది. అయితే డెన్మార్క్‌లోని అమెరికా రాయబారి కార్లా శాండ్స్‌ ఒక రోజు ముందుగా వర్తమానం పంపుతూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ట్రంప్‌ విధానాలను గతంలో సోలన్‌ విమర్శించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాల క్రితం అంటే రెండవ ప్రపంచ యుద్దం ముగిసేనాటికి అమెరికా తిరుగులేని అగ్రరాజ్యం.1945లో ఏకైక అణు శక్తి, ఆయుధాలను, ప్రపంచ జిడిపిలో సగం వాటా కలిగి ఉంది. ఇప్పుడు అది 15శాతానికి పడిపోయింది. ఉత్తర కొరియా వంటి చిన్న దేశం కూడా నేడు అణుశక్తిని కలిగి ఉంది.నాడు దుర్భరదారిద్య్రంతో ఉన్న చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్ధాయికి ఎదుగుతోంది. ఒకనాడు అమెరికా ప్రపంచీకరణ ఛాంపియన్‌గా ఉంది, నేడు దానికి విరుద్దంగా అనేక ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది, ఏక పక్షంగా వైదొలుగుతోంది. ఈ నేపధ్యంలోనే నాటో సభలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును చూడాల్సి ఉంది.