ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్ ఇండియాగా మార్చటానికి బదులు రేప్ ఇన్ ఇండియా(అత్యాచారాల భారత్)గా మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్ చేశారు. రాహుల్ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ధాకరే బహిరంగంగా రాహుల్ గాంధీని కొట్టాలని సావర్కర్ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్ వారికి సేవచేసుకుంటానని అండమాన్ జైలు నుంచి విడి సావర్కర్ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్ గాంధీకి తగిన పేరు రాహుల్ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్ మార్క్స్- ఫెడరిక్ ఎంగెల్స్ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్ బుల్ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్-ఎంగెల్స్ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్-ఎంగెల్స్ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్ భారత్ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్ జైలుకు తరలించిన తరువాత సావర్కర్ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్ బ్రిటీష్ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్ భుజబల్ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.