Tags

, , , , ,

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !