Tags

, , ,

Image result for three capitals

ఎం కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన రాజధాని రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. అది కూడా రాజధానికి-అభివృద్ధికి ముడి పెట్టటం, ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పక తప్పదు. తెలుగుదేశం గత ఐదేండ్ల పాలనలో భ్రమరావతిగా ఒక్క అమరావతినే చూపారు. ఇప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ, అభివృద్ది పేరుతో మరో రెండు భ్రమరావతులను ప్రదర్శించేందుకు వైసిపి ఆరునెలల పాలన నాంది పలికిందా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు గనుక దీని మంచి చెడ్డల పరిశీలన కూడా ఆ పరిమితుల్లోనే ఉంటుంది.
కన్యాశుల్కంలో తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని అగ్నిహౌత్రావధానులు ఆంటాడు. డిసెంబరు17న అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానులు రావచ్చునేమో అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటన ద్వారా తాంబూలాలతో నిమిత్తం లేకుండానే తన్నుకు చచ్చేందుకు తెరతీశారు. అప్పుడే నిర్ణయం జరిగిపోయినట్లుగా విశాఖ, కర్నూల్లో హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తమను మోసం చేశారంటూ అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్‌ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చెప్పేశారు.

Image result for three capitals
ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతో మరొకరో , మీడియా ఊహాగానాల్లోనో ఉన్నరాజధానిపోవచ్చు, కొత్త రాజధానులు రావచ్చేమో అంటే అదొక తీరు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో వచ్చు భాష మాట్లాడితే దాన్ని రాజకీయం తప్ప అని మరొకటి అనలేరు. రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేసేందుకు ఐదుగురు పట్టణ ప్రణాళికల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణాల నిపుణులు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి గురించి ఏమి చెబుతారో తెలియదు. వివిధ తరగతుల నుంచి అభిప్రాయలు సేకరించారు గనుక ఏదో ఒకటి చెబుతారనుకుందాం. కొద్ది రోజుల్లో అలాంటి నివేదిక ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. రాకముందే రాజధానులు మూడు వుండవచ్చు అని సిఎం చెప్పేశారంటే నివేదికలో అలాగే ఇమ్మని ముందుగానే ఉప్పందించారనే అనుకోవాలి. ఒక వేళ దానికి భిన్నంగా ఇస్తే ఏమిటి అన్నది ప్రశ్న !
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పాలకులు తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కమిటీల నివేదికల సిఫార్సులకు, పాలకుల నిర్ణయాలకు సంబంధం లేదు. రాజధాని గురించి గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన స్వంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. భిన్నంగా ఇస్తే చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి వైఎస్‌ జగన్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎన్నో తర్జన భర్జనలు, తెరవెనుక మంత్రాంగాలు, లావాదేవీలు పూర్తయ్యాక అక్కడా, ఇక్కడా అని చెప్పిన పుకార్ల వ్యాప్తి, శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సుల తరువాత వాటికి భిన్నంగా రాజధాని నిర్మాణానికి చివరకు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దానికి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, దానికి నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కూడా అంగీకరించారు. అప్పుడు జగన్‌ ఆయన పరివారానికి ‘ ఇంగ్లీషు, తెలుగు ‘ భాష వచ్చు అయినా ఆ సమయంలో అధికార వికేంద్రీకరణ, భిన్న రాజధానుల గురించి మాట్లాడలేదు. ఎన్నికల ప్రణాళికలో అలాంటి ఊసు లేదు. అసెంబ్లీలో అంగీకరించినా జగన్‌ అధికారానికి వస్తే రాజధానిని మార్చివేస్తారని తెలుగుదేశం ప్రచారదాడి చేసింది. చంద్రబాబు రాజధానిలో స్దిరనివాసం ఏర్పరచుకోలేదు, మానేత తాడేపల్లిలో ఏకంగా ఇల్లుకట్టుకున్నారు, అలాంటి వ్యక్తి అమరావతి నుంచి రాజధానిని ఎలా మారుస్తారని వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు. ఆయనే ఇప్పుడు అధికారపీఠమెక్కారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన ఆరునెలల తరువాత రాజధాని మీద నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ జగన్‌ కూడా సరిగ్గా ఆరునెలల తరువాతే రాజధాని గురించి తన మన్‌కీ బాత్‌ వెల్లడించారు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా బిజెపి నేతల మాటలు ఉన్నాయి.

Image result for three capitals
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మరో నాలుగున్నర సంవత్సరాల తరువాత మరో పార్టీ, ముఖ్య మంత్రి అధికారానికి వస్తే మూడింటితో అభివృద్ధి ముడిపడలేదు, మూడును పదమూడు చేస్తా అంటే ? వంతుల వారీగా ప్రతి జిల్లాలోనూ రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. వారికి పోయేదేముంది. వారు లేదా వారి అనుయాయులుగా ఉన్న వారి రియలెస్టేట్‌ ప్రయోజనాలు కదా ముఖ్యం. గుడ్డిగా సమర్ధించే మద్దతుదారులు ఎలాగూ ఉంటారు. గతంలో చంద్రబాబు వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌, సింగపూర్‌ ఇలా ఏ నగరం పేరు చెప్పి అలాంటి నగరాల మాదిరి ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మిస్తామంటే తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు బుర్రలను తీసి పక్కన పెట్టి తలలు ఊపారు. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెబుతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తేడా రంగులు, అభిమానులు మారారంతే !
రాజధాని రాజకీయంలో చంద్రబాబు కొన్ని నగరాల పేర్లను ముందుకు తెస్తే జగన్మోహన్‌రెడ్డి రాజధాని రాజకీయానికి దక్షిణాఫ్రికా దేశాన్ని తెరమీదకు తెచ్చారు. సినిమా ఇంటర్వెల్‌ వరకే చెప్పి ముగింపు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రికి దక్షిణాఫ్రికా కధను చెప్పిన వారు అదే పని చేశారు. జాత్యంహార వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న మూడు రాజధానులకు బదులు సరికొత్త రాజధాని నిర్మాణం జరపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెప్పలేదు. వందిమాగధులు రాజుగారికి ఇష్టమైన అంశాలనే చెప్పేవారు. ఇప్పుడు వారి స్ధానాన్ని ప్రభుత్వ సలహాదారులు అక్రమించారు కనుక సగమే చెప్పి ఉండాలి.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటే రెండు రాజధానులున్న దేశాల మరో డజను వరకు ఉన్నాయి. అసలు రాజధానికి ప్రత్యేకంగా ఒక నగరమంటూ లేకుండానే ఒక మున్సిపల్‌ జిల్లాలోని ఒక పట్టణంలో రాజధాని కలిగి ఉన్న హొండూరాస్‌ గురించి సలహాదారులకు తెలిసినా చెప్పి ఉండరు. రాజధాని-అభివృద్ధి గురించి చర్చించబోయే ముందు సిఎం ప్రకటనతో దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయని అనేక మందిలో ఉత్సుకత తలెత్తింది. కేప్‌టౌన్‌లో పార్లమెంట్‌, ప్రిటోరియాలో పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్ధ కేంద్రంగా బ్లోయెమ్‌ ఫోంటెన్‌ ఉంది.
నేడు దక్షిణాఫ్రికాగా పిలుస్తున్న ప్రాంతాన్ని 1657లో డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. తరువాత డచ్‌వారు ఆ ప్రాంతాన్ని 1806లో బ్రిటీష్‌ వారికి ధారాదత్తం చేశారు. డచ్‌ పాలనా కాలంలో డచ్‌ జాతీయుల ఆధిపత్యంలోని ఆరు ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇచ్చారు. వాటిని బోయర్‌ రిపబ్లిక్‌లని పిలిచారు. వాటిలో దక్షిణాఫ్రికా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ అనే రిపబ్లిక్‌లు పెద్దవి. బ్రిటీష్‌ వారు పెత్తనానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు లేదా యథాతధ స్ధితిని కొనసాగించటానికి భిన్నంగా బోయర్‌ రిపబ్లిక్‌ల మీద తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంలో బోయర్‌ రిపబ్లిక్‌లు ప్రతిఘటించాయి. వాటినే ఆంగ్లో-బోయర్‌ యుద్ధాలు అని పిలిచారు. చివరికి 1910లో బ్రిటీష్‌ వారు పాక్షిక స్వాతంత్య్రం, బ్రిటీష్‌ ప్రాంతాలు-బోయర్‌ రిపబ్లిక్‌లతో కూడిన ఒక యూనియన్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం వారికి చెందిన రెండు పెద్ద పాలిత ప్రాంతాల రాజధానులలో ,బ్రిటీష్‌ వారి రాజధానిలో ఒక్కొక్క చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లో భాగంగా పైన చెప్పుకున్న మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయి.
1934లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. డచ్‌, బ్రిటీష్‌ వారు ఎవరు అధికారంలో ఉన్నా వారు స్ధానిక ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకారంతో వ్యవహరించారు. ఆ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరుతో చివరకు జైలు నుంచి నెల్సన్‌ మండేలా విడుదల, 1994 ఎన్నికల్లో ఎఎన్‌సి విజయంతో జాత్యహంకార పాలన ముగిసింది. ఆ వ్యవస్ధ చిహ్నాలుగా ఉన్న రాజధానుల స్ధానంలో ఒక చోట కొత్త రాజధాని నిర్మాణం జరపాలని అనేక మంది కోరారు. అయితే దాని కంటే ఇతర ప్రాధాన్యతలకు నిధులు అవసరమైనందున ఆప్రతిపాదనను పక్కన పెట్టి ఉన్న వ్యవస్ధలనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా అనుభవం నుంచి ఏమి నేర్చుకోవాలి? మూడు చోట్ల ఉన్నవాటిని ఒక చోటకు చేర్చాలంటే వారికి నిధుల సమస్య ఎదురైంది. తాత్కాలికంగా అయినా వాయిదా వేసుకున్నారు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందుల గురించి చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ఉన్న ఒక రాజధానిని మూడుకు పెంచవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న రాజధానిలో పాలన సాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తాత్కాలిక కట్టడాలుగా ఉన్నవాటినే ఉపయోగపడినంత కాలం శాశ్వతంగా మార్చినా పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు సామాన్య జనానికి లేని ఇబ్బంది కొత్తగా వచ్చేదేమీ ఉండదు.
ఎన్ని రాజధానులు ఉండాలి అనేది దేశాలన్నింటా ఒకే విధంగా లేదు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమస్టర్‌ డామ్‌. మరో పట్టణం హేగ్‌ వందల సంవత్సరాలుగా రాజధానిగా ఉంది. బొలీవియాలో లాపాజ్‌ మరియు సకురే పట్టణాలను రాజధానులుగా పరిగణించి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని శాఖలను పని చేయిస్తున్నారు. 19వ శతాబ్దంలో తలెత్తిన విబేధాల కారణాంగా ఇలా చేశారు.కోట్‌ డిలోవరీ అనే ఆఫ్రికన్‌ దేశం అధికారిక రాజధాని యెమౌసుకోరో, అయితే ప్రభుత్వం మాత్రం అబిడ్‌జాన్‌లో ఉంటుంది. అధికారికంగా రాజధాని కాదు. బెనిన్‌ అనే దేశ రాజధాని పోర్టో నోవా, కానీ పాలన మాత్రమ కోటోనౌ పట్టణం నుంచి జరుగుతుంది. చిలీ రాజధాని శాంటియాగో, కానీ 1990లో పార్లమెంట్‌ను వలపారిసోకు తరలించారు. పూర్వపు సోవియట్‌ రిప్లబిక్‌గా ఉండి ఇప్పుడు స్వతంత్ర దేశమైన జార్జియా రాజధాని తిబిలిసి, పార్లమెంట్‌ మాత్రం కుటారుసిలో ఉంది. హొండురాస్‌ అనే దేశానికి అసలు దేశ రాజధాని పట్టణం లేదు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిపాలిటీ అనే పాలనా ప్రాంతంలో తెగుసియోగాల్పా అనే పట్టణం నుంచి పాలన సాగుతుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, అయితే 1999లో పుత్ర జయ అనే పట్టణానికి తరలించారు. మాంటెనీగ్రో అనే దేశ రాజధాని పోడ్‌గార్సియా. అయితే మాజీ రాజధాని అయిన సెటినిజేను గౌరవ రాజధానిగా పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియాకు రెండు రాజధానులున్నాయి. సియోల్‌ పట్టణం రద్దీగా మారినందున 2012 నుంచి సిజోంగ్‌ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో అయితే శివార్లలో జయవర్ధనే పుర కొటే అనే చోట రాజధాని నిర్మాణం చేశారు. స్వాజీలాండ్‌ అనే దేశంలో కార్యాలయాలు మబాబ్‌నేలో ఉంటే లొబాంబాలో పార్లమెంట్‌ ఉంది. టాంజానియా రాజధాని దారెస్‌ సలామ్‌, అయితే దేశంలో మధ్యలో ఉండే డోడోమాకు 1973లో రాజధానిని మార్చారు. పశ్చిమ సహారాలో అంతర్యుద్ధం జరుగుతున్నది. రెండు ప్రధాన పక్షాలు రెండు ప్రాంతాలను తమ రాజధానులుగా ప్రకటించకున్నాయి. మొరాకో తన రాజధాని లాయునే అంటే సహరావీ అరబ్‌ రిపబ్లిక్‌ టిఫారిటీని రాజధానిగా పరిగణిస్తుంది.
మన దేశంలో రద్దయిన కాశ్మీర్‌కు,మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయి. చలికాలంలో శ్రీనగర్‌లో మంచు కారణంగా జమ్మూలో రాజధాని పని చేస్తుంది. స్వాతంత్య్రానికి ముందు తరువాత సెంట్రల్‌ ప్రావిన్సుగా ఉన్న ప్రాంతానికి రాజధాని నాగపూర్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన మహారాష్ట్రలో నాగపూర్‌ ఉన్న విదర్భ ప్రాంతాన్ని విలీనం చేశారు. రాజధాని ముంబైలో ఉంటే తమ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న భయం ఆప్రాంత జనంలో ఏర్పడటంతో నాగపూర్‌ను అనుబంధ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక అసెంబ్లీ సమావేశాన్ని అక్కడ జరుపుతారు.
మద్రాస్‌ ప్రావిన్సు నుంచి తెలుగు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నపుడు రాయలసీమనేతలు లేవనెత్తిన సందేహాలను తీర్చేందుకు శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేశారు. అందరికీ అందుబాటులో విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కూడా ఉంది. అయితే విజయవాడ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున అక్కడ రాజధాని ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే ఆ ప్రాంతాన్ని సంతృప్తి పరచేందుకు గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో గుంటూరులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరటం తప్ప ఎలాంటి హామీలను కోరలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినపుడు, రాజధాని ఏర్పాటు సమయంలోనూ ఎలాంటి ప్రత్యేక డిమాండ్లు ముందుకు రాలేదు. అమరావతి నిర్ణయం సాఫీగానే జరిగింది.

Image result for three capitals
ప్రపంచంలో ప్రతి దేశానికి, మన దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయి. అవేమీ జనాన్ని దారిద్య్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, వ్యవసాయ సంక్షోభం, సంపదల కేంద్రీకరణ, ప్రాంతీయ అసమానతల వంటి వాటి నుంచి జనాన్ని బయటపడలేక పోయాయి. అయినా రాజధానితో అభివృద్ధి సాధిస్తామని చెబుతుంటే ఎంత మంది నమ్ముతున్నారో తెలియదు గానీ నమ్మే వారంతా గుడ్డిగా ఉన్నారని చెప్పకతప్పదు.పైన పేర్కొన్నట్లుగా దేశాల రాజధానుల, మన దేశంలో రెండు రాష్ట్రాల రా నిర్ణయంలో అనేక అంశాలు పని చేశాయి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మూడు మూడూ చోట్ల ఉంటే అది ఆర్ధికంగా భారాన్ని మోపేదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ వేరు వేరు నగరాల్లో ఉంటే అధికారులు, సిబ్బంది పనికి అంతరాయంతో పాటు ఆర్ధికంగా అదనపు భారాన్ని మోపుతుంది. అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానికి దూరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హైకోర్టు బెంచ్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని శాఖలకు ప్రాంతీయ డైరెక్టరేట్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అందువలన అలాంటి వాటి గురించి ఆలోచించవచ్చు తప్ప మూడు వ్యవస్దల ప్రధాన కేంద్రాలను వేర్వేరు చోట్ల నుంచి పని చేయించటం సరైంది కాదు.
అనేక మంది అధికార వికేంద్రీకరణ అంటే పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం అనే అర్ధంలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర కేంద్రంగా ఉన్న అధికారాలను వాటిని స్ధానిక సంస్ధలకు బదలాయించటం అనే విషయాన్ని మరచిపోతున్నారు. రెండవది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది మరొక భ్రమ. గతంలో రాజధాని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్ధాపించాయి. ఇప్పుడు వాటిని తెగనమ్మే కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నాయి. అందువలన ప్రభుత్వాల పెట్టుబడులు రావు. ప్రయివేటు పెట్టుబడులు రాజధానిగా ఉన్న నగర ప్రాతిపదికన రావు. వాటికి ఎక్కడ లాభసాటి అయితే అక్కడకు పోతాయి తప్ప మరొకటి కాదు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవెనుకబాటు తనమూ, కర్నూల్లో హైకోర్టు ఏర్పడితే రాయలసీమ వెనుకబాటు తనమూ, అమరావతిలో అసెంబ్లీ ఉంటే కోస్తా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఎవరైనా వాదిస్తే వారికి వంద నమస్కారాలు పెట్టటంతప్ప తర్కంతో చర్చ జరిపితే వినే స్ధితిలో ఉండరు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ది జరుగుతుందని చెబుతున్న లేదా నిజంగా నమ్ముతుంటే బిజెపి నేతలు, ఇతరులు ఢిల్లీలో ఉన్న కేంద్ర రాజధానిని విభజించి ప్రతి రాష్ట్రంలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కేంద్ర రాజధానుల శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుంది.అంతకంటే కావాల్సింది ఏముంది. ప్రత్యేక హౌదా కావాలన్న డిమాండ్లు రావు, ఆ వాగ్దానంపై మడమ తిప్పను అని చెప్పుకొనే వారికి ఇబ్బంది ఉండదు ! సర్వేజనా సుఖినో భవంతు !!