Tags

, , ,

Image result for citizenship amendment act 2019పౌరసత్వ సవరణ చట్టం-వాదనలు, వాస్తవాలు !
ఎం కోటేశ్వరరావు
పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.దీని చట్టబద్దతను సవాలు చేస్తూ అనేక మంది సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. ఈ చట్టం గురించి అనేక మందిలో తలెత్తిన అనుమానాలు, కొన్ని వాదనలు, వాస్తవాలను చూద్దాం.
ఈ చట్టం ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు పోయేదేమీ లేదు, అయినా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు, విదేశీ ముస్లింలను ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాలని వారు కోరుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు మాట్లాడే వారు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు తెలుపుతున్నది ప్రధానంగా హిందువులే అన్న అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. అసోంలో ఇప్పటికే కొందరు బిజెపి నేతలు పదవులకు రాజీనామాలు చేశారు, బిజెపి మద్దతుదారైన ఏజిపి పునరాలోచనలో పడింది. మరి వీరిని ఎవరు ప్రేరేపిస్తున్నట్లు ?
1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉండగా విదేశీయులకు స్వాగతం పలికేందుకు ఎవరూ సిద్ధం కాదు, అలాంటి అవసరమూ లేదు. దేశంలోని ఏ ముస్లిమూ అలాంటి డిమాండ్‌ను ఎన్నడూ ముందుకు తేలేదు. గతంలో లేని మాదిరి శరణార్దులుగా వచ్చిన వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిన వారు, రేపు అదే ప్రాతిపదికన ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడరన్నదే ఇప్పుడు తలెత్తిన భయం. రాజ్యాంగాన్ని దెబ్బతీసే అనేక చర్యలను వేగంగా తీసుకుంటున్న పూర్వరంగంలో ఇతర మత రాజ్యాలలో మాదిరి తమ హక్కులను హరిస్తారా, రెండవ తరగతి పౌరులుగా మారుస్తారా అన్న ఆందోళనే మైనారిటీలను ఆందోళనకు గురి చేస్తోంది.
సవరించిన చట్టం ప్రకారం పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో ఉన్న హిందువులు ఎవరైనా మన దేశంలోని బంధువులు, కుటుంబాలతో కలసిపోయేందుకు అక్కడి నుంచి వలస వస్తే వారికి పౌరసత్వం ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఇదే సూత్రం ముస్లింలకు వర్తించదు. హిందువుల మాదిరే ఈ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా మన దేశంలో బంధుత్వాలు, కుటుంబాలు ఉన్నాయి. ఒక మతం వారికి ఒక సూత్రం, మరొక మతం వారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదే !
ఈ మూడు దేశాల్లో ఉన్నది ఇస్లామిక్‌ ప్రభుత్వాలు. పాక్‌, ఆప్ఘనిస్తాన్‌ మాత్రమే ఇస్లామిక్‌ అని ప్రకటించుకున్నాయి.1972లో బంగ్లాదేశ్‌ లౌకిక రాజ్యంగా ఏర్పడింది. తరువాత దానిని 1980లో ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చారు.1972లో ఆమోదించిన లౌకిక సూత్రాలే చెల్లుబాటు అవుతాయని 2010లో అక్కడి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఆచరణలో మత రాజ్యంగా ఉందనే కొందరు చెబుతారు.
ఈ మూడు దేశాల్లో అత్యధికులు ముస్లింలు, మిగిలిన వారందరూ మైనారిటీలు, వారి మీద దాడులు జరుగుతున్నాయి కనుక వారు మాత్రమే భారత్‌లో పౌరసత్వం పొందేందుకు అర్హులు అన్నది ఒక వాదన. ప్రపంచంలో మైనారిటీలు అన్నిదేశాలలో ఉన్నారు. పాకిస్ధాన్‌లో కంటే ఇండోనేషియాలో హిందువుల సంఖ్య. మన దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నట్లుగానే ప్రపంచంలో అనేక దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారు మరొక దేశంలో ఆశ్రయం కోరితే వారికి మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేసే పద్దతి ఏ దేశంలోనూ లేదు.
పాకిస్ధాన్‌లో మైనారిటీలు అంటే ఒక్క హిందువులే కాదు. హిందువులలో వివిధ తరగతులు ఉన్నట్లే ముస్లింలలో కూడా మెజారిటీ, మైనారిటీలు ఉన్నారు. అక్కడి షియాలు, అహమ్మదీయాలు, సూఫీలు మైనారిటీలే. హిందువులు ఇతర మైనారిటీల మీద దాడులు జరిగినట్లే వీరి మీద కూడా నిత్యం దాడులు జరుగుతున్నాయి.హిందువులకు ఉన్నట్లే వీరి పూర్వీకులు కూడా మన దేశంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ మైనారిటీలు ఆశ్రయం కోరితే తాజాగా చేసిన సవరణ చట్టంలో అంగీకరించే అవకాశం లేదు. పాకిస్ధాన్‌లో లష్కరే జాంగ్వీ పేరుతో ఒక ఉగ్రవాద సంస్ధ ఉంది. దీని పని షియాల మీద దాడులు, వారిని చంపటమే. వారిని ముస్లిమేతరులుగా ప్రకటించాలని అది డిమాండ్‌ చేస్తోంది. 2003-16 మధ్య 2,558 మందిని హత్య చేయగా 4,518 మందిని గాయపరిచారు. జనాభాలో షియాలు 15నుంచి 20శాతం వరకు ఉన్నారు.
1974లో పాకిస్ధాన్‌ ఒక రాజ్యాంగ సవరణ చేసి అహమ్మదీలను ముస్లిమేతరులుగా ప్రకటించింది. తరువాత నియంత జియావుల్‌ హక్‌ అహమ్మదీయాలు తమను ముస్లింలుగా పిలుచుకోవటాన్ని నిషేధించాడు. తెహరిక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్ధాన్‌ అనే సంస్ధ లాహౌర్‌ తదితర చోట్ల అహమ్మదీలు, వారి మసీదులపై దాడులు చేస్తున్నది. పోలీసులు కూడా అదే దుండగాలకు పాల్పడుతున్నారు. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేష ప్రచారం చేస్తున్నట్లుగానే అహమ్మదీల మీద పత్రికల్లోనే అలాంటి ప్రచారానికి సంబంధించి 3,963 వార్తలు, 532 వ్యాసాలను ఉటంకిస్తూ బాధితులు ఒక నివేదికను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో దేవుడు, దేవదూతలు, ప్రవక్తల పట్ల విశ్వాసం లేని వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఆచరణలో ముస్లిం మైనారిటీలే, వారు గాక బీహారీ ముస్లింలు, అస్సామీ ముస్లింల పట్ల బంగ్లాదేశ్‌లో వివక్ష కొనసాగుతోంది, వారు దాడులకు గురవుతున్నారు, వారు శరణు కోరితే వైఖరి ఏమిటి ?

Image result for citizenship amendment act 2019
బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్క త విద్యా ధర్మ విజ్ఞాన కేంద్రంలో సంస్క తంలో ఉన్న హిందూ పురాణాలను జంధ్యం లేని, ఫిరోజ్‌ ఖాన్‌ అనే ఒక ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బోధించటాన్ని అంగీకరించేది లేదంటూ అక్కడి విద్యార్ధులు, కొందరు టీచర్లు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఫిరోజ్‌ఖాన్‌ రాజీనామా చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పోయిన తన పరువును కాపాడుకొనేందుకు రాజీమార్గంగా ఫిరోజ్‌ఖాన్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఆర్ట్స్‌ విభాగంలో సంస్క త సాహిత్యం, భాషా విభాగంలో నియమించింది.
పాకిస్ధాన్‌లో కూడా మతఛాందస శక్తులు అతిఫ్‌ మియాన్‌ అనే అహమ్మదీ సామాజిక తరగతికి చెందిన ఆర్ధికవేత్తను ఆర్ధిక సలహా మండలిలో పని చేయటానికి అంగీకరించబోమని వత్తిడి చేయటంతో వారంలోపే నియామకాన్ని రద్దు చేశారు. మత అసహనం, వివక్షకు ఇది పక్కా నిదర్శనం. సూఫీ ముస్లింల మీద కూడా అక్కడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. వారు కూడా పాక్‌లో హిందువుల మాదిరే మన పూర్వీకులే కదా ! శరణార్ధులంటే ఎవరైనా శరణార్ధులే, వారిని అనుమతించటమా లేదా అనే ఒక విధానం తీసుకోవటంలో తప్పు లేదు కానీ వారి పట్ల మత విబేధాన్ని పాటించటం అంటే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే. ఇది మన భారతీయ సంప్రదాయం కానే కాదు. అఖండ్‌ భారత్‌ను పునరుద్దరించాలని చెప్పే వారు, ఈ సంకుచిత వైఖరిని అనుసరించటంలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, విశాల భావనకు చోటెక్కడ ? పౌరసత్వ చట్ట సవరణ ద్వారా అఖండ భారత్‌లో విభజనకు పూర్వం ఉన్న ముస్లింలకు చోటు లేదని తేల్చి చెప్పారు.
రాజ్యాంగ విరుద్దం అని ఎందుకు అంటున్నారు ?
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ముస్లిం అనుకూలురు, ఇతర దేశాల నుంచి ముస్లింలు వలస రావాలని కోరుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ విరుద్దమైన చర్యను వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు అనేది తప్పుడు ప్రచారం, వక్రీకరణ. దేశ విభజన నేపధ్యంలో తలెత్తే పౌరసత్వ సమస్యలను పరిష్కరించేందుకు హింద్షూముస్లిం అనే వివక్ష లేకుండా రాజ్యాంగంలోని ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న ఆర్టికల్స్‌ నిబంధనలు, విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు, తిరస్కరించేందుకు పార్లమెంట్‌కు అధికారం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని వినియోగించుకొని ఆ ఆర్టికల్‌ను సవరిస్తూ మత ప్రాతిపదికన ముస్లిం మినహా పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన హిందూ, బౌద్ద, జైన, సిక్కు, పార్సీ, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఎన్‌డిఏ సర్కార్‌ చట్టసవరణ చేసింది. గతంలో లేని మత వివక్షను చొప్పించింది, ఇది లౌకిక స్వభావం నుంచి మత రాజ్యంవైపు వేసే అడుగులో భాగం తప్ప మరొకటి కాదు. ఆర్టికల్‌ 14కు విరుద్ధం.
1955 చట్టం ప్రకారం అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం లేదు. సవరించిన చట్టంలో దీనికి మినహాయింపులు ఇచ్చారు. 2015లో పాస్‌పోర్టు, విదేశీయుల చట్టానికి సంబంధించి చేసిన సవరణల ప్రకారం ముస్లిమేతరులు తగిన పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించినప్పటికీ పౌరసత్వాన్ని పొందేందుకు అవసరమైన ఎత్తుగడ దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది చట్టసవరణకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో రాజ్యాంగ ఆరవ షెడ్యూలులో చేర్చిన గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఒకసారి పౌరసత్వం ఇచ్చిన తరువాత ఈ ప్రాంతాలకు వలసలను ఎలా నిరోధిస్తారన్నది ఒక ప్రశ్న. తెలుగు రాష్ట్రాలలో ఒన్‌ ఆఫ్‌ 70 చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు ఎలా చేరుతున్నదీ చూస్తున్నాము.ఈశాన్యరాష్ట్రాలలోని గిరిజనేతర ప్రాంతాలను ఇప్పటి వరకు శరణార్ధులుగా ఉన్న వారికి పౌరసత్వం ఇచ్చి నింపితే స్ధానికులు తాము మైనారిటీలుగా మారతామని, తమ భాష, భూమి, సంస్క తులకు ముప్పు వస్తుందనే భయంతో ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Image result for citizenship amendment act 2019
శరణార్ధుల విషయంలో మత ప్రాతిపదికను ప్రవేశపెట్టిన కేంద్రం ఇంతటితో ఆగుతుందనే హామీ లేని కారణంగా మైనారిటీల్లో భయం ఏర్పడింది. ఈశాన్య ప్రాంతాలలో తమ అస్ధిత్వం, అవకాశాల గురించి హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వీధుల్లోకి వచ్చింది వారే. ఇదే సమయంలో దేశ వ్యాపితంగా ఎన్‌ఆర్‌సిని అమలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అసోం ఎన్‌ఆర్‌సి జాబితాలో అవకతవకలు, పేర్లను తొలగించే అధికారం అధికారులకు కట్టబెట్టం మైనారిటీల్లో ఇప్పటికే అనేక అనుమానాలు, ఆందోళనలను రేకెత్తించింది. శరణార్ధుల విషయంలో మతవివక్షను ప్రవేశపెట్టిన కేంద్రం ఎన్‌ఆర్‌సి పేరుతో దేశంలో ఉన్న లక్షల మంది ముస్లింల పౌరసత్వాలను రద్దు చేస్తారనే భయం అనేక చోట్ల వారిని ఆందోళనకు పురికొల్పింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు మన దేశానికి ఇప్పుడు ఆచరణలో సరిహద్దులేదు. అయినప్పటికీ ఆ దేశాన్ని ఎందుకు చేర్చారో తెలియదు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు, శ్రీలంకలో మైనారిటీలుగా హిందువులు, ముస్లింలు ఉన్నారు. నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాల్లో మైనారిటీలు ఉన్నారు. వారందరినీ మినహాయించటానికి తగిన కారణాలను చెప్పలేదు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తరువాత అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారందరినీ మతంతో నిమిత్తం లేకుండా వెనక్కు పంపాల్సి ఉంది.
ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, సిక్కులు అక్కడ పౌరులు కానట్లయితే, మన దేశం పౌరసత్వం కావాలనుకుంటే మంజూరు చేయాలన్న మత ప్రాతిపదిక ప్రతిపాదనను రాజ్యాంగ రచన సమయంలోనే కొందరు ముందుకు తెచ్చారు.1949 ఆగస్టు పన్నెండున ఆ ప్రతిపాదనపై రాజ్యాంగ పరిషత్‌లో ఓటింగ్‌ జరపగా తిరస్కరించారు. ఇప్పుడు హిందూత్వశక్తులు, వారిని సమర్ధించే వారు గతంలో తిరస్కరించిన ప్రాతిపదికనే ఇప్పుడు ముందుకు తెచ్చారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున 70సంవత్సరాల తరువాత మత ప్రాతిపదికను అమల్లోకి తెస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందనే హామీ లేదు. ఆర్టికల్‌ పదకొండు ప్రకారం పౌరసత్వాన్ని మంజూరు చేసే రద్దు చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది. ఇప్పుడు మతాల ఆధారంగా మంజూరుకు చట్టాన్ని సవరించిన వారు, రేపు అదే ప్రాతికన మైనారిటీల పౌరసత్వాన్ని రద్దు చేస్తే, ఆంక్షలు విధిస్తే పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికి లేదు కదా రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని ఎందుకు అనుమానించాలి అని కొందరు అతితెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దే శాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నిరంతరం ప్రచారం చేస్తున్నవారిని సమర్ధిస్దున్న వారే కేంద్రంలో పాలకులుగా ఉండగా వారికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదే శం, వైసిపి వంటి పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరైనా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని, మొత్తం రాష్ట్రాన్ని అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మార్చివేస్తారని, అభ్యంతర తెలిపిన పార్టీల నేతలను జైలు పాలు చేస్తారని ఊహించారా ? బాబరీ మసీదును కూల్చివేస్తామని సంఘపరివార్‌ ఎన్నడూ చెప్పలేదు, అయినా ఉత్తర ప్రదే శ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని కూల్చివేస్తుంటే ఎవరేమి చేయగలిగారు? ఒకసారి మతరాజ్యంగా మారిన తరువాత హిందూ మతానికి ప్రాతిపదిక మనుధర్మం కనుక ఇస్లామిక్‌ దేశాల్లో షరియత్‌ను అమలు చేసినట్లుగా మనుధర్మాన్ని జనం మీద రుద్దరనే హామీ ఉందా ? సామాజిక వివక్ష నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదా చర్చ జరగాలనే పేరుతో వాటి రద్దు డిమాండ్‌ను ముందుకు తెస్తున్నది సంఘపరివార్‌, అందువలన ఒక విషయంలో ఒక సామాజిక తరగతి మౌనం వహిస్తే మరొక విషయంలో వారికే ముప్పు తెస్తే దిక్కేమిటి ? ఈ సందర్భంగా హిట్లర్‌ దాష్టీకానికి గురైన జర్మన్‌ మతాధికారి మార్టిన్‌ నైమిలర్‌ జైలులో పశ్చాత్తాపం లేదా కుట్రను గ్రహించి నాజీల తీరుతెన్నుల గురించి రాసిన కవితను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు !
నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు.
తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు !
నేను సోషలిస్టును కాదు గనుక నోరు విప్పలేదు.
తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు !
నేను కార్మికుడిని కాదు కనుక పెదవి విప్పలేదు.
తరువాత వారు యూదుల కోసం వచ్చారు !
నేను యూదును కాదు గనుక మౌనంగా ఉన్నాను.
తరువాత వారు నాకోసం వచ్చారు !
మాట్లాడేందుకు అక్కడ ఎవరూ మిగల్లేదు .

సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ అనేక మంది సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా ఉన్న ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఉన్నత న్యాయ స్ధానం ముందు ఉంది. ఇటీవలి కొన్ని తీర్పుల తీరు తెన్నులు చూసిన తరువాత అనేక మందిలో తలెత్తిన సందేహాలు, అనుమానాలకు సుప్రీం కోర్టు తెరదించుతుందా ? మన రాజ్యాంగం మనుగడలో ఉంటుందా ? మత రాజ్యాంగంగా మారనుందా ?